ప్రేమతో నీ ఋషి – 15

యనమండ్ర శ్రీనివాస్


( జరిగిన కధ : కొన్ని శతాబ్దాల క్రితం... ఇంద్రుడి ఆజ్ఞమేరకు ,మేనక తన రూపలావణ్యాలతో విశ్వామిత్రుడిని సమ్మోహనపరచి, అతని తపస్సును భగ్నం చేస్తుంది. కొన్ని దశాబ్దాల క్రితం... మైసూరు మహారాజు సంస్థానంలో గొప్ప భారతీయ చిత్రకారుడిగా పేరుపొందిన ప్రద్యుమ్న ‘ప్రపంచ కొలంబియన్ ప్రదర్శన’ కోసం, రాకుమారి సుచిత్రాదేవినే తన చిత్రానికి నమూనాగా వాడుతూ, మేనక విశ్వామిత్రుడికి తపోభంగం చేసే సన్నివేశాన్ని అత్యద్భుతంగా చిత్రిస్తూ, ఈ క్రమంలో రాకుమారితో ప్రేమలో పడి గుప్తంగా రాజ్యం వదిలి పారిపోతాడు. రాజు పారెయ్యమన్న ఆ చిత్రం అనేకమంది చేతులు మారి, చివరగా  దాన్ని బ్రిటన్ తీసుకువెళ్ళాలన్న కోరికతో కొన్న ఒక విదేశీయుడి  వద్దకు చేరుతుంది. ఆ తర్వాత అది ఏమైందో ఎవరికీ తెలీదు. 
ప్రస్తుతం... ముంబై స్టాక్ ఎక్స్చేంజి లో పనిచేస్తున్న త్రివేది గారు, ఉదయాన్నే ఫాక్ష్ లో వచ్చిన సందేశం చూసి, అవాక్కవుతారు... కారణం తెలియాలంటే, కొంత గతం తెల్సుకోవాలి....  కొన్ని నెలల ముందు మాంచెస్టర్ లో  గొప్ప వ్యాపార దిగ్గజమైన మహేంద్ర, చేపట్టిన ‘ప్రద్యుమ్న ఆర్ట్ గేలరీ’ ప్రాజెక్ట్ కోసం చిత్రాలు సేకరించేందుకు అతని మాంచెస్టర్ ఆఫీస్ లో పనిచేస్తుంటారు స్నిగ్ధ, అప్సర. ఈ క్రమంలో స్నిగ్ధకు స్విస్ బ్యాంకు మాంచెస్టర్ ఆఫీస్ లో సీనియర్ క్లైంట్ బ్యాంకర్ గా పనిచేస్తున్న ఋషి తో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారుతుంది. ఋషిని  అప్సర సామీప్యంలో చూసిన స్నిగ్ధ మనసు క్షోభిస్తుంది. స్నిగ్ధ తో కలిసి ముంబై వెళ్తుండగా, జరిగినదానికి సంజాయిషీ ఇవ్వబోయిన ఋషిని పట్టించుకోదు  స్నిగ్ధ.  అతను మౌనం వహించి, కళ్ళుమూసుకుని, గత జ్ఞాపకాలు నెమరేసుకుంటూ ఉంటాడు...  ఆర్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్’ కోసం పనిచేసేందుకు మాంచెస్టర్ వచ్చి, ముందుగా ఆర్ట్ గురించిన అవగాహన కోసం ప్రయత్నిస్తున్న ఋషి, ఫేస్బుక్ లో స్నిగ్ధ ప్రొఫైల్ చూసి, అచ్చెరువొందుతాడు. స్నిగ్ధకు మహేంద్ర కంపెనీ లో ఉద్యోగం వస్తుంది. ఈలోగా ఋషి మాంచెస్టర్ ఆర్ట్ గేలరీ దర్శించేందుకు వచ్చి, స్నిగ్ధను కలిసి, ఆమెనుంచి ఆర్ట్ కు సంబంధించిన ఎన్నో విషయాలు తెలుసుకుంటాడు. ఫేస్ బుక్ లో ఋషి, స్నిగ్ధ చాటింగ్ ద్వారా వారిద్దరూ మరింత చేరువ అవుతారు. కొత్తగా చేరిన ఉద్యోగంలో మృణాళ్, అప్సరల ప్రవర్తన స్నిగ్ధకు ఆశ్చర్యం కలిగిస్తుంది, అదే ఋషితో చెప్తుంది. మహేంద్రను కలిసిన ఋషి, అతని వ్యాపార ప్రతిపాదనకు అంగీకరించి, స్నిగ్దను, అప్సరను ఆఫీస్ లో కలుస్తాడు. అప్సర, ఋషి మధ్య చనువు స్నిగ్ధకు ఆందోళన కలిగిస్తుంది.   ఇక చదవండి...)
అప్సర తనను ఆక్షన్ హౌస్ లో కలిసాకా, ఆమె పంపిన రెండు మూడు సందేశాలకు, మొదట్లో ఋషి స్పందించలేదు. కాని, రోజులు గడుస్తుండగా, అప్సరతో అతని సంప్రదింపులు ఎక్కువయ్యాయి. మహేంద్ర వేలంలో కొన్న పెయింటింగ్స్ అన్నీ వాళ్ళ ఆఫీస్ కు చేర్చాలి, బ్యాంకు తరఫున ఆ బాధ్యత ఋషిదే.
ఆ సంభాషణల్లో ఋషి, తాను ముందుగా అంచనా వేసిన దానికంటే అప్సర చాలా గడుసైనదని తెలుసుకున్నాడు. అంతే కాదు, ఆ సాయంత్రం మహేంద్రతో డిన్నర్ కు కలిసిన దగ్గరి నుంచి ఆమె ఋషి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తోందని, అతను గమనించాడు.
ఇటువంటి అభ్యర్ధనలను మన్నించేందుకు మామూలుగా ఋషికి ఒక ప్రత్యేక విధానం ఉంది. ముఖ్యంగా, స్నిగ్ధతో అనుబంధానికి ఒప్పుకున్నాకా, అతను వేరే ఏ అమ్మాయితో డేటింగ్ చెయ్యలేదు. కాని, అతనికి అప్సర విభిన్నంగా కనిపించింది.
ఆఫీస్ పనిమీద ఎప్పుడు అప్సరను కలిసినా ఆమె అతనికి ఏదో డ్రింక్, లంచ్ లేక డిన్నర్ ను ఆఫర్ చేసేది. అటువంటి సమయాల్లో ఆమె ఉత్సాహం ఏ స్థాయిలో ఉండేదంటే, ఋషికి ఆమెను మాటల్ని ఆపేలా చెయ్యడం అసాధ్యమయ్యేది. మామూలుగా ఆమె చర్చకు ఎంచుకునే అంశం శృంగార సంబంధమైనదో, అభ్యంతరకరమైనదో అయి ఉండేది. ఇక పెద్దల జోకులకు వస్తే, ఆమెకు అటువంటివి చాలా ఇష్టం. అటువంటివి ఒక స్త్రీ నుంచి వినడం ఋషికి ఇబ్బంది కలిగించినా, మహేంద్ర వేలంలో కొన్న పెయింటింగ్స్ ను వారికి అప్పగించే పనిని పూర్తిచేసే దాకా, అతనికి మరో మార్గం లేదు. అందుకే అతను అప్సరను తరచుగా కలవాల్సి వచ్చేది.
నెమ్మదిగా ఋషి అప్సర సాంగత్యానికి అలవాటు పడ్డాడు. ఆ చర్చలను అతను మహేంద్రను గురించి మరింత అవగాహన పెంచుకునేందుకు వాడుకున్నాడు. అప్సర మహేంద్రకున్న దగ్గరి స్నేహితురాళ్ళలో ఒకతె, అతను ఆమెతో తన వ్యాపార రహస్యాలన్నీ చెప్పేవాడు, ఆమె అతనికి నమ్మకస్తురాలైన వ్యాపార సలహాదారు కూడా.
ఒకటిరెండు సార్లు, అప్సర మహేంద్ర వైపునుంచి, కొన్ని ఆర్ధిక నిర్ణయాలు కూడా తీసుకుందని, అతను గమనించాడు. మొదట అతను అప్సర నుంచి అటువంటి అభ్యర్ధనల్ని తీసుకునేందుకు నిరాకరించాడు. కాని, మహేంద్ర ఒకసారి అప్సర కోరిన విధంగా చెయ్యవచ్చని, తెలిపాడు.
ప్రతి ట్రాన్సాక్షన్ కు డాకుమెంట్స్ అవసరమయ్యే మామూలు బ్యాంకింగ్ లా కాకుండా, ప్రైవేట్ బ్యాంకింగ్ లో, విశేషించి,  సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులతో సంబంధాలు, పరస్పర నమ్మకంపైనే ఆధారపడి ఉంటాయి. ఒకసారి క్లైంట్ రిలేషన్షిప్ మేనేజర్ ను నమ్మటం మొదలుపెట్టాకా, ఈ నమ్మకం ఏ స్థాయికి చేరుతుందంటే, ఒక్కసారి వారు బ్లాంక్ అప్లికేషను ఫార్మ్స్ ను, సంతకం చేసిన బ్లాంక్ చెక్ బుక్స్ ను కూడా వీరికి ఇచ్చేస్తారు.
క్లైంట్ లావాదేవీలు ఖచ్చితంగా జరిగేందుకు ఇది ఎంతో అవసరం. మామూలుగా అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లో నిర్ణయాలను చాలా త్వరగా తీసుకోవాలి, కాబట్టి, ఆర్ధిక విషయాల్లో ప్రతిసారి క్లైంట్ ఆమోదాన్ని తీసుకునేంత సమయం ఉండదు.
ఋషి, అప్సర సంప్రదింపులు పలు విధాలుగా జరిగేవి – పాక్షికంగా అవి వ్యాపారానికి సంబంధించి, మిగిలినవి సరదాగానూ సాగేవి. మహేంద్ర తరఫున ఆర్ధిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఋషి ఆ చర్చల్లో ఏదో సలహా ఇస్తూ, ప్రాబల్యం చూపేవాడు. కాని, అనధికారిక సెషన్ లలో అప్సర ప్రాబల్యం ఎక్కువగా ఉండేది.
రోజులు గడుస్తుండగా, అప్సర కన్ను తనపై పడిందని ఋషికి స్పష్టమయ్యింది. కాని, అది కేవలం శృంగారపరమైన కోరికా లేక మరేమిటా అన్నది అతనికి స్పష్టం కాలేదు. ఏ రకంగా అయినా, అతని ఆలోచనల్లో స్నిగ్ధ నిండిపోయి ఉండడం వల్ల, అతను అంతగా పట్టించుకోలేదు.
అప్సరతో గడిపిన క్షణాలు, అనిశ్చయమైన ఒక ముందడుగు కనుక, అతని మనసులో ఒక అలజడిని సృష్టిస్తే, స్నిగ్ధ సాంగత్యం అతని మనసులో ఒక మధురానుభూతిని కలిగించేది. బహుశా ప్రేమకు, మోహానికి ఉన్న తేడా ఇదేనేమో.
***
స్నిగ్ధ ఆ రోజు ఆఫీస్ కు త్వరగా చేరుకొని, పని మొదలుపెట్టింది. కొద్ది సేపు, ఆమె తాను సేకరించిన వేలిముద్రల్ని డి.ఎన్.ఎ ఆర్ట్ వ్యాపారికి పంపడంలో బిజీ అయ్యింది. తర్వాత అందుకు కావలసిన డాకుమెంట్స్ కు సంబంధించిన పనుల్ని పూర్తిచెయ్యడంలో పడిపోయింది.
“స్నిగ్ధా, మహేంద్ర ఆఫీస్ నుంచి ఆయనకు ఫోన్ చెయ్యమన్న సందేశం వచ్చింది.” మృణాల్ వచ్చి, స్నిగ్ధకు చెప్పాడు. అతను గత సాయంత్రమే ఇటలీ నుంచి వెనక్కు వచ్చాడు.
“థాంక్స్, నేను ఆయనకు ఫోన్ చేస్తాను. ఇటలీ లో మీరు బాగా ఎంజాయ్ చేసి ఉంటారు,” నవ్వుతూ పలకరించింది స్నిగ్ధ.
“ఎస్ బేబీ, ఒంటరిగా ఉండడం వల్ల, అంతగా ఎంజాయ్ చెయ్యలేకపోయాను. కాని, ఇటాలియన్ బేబ్స్ నీలాగే చాలా అందంగా ఉంటారు,” మృణాల్ స్నిగ్ధకు నచ్చని విధంగా సంభాషణ మొదలుపెట్టాడు. కాని, దురుసుగా అనిపించకూడదని, స్నిగ్ధ అతనితో సంభాషణ కొనసాగించింది.
“ఇటలీ లో ఏ పెయింటింగ్ కొన్నారు? నేను చూడచ్చా ?” అడిగింది స్నిగ్ధ.
“అది విశ్వామిత్ర, మేనక పెయింటింగ్. నేను దాన్ని ఎలాగో 10 కోట్లకు కొనగాలిగాను. “ మామూలుగా చెప్పాడు మృణాల్. స్నిగ్ధ చాలా ఆతృత పడుతుందని, అతనికి తెలుసు.
“నిజంగా !!!” దాదాపుగా అరుస్తున్నట్లు అంది స్నిగ్ధ. మృణాల్ చెప్పిన రేట్ గురించి ఆమె పట్టించుకోలేదు. ఒక సేకరణ దారుడి చిత్రం వెల, చరిత్ర అంత అమూల్యమైనది. “ ఆ పెయింటింగ్ ఎక్కడుంది? నేను వెంటనే చూడాలి,” ఆమె ఉత్సాహంతో అరిచింది.
“అప్సర తనకు సంబంధించిన ప్రైవేట్ కల్లెక్టర్స్ కు ఈ వారంలో ఆ చిత్రాన్ని చూపేందుకు, ఆ పెయింటింగ్ ను తన ఇంట్లో ఇవ్వమని అడిగింది.” బదులిచ్చాడు మృణాల్. ఇది వినగానే స్నిగ్ధకు కోపం వచ్చింది. తన ఆఫీస్ వారిని అప్సర కమాండ్ చెయ్యటం ఆమెకు నచ్చలేదు.
ఫోన్ రింగ్ అయ్యింది, మహేంద్ర లైన్ లోకి వచ్చాడు, “హే స్నిగ్ధ, ఎలా ఉన్నావ్?”
“బాస్, ఇక్కడ అంతా బాగుంది. మీరు బాగున్నారా?” అంటూ పలకరించింది స్నిగ్ధ.
“బాగున్నాను, కాని, పూర్తిగా కాదు, ఇదొక బిజీ ప్రపంచం, చాలా టెన్సన్స్ కూడా ఉన్నాయి,” అన్నాడు మహేంద్ర నవ్వి.
“నేను అర్ధం చేసుకోగలను, కాని, ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని  నిర్వహిస్తున్నందుకు మీకు అభినందనలు,” మహేంద్ర పట్ల పూర్తి ఆరాధనా భావంతో అంది స్నిగ్ధ.
“కాని, విజయానికో వెల ఉంటుంది,” తగ్గు స్వరంతో అన్నాడు మహేంద్ర, “నిన్ను నీ లక్ష్యం వైపు నుంచి మళ్ళించే శక్తులు ఎప్పుడూ ఉంటాయి. కార్పోరేట్ రంగంలో, వీటితో పోరాడడం చాలా కష్టం,” కొనసాగించాడు మహేంద్ర.
అతని క్లైంట్ లొకేషన్ ల గురించి, తాజాగా వచ్చిన “ఇంటలెక్టువల్ ప్రాపర్టీ ఉల్లంఘనల” కు సంబంధించిన వార్తల గురించి అతను మాట్లాడుతున్నాడు. ఈ ఉల్లంఘనలు, తన కంపెనీ కి జరిమానా విధించే పక్షంలో, తన కంపెనీ ఏ ప్రధాన అంతర్జాతీయ సాఫ్ట్వేర్ కాంట్రాక్ట్స్ నుంచైనా బాన్ చెయ్యబడుతుంది. ఇది అతని వ్యాపారాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.
“చింతించకండి బాస్, మేమంతా మీతో ఉన్నాము. గుడ్ లక్,” అంది, స్నిగ్ధ శుభాకాంక్షలు చెబుతూ.
“థాంక్స్” మాత్రమే చెప్పగలిగాడు మహేంద్ర.
“నాతో మాట్లాడాలని అనుకుంటున్నారని మృణాల్ చెప్పాడు,” అంది స్నిగ్ధ విషయానికి వస్తూ.
“అవును, నీతో రెండు విషయాలు మాట్లాడాలి. ఇటలీ లో అతను కొన్న విశ్వామిత్ర పెయింటింగ్ తాలూకు పత్రాలను నువ్వు రివ్యూ చెయ్యాలని, నా కోరిక. ఇది చాలా అర్జెంటు. నీకు తెలుసా, ఈ పెయింటింగ్ కోసం మనం 10 కోట్లు కడుతున్నాము.”
“నేనొక అరగంటలో చెబుతాను బాస్; మరొక అంశం ఏమిటి?” ఈ పెయింటింగ్ ను మృణాల్ కొనుగోలు చేసిన విషయం గురించి మహేంద్రకు తెలిసినందుకు స్నిగ్ధ షాక్ అయింది. ఆఫీస్ మొత్తంలో ఆమెకే ఈ సంగతి తెలీదు.
“ముంబై లో ఉన్న గార్డెన్ హోటల్ నీకు తెలుసా?” మహేంద్ర అడిగాడు. స్నిగ్ధ సానుకూలంగా స్పందించింది.
అది ముంబై లో ఉన్న అత్యంత ప్రతిష్టాత్మకమైన, పురాతనమైన హోటల్స్ లో ఒకటి. అది తాజాగా తీవ్రవాద దాడులకు గురైంది, ఆ సమయంలో అది అంతర్జాతీయ వార్త అయ్యింది. స్నిగ్ధకు ఇది తెలుసు.
(సశేషం)

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top