ఇలా ఎందరున్నారు - 21 - అచ్చంగా తెలుగు

ఇలా ఎందరున్నారు - 21

Share This

ఇలా ఎందరున్నారు - 21      

అంగులూరి అంజనీదేవి

(జరిగిన కధ : సంకేత, శివాని, పల్లవి, హిందూ స్నేహితురాళ్ళు, ఇంజనీరింగ్ చదువుతూ ఉంటారు. ఆ కాలేజీ లోనే చదువుతున్న శ్రీహర్ష తండ్రి ,సంకేత తండ్రి  స్నేహితుడుకావడంతో ఆమె వాళ్ళ ఇంట్లోనే ఉంటూ చదువుకుంటుంది. నీలిమ శ్రీహర్ష ఇంట్లో పనిమనిషి, 10 వ తరగతి వరకు చదువుకుంటుంది. కోడలు కాంచనమాల తనను ఎలా చూస్తుందో నీలిమకు చెప్తుంది వరమ్మ. కాలేజీ ఫీజు కట్టేందుకు, తగినంత డబ్బు లేకపోవడంతో తన స్నేహితురాళ్ళను అప్పు అడిగేందుకు వెళ్ళిన సంకేతను, పల్లవి బలవంతంగా బాగా డబ్బున్న అనంత్ పుట్టినరోజు వేడుకకు తీసుకు వెళ్తుంది. బాగా చదివే సంకేత తీరును ఇష్టపడి, ఆమె ఫీజును కడతాడు అనంత్. సంకేతకు అనంత్ పట్ల ఒక గౌరవ భావం కలుగుతుంది. అనంత్ కూడా సంకేతను ఇష్టపడుతూ ఉంటాడు. అనంత్ తో సంకేత  ప్రేమను గురించి నీలిమకు చెబుతుంది శివాని.  సంకేతను చూసేందుకు ఆమె ఇంటికి వస్తుంది అనంత్ తల్లి శరద్రుతి. అనంత్ తనతో తిరిగింది కేవలం కాలక్షేపానికే అని తెలిసిన సంకేత మనసు ముక్కలవుతుంది. అతన్ని నిలదీసేందుకు వెళ్ళిన సంకేత, ప్రస్తుతం అతను మరో అమ్మాయితో ఇదే ఆట మొదలు పెట్టాడని తెలుసుకుంటుంది. అనంత్  కు  ఆక్సిడెంట్  అవుతుంది. అతనికి సేవలు చేస్తుంటుంది  సంకేత. నీలిమను శ్రీహర్ష పెళ్లి, అనంత్ తో సంకేత పెళ్లి జరిగిపోతాయి. అనుక్షణం నరకం చూపిస్తున్నా, అనంత్ తో ఓపిగ్గా కాపురం చేస్తుంటుంది సంకేత. శివాని మూర్ఖంగా భర్తతో, అత్తతో గోదావలుపడి, విడాకులకి సిద్ధపడుతుందని తెలిసి మందలిస్తుంది సంకేత. అయినా  ఆమె ఆ మాటలని లెక్కచెయ్యదు. ఇక చదవండి... )
అత్యవసర స్థితిలో ఇంట్లో మగతోడు లేకపోయినా, తన మనవరాలి ప్రాణాలను రక్షించిన సంకేత అంటే ఇంట్లో అందరికీ ఇష్టం, సానుభూతి ఏర్పడుతుంది. తనకు కాఫీ తెచ్చిన సంకేతతో “స్వార్ధమో, స్వలాభామో కాని, మేమంతా కలిసి ఎందుకూ కొరగాని అనంత్ తో నీకు పెళ్లి చేసి, నీ గొంతు కోసాము. నువ్వూ శివాని లాగా విడాకులు తీసుకుని, ఈ నరకంలోంచి బయటపడు, నీదారి నువ్వు చూసుకో” అన్నాడు దేవరాయుడు. షాక్ కు గురైనట్లు చూస్తూ ఉండిపోయింది సంకేత.
“ అన్నట్లు నీకు చెప్పటం మరచిపోయాను. మొన్నా మధ్య నీ స్నేహితురాళ్ళు శివాని, హిందూ కనిపించారు. హిందూ నన్ను చూడగానే గుర్తుపట్టి పలకరించింది. శివానిని పరిచయం చేసింది. ఆరోజు అనంత్ కి యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో వున్నప్పుడు చూసిందే హిందూని. తర్వాత నేను చూడలేదు. హిందూ నీ క్లోజ్ ఫ్రెండయినా కూడా నీ పెళ్ళయ్యాక ఒక్కసారి కూడా మనింటికి రాలేదు. ఆఫ్ కోర్స్ ఎవరి బిజీ వారికి ఉంటుందనుకో! కానీ హిందూ చాలా మారిపోయి కన్పించింది. చూస్తుంటే ఏదో ప్రాబ్లం లో ఉన్నట్లే అన్పించింది నాకు వేరే పని వుంది వివరాలేం అడగకుండా వెళ్ళిపోయాను.” అన్నాడు. హిందూ ఒకసారి వచ్చినప్పుడు ఆయన ఇంట్లో లేడు. అందుకే హిందూ ఎప్పుడు రాలేదని అనుకుంటున్నాడు.
“హిందూకి ప్రాబ్లమ్స్ ఏముంటాయి?” అంది సంకేత.
ఈ మధ్యన ఒకటి రెండుసార్లు ఫోన్ చేస్తే ఇదో పనివున్నదానిలా వెంటనే కట్ చేసింది. మళ్ళీ చేస్తే తనే చేస్తాను పెట్టేయ్యమంది. తను చెయ్యలేదు. హిందూ లాయర్ దగ్గరకి వచ్చిందీ అంటే ఏదో బలమైన కారణమే వుండి ఉంటుంది. వెంటనే కాల్ కాని, శివాని దగ్గర అడ్రస్ తీసికొని ఇంటికైనా వెళ్లాలి అని మనసులో అనుకుంది.
మౌనంగా ఉన్న సంకేతని చూసి “లాయర్ని ఎపుడు కలవాలి అని ఆలోచిస్తున్నావా సంకేతా?” అన్నాడు దేవారాయుడు. సంకేత ఉలిక్కిపడి “ నేను అలోచించి చెబుతాను మామయ్య? ఏదైనా మీకు చెప్పకుండా చెయ్యను..చెయ్యలేను. ఈమాత్రం నా గురించి అలోచిస్తున్నందుకు నా కృతజ్ఞతలు. అత్తయ్య నాకోసం ఎదురు చూస్తుంటారు...” అంటూ గదిలో నుండి బయటకు రాగా లిప్ట్ ముందు నిలబడి తననే చూస్తూ కన్పించాడు అనంత్.
అనంత్ ని చూడగాని  బాగా అలసినట్లు కనపడుతున్నాడు..వెళ్ళి కాఫీ కలిపి ఇవ్వాలి అని అనుకుంటూ వేగంగా నాలుగు అడుగుల్లో అతన్ని చేరుకుంది.
 అనంత్ సంకేతను దూరంగా నెట్టేస్తూ, “మా పెదనాన్న కి ఆడవాళ్ళ పిచ్చి అని చెప్పినా అతని గది కెందుకేల్లావ్..నువ్వు అమాయకురాలివి అని అనుకుంటున్నావా?” అని అరచి తన ఫ్లోర్ కి వెళ్ళిపోయాడు. సంకేత బిత్తరపోయి అలానే క్రిందికి వచ్చి రోడ్డుమీదకి నడచింది. అలా వెళ్ళిన సంకేత వారం అయినా ఇంటికి రాలేదు. ఎటు వెళ్లిందో తెలీక.. తెలుసుకోడానికి ప్రయత్నించడానికి అహం అడ్డొచ్చి... ప్రశ్నలతో విసిగించే వారి మాటలు విని విననట్లు తప్పుకు తిరుగుతూ...సంకేత వస్తుందన్న ఆశతో తెలీకుండానే ఎదురు చూడడం మొదలెట్టాడు అనంత్.
***
తన స్నేహితురాలైన హిందూ వద్దకు చేరింది సంకేత.
“నాకు ఆఫీస్ లో వుండే టెన్షన్ కన్నా ఈ కోర్టు వాయిదాలకి అటెండ్ కావడమే ఎక్కువ ఇబ్బంది అనిపిస్తోంది సంకేతా! పైగా ఈ వయసులో మా అమ్మను చాలా బాద పెడుతున్నానేమో అనిపిస్తోంది. నేను ఏదో తప్పు చేసే ఉంటాను అందుకే ఈ బాధలు...” అంది హిందూ. ఆమెలో ఇంత అపరాధభావం ఎప్పుడూ చూడలేదు సంకేత.
“ఏయ్ పిచ్చి నువ్వు తప్పు చెయ్యడము ఏంటి. మేము కదా తప్పు చేశాం. నేను అనంత్ ని ప్రేమించి, శివాని ఎవరితో పడితే వారితో చాటింగ్ చేసి... మా తప్పులు సరిదిద్దుకోమని మమ్మల్ని మార్చి మంచి దారిలో పెట్టాలని నువ్వు చెప్పేవన్ని , నా ఆనందం చెడగొట్టడానికి అనిపించి నేనే దూరం దూరం వుండేదాన్ని. దాని ఫలితం ఇపుడు అనుభవిస్తున్నా... కానీ నువ్వు ఎందుకిలా అయ్యావ్! నాకైతే ఆశ్చర్యంగా అవునది...అంది సంకేత.
“సుదర్శన్ నా వెంట పడేవాడు... బలవంతంగా రౌడీలతో వచ్చి గొడవ చేసి పెళ్ళి చేసుకొని మూడునెలలు నరకం చూపించాడు. అసలు ఇదంతా మా అమ్మ వల్లనే, తనే నా తలరాతను రాసింది. అయినా నా తల్లిని నేను చూసుకోవాలి ... అందుకు బ్రతకటానికి డబ్బు కావాలి. పని చేయనివాడు... నా ఉద్యోగం పైనే బ్రతుకుతూ నాకు నరకం చూపిస్తున్నాడు. అన్ని విధాలా విసిగిపోయా... అందుకే విడాకులు తీసుకుంటున్నా.. పట్టాభిరాం మంచి లాయర్. ఎలాంటి మొండి కేసులైనా సాల్వ్ చేయగలడు” అంది హిందూ.
సంకేత కూడా ఆలోచిస్తూ నన్ను కూడా ఆ లాయర్ దగ్గరకు తీసుకెళ్ళు ,ఆయనతో కొంచెం మాట్లాడాలి.. మామయ్యకు మంచి ఫ్రెండ్ కాని అతనితో వెళ్లడం కంటే నేనే కలుద్దామని అంది. ఇద్దరు కలసి లాయర్ పట్టాభిరాం కలవాలని బయరుదేరారు.
***
రోజులు గడుస్తున్నా సంకేత జాడ మాత్రం తెలియదు. వస్తుందో. లేదో అన్న సంశయం మొదలైంది. అపుడే డోర్ చప్పుడు వినిపించడంతో వెళ్ళి తలుపు తీశాడు. పటాభిరాం వచ్చారు. అతను ఫ్యామిలి ఫ్రెండ్ కాబట్టి అతను అడిగే వాటికి కూల్ గా సమాధానాలు ఇస్తున్నాడు అనంత్. మాట్లాడుతూ అక్కడ ఉన్న పెళ్ళి ఫోటో చూసి,” ఇపుడు సంకేత ఇక్కడ లేదేమో కదా. ఫ్రెండ్ ఇంట్లో ఉందను కుంటా...విడాకులు తీసుకోవాలని కలవడానికి వచ్చింది,” అన్నాడు అభిరాం. అది వినగానే షాక్ అయ్యాడు అనంత్.
“ఏదో ఒక్కచిన్న మాట అన్నానని తానింతగా పట్టించుకుంది. తనని క్షమించమని అడుగుతాను. సంకేత గురించి నాకు బాగా తెలుసు,” అన్నాడు అనంత్.
          “కొన్ని మాటలు క్షమించేలా ఉంటాయి అనంత్! కానీ కొన్ని మాటలు వ్యక్తిత్వం పై స్వారి చేస్తాయి. తీవ్రంగా గాయపరుస్తాయి. ఎదుటి మనిషిని నీచమైన అర్ధాలలో మాట్లాడి గాయపరచటం కూడా నేరం కిందకే వస్తుంది. చిన్నపిల్లలు కూడా నచ్చని మాటలకు వెంటనే స్పందిస్తారు. అలాంటిది వ్యక్తిత్వం ఉన్న సంకేత ఎలా ఊరుకుంటుందని అనుకుంటున్నావు?”
“నిన్ను ప్రేమించింది అని నువ్వు అంటున్నావు... అది ఎప్పుడో నీవంటూ పూర్తిగా తెలియనప్పుడు. సంకేత నిన్ను ప్రేమించిన దానికన్నా ఎక్కువగా తన్ను తాను ప్రేమించుకుంటుంది. తన జీవితాన్ని ప్రేమించుకుంటుంది. ఒకటి కావాలనుకున్నపుడు ఇంకొకటి వదులుకుంటారు ఎవరైనా....!” అన్నాడు లాయర్ పట్టాభిరాం.
“అయినా ఇంత త్వరగా నాకు విడాకులు ఇవ్వాలని ఎలా అనుకుంటుందో నేనొకసారి తనతో మాట్లాడుతాను”
లాయర్ సూటిగా చూసి “ ఆమె నీకు విడాకులు ఇస్తానని నీతో చెప్పిందా?” అన్నాడు.
అనంత్ కలవరపడి “మీతో చెప్పిందిగా” అన్నాడు.
“అలాంటి మాటలేమి నాకు చెప్పలేదు. హిందూ విడాకుల కేసు నిమిత్తం నన్ను కలవడానికి వచ్చింది. హిందూతో విడాకులు కేసు డ్రాప్ చేయించింది. ఇపుడు హిందూ వాళ్ళ ఆయనతో ఉంటా అంటుంది. సుదర్శన్ కూడా తప్పులు సరిదిద్దు కుంటా అన్నాడు. సంకేత ఆలోచన విధానమే వేరు. నేనే గుర్తు పట్టి అడిగాను సంకేతను. అపుడు చెప్పింది తాను విడాకులు తీసుకోనని కాని నీతో కలసి ఉండనని... అది సరియైన పద్దతి కాదు అని అనిపించి... కలసి ఉండనపుడు లీగల్ గా విడాకులు తీసుకుంటే నీవు మళ్ళీ పెళ్ళి చేసుకోవచ్చు అని చెప్పను. దానికి సంకేత ఏమందో తెలుసా “ అపుడు మాత్రం రాముడు వస్తాడా” అంది. ఎందుకో నా మనసు చివుక్కు మంది బాధతో అన్నాడు పట్టాభిరాం.
“అనంత్ లాంటి భర్త ఏ అమ్మాయికి వద్దు సార్. నేను పడ్డ బాధలు చాలు. నాకు ఇలాంటి వాడు వద్దు. కాని అనంత్ ని వేరే పెళ్ళి చేసుకోమని చెప్పండి సర్! నా కెలాంటి అభ్యంతరం లేదు... ఇవన్నీ మీరు చెబితే బాగుంటుందనీ నా స్వవిషయాలు ఇంత వివరంగా చెప్పాను. దేవరాయుడు మామయ్య చేత చెప్పిస్తే బావుండదు. ఎందుకంటే ఆయన పట్ల అనంత్ కి ఒకే ఒక్క విషయంలో మంచి అభిప్రాయం లేదు. అదింకా ముదిరే అవకాశం వుంది. నేను ఇప్పటికే చాలా అలసిపోయి ఉన్నాను...”అంది.... నేనిక వెళ్ళి వస్తాను ట్రైన్ టైం అవుతుంది” అంటూ లేచాడు లాయర్ అభిరాం.
అనంత్ కూడా “ మీరు ఢిల్లీ నుండి రాగానే మిమ్మల్ని కలుస్తాను అంకుల్ అంటూ ఆయనతో పాటే కారు వరకు వెళ్ళాడు.
******
శ్రీహర్ష, నీలిమ మీద కోపంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళలేక, ఇంట్లో ఇంటిపనులు చేసుకోలేక పంతం పట్టి శివరామకృష్ణ తో పాటు ఓల్డ్ ఏజ్ హోమ్ లో చేరింది కాంచనమాల. అక్కడ కూడా సౌకర్యంగా లేదు కాని అప్పటికే రెండు మూడు హోమ్ లు మారి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ కూడా ఒక్క దగ్గరే ఇద్దరికీ కలసి  గది కేటాయించలేదు. ఆ రోజు శ్రీహర్ష, పల్లవి చూడడానికి వచ్చారు. అప్పుడే శివరామకృష్ణ కి హార్ట్ అటాక్ రావడంతో హడావిడిగా హాస్పిటల్ కి తీసుకెళ్ళడంతో ప్రమాదం తప్పింది... ఆ సంఘటన కాంచనమాలలో మార్పు తీసుకువచ్చింది. ఆ సమయానికి కొడుకు కోడలు లేకుంటే ఏమయ్యేదో అని.
“నా బలం బలహీనత మీ మామయ్యే.. తాను లేకుంటే నా పరిస్థితి ఏమిటి.. డబ్బు గురించి కాదు.. ఇక్కడ నా అనే వారు ఎవరూ లేరు..ఇవి ఏమి ఆలోచించకుండా పంతం తో మీ మామయ్యని, మిమ్మల్ని చాలా బాధ పెట్టాను క్షమించమ్మా,” అంటూ నీలిమని పట్టుకుని ఏడుస్తూ అంది కాంచనమాల.
అత్తయ్య ఇక్కడ ఇక ఉండొద్దు.. మన ఇంటికి వెళ్దాం అని, వెంటనే అక్కడ హోమ్ లో ఫార్మాలిటీస్ అన్ని పూర్తిచేసుకొని బయలుదేరారు.
దారిలో ఒక్కసారి కుదుపుతో కారు సడెన్ బ్రేక్ వేయడంతో ఏమయిందో అని అందరూ బయటికి చూసారు. ఆ క్షణంలో తమ కారుకి యాక్సిడెంట్ జరిగిందనే అనుకున్నారు. కాని అది యాక్సిడెంట్ కాదు.
కారు మీద పడిన తన బైక్ ని పల్లవి నెమ్మదిగా పైకి లేపుతూ ఆయాసపడి పోతూలేవదీస్తుంది. పల్లవి సంగతి తెలిసిన నీలిమ నవ్వి, వెంటనే కారు డోర్ తీసుకుని కిందకి దిగింది.
నీలిమని చూడగానే పల్లవి షాకింగ్ గా ,”ఇది నీకారా?” అంటూ కారులో ఉన్న కాంచనమాల ని చూసి ,”వీళ్లు ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉన్నారని విన్నాను. ఇప్పుడు ఎక్కడికి తీసుకెలుతున్నావు?” అని అడిగింది పల్లవి.
నీలిమ ప్రసన్నంగా చూసి “మా యింటికి” అంది సంతోషంతో....
“ఎందుకే కొరివితో తలగోక్కోవడం, నిన్ను ఒక్కరోజన్నా సరిగా చూసిందా? ఇప్పుడేదో హాయిగా ఉన్నావ్? మళ్ళీ ఎందుకు ఈ పీడా. వాళ్లను అక్కడే ఉండనివ్వక” అంటూ సలహా ఇచ్చింది పల్లవి.
“నా పాటికి నేనుండి, నా బాధ్యతలు వదిలేస్తే నా జీవితం పరిపూర్ణం కాదు.” అంది నీలిమ. ఆ మాటలు పల్లవికి నచ్చలేదు.
కారులో ఉన్న శివరామకృష్ణని చూసి పల్లవి వెళ్ళి ,”బాగున్నారా అంకుల్... మీరు ఎలా ఉన్నారాంటీ?” అంటూ పలకరించింది.
“ఇప్పటి వరకు బాగాలేము పల్లవి. ఇప్పటి నుండి బాగున్నట్టు అంది నీలిమను చూస్తూ... మాతో పాటు రా.” అంటూ పిలించింది పల్లవిని. “
లేదాంటీ సంకేతతో షాపింగ్ కి వచ్చా ,మళ్ళీ కలుస్తాను అంటీ,” అంది.
సరే మళ్ళీ కలుద్దాం బై... అంటూ కారులో కూర్చుంది. నీలిమతో ప్రయాణం ఎంతో నిశ్చింతగా అనిపిస్తుంది కాంచనమాల, శివరామకృష్ణ లకి.......
*****
 (సశేషం)

No comments:

Post a Comment

Pages