భూతాల మధ్యన భారతి - అచ్చంగా తెలుగు

భూతాల మధ్యన భారతి

Share This

భూతాల మధ్యన భారతి

పోడూరి శ్రీనివాసరావు 


సుందరకాశ్మీరం మకుటాయమానంగా
పవిత్ర త్రిసముద్రవాహిని
పాదాభిషేకం చేయగా
అతి మనోహర రూపంతో
అలరారిన నా భారతి - నేడు
భయంకర భూతాల మధ్య
బెంబేలెత్తుతూ - బిక్కచచ్చి
ప్రాణావశిష్టయై - బితుకు బితుకు
మంటూ భీతిల్లుతోంది
ఎయిడ్స్ మహా భూతం - ఏ మూలనుంచి
దాడి చేస్తుందో –
సమగ్రవాదాన్ని వెన్నుపోటు పొడుస్తూ
ఉగ్రవాదం మహాభూతమై
ఎటునుంచి విరుచుకుపడుతుందో-
ఎన్ని జీవాలను - విగతజీవుల్ని
చేస్తుందోకన్నుమిన్ను కానరాని కామపిశాచి
చిన్నపిల్లల్నే కాదు - కన్నపిల్లల్ని
కూడా చిదిమి నేల రాల్చుతుందో –
ప్రకృతి వైపరీత్యాలను అదుపు చేయలేని
మానవ ప్రయత్నం - ఎన్నెన్నో తుఫాను
లను, తలవంచి భరిస్తోందో –
ఆస్తినష్టం - ప్రాణనష్టాలను నైవేద్యంగా
సమర్పిస్తోందో -
ర్యాగింగు భూతం ఎన్నో పసిమొగ్గలను
బలి తీసుకొంటోందో –
ధరల కళ్లేలను అదుపు చేయలేక
సొమ్మసిల్లి
తీసుకున్న అప్పలను చెల్లించలేక
అసువులనర్పించిన అమాయకులు ఎందరో-
ముష్కరుల దాడికి బలైన విదేశీ జంట
మృతకళేబరాలపై రక్తాశ్రువులు కారుస్తూ
నివాళులర్పిస్తున్న శాంతి కపోతంపై
ఉగ్రవాదం మరోమారు విరుచుకుపడింది.
గాయపడి రక్తంతో తడిసిన
తన రెక్కలను శాంతికపోతం
తుపాకి బానెట్ పై ఆరబెట్టుకుంటోంది.
బాంబుదాడిలో తునాతునకలైన
శరీర శకలాలు - భీభత్సదృశ్యాన్ని
తలపింపగా
తల్లడిల్లిపోయిన తల్లి భారతి
పగిలి ముక్కలైన హృదయంతో
కులాల మతాల కావేషాలతో
కొట్టుకుంటూ, కైజారులతో
తల్వారులతో తలపడుతున్న
తనయులను శాంతింపచేయలేక
కుళ్ళి కుళ్ళి ఏడుస్తోంది
తనననునయించేవారు లేక,
తల్లడిల్లుతున్న ఆ మాతృ హృదయం
సమైక్యరాగానికై ఎదురుచూస్తూ
పరివర్తనకి పదివేల కళ్లతో
ఎదురుచూస్తోంది.
***

No comments:

Post a Comment

Pages