“ఒకరికొకరు” - అచ్చంగా తెలుగు

“ఒకరికొకరు”

Share This

 “ఒకరికొకరు”

 మంథా భానుమతి


 
“ఏం చేద్దాం మాలినీ? నాకే తోచడం లేదు.” కల్నల్ విక్రమ్ అడిగాడు.
  “తోచేదేముంది ముందునుంచీ అనుకున్నదే కదా?” అద్దాల అలమర్లో ఉన్న గాజుబొమ్మల్ని తళతళా మెరిసేట్లు తుడిచి, దూరంగా జరిగి కిటికీలోనుంచి పడుతున్న ఉదయ కిరణాల పరావర్తనాన్ని ఆనందంగా ఆస్వాదిస్తూ అంది మాలిని.
  “నిజమే అనుకో. కానీ అబ్బాయి, కోడలు ఏమీ అనుకోరంటావా?” సందేహంగా అడిగాడు విక్రమ్, ఖాళీ అయిన కాఫీ కప్పు తీసుకెళ్ళి వంటింట్లో పెట్టి వస్తూ.
  “ఎందుకనుకోరూ? వాళ్ల తాపత్రయం వాళ్లది. కానీ మనకంటూ కొన్ని ఆశలుంటాయి కదా? ఇప్పటి జీవితాన్ని గురించి ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. అవన్నీ గాలికొదిలేసి మళ్లీ లంపటంలో ఇరుక్కోవడం.. నా వల్ల కాదు బాబూ!” స్థిరంగా, స్పష్టంగా అని, గోడకి తగిలించిన ప్రకృతి వర్ణ చిత్రాన్ని ఎగాదిగా చూసింది మాలిని.
  “ఈ పెయింటింగ్ ఇక్కడ బావుందంటారా?” మాట మార్చింది. ఊరుకుంటే అలా నట్టుతూ వాదిస్తూనే ఉంటాడు విక్రమ్.
  కల్నల్ విక్రమ్ రిటైర్ అయి వారం రోజులయింది. పూర్తిగా ఉత్తర హిందూస్తానంలోనే సర్వీస్ చేసి, తాము పుట్టి పెరిగిన చెన్నైలో స్థిర పడదామని నిర్ణయించుకున్నారు. మాలిని, ఒక నెల ముందుగా వచ్చి ఇల్లంతా మార్పులు చేర్పులు చేయించింది. చాలా ఏళ్ల క్రితమే డిఫెన్స్ కాలనీలో ఇల్లు కట్టుకున్నారు.
  సామానంతా వచ్చేసింది. అవన్నీ సర్దుతూ ఉండగానే అబ్బాయి దగ్గర్నుంచి ఫోన్..
  “అమ్మా! ఇక్కడికి వచ్చెయ్యండి. మీరు ఇద్దరూ విడిగా ఎందుకు? ఇన్నాళ్లు శ్రమ పడ్డారు. ఇప్పుడన్నా విశ్రాంతిగా ఉండండి, హాయిగా మనవలతో ఆడుకుంటూ.” విసుగు చెందని విక్రమార్కుడిలాగా పదహారోసారి అడిగాడు.
  అప్పటికి మాలిని తమ ఆభిప్రాయాన్ని వివరించడం అయింది ఐనా సరే!
  అది పట్టుకుని ఐదునిమిషాలకొకసారి విసిగిస్తుంటాడు విక్రమ్.
  “అది కాదు మాలినీ! అబ్బాయి..” మళ్లీ మొదలు పెట్టాడు విక్రమ్.
  “అబ్బబ్బా! ఊరుకోమన్నానా? విశ్రాంతి అంటారు, కానీ అక్కడికి వెళ్లినప్పట్నుంచీ పనే. చూస్తూ చూస్తూ వదిలెయ్యలేము. పిల్లలు కూడా ఏది కావలసినా మనల్నే అడుగుతుంటారు. ఇదివరకు ఫరవాలేదు కానీ, ఇప్పుడు నాకు ఓపిక లేదు. పైగా, మన చుట్టాలనీ, స్నేహితులనీ అనుకున్నప్పుడల్లా పిలుచుకోలేము. వాళ్లూ ఫ్రీగా రాలేరు. ఐనా మనిద్దరం, ఒకరికొకరం హాయిగా బాదరబందీ లేకుండా మనిష్టం వచ్చినట్లుందామంటే మీ గోలేంటీ? ఇంకొక్క మాట మాట్లాడారంటే ఊరుకోను.” కాఫీ కప్పు విక్రమ్ చేతికిచ్చి, తనొకటి తీసుకుని పక్కనే కూర్చుని, టివీ రిమోట్ అందుకుంది మాలిని.
  నిజమే! బాధ్యతలు తీరి పోయాక, విశ్రాంతి తీసుకుంటూ, తమ కిష్టమైన పనులు చేసుకుంటూ, ఇష్టం వచ్చిన ప్రదేశాలకు వెళ్తూ ఆనందంగా గడపడమే ప్రతీ జంట కోరుకునేది.
  ఆ విధంగా గడుపుదామనుకోవడం ఆర్ధిక ఇబ్బందులు లేనివారికి పెద్ద విశేషమేమీ కాదు.
  “నిజమేలే. ఇదే మంచి డెసిషన్.” విక్రమ్ సర్దుకుని కూర్చున్నాడు.
  ఆ క్షణంలో మంచి నిర్ణయమే అనిపించింది. కానీ..  విధి నిర్ణయం ఏమిటో ఎవరు చెప్పగలరు?
                                    ………………….
  ముందు చిరుజల్లుగానే మొదలయింది..
  అలా కురుస్తూనే ఉంది. వారం దాటింది, వరుణుడు ఆగట్లేదు.
  చిరాకేస్తున్నా “వానల్లు కురవాలి వానదేవుడా
  పంటల్లు పండాలి కడుపు నిండగా” అని పాడుకుంటూ పనులు చేసుకో సాగింది మాలిని.
ఎందుకేనా మంచిదని పాల పాకెట్లు, కూరలు తెచ్చి ఫ్రిజ్ లో పెట్టాడు విక్రమ్.
  “ఇప్పుడైనా నాలుగురోజులు ఉందురు గానీ రండమ్మా” అంటూ అబ్బాయి రోజూ ఫోన్ చేస్తూనే ఉన్నాడు.
  వాన పెద్దదవుతోంది. ఎక్కడా అరక్షణం కూడా ఆగట్లేదు. కాంపౌడ్ లోకి వచ్చేస్తున్నాయి నీళ్లు. విక్రమ్ రోడ్ మీదికి కాలువ చేసి పంపేద్దామని చూశాడు. రొడ్డు నిండి పోయే ఇంట్లోకి వస్తున్నాయి. చేసేదేం లేక, తొండం ధారల్లా పడుతున్న వానలోంచి ఇంట్లోకి పరుగెత్తి తలుపేసి గడియ పెట్టాడు.
  ఎంతో బరువైన టేకు తలుపు.. అంతకంటే బరువైన ఇనప గడియలు. ఐనా.. అడ్డ గడియ పెడ్తే తలుపు ఆగట్లేదు. ఈదురు గాలికి వెనక్కి నెట్టేస్తోంది వేస్తుంటే. మాలినిని రమ్మని బలం అంతా ఉపయోగించి, పైనా, కిందా ఉన్న అన్ని గడియల్నీ వేసేశాడు. పెరట్లో కెళ్లే తలుపుది కూడా అదే పరిస్థితి. ఆ తలుపుని కూడా బిడాయించి అబ్బాయికి ఫోన్ చేసి కనుక్కున్నాడు విక్రమ్.. వాళ్లెలా ఉన్నారో అని.
  “భగవంతుడా ఈ వానను తగ్గించి అందరనీ కాపాడు.” పూజగదిలో దీపం పెట్టి ప్రార్ధించింది మాలిని.
  ఇంట్లోంచి బైటికి వెళ్లే తూములన్నింటినీ నీళ్లు బైటికి పోయేలా దారి చేసి, వీధి తలుపు, పెరటి తలుపు గట్టిగా ఉన్నాయా అని చూసుకుని, తమ గదిలో పడుక్కున్నారు విక్రమ్, మాలిని. రెండు గదుల డాబా ఇల్లు వాళ్లది. పెద్ద హాలు, హాలుకి ఆనుకుని విశాలమైన వంటిల్లు. కొంచెం సర్దుకున్నాక, హాల్లోంచి మెట్లు పెట్టుకుని, పైనొక గది వేసుకుందామని ఆలోచన.. డాబా మీద ఒక తోటని పెచాలని కూడా అనుకుంటోంది మాలిని. వానల్లేకపోతే మొదలు పెట్టేవారే!
  అర్ధరాత్రి మంచం ఊగిపోతున్నట్లనిపించి తెలివొచ్చింది విక్రమ్ కి. కలేమో అనుకున్నాడు. లేకపోతే భూకంపం వస్తోందా? లేచి మంచం దిగబోయాడు. మోకాలు దాటి నీళ్లు..
  అంతా అంధకారం. పవర్ ఎప్పుడు పోయిందో..
  అశ్చర్యంగా చూస్తూ మాలినిని లేపాడు.
  “ఇంట్లోకి ఇన్ని నీళ్లా? ఇదేవిటి విక్రం? అబ్బాయికి ఫోన్ చెయ్యండి.” మాలిని దిండు కింది నుంచి సెల్ తీసింది.
  “అయ్యో.. డాడీ! ఇక్కడ రోడ్ల మీద నిండా నీరే. మా అపార్ట్ మెంట్ మొదటి అంతస్థు మునిగి పోయింది. అక్కడుండే వాళ్ళంతా మా ఇళ్ల లోకి వచ్చేశారు. ఇంక రోడ్ ఎంత లోతులో ఉందో చెప్పలేం. ఎవరూ వీధిలోకెళ్లడానికి దారి లేదు.”
  “ఏం చేద్దామండీ? వీధి తలుపు తీద్దాం.. బైటికెళ్తే ఏదన్నా దారి దొరుకుతుందేమో. బైట ఇంట్లో కంటే నీటి మట్టం ఎత్తుగానే ఉన్నా.. కనీసం ఈదుకుంటూ ఎక్కడికైనా వెళ్లచ్చేమో” మాలిని ఏడుపు కంఠంతో అంది.
  విక్రమ్ మౌనంగా మంచం మీది నుంచి దూకి, మెడ లోతు నీళ్లలో, తడుముకుంటూ వీధి తలుపు దగ్గరికి వెళ్లి తెరవ బోయాడు. సైన్యంలో పని చేసిన అనుభవం అక్కరకొచ్చిందతనికి.   
  అడ్డ గడియ వచ్చింది కానీ, పైనా, కిందా ఉన్న గడియలు బిగుసుకు పోయాయి. అద్దెకిచ్చిన ఇళ్లలాగే ఉంటాయని అనుకుంటూ, పెరటి తలుపు దగ్గరికి వెళ్లాడు. దాని స్థితీ అంతే..
  నీటి మట్టం ఇంకా పెరగ సాగింది. మెడ దాటి ముక్కు వరకూ వచ్చేసింది.
  “మాలా! కమ్ ఔట్.” కేక పెట్టి, భోజనాల బల్ల ఎక్కాడు నిక్రమ్.
  మాలిని ఈదుకుంటూ వచ్చి, విక్రమ్ అందించిన చెయ్యి అందుకుని బల్ల ఎక్కింది కష్టపడి.
  సెల్ ఫోన్ నోటిలో పెట్టుకుని ఈదింది. తడిసినా పని చేస్తోందది.
  అంతలో రింగ్ అయింది..
  “డాడీ! ఎలా ఉన్నారు?”
  “నాట్ గుడ్.. బాబా! ఎమర్జెన్సీకి ఫోన్ చెయ్యి. ఎపర్నైనా పిలు. డు సమ్ థింగ్..”
  “అయ్యయ్యో.. ఏ ఫోన్లూ అందటం లేదు. లక్కీగా మీ ఫోన్ దొరికింది..” మాట్లాడుతుండగానే బాటరీ ఆయిపోయిన సిగ్నల్ వచ్చింది.
  సెల్ ఫోన్ డెడ్.
  నీళ్లు అంతకంతకు పైకొచ్చేస్తున్నాయి.
  విక్రమ్ బల్ల దగ్గరకొచ్చిన కుర్చీని పైకి లేపి, బల్ల మీద వేసి, దాని మీదికెక్కాడు. మాలినిని కూడా  పైకి లాగాడు. వాళ్ల బరువుకి బల్లా కుర్చీ కదలకుండా ఉన్నాయి.. కాసేపు.
  అప్పటి నుచీ అరవడం మొదలెట్టారు ఇద్దరూ.. కంఠనాళాలు పగిలేలా..
  “హెల్ప్.. హెల్ప్..”  
  పక్కిళ్లన్నింటీకీ మేడలున్నాయి, ఎక్కి తలుపులేసుకుని కూర్చున్నారు. ఎవరికి వినిపిస్తుంది? పక్కనే ఉన్న ఇంటి వాళ్లకి కొంచంగా వినిపించినా.. వాళ్లు ఏమీ చెయ్యలేని పరిస్థితి.
  అంతా జలం.. జలం.. జలమయం.
  కల్నల్ విక్రం, ఒక చేత్తో భార్యని పొదివి పట్టుకుని, ఇంకొక చెయ్యెత్తి సీలింగ్ ఫాన్ పట్టుకున్నాడు. కానీ.. అతనికి తెలుసు, ఆఖరి ఘడియలు వచ్చేశాయని.
  “అబ్బాయి పిలిచినప్పుడు వెళ్లాలిసిందండీ.. అంతా నా వల్లనే.. నేనే చేశాను.” మాలిని ఏడుస్తోంది.
  “ఎవరూహించగలరు మాలా! ఐపోయిందంతే మన టైమ్. లేకపోతే హిమాలయాల దగ్గరొచ్చిన  ఫ్లడ్స్ లో ఇరవై మంది ప్రాణాలు కాపాడిన నేను, నా వైఫ్ తో నా ఇంట్లోనే మునిగి పోతానని అనుకుంటానా. కెన్ యనీబడీ గెస్.. జస్ట్ ప్రే గాడ్.”
  “అ...లా...గే… నన్ను మరింత గట్టిగా అదుముకో విక్రం.. హగ్ మి టైట్.. మనం ఒకరి కొకరం..”
                             *-------------------------------*
చెన్నై వానల్లో మునిగి పోయిన ఒక మిలటరీ అధికారి, భార్యల విధి గురించి విని.. కన్నీటితో..
  
 

No comments:

Post a Comment

Pages