అమ్మ ఒక్కర్తే... - అచ్చంగా తెలుగు

అమ్మ ఒక్కర్తే...

Share This

అమ్మ ఒక్కర్తే...

భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు.


అడగనిదే అమ్మైనా పెట్టదని ఎవరన్నారు?
అమ్మలా ప్రేమతో మనకడుపు నింపేవారు ఇంకెవరున్నారు?
మనం అడిగామనే మనకు జన్మనిచ్చిందా?
అడిగామనే మనకు పాలిచ్చిందా?
అడిగామనే లాలపోసిందా, అడిగామనే జోలపాడిందా?
అజ్ఞానంతో మనం ప్రతి చిన్నవిషయానికీ చలించి ఏడుస్తుంటే,
అనంతమైన ప్రేమతో మనని తనగుండెలకు హత్తుకొని,
మన అన్నిభయాలకు తానే మందుఅయి,
ఓదార్పునిచ్చింది మనం అడిగామనేనా?
మన అల్లరిని తండ్రికి తెలియకుండా దాచి,
మన నాన్నజేబులోని డబ్బును అతనికి తెలియకుండా దోచి,
మనకిచ్చింది మనం అడిగామనేనా ?
వెకిలి బుద్ధులున్న మనని
వెయ్యేళ్ళు ధనంతో వర్ధిల్లమని
దీవించినది మనం అడిగామనేనా?
చిన్నప్పుడు తనకొంగు పట్టుకొని తిరిగిన మనం,
పెద్దయ్యాక తన కొంగునొదిలేసినా
తనను,తనజ్ఞాపకాలనూ వెలివేసినా
మన వ్యథలను గూర్చి చింతిస్తూ,
మనకై మౌనంగా తనలోతానే విలపిస్తూ,
మన పరిస్థితులను బాగుచేయమని,
మన స్థితిగతులను సరి చేయమని,
ఆ భగవంతుడిని అనుక్షణం ప్రార్దించినది,
మనం అడిగామనేనా?
మనం దూషించినా మనను దీవించేది,
మనం ద్వేషించినా మనను ప్రేమించేది.......అమ్మ ఒక్కర్తే !
మనం అడిగినా,అడగకున్నా ప్రేమతో మన కడుపునింపేది..... అమ్మఒక్కర్తే !
****

No comments:

Post a Comment

Pages