బుచ్చిబాబు గారు(ఇది బుచ్చిబాబు గారి శత జయంతి సంవత్సరం) - అచ్చంగా తెలుగు

బుచ్చిబాబు గారు(ఇది బుచ్చిబాబు గారి శత జయంతి సంవత్సరం)

Share This

బుచ్చిబాబు గారు(ఇది బుచ్చిబాబు గారి శత జయంతి సంవత్సరం)

టీవీయస్.శాస్త్రి


ఇది బుచ్చిబాబు గారి శత జయంతి సంవత్సరం. బుచ్చిబాబుగా పేరొందిన ఈయన అసలు పేరు శివరాజు వెంకట సుబ్బారావు. ఈయన ప్రసిద్ధ నవలాకారుడు, నాటకకర్త మరియు కథకుడు. ఈయన తెలుగు రచనలలో 'బుచ్చిబాబు' అన్న కలంపేరుతోనూ, ఆంగ్ల రచనలలో 'సంతోష్ కుమార్' అన్న పేరుతోనూ రచనలు చేశారు.ఈయన ఏలూరులో శివరాజుసూర్య ప్రకాశరావు మరియు వెంకాయమ్మ దంపతులకు జూన్ 14, 1916 న జన్మించాడు. అక్షరాభ్యాసం కంకిపాడులో జరిగింది.పాలకొల్లు,గుంటూరు ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో చదివారు.1937 చివరలో సుబ్బలక్ష్మిగారితో ఈయనకు వివాహం జరిగింది. తర్వాత మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో బి.ఏ. ఆనర్సులో ఉత్తీర్ణులై, నాగపూర్ విశ్వవిద్యాలయం నుండి 1941లో ఎం.ఏ. పట్టా పొందారు. ఈయన కొన్నాళ్ళు అనంతపురం మరియు విశాఖపట్నంలలో ఆంగ్ల ఉపన్యాసకుడిగా పనిచేశాడు. 1945 నుండి 1967లో మరణించేవరకు ఆలిండియా రేడియోలో పనిచేశాడు. ఆంధ్ర క్రైస్తవ కళాశాల వార్షిక సాహిత్య సంచికలో (1936) వీరి ప్రప్రథమ రచనలు - 'జువెనిలియా', 'బ్రోకెన్ వయోలిన్' అనే ఆంగ్ల కవితలు, 'పశ్చాత్తాపం లేదు' అనే తెలుగు కథానిక ప్రచురించబడ్డాయి. బుచ్చిబాబు ఆలోచనా స్రవంతిపై సోమర్‌సెట్ మామ్, ఓ హెన్రీ తదితర ఆంగ్ల రచయితల ప్రభావం మెండుగా కనిపిస్తుంది.మంచి నవలా రచయితగా కూడా పేరు తెచ్చుకున్నాడు.82 కథలు, నవల, వచన కావ్యం, 40 వ్యాసాలు, 40 నాటిక-నాటకాలు, పరామర్శ గ్రంథం, స్వీయ చరిత్రకు చెందిన మొదటి భాగం, కొన్ని పీఠికలు, పరిచయాలు - ఇతని లేఖిని నుండి వెలువడ్డాయి. ఈయన రచనలలో అత్యంత పేరు పొందినవి--చివరకు మిగిలేది (నవల) ,అజ్ఞానం (వచన కావ్యం),ఆశావాది,ఆద్యంతాలు మధ్య రాధ,నా అంతరంగ కథనం,షేక్ స్ఫియర్ సాహిత్య పరామర్శ,మేడమెట్లు (కథా సంపుటి).వీరు 1967, సెప్టెంబర్ 20 న పరమపదించారు. అనారోగ్యం కారణంగా సర్వీసులో ఉండగానే (51) వెళ్లిపోయారు. కథా సాహిత్యంలో బుచ్చిబాబుగారి ‘నన్ను గురించి కథ వ్రాయవూ?’ ఒక కళాఖండం.ఆయన భార్య శ్రీమతి శివరాజు సుబ్బలక్ష్మి గారు 95 సంవత్సరాల వయసులో కూడా ఉత్సాహంగా బుచ్చిబాబు గారి సాహిత్యాన్ని గురించి అందరికీ వివరిస్తున్నారు . శతజయంతి ఉత్సవాలకు ముమ్మరమైన
ప్రయత్నాలు చేస్తున్నారు.ఆయన వ్రాసిన ఏకైక నవల “చివరకు మిగిలేది”. 1946-47లో నవోదయ పత్రికలో సీరియల్ గా వచ్చి తెలుగు సాహిత్యంలో అజరామరంగా నిలిచిపోయింది . ఆయన వ్రాసిన “ఆత్మవంచన” నాటిక రేడియోలో వచ్చింది. అందులో సావిత్రి, పుండరీకాక్షయ్య వంటి వారు నటించేవారు. తెలుగు సినీ కళాఖండం “మల్లీశ్వరి” సినిమాకు బుచ్చిబాబు వ్రాసిన “కృష్ణదేవరాయల కరుణ కృత్యం” నాటిక ఆధారం. షేక్స్ పియర్ రచనల మీద “షేక్స్ పియర్ సాహితీ పరామర్శ” పరిశోధనకి గాను సాహిత్య ఎకాడమీ అవార్డు అందుకున్నారు.
“జీవితం అంటే ఏమిటి?”
అని ప్రశ్నించుకొని, అదొక నిరంతరమైన అన్వేషణ అంటారు. ఎందుకంటే జీవనరహస్యాలను తెలుసుకున్న వ్యక్తి అన్వేషణ మానలేడు. అలా మానితే జీవితాన్ని అర్థం చేసుకున్న వాడు కాడు, అందుకే జీవితం అంటే ఆలోచనల మయం కాదనీ, అది నిరంతర అనుభూతికీ సంబంధించిందనీ, అనుభూతిని వ్యక్తం చేయలేము కాబట్టి, అన్వేషణ నిరంతరంగా సాగవలసిందేనని అంటారు బుచ్చిబాబు.“తనకేం కావాలో తెలీనప్పుడు మానవుడు ద్వేషిస్తాడు. ఏం కావాలో తెలిస్తే, ఆ వస్తువును ప్రేమించి, దాన్ని పొందడం కోసం యత్నిస్తాడు. తెలీనప్పుడు హృదయంలో మిగిలేది ద్వేషం. అక్కర్లేదని తెలుసుకుంటే మానవులకు ద్వేషం ఉండదు.” అంటూ గుర్తించారు బుచ్చిబాబు.చివరకు మిగిలేదిలో “జీవితమంటే ఏమిటి?” అని అన్వేషణ ప్రారంభించిన దయానిధి, “జీవితమంటే తనలో తాను సమాధాన పడటం”, అన్న సత్యాన్ని తెలుసుకోవడానికి, చాల సఘర్షణే పడవలసివచ్చింది.
బుచ్చిబాబుకి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి నివాళి--
​​(బుచ్చిబాబు గారు ,దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు మంచి స్నేహితులు. వారిది ఎంతో గొప్ప స్నేహబంధం) ​
నిన్న శివరాజు వెంకట సుబ్బారావు వెళ్లిపోయాడు. ఆయ్యయ్యో నేనింక ఎలాగ ?ఈ వయసులో నాలోకి ఒంటరి
తనపు తీగలు రాకుండా ఈ మధ్య చేసిన వాడు బుచ్చి బాబు. అతని అనురాగం అట్టిది నా యెడ.అయితే కేవలం అతి మెత్తని అతని హృదయం మాత్రమే కాదు, నన్ను అతని వద్దకు నిత్యము ఆకర్షించింది.
అతని సంస్కారమమ్మున్ను , అతని మేధస్సున్నూ మనం ఎరుగుదుము. బుచ్చిబాబుతో ఐదు నిమిషాలు కూర్చుంటే, మనోమందిరం తలుపులు త్వరత్వరగా తెరిచినట్లు, వెలుపల గాలులు లోనికి వచ్చినట్లు ఉండేవి. అతడు మేధావి, భావుకుడు, బాగా చదువుకున్నవాడు. అతని సన్నిధానంలో మన మెదడు స్థబ్దుగా కూర్చోలేదు, అతని మెదడుతో కూడా పరిగెత్తలి. అలాగా బహు కొద్ది మందితో నాకు అనిపిచింది.నా జీవితంలో గొప్ప వెలితి ఏర్పడినట్లైయ్యింది నిన్న.ఇక సాహిత్య
జగత్తులో వచ్చిన శూన్యం సంగతి చెప్పాలా ?నా మనస్సుకు చివరికి మిగిలేది వంటి నవల ఈ రోజుల్లో తెలుగులో రాలేదనిపిస్తోంది. మానవ ప్రవృత్తిలోని లోతులనూ, ఎత్తులనూ, అంత సూక్ష్మంగా వివరించగలడు బుచ్చిబాబు. హృదయము, బుధ్ధీ, రెండూ గొప్పవి అతనివి. కనుక అతని రచన ప్రధమ శ్రేణి లోనిది. కేవలం బుధ్ధి బలంతో చేసే రచనకు ఆద్రత , వేగము, వేడి వంటివి ఉండవు. కేవలం హృదయావేశంతో నిర్మించిన వాటికి స్థైర్యము, గాంభీర్యము ఉండవు. ఎందరికో సామర్థ్యం, టాలెంట్ ఉంటుంది. బహు కొద్ది మందికే ప్రతిభ , జీనియస్ ఉంటుంది. నేటి ఆంధ్ర సాహిత్యలోకంలో ఆ నలుగురైదుగురిలో బుచ్చిబాబు ఒకడు.
వేరే కవిత్వం అని వ్రాయక పోయినా, బుచ్చిబాబు గొప్ప కవి. అతని నవల్లో , కధల్లో, ప్రతి పుటలో, ఒక గొప్ప కవి కూడా ప్రత్యక్షం అవుతాడు.బుచ్చిబాబు భార్య సుబ్బలక్ష్మి కూడా మంచి కధలు వ్రాసింది. అంతేగాక గాక అతని చేత వ్రాయించింది. ఆ ఇల్లాలు బుచ్చిబాబు సర్వస్వము.నిన్న శివరాజు వెంకట సుబ్బారావు వెళ్ళి పోయాడు. బుచ్చిబాబు కీర్తిశేషుడై, ఉండిపోయాడు. ఆమె మనస్సులోనూ, నా వంటి ఆత్మ బంధువు మనస్సులోనూ, ఆంధ్ర సాహిత్యంలోనూ కాంతి పుంజమై వెలుగుతాడు. ---21-Sep-1967, హైదరాబాద్,దేవులపల్లి కృష్ణశాస్త్రి.
బుచ్చిబాబుకు శ్రద్ధాంజలి – శ్రీ మొక్క పాటి నరసింహశాస్త్రి గారు
ఈనాడు ఈ మాటలు చెప్పవలసి వస్తుందని అనుకోలేదు. కానీ ఇంతట్లో అంతరిస్తాడని అనుకున్నామా ఎవరిమైనాను ? ముప్పై సంవత్సరముల పరిచయం, సన్నిహితం, క్షణంలో తుడుచుకుని పోయినాయి. ఆ చిరునవ్వు చిలికే పెదవులు, ఆత్మీయత అంతా కన్నులలోనే కనిపించే, లోతైన చిన్న కళ్ళు, సామాన్యులకో పట్టాన అందని భావగర్భితమైన చమత్కార పదోనైపుణ్యం, మైలు దూరాన ఉందామనుకున్నా రెప్పపాటులో దగ్గరకు లాక్కుని గుండెకానించుకునే సాగర గంభీరమైన పెద్ద నవ్వు మా బుచ్చిబాబు. ఇంక నాకు ఇటువంటి ఆప్తమిత్రుడు ఎక్కడ దొరుకుతాడు ?ఎల్లప్పుడూ సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మిలా సుప్రసన్నరాలుగా ఉండే అన్నపూర్ణ వంటి భార్యనే విడిచి నిశ్చింతగా ప్రయాణించగల సాహశీకుడు, స్నేహితులనూ విడిచి వెళ్ళినాడు.నేను ఆయన్ను మొదట నటకుడిగా చూశాను.
తరావాత రేడియోలో ఉద్యోగిగా పరిచయం. ఆ తర్వాత తర్వాత సహృదయుడిగా, అద్బుత హృదయుడిగా, సారస్వత ప్రియుడిగా, సరస కధా, నవలా, నాటికా రచయితగా కుంచెతో ఒకానొక అద్భుతానందాన్ని కలిగించే చిత్రలేఖకుడిగా నాలో నిండిపోయాడు. ఇన్ని ఉండీ, ఇప్పుడొక స్మృతి మాత్రమే మిగిలిందా ? చివరకు మిగిలేది ఏమిటి?అని అతను ప్రపంచాన్ని అడిగిన ప్రశ్న నేడు మళ్ళీ స్ఫురణకొస్తోంది.
బుచ్చిబాబుకు శ్రద్ధాంజలి – శ్రీ మునిమాణిక్యం నరసింహారావు గారు
బుచ్చిబాబుని చిన్నపడి నుంచి ఎరుగుదును. కాలేజీలో చదువుకుంటున్న రోజులనుంచి వట్టి అమాయకుడు. నిర్మల హృదయుడు. అతని నవ్వే అతని హృదయ నిర్మలత్వానికి సాక్ష్యము. భోళాగా, పెద్దగా, హాహాయని, హాలు అదిరి పోయేలాగున నవ్వేవాడు. శుష్క భావాలకు తావులేదు. రచయితగా చిన్నతనం లోనే పేరు సంపాదించాడు. సాహిత్యారాధకుడిగా రావలిసిన గౌరవాలు వచ్చినవి. సాహిత్య అకాడెమీ ఆయన్ను గౌరవించినది.చివరకు మిగిలేది అన్న నవల ఇతర
భాషలలోకి తర్జుమా అయి పండితుల, సాహితీవేత్తల మన్నలను పొందినది. ఆ పుస్తకం అందరికీ తెలిసినదే. బుచ్చిబాబు చక్కని కధలు వ్రాశాడు. నవలా రచయితగానే కాక కధుకుడిగా కూడా అతనికి మంచి పేరు ఉంది. ఆయన కధల్లోని పాత్రలు మనతో ముఖాముఖిన మాట్లాడు తున్నట్లు ఉంటాయి. వారు మనకు ఎంతో కాలం నుంచి పరిచయుస్తుల వలే, ఆప్తుల వలే, హృదయము ఇచ్చి మాట్లాడుతారు. అది బుచ్చిబాబు స్వభావము. ఆయన సృష్టించిన ప్రతీ పాత్రలోనూ ఆయన స్వభావము ప్రతిబింబిస్తూ ఉంటుంది. పాత్రలన్నింటిలోనూ ఏదో రూపంలో ప్రత్యక్షమవుతూ ఉంటాడు. నిష్కల్మష హృదయంతో మాట్లాడడంలోనూ, నిష్పక్షపాతముగా విషయాన్ని పరామర్శించడంలోనూ, పాత్రల యొక్క మనోగత విషయాలను,రహస్యాలను వెలికి తీసి మనముందు పెట్టడంలో ఆయన అద్వితీయుడు. బుచ్కిబాబు రచనల్లో రుస్సెల్ వంటి తత్వజ్ఞుల ప్రభావము కనబడుతుంది. ఆయన రచనలు చదువుతుంటే ఎన్నో పుస్తకాలు చదివి జీర్ణించుకుని ఎంతో విజ్ఞానము సంపాదించిన వాని రచనలాగా భావిస్తుంది.నాకు తెలుసు ఆయనకు మల్లెపూలంటే ఎక్కువ ఇష్టము. ఆయన హృదయమే ఒక మల్లెపూవు.
ఎప్పుడూ వాడని మల్లెపూలు గల లోకానికి వెళ్ళిపోయాడు. కానీ వారి దయానిధి మనకెప్పుడూ బుచ్చిబాబు గురించి చెప్తూనే ఉంటాడు. ఆయన ఆత్మకు శాంతి కలుగుగాక అని అనక్కరలేదు. ఆయన శాశ్వతమైన శాంతిని అనుభవించడానికి అర్హతను సంపాదించుకునే వెళ్లారు.
బుచ్చిబాబు గారిని గురించి శ్రీ గొల్లపూడి మారుతీరావు గారు--
కాలేజీలో చదువుకునే రోజుల్లో నాకు మూడు పారాయణ గ్రంథాలు- కృష్ణశాస్త్రిగారి ‘కృష్ణపక్షం’, బుచ్చిబాబుగారి ‘చిరంజీవి’, చలంగారి ‘మ్యూజింగ్స్’. నా జీవితంలో అదృష్టం ఏమిటంటే ఆ ముగ్గురితోనూ అతి సన్నిహితమైన పరిచయాలు ఏర్పడటం. 1960లో ఆంధ్రప్రభలో చిత్తూరులో పనిచేసే రోజుల్లో తరచూ చలం గారు ఉన్న తిరువణ్ణామలై ఆశ్రమానికి వెళ్లేవాడిని. మరో మూడేళ్లకి ఆలిండియా రేడియోలో కృష్ణశాస్త్రి గారు, బుచ్చిబాబు గారితో కలసి పనిచేశాను. నేనూ, శంకరమంచి సత్యం, ఉషశ్రీ యువతరం రచయితలం. పెద్దలతో కలసి పనిచేయడం పండగ.బుచ్చిబాబు గారు మితభాషి. బి.ఎన్.రెడ్డిగారి ‘మల్లీశ్వరి’కి బుచ్చిబాబు గారు రాసిన ఒక రేడియో నాటిక మాతృక అని నిరూపణ అయినా కాలుదువ్వని సౌమ్యుడాయన.రెండేళ్ల కిందట ‘వందేళ్ల కథకు వందనాలు’ కార్యక్రమా నికి బుచ్చిబాబుగారిదీ,
ఆమెదీ(సుబ్బలక్ష్మి గారిది) కథలు రికార్డు చేశాను. ‘మరో రెండేళ్లు బతకాలని ఉంది మారుతీరావ్. బుచ్చిబాబు గారి శతజయంతి చేసి వెళ్లిపోతాను’ అన్నారు సుబ్బలక్ష్మి గారు . జూన్ 14న శతజయంతి ఉత్సవం జరిపిస్తున్నారు.బుచ్చిబాబు గారి జీవితమే ఒక కళాఖండం.ఏమీ అరమరకలు లేని, గజిబిజిలేని,సరళమైన జీవితాన్ని గడిపిన
గొప్ప ఇంటలెక్చువల్ బుచ్చిబాబు. ఆయన మంచి కవి. ఆ సాక్ష్యాలు ఇప్పటికీ శివరాజు సుబ్బలక్ష్మి గారి దగ్గర ఉన్నాయి.
*****
ఈ తెలుగు నవలా చక్రవర్తి శతజయంతి ఉత్సవాలలో ప్రభుత్వం కూడా పాలుపంచుకొని సాహిత్యం,కళల పట్ల తమ అభిరుచిని ప్రకటించుకుంటాయని ఆశిద్దాం!
బుచ్చిబాబు చిరంజీవి!
ఆయనకు నా స్మృత్యంజలి!

No comments:

Post a Comment

Pages