శ్రీధరమాధురి – 27

(నిజమైన విద్యార్ధి ఎలా ఉండాలో పూజ్య శ్రీ వి.వి.శ్రీధర్ గురూజీ అమృత వాక్కుల్లో చదవండి.)


విద్యార్ధిగా మీరు వృధా చేసిన ప్రతి నిముషం తదుపరి జీవితంలో మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది. మీరు ఎదుగుతుండగా, మీరు అమూల్యమైన కాలాన్ని వృధా చేశారనీ, అందువలన చాలా నష్టపోయారానీ మీకు అనిపిస్తుంది. అందుకే ఒకవేళ ఒక విద్యార్ధి, ఉన్నతాశయాలతో ఉంటే, అతను సమయాన్ని వృధా చెయ్యకూడదు.
ఒక విద్యార్ధి దారి మళ్ళి, పరధ్యానానికి గురి కాకూడదు . ఈ రోజుల్లో వ్యాపకాలు ఎక్కువ అయ్యాయి. విద్యార్ధికి ప్రధానమైన పరధ్యానం కలిగించేది సెల్ ఫోన్. ఇంకా దారుణమైనది స్మార్ట్ ఫోన్. యువతరం స్మార్ట్ ఫోన్ ను సవ్యంగా వాడగలిగినా, నేను విన్నదాన్ని బట్టి, చాలావరకు,  విద్యార్ధులు దాన్ని స్మార్ట్ గా వాడట్లేదు. కాబట్టి విద్యార్ధులు స్మార్ట్ ఫోన్ ను వాడచ్చు కాని, దాన్ని స్మార్ట్ గా వాడటం వారు తెలుసుకోవాలి. ఆ వాడకం అనేది మీ జ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు తోడ్పడాలి.

ఆరోగ్యకరమైన వాదనలు, సామూహిక చర్చల్లో పాల్గొనడం ఎల్లప్పుడూ మంచిదే. ఇది విద్యార్ధి జ్ఞానాన్ని పెంచుతుంది. వాదన తర్కం యొక్క నైపుణ్యాన్ని పెంచేందుకు ఉపకరిస్తుంది. కాని వివాదాలను రేకెత్తించే చర్చల్లోకి విద్యార్ధులు లాగబడకుండా జాగ్రత్త వహించాలి. అటువంటి వాదనలు కేవలం సమయాన్ని వృధా చేస్తాయి తప్ప, విద్యార్ధికి ఏ విధంగానూ ఉపయోగించవు. అంతేకాక, కొన్నిసార్లు అమాయకమైన విద్యార్ధి, రగిలే వివాదాలకు సమిధ అవుతాడు. అతని అనుభవ రాహిత్యం వల్ల, అతను సరైన సమయానికి బయటపడలేకపొతే, అతని భవిత, కెరీర్ ప్రభావితం అవుతాయి. అతన్ని వివాదాస్పదమైన వాదనలలోకి తోసేవాళ్ళు, హాయిగా గాల్లోకి మాయమైపోతారు, అతని భావి జీవితం ప్రశ్నార్ధకమవుతుంది. కాబట్టి, ఒక విద్యార్ధి అటువంటి విషయాల గురించి అవగాహన కలిగి ఉండాలి.

జ్ఞానసముపార్జన యొక్క ప్రధాన ఉద్దేశం మంచి ఉద్యోగమో, లేక డబ్బో, లేక పరపతిని, సంఘంలో ఒక స్థాయిని సంపాదించడమో , లేక అవార్డుల కోసమో, రివార్డుల కోసమో కాదు. మానవత్వం కోసం ఒక విజేతలా నిలిచి, ఒక మంచి పౌరుడిగా ఉంటూ, తన జీవితకాలంలో ప్రపంచానికి వీలైనంత మంచిని చెయ్యడం. విద్యార్ధులు ఈ కోణం నుంచి విషయాలను చూస్తూ, ఏ విధంగానైనా దీన్ని సాధించేందుకు కృషి చెయ్యాలి.
విద్యార్ధి పరంగా చూస్తే, విద్యకు నలుగురు సంరక్షకులు ఉన్నారు.
  1. తల్లిదండ్రులు
  2. అధ్యాపకులు మరియు విద్యావేత్తలు
  3. సంస్థల నిర్వాహకులు
  4. విద్య పరంగా పాలసీలను తయారు చేసేవారు/ విద్యాశాఖకు సంబంధించిన ప్రభుత్వ అధికారులు, మంత్రులు.
ఈ నలుగురూ విద్యార్ధి ఎదుగుదలకు కీలకమైనవారు. క్రమశిక్షణ పైనుంచి మొదలై, విద్యార్ధుల దాకా ప్రవహిస్తుంది. పాలసి తయారు చేసేవారు, విద్యాసంస్థల నిర్వాహకులు, టీచర్లు లేక తల్లిదండ్రులు క్రమశిక్షణారాహిత్యంగా వ్యవహరించకూడదు. వీరిలో ఏ ఒక్కరికి క్రమశిక్షణ లేకపోయినా, విద్యార్ధి కూడా అలాగే తయారయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విద్యార్ధుల బాగు కోసం ఈ నలుగురు సంరక్షకుల నైతిక బాధ్యత సమానంగా ఉంటుంది.
విద్యా సంరక్షకుల దృక్పధం తాత్కాలికంగా ఉండకూడదు. విద్యా క్షేత్రంలో భవితను వారు ముందుచూపుతో దర్శించి, విద్యార్ధుల్లోని శ్రేష్టతను వెలికి తీసుకువచ్చే లాగా, కొత్త ఆలోచనలను అమలుపరచాలి.

విద్యా సంరక్షకులు ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, కలిసికట్టుగా పనిచెయ్యాలి. తరచుగా సంప్రదింపులు జరుపుతూ, కొత్త ఆలోచనలను పంచుకుంటూ, ఒక విద్యార్ధి జీవితంలోని ప్రతి అంశానికి సంబంధించి వారు గమనించిన సమాచారాన్నిబదిలీ చేసుకుంటూ ఉండాలి. విద్యకు సంబంధించి, విద్యార్ధి జీవితంలో ఏమి జరుగుతోందన్న విషయాన్ని ప్రతి సంరక్షకుడు తెలుసుకోవాలి.

విద్యా సంరక్షకులు ఉన్నతస్థాయి ప్రమాణాలను, నైతిక విలువలను పాటించాల్సిన అవసరం ఉందని చెప్పనక్కర్లేదు. ఇవి కేవలం మాటలకే పరిమితం కాకుండా, చేతల్లోనూ, చేసే పనుల్లోనూ ప్రతిఫలించాలి.

కొన్నిసార్లు, ఒక పెద్ద కారణం కోసం మేధావులు కూడినప్పుడు, అహం, అసూయ, ఆ కారణాన్ని పాడుచేస్తాయి. విద్యా సంరక్షకులు కూడా దీనికి అతీతమేమీ కాదు. మానవత్వానికి భవిష్యత్తు విద్యార్ధులే కనుక, మనం ఈ రంగంలో రాజకీయం ఆడేందుకు వీలు లేదు.

విద్యా మెరుగుదల కోసం నలుగురు విద్యాసంరక్షకులకు సామూహిక బాధ్యత ఉంటుంది. ఏ పరిస్థితుల్లోనూ, వ్యక్తిగత భావాలు లేక ఇష్టాలపై ఆధారపడ్డ ఏ సంరక్షకుడి ఐడియాలనైనా అమలు జరిగేలా చూడకూడదు,  ఇది విద్యార్ధుల ఆసక్తిని దెబ్బతీస్తుంది.

నేటి చట్టనిర్మాతలు, ఏ ప్రభుత్వం మారినా కూడా, విద్యా క్షేత్రంలో వివిధ రంగాల్లోని మేధావులతో కూడిన ఒక స్వతంత్రంగా వ్యవహరించగల ‘అంతర్గత  శాఖ’ ఏర్పడేలా ఒక రాజ్యాంగ చట్టాన్ని తీసుకుని రావాలి. వీరంతా కలిసి, అవసరాన్ని బట్టి, విద్యకు సంబంధించిన పాలసీ అంశాల్లో ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోగలగాలి. మారుతున్న ప్రభుత్వాలు విద్యార్ధుల ప్రగతిని, కెరీర్ ను ప్రతికూలంగా ప్రభావితం చెయ్యకూడదని, ఇలా సూచించబడింది.
దయ అనేది ఏ విద్యా వ్యవస్థకైనా మూలం కావాలి. ఒకవేళ విద్య అనేది ఇతరుల పట్ల, సమాజం పట్ల దయ గా రూపాంతరం చెందలేకపొతే, అది శుద్ధ దండగ, అటువంటి విద్యను తృణీకరించాలి. 
***

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top