శీలవతి - అచ్చంగా తెలుగు

శీలవతి

Share This

శీలవతి

     -చెన్నూరి సుదర్శన్.


సర్వేశానికి  భార్య మీద అనుమానం జాస్తి.
పైగా తనది పోలీసు ఉద్యోగం. ‘ఎవరికీ తల వంచకు.. ఎవరినీ నమ్మకు.. అందరినీ అనుమానించు. దయాదాక్షిణ్యాలను దరిదాపు రానీయకు.. చివరికి నీ రక్త సంబధీకులైనా సరే.. రాజీ పడకు.. కనికరంతో  ఎవరినీ కటాక్షించొద్దు...’ అంటూ ఉద్భోదించే డిపార్టుమెంటు అది.
దానికి తోడు ‘ఒరేయ్ సర్వేశా..! పెళ్ళాంకు ఇసుమంత  అలుసు యిచ్చావో ఇక చచ్చావే అనుకో..!!. నెత్తికెక్కి కూర్చొని సవారీ  చేస్తుంటుంది.. కొంగుకు  ముడిపెట్టుకొని నిన్నొక ఆటాడించడం ఖాయం. ”  అంటూ సర్వేశం నాయనమ్మ కడుపు  నిండా ఉగ్గుపాలతో సహా  పట్టించి పరమపదించింది..
అంతెందుకు..? అనుమానం మొదలు పుట్టి సర్వేశం తదుపరి పుట్టాడని అడిపోసుకుంటారంతా.. అయినా ఇవేవీ ‘జాన్తానై..’ అనుకునే రకం సర్వేశం.
          సర్వేశం ఇంట్లో అడుగుపెట్టాడంటే .. యమధర్మరాజు ఇంట్లోకి అడుగు పెట్టినట్లే.. పాపం..! అతడి భార్య హేమ ప్రాణాలు అర చేతిలో పట్టుకొని గజ గజ లాడేది.
మొదటి  డోర్ బెల్లుకే గవాక్షం తెరవాలి. నేరుగా వచ్చి వాలు కుర్చీలో వాలి పోతాడు సర్వేశం. అతడి బూట్లు విప్పాలి.. సాక్స్ విప్పాలి.. లుంగీ, టవలు చేతికి అందించాలి. స్నానాకి వేడి నీరు.. వీపు రుద్దటం.. టవలుతో ఒళ్ళు తుడవటం..  తలకి కొబ్బరి నూనె రాయటం.. దువ్వటం.. ముఖానికి పౌడరు రాయటం.. భోజనం అయ్యాక నడుము వాల్చుకున్నప్పుడు కాళ్ళు పట్టడం... ఇత్యాది పనులన్నీ ఒక క్రమ పద్ధతిలో చేయాలి. ఇందులో రవంత పొరపాటు జరిగినా రక్తం కళ్ళ జూస్తా.. అని బెదిరించే వాడు.
హేమ కాపురానికి వచ్చి అర మాసం   దాటింది.. అరక్షణమైనా తన కట్టుబాట్లను జవదాట కుండా కుక్కిన పేనులా కిక్కురు మనకుండా ఒదిగి పోయిన హేమను  చూసి   ఎంతగానో మురిసి పోయేడు సర్వేశం.
 “ఆ పటం  వంక చూడురా  సర్వేశా. శ్రీ మహా విష్ణువు కాళ్ళు మహాలక్ష్మి ఎలా పట్టుతుందో..! అందుకే నా మాట విను.. నీలో దైవ భక్తి పెంచుకో.. నీ పెళ్ళాం చచ్చుకుంటూ నీ మాట వింటుంది అని పోతూ పోతూ..  మరీ మరీ  చెప్పి చచ్చిన నానమ్మను ఫాలో అవుతున్నందుకేనెమో తన భార్య ఇలా కాళ్ళు పడ్తున్నదనుకునే వాడు.
అయినా భార్యపై అనుమానం లేక పోలేదు.. మరో ప్రక్క   పీకుతునే వుంది.
ఒక పరీక్ష పెట్టి తన అనుమానాన్ని  నివృతి చేసుకోవాలని పథకం పన్నాడు..
“హేమా ..”అంటూ గోముగా పిలిచాడు మంచంలో నడుం వాల్చుకున్న సర్వేశం.
కాళ్ళు పడ్తున్న హేమ “ఊ..’ అంది. ఎక్కువగా మాట్లాడినా ఈయనగారితో మరో తంట అనుకుంటూ మనసులో..
“నేను ఒక కేసు విషయంలో క్యాంపుకు వెళ్ళుతున్నానోయ్.. రెండు రోజుల వరకూ రాను” అంటూ చెప్పటం మొదలుపెట్టాడు.
ఆవేదనగా  చూసింది హేమ. అ చూపు సర్వేశాన్ని లోన కదిలించినా బయటికి ఏమాత్రమూ ఫోకస్ చేయలేదు. అలా చేస్తే  తన భద్రతకు  భంగం వాటిల్లుతుందని ప్రగాఢ విశ్వాసం..
“నాకూ నిన్ను విడిచి వెళ్ళాలంటే కష్టంగానే వుందోయ్.. అయినా  ఏంచేస్తాం.. ఉద్యోగ ధర్మం. కాని ఈ లోకమే పలు రకాలుగా పెళ్ళాన్ని  వదిలి వెళ్ళాడు.. అని అడిపోసుకుంటుంది.. నీ మనసు నాకు తెలియంది కాదు. నువ్వు కూడా బాధ పడ్తున్నావని ఈ లోకానికి తెలియాలి..”
‘అంటే నేనేం చెయ్యాలి..? అన్నట్లుగా చూసింది హేమ. ప్రసన్నుడైనట్లు నటించాడు   సర్వేశం.
“నేను వచ్చే వరకు నువ్వు స్నానం చెయ్యొద్దు.. చీర, జాకెట్టు మార్చొద్దు. తల దువ్వొద్దు.. ముడుచు కోవద్దు.. పూలు పెట్టుకో వద్దు. కళ్ళకు కాటుక పెట్టుకో వద్దు. పెదాలకు లిఫ్టిక్ రాయోద్దు.. గడప దాటి బయటికి పోవద్దు” అంటూ కళ్ళు మూసుకున్నాడు.. ఆమె రియాక్షాన్ తో నాకేంటి పని అన్నట్లు.
ఆమె మౌనంతో  సర్వేశం సుఖ నిద్రలోకి జారుకున్నాడు.
మరునాడు సాయంత్రం సర్వేశం అలా క్యాంపుకు  వెళ్ళాడో లేదో.. పంజరం విడిచిన విహంగమయ్యింది హేమ. గబా, గబా స్నానాల గదిలోకి పరుగెత్తింది. తలంటు స్నానం చేసింది. సర్వేశం పెట్టిన నియమాలన్నీ  తుంగలో తొక్కింది.
అది సంధ్యా సమయం. అప్సరసలా తయారైన హేమ మరో మారు అద్దంలో తన సౌందర్యాన్ని బేరీజు వేసుకుంది. వెలితిగా అనిపించి ముఖంపై అక్కడక్కడ మరింత టచప్ చేసుకుంది. పెరట్లో బొడ్డుమల్లె చెట్టు అనుగ్రహంతో తలలో బారెడు దండ దూర్చింది. సరదాగా కాసేపు కబురు చెప్పుకుందామని ఎదురింటి రమణి యింటికి బయలు దేరింది..
అలా రోడ్డు దాటి మెరుపు తీగలా  రమణి ఇంట్లో దూరిన హేమను  చూసి మూర్చ వచ్చినట్లై సడన్ గా బ్రేకుపై కాలు వేశాడు  కామేశం. కాసేపు బండి  రోడ్డు ప్రక్కన  ఆపి హాండిల్ పై అలాగే వాలి పోయాడు పువ్వుపై తుమ్మెదలా.. హేమ అందం అతడిని స్వర్గలోకంలో విహరింప జేస్తోంది.
కామేశం అంటే ఆ ఊళ్ళో తెలియని  వారుండరు. అతడంటే  అందరికీ హడల్.. చిన్న పాటి  వీధి రౌడీ. భూదందాలను సెటిల్ చేస్తూ ఉంటాడు. డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేస్తాడు..  జల్సారాయుడు  అనుకుంటారంతా..
హేమ వెళ్ళే సరికి రమణి  అత్తగారు ఇంట్లోనే వున్నారు. ఆమెతో మనసు విప్పి మాట్లాడు కోవడం కుదురలేదు.
“మా వారు క్యాంపుకెళ్లారు. నాకు ఇంట్లో ఒక్క దానికి ఏమీ తోచడం లేదు.. కాసేపు కబుర్లు చెప్పుకుందాం మా ఇంటికి రావా ప్లీజ్...”అంటూ రమణిని ఆహ్వానించి  తిరిగి వచ్చేసింది హేమ.
ఇంట్లోకి అడుగు పెట్టిన హేమకు  గుండె ఝల్లుమంది. ఎదురుగా సర్వేశం.. పళ్ళు నూరుతున్న ఉగ్ర స్వరూపం.
“నీ అసలు రంగు  కనుక్కుందామనే క్యాంపు నాటక మాడాను. బలేగా దొరికావు.. నా పంబలకిడి జంబ.. నీ సంగతి ఇలా కాదు.. నా నిజ స్వరూపం చూపిస్తా..” అంటూ బర, బారా ఈడ్చుకు వెళ్లి చీకటి గదిలో ఒక స్థంబానికి కట్టేసాడు.  పోసీసు స్టేషన్ లోని లాకప్పు గదిలా ఒకటి ఇంట్లో సైతం మేనేజ్ చేస్తూ ఉంటాడు సర్వేశం.
హాల్లో కూర్చొని మనసుకు తగిలిన గాయానికి పూతగా మందు  లాగించ సాగాడు.
“ఓ.. భగవంతుడా.. నా భర్త చేష్టలను క్షమించు.. “అనుకుంటూ ఏడ్వ సాగింది హేమ.
పావుగంట తరువాత తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. హేమ  ఆశగా తలెత్తి చూసింది. కుక్కలా పసిగట్టి.. పిల్లిలా వస్తున్న రమణిని చూసి ఖంగు తింది..
“అయ్యయ్యో ఇప్పుడెలా.. నీకు ఒక మంచి బేరం తెచ్చాను” అంటూ గుస గుసలాడుతూ అసలు విషయం బయట పెట్టింది రమణి.
‘నిన్ను చూసి కామేశం మనసు పారేసుకున్నాడు. నువ్వు కామేశాన్ని కటాక్షించే దాకా కదలడట.. కాదంటే కాటికైనా సరే.. వెళ్ళడానికి రడీ  అని భీష్మించుకొని కూర్చున్నాడు. వాడు జగ మొండి.  నాకు బాగా తెలుసు.  అందుకే మళ్ళీ, మళ్ళీ ఇది రాని  రోజు.. అనుకుంటూ మంచి బేరం కుదిర్చాను. ఊహించనంత డబ్బు చేజేతులా చేజారి పోతుంది..” అంటూ మొసలి కన్నీరు అరువు తెచ్చుకో సాగింది..
కాసేపటికి తేరుకొని తనే ఒక ఉపాయం చెప్పింది.. అది హేమకూ నచ్చింది.
హేమ  కట్లు విప్పింది రమణి.
హేమ తిరిగి  రమణిని అదే స్థంబానికి కట్టి వేసింది. అచ్చంగా తనలాగే ఏడ్వాలని చెప్పి రమణి చెప్పిన రహస్య స్థావరానికి వెళ్ళింది.
అదే పనిగా ఏడుస్తూ వుండటం సర్వేశానికి అరికాలి మంట సుర్రున నెత్తి కెక్కింది.. మరోప్రక్క విస్కీ కిక్కు కుదిపేస్తోంది..
‘ఆడదాని అందానికి ప్రతీక ముక్కు. ముక్కు చేక్కేస్తే.. దాని తిప్పులాటా..! తప్పుతుంది. పరాయి మగాడికి  తప్పులాటా..!! తప్పుతుంది’ అని మనసులో వచ్చినదే తడవుగా చిన్న చాకు తీసుకొని చీకటి గదిలోకి అడుగు పెట్టాడు. రమణి ఏడ్పు రాగం సౌండు మరింత పెంచింది.. అ రాగానికి తాళం వేస్తూ చాకుతో రమణి  నాసికాగ్రాన్ని  రవంత గాటు పెట్టి రక్తసిక్తం చేసాడు సర్వేశం. రమణి తన బాధ కక్క లేక మింగ లేక కొంగు నోట్లో సౌండ్ ప్రూఫ్ లా కుక్కుకొని కుమిలి కుమిలి ఏడ్వ సాగింది..
మరో పావుగంట తరువాత హేమ వచ్చింది. ఆమె మొగుడు చేసిన సత్కారాన్ని సైగలతో వివరిస్తూ తిరిగి హేమను కట్టి వేసింది రమణి.. తన తెగిన ముక్కు ముక్కను చీకట్లో తడుముకుంటూ వెదుక్కొని..  దొంగకు తేలు కుట్టినట్లు తన ఇంటికి గాలిలో తేలిపోయింది
“ఓ.. భగవంతుడా.. నా భర్త చేష్టలను  క్షమించు.. అతడు నిర్దోషి.. నేనే పతివ్రతనైతే నా ముక్కు నాకే దక్కు..” అంటూ అదే పనిగా శోకాలు తీయ సాగింది హేమ.
సర్వేశానికి అనుమానమొచ్చింది. చేయి గిల్లి చూసుకున్నాడు. అరచేతి లోని రక్తం ఇంకా అరి పోనేలేదు.. ‘మరి నా హేమ  ముక్కు ఎలా దక్కు?..’ అని మనసులో అనుకుంటూ నెమ్మదిగా గదిలోకి వెళ్ళాడు. హేమ  కట్లు విప్పి హాల్లోకి తీసుకు వచ్చాడు. నిర్ఘాంత  పోయాడు. తన కళ్ళను తనే నమ్మలేక పోతున్నాడు. కళ్ళు నలుముకుంటూ మిటకరిస్తూ .. చూసాడు. హేమ ముక్కు దేదీప్యమానంగా ఎల్. ఈ. డి. లైటు వెలుగులో వెలిగి పోతోంది.
‘నా సతీమణి మహా సాధ్వి. సావిత్రి, సక్కుబాయిలు ఆమె ముందు దిగదుడుపే..  ఇక ముందు ఎప్పుడూ అనుమానించొద్దు. అనుమానం పెనుభూతం’ అని మనసులో బాధ పడుతూ మొదటి సారిగా “నన్ను క్షమించు హేమా ..” అంటూ మదిలో దేవుడికి దండం పెట్టుకుంటూ.. ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు.
అ రాత్రి వారి మొదటిని మైమరిపింప జేస్తోంది..
ఇదే మంచి తరుణమని హేమ  మనసు భగవద్గీతలా విప్పింది..
“ఏమండీ.. ఒక మాట చెబుతాను మీరు అవకాశమిస్తే..” అంది.. సర్వేశం ఎదపై సుతారముగా నిమురుతూ.
“ఎక్కడో స్వర్గలోకపు అంచులలో విహరిస్తున్న  సర్వేశం “తథాస్తు”  అన్నాడు.
“కాపురానికి వచ్చినప్పటి నుండి మీతో మనసు విప్పి మాట్లాడే సమయం కోసం వేచి చూస్తున్నాను.  ఈ రోజు కలిసి వచ్చింది” అంటూ మొదలు పెట్టింది హేమ.
“సంసారానికి భార్యా భర్తలు బండికి రెండు చక్రాల్లాంటి వారు. అందరూ ఆడవాళ్ళు మీ నాయనమ్మ చెప్పినట్లు వుండరు. వాళ్ళూ మనుషులే.. వాళ్ళకూ అభిరుచులూ ఉంటాయని అర్థం చేసు కోవాలి. భార్యను  బానిస లాగా చూడొద్దు.. భార్య అంటే తమ శ్వాస అనుకోవాలి గాని శాసించ గూడదు..
అర్థాంగి అందంగా అలంకరించుకుంటే తప్పేంటి..? అది ఎవరికోసమో..! అని ఎందుకు అనుకోవాలి..
ఆడది తలచుకుంటే మగని కన్ను కప్పి ఏమైనా చేయగలదు.. అందుకు ఉదాహరణ  మన ఇంటి ముందున్న రమణి.
ఆడది తన భర్త అండ చూసుకొని గర్విస్తుందే.. కాని చేతి కండ చూసి కాదు. ఇది తెలియని ఆమె భర్త అనుమానపు  పిశాచి.. తన తల్లిని ఆమెకు కాపలా పెట్టాడు. ఆ మహాతల్లి రమణి కదలికలపై ఒక కన్నేసి ఉంచేది. రమణికి అది నచ్చేది కాదు. ఆమె లోని మానసిక  అశాంతి వాళ్లకు సక్రమంగా బుద్ధి  చెప్పించే బదులు వక్ర బుద్ధికి మార్గం చూపింది.
ఇది మంచి పధ్ధతి కాదని నేను  ఆమెకు నాలుగు మంచి మాటలు చెప్పి  సరియైన దారిలో పెడదామని మీరు క్యాంపుకు వెళ్ళాక రమణి  ఇంటికి వెళ్లాను. ఆవిడ అత్తగారి ముందు మాట్లాడటం సరి కాదని ఆమెను మన ఇంటికి ఆహ్వానించాను. నన్ను అపార్థం చేసుకొని ఆమె కోసం వచ్చే కామేశాన్ని  నాకు బేరమాడి తెచ్చింది.. వాడికి ముందు బుద్ధి చెప్పాలని అనుకున్నాను. నా స్థానంలో రమణిని కట్టివేసి  ఆమె చెప్పిన రహస్య స్థావరానికి వెళ్లాను..
లేడీ పోలీసులకు కబురు అందించి కామేశాన్ని పట్టించాను. తిరిగి వచ్చేసరికి మీరు ఆమె ముక్కును చెక్కేసారు.  మీనాక్షి దానినీ తన  కనుకూలంగా మార్చుకునే రకం.. ‘తెగించిన దానికి తెడ్డే తొండం’ అన్నట్లు.
 బంధాలను అనుబంధాలను  తెగే దాకా లాగొద్దు. మనిషి మీద నమ్మకం వుండాలి.  బిడ్డకు తల్లి ఋజువు..  తండ్రి పరువు కాపాడుతుంది.   అర్థమయ్యిందనుకుంటాను..
మగవాని  జీవనంలో భార్య అర్థ భాగం. అతడు భార్యతో జీవనం కొనసాగించడం  పూర్ణ కళా భాగం..” అంటూ ఇంకా ఎన్నెన్నో విషయాలను చెబుదామనుకున్న హేమ నోటిని తన పెదాలతో సగర్వంగా తాళం వేసాడు  సర్వేశం.. తనకు జ్ఞానోదయం అయిందన్నట్లుగా.
***
మరునాడు ఉదయం.. ఏడు  కావస్తోంది.. రమణి  ఇంకా పడక గదిలో నుండి బయటకు రాలేదు. నా  కొడుకు ఊళ్ళో లేక పోవటం.. కోడలు కళ్ళు నెత్తికెక్కాయి. అని మనసులో అనుకుంటూ “కోడలా.. నీకేమైనా బుద్ధీ జ్ఞానం ఉందా..? బారెడు పొద్దెక్కింది.. ఇంకా లేవ బుద్ధి కావడం లేదా..! బాగా పొగరెక్కిందే నీకు..(ఒక బూతు  మాట) .. ఒళ్ళు సైతం కొవ్వెక్కింది. మనసు  అందంగా లేనిది తోలు అందంగా వుంటే సరా.. నీ అందం అటకెక్క.. నా కొడుకుంటే అణగబట్టి నీ ముక్కు(బూతు మాట) తెగ్గోసే వాడు” అంటూ గట్టిగా రామణిని ఆడిపోసుకో   సాగింది.
రాత్రి జరిగిన సంఘటన అత్త  పసిగట్టి అలా మాట్లాడుతుందని రమణికి అర్థమయ్యింది. తనూ రెచ్చిపోవాలనుకొంది..
“నీ ముక్కు పాడు గాను.. నీకోడుకేంది కోసేది.. నేనే కోసుకుంట..” అంటూ కడుపులో వున్న దుఖాన్ని భళ్ళున బయటకు గక్కింది... ముక్కు కోత ముఖాన రుద్దింది.
‘అబ్బో నా కోడలు ఎంత రోషవంతురాలు..? అనవసరంగా నోరు పారేసుకున్నాను..’ అని లెంపలు వేసుకోసాగింది  అత్త.
వీధిలో ఎదో గొడవని పరుగెత్తుకుంటూ వచ్చిన హేమ అంతా గమనించింది.  రమణి హేమను చూసి తల దించుకుంది. అలా తల దించుకునే అవసరం రాకుండా రమణిని తీర్చి దిద్దాలని మదిలో మరింత దృధ నిర్ణయం తీసుకుంది హేమ.
రమణిని ఆటోలో హాస్పిటల్ కు తీసుకు వెళ్తూ “ నా భర్తకు చెప్పి ప్లాస్టిక్ సర్జరీ చేయిస్తాను గాని నీ ఆలవాట్లను మానుకోవాలి .. నీ అత్త గారిని, భర్తను మార్చుకొని కాపురాన్ని చక్క దిద్దుకో.. మావంతు సహకారం ఎప్పుడూ వుంటుంది” అంటూ హితవు పలికింది. రాత్రి కామేశాన్ని పోలీసులకు పట్టిచ్చిన వైనం వివరించింది.
కృతజ్ఞతా పూర్వకంగా హేమకు నమస్కరించింది రమణి.
***
   

No comments:

Post a Comment

Pages