భక్తమందార శతకము -కూచిమంచి జగ్గకవి

పరిచయం :దేవరకొండ సుబ్రహ్మణ్యం 


కవిపరిచయం:
భక్తమందార శతకకర్త కూచిమంచి జగ్గకవి (క్రీ.శ.1700-1765) అర్వేల నియోగి బ్రాహ్మణుడు. ఆపస్థంబసూత్రుడు. కౌండిన్యగోత్రుడు. బయ్యన్న ప్రపొత్రుడు. తిమ్మయ పౌత్రుడు. తల్లి తండ్రులు గంగన్న, లచ్చమ్మ. మహాకవి కూచిమంచి తిమ్మకవికి రెండవ సోదరుడు. ఈకవి తన అన్నగారైన తిమ్మకవి వలే మహాపండితుడు. ఈకవి సుమారు క్రీ.శ.1700 ప్రాంతమున జన్మించి 65 సంవత్సరాలు జీవించి యున్నట్లు శతకచరిత్రకారుల అభిప్రాయం. ఈతని కవిత్వం అద్భుతమైన ధారాశుద్ధికలిగి శబ్దాలంకారములతో గంగాస్రవంతివలె ధారాళముగా సాగిపోవుచుండును. ఇతడు చిన్నతనము నుండే అనేక రాజాస్థానములను సందర్శించి తనకవితా పటిమతో అనేక కవులను ఓడించి తన ప్రతిభను చాటుకున్నాడు. తన అన్నగారైన తిమ్మకవి మెప్పు పొందినవాడు. ఈకవి అధిక్షేప ప్రబంధమునకు శ్రీకారము చుట్టిన చంద్రరేఖావిలాపము కర్తగా సాహిత్యాభిమానులకు సుపరిచితం. తిట్టుకవిత్వంలో ఈకవి అందెవేసిన చెయి. ఏవిషయాన్నైనా డొంకతిరుగుడుగా కాక సూటిగా పాఠకుల హృదయాలలోకి చొచ్చుకుపోయేట్టు చెప్పగలడు.
ఈతని విద్వత్తుకు మెచ్చి తిమ్మభూమండలేశ్వరుడు ఇతనికి "బేబదల్" అనే బిరుదము ఇచ్చి సత్కరించినాడు. బహుశా ఇది ఇతని జీవితకాలంలోని చివరి బిరుదము అయి ఉండవచ్చునని, ఈబిరుదము ఇతని 60 ఏండ్లప్రాయలో లభించి ఉండవచ్చునని శతక చరిత్రకారుల అభిప్రాయం.
ఈతడు తన కృతులను గురించి యిట్లు చెప్పుకొన్నాడు.
రచియించితివి మున్ను రసికులౌననునట్లు సురుచిర జానకీపరిణయంబు
వచియించితివి కవివ్రాతము ల్వొగడంగ ద్విపద రాధాకృష్ణ దివ్యచరిత
ముచ్చరించితివి విద్వచ్చయంబు నుతింపఁ జాటుప్రబంధముల్ శతకములును
వర్నించితివి యిరువదిరెండు వర్ణనల్ రాణించగా సుభద్రావివాహ
మాంధ్రలక్షణలక్ష్యంబు లరసినావు, భూరిరాజన్యసంసత్ప్రపూజితుడవు
భళిర! నీభాగ్యమహిమ చెప్పంగదరమె?, జగ్గకవిరాజచంద్ర! వాచాఫణీంద్ర! (చంద్రరేఖావిలాపము)
పై పద్యం ప్రకారం జానకీపరిణయము, ద్విపదరాధాకృష్ణచరిత్రము, సుభద్రావివాహము, కొన్ని శతకములు, చాటుప్రబంధములు, చంద్రరేఖావిలాపము ఈ కవికృతులని తెలుస్తున్నది. ఇది కాక సోమదేవరాజీయము అనే గ్రంధం కూడా ఇతని కృతియే అని తెలుస్తున్నది. ఐతే ఈకవి ఎకాలం లో ఏగ్రంధం రచించినాడనే విషయం నిర్ణయించటం కొంచం కష్టమే. అదేవిధంగా ఈకవి కొన్ని శతకములు అని చెప్పినాడు కానీ వాటి నామధేయములు తెలుపలేదు. బహుశా మరిన్ని శతకములు రచించి ఉండవచ్చుని. కాని అవి ఇప్పుడు దొరకటము లెదు.
శతక పరిచయం:
"రామా! భక్తమందారమా!' అనే మకుటంతో శార్ధూల మత్తేభ వృత్తాలలో రచించిన 101 పద్యాల భక్తిరస, నీతి, అధిక్షేపశతకము భక్తమందార శతకము. ఈశతకము సాంఘీకశతకములలో "కాళహస్తీశ్వర", "భర్గ" శతకములకు ధీటైనది.
సరసప్రస్తుత కూచిమంచి కులభాస్వద్వార్ధి రాకాసుధా
కరుఁడన్ గంగన మంత్రినందనుఁడ! రంగల్తిమ్మభూమండలే
శ్వరపర్యార్పిత "బేబదల్" బిరుదవిస్ఫాయజ్జగన్నాథ నామ
రసజ్ఞుండను బ్రోవు మెప్డు నను రామా! భక్తమందారమా!
అన్న ఈశతకంలోని చివరిపద్యాన్నిబట్టి ఈతనికి "బేబదల్" అనే బిరుదు వచ్చిన తరువాత రచించినదీ శతకం అని తెలుస్తున్నది. ఈ రచనలో భక్తి శతక ధోరణిలో రచన సాగినప్పుడు రామగుణస్తుతి, నిర్గుణోపాసన భావములు వ్యక్తమవుతాయి.
భక్తిరసము ఉప్పొంగే ఈ క్రింది పద్యాలు గమనించండి
శా. అస్తోకామల కీర్తికామ! లసదుద్య న్నిరత శ్యామ! భూ
విస్తార ప్రభుతా లలామ! త్రిజగత్ప్రఖ్యాత సన్నామ! ధీ
రస్తు త్యోరు గుణాభిరామ! భుజసారస్ఫార పౌలస్త్యదు
ర్మస్తస్తోమ విరామ ధీమహిత! రామా! భక్తమందారమా!
శా. దండం బియ్యదె నీకుఁ గైకొనుము దోర్దండాగ్రజాగ్రన్మహో
దండోత్తాల విశాల దివ్యతర కోదండాగ్ర నిర్ముక్త స
త్కాండ వ్రాత విఖండి తాహిత శిరఃకాండా! కనత్కుండలా!
మాండవ్యాది తపోధన ప్రణుత! రామా! భక్తమందారమా!
శా. సందేహింపక కొంచకెప్పుడు హృదబ్జాంతంబులో భక్తి నీ
యందంబై తగుమూర్తి నిల్పికొని యత్యాసక్తి సేవించువాఁ
డొందుం గుప్పున వాంఛితార్ధములు బాగొప్పారు వందారు స
న్మందారంబవు గావె నీ వరయ రామా! భక్తమందారమా!
కపటభక్తి, కలియుగ ధర్మములు పాపము పుణ్యములు, సప్తసంతానములు, దానధర్మములు, సజ్జన దుర్జన లక్షణములు మొదలైనవానిని వివరించునప్పుడు కొన్ని వివరణాత్మకముగాను, ఉపదేశాత్మకముగాను, అధుక్షేప వ్యంగ్య చమత్కృతులతో నుండును. నిశ్చలభక్తిలేని దానధర్మ వ్రతములు తీర్థయాత్రాది విధానములు నిరర్థకములని నిరసించిన సందర్భమున అధిక్షేపచ్చాయలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.
 శా. ధర్మంబంచు నధర్మంమంచుఁ గడు మిధ్యలీల లే పారఁగా
నిర్మాణం బొనరించి ప్రాణులను నిర్నిద్ర ప్రభావంబులన్
బేర్మిం జెందఁగఁ జెసి యంత్రకుగతిన్ బిట్టిరకే త్రిప్పు నీ
మర్మం బెవ్వ రెఱుంగఁగాఁ గలరు? రామా! భక్తమందారమా!
మ. వ్రతముల్ పట్టిన, దేవభూసుర గురువ్రాతంబులం గొల్చి నం
గ్రతు తంత్రంబులు దానధర్మము లపారంబౌనటుల్ చేసినన్
శతవర్షంబులు గంగలో మినిఁగినన్ సంధిల్లునే ముక్తి దు
ర్మతికిం దావక భక్తి గల్గమిని? రామా! భక్తమందారమా!
శా ఇం దందున్ సుఖమీయఁజాలని మహాహేయార్థ సంసారఘో
రాంధూ బృందనిబద్ధిలై సతత మన్యాయ ప్రచారంబులన్
గ్రిందున్మీఁదును గానకెంతయున్ రక్రిన్ ధాత్రివర్తింతురౌ
మందుల్ సుందర మందహాసముఖ రామా! భక్తమందారమా!
అంత్యప్రాసాలంకారములనిన ఈతనికి బహు ప్రీతిగా తెలుస్తున్నది. అత్తిపద్యములు ఈశతకములో ఆరు ఉన్నవి మచ్చుకి ఒకటి చూడండి
మ. అతసీపుష్పసమాన కోమల వినీలాంగునిన్ సముద్య న్మహో
న్నతకోదండ నిషంగగంగు బలవ న్నక్తంచరాఖర్వ ప
ర్వత జీమూత తురంగుఁ గింకరజనవ్రాతావనాత్యంత ర
మ్యతరాపాగుని నిన్ భజింతు మది రామా! భక్తమందారమా!
శ్లేషాలంకారముతో ప్రభుదూషణముగల ఈ క్రిందిపద్యం చూడండి
పలుమాఱుం ద్విజరాజు లొక్కట దముం భాదించురంచు న్విషా
నలఘోరాననముల్ముడుంచుకొని కానన్ రాక దుర్గస్థలం
బుల వర్తింపుచు భుస్సురందురిల నాభోగీశు లెందైననున్
మలకల్ మాని చరింపఁ గాఁగలరె రామా! భక్తమందారమా!
జటిలదీర్ఘసమాసములు ఈశతకంలో అనేకం. ఈక్రింది ప్రయోగాలు గమనించండి.
1. దోర్దండాగ్రజాగ్రన్మహోద్దండోత్తాల విశాలదివ్యతర కోదండోగ్రనిర్ముక్త సత్కాండ వ్రాతవిఖండితాహిత శిరఃకాండా
2. మదనాగాశ్వశతాంగ కాంచన కనన్మాణిక్యభూష మృగీమద దివ్యాంబర చామరధ్వజ లసన్మంజూషికాందీళికామృతలాబార్థ సమృద్ధి
3. మకరోగ్రక్రకచాగ్ర జాగ్రదురు సమ్యక్చాతదంష్ట్రాక్షత ప్రకటాంఘ్రీద్వయ నిర్గళద్రుధిరధారా పూరగోరవ్యధా చకితుండు
4. అమరేంద్రాది సమస్తదేవ భయదాహంకారహూంకారదుర్దమ బాహాబలసింహనాద పటుకోదండోగ్రబాణచ్ఛటా సమజాగ్రత్ఖ దూషణాసురులు
మరిన్ని పద్యాలను చూద్దాము
పద్యంబెల పసిండి/ కీప్సితము దీర్పన్ లే జేజేకు నై
వేద్యంబేల? పదార్థ చోరునకు నిర్విన్ వేదవేదాంత స
ద్విద్యాభాసక బుద్ధియేల? మది భావింపంగ నెల్లప్పుడున్
మద్యం బానెడు వానికేల సుధ? రామా! భక్త మందారమా!
మ. ముకురంబేటికి గ్రుడ్డివానికి, జనామోదానుసంధాన రూ
పకళాకౌశలకామినీ సురతలిప్సాబుద్ధి ధాత్రిన్నపుం
సకతం గుందెడు వానికేమిటికి, మీసంబేటికిన్ లోభికిన్
మకుటంబేటికి మర్కటంబునకు రామా! భక్తమందారమా!
మ. కుజనున్ ధర్మతనూజుఁడంచు నతిమూర్ఖున్ భోజరాజంచు ఘో
ర జరాభార కురూపకారిని రమారామాకుమారుండటం
చు జడత్వంబునవేఁడి కాకవులు కాసుంగాన రెన్నంగ సా
మజ రజో గ్రవిపద్దశాపహర రామా! భక్తమందారమా!
ఈ శతకములో కొన్ని పద్యాలు ఇతరకావ్యములకు అనుకరణలుగా, మరికొన్ని అనువాదములుగా కనిపిస్తాయి. ఈశతకంలోని జాతీయశబ్ద ప్రయోగములు అనేకం
కొంటెతొత్తు కొడుకులు, కోనారులు, తకతేతత్తలవారు, మోటకొయ్యదొరలు, బవనీలు, దరిబేసులు, కోమటిమేనర్కము, మాటేబంగరు, హోందిలావు, క్రిందున్మీదుగానక, మోటకాపు దొరలు, పల్గాకి, దీమస, గోరంత, కాసంతసేపు, ఎడపొద్దు, సరిపిణీలు, మసియైపోవు విడిదిల్లు వంటి జాతీయాలు మనం చూడవచ్చును.
అలాగే నానుడూలు, ఉపమానాలు కోకొల్లలు
నీదుచిత్తము నాదు భాగ్యము; నీమనసు న్నామనసు న్నెఱుంగు; నేనీబంటును, నీవునాదొరవు; మీసంబేటికిన్ లోభికిన్, మకుటం బేటికి మర్కటంబునకు, మన్నుంబిల్లి మృగేంద్రమౌనె?; ఒత్తుల్ దిను దాసరింబలె; దోమలువేయైన మదద్విపంబగునె; ఈప్సితము దీర్పన్ లేని జేజేకు నైవేద్యంబేల? పారిజాతసుమనో మత్తద్విరేఫంబు దా మదనోర్వీజము చెంతకుజనునే? బర్బూరము గాలివాన బడుగా కింతైన గంపించునే మలయోర్వీధరమారుతంబునకు, జెఱ్ఱ్ చీమలు చీకాకు జేయుచందమున
ఇక ఈశతకములో ఆకాలపు ప్రభువులను దూషించు పద్యములు, నమ్మరాని జాతులగురించిన పద్యములు పంక్తిబాహ్యులపై పద్యములు, ఆకాలపు బూటకపు వైద్యులను దూషిచు పద్యములు ఉన్నవి.
చివరిమాటగా ఈశతకం ఆనాటి సాంఘీక ఆచారవ్యవహారాలను దుయ్యబడుతు, రాజకీయ పరిస్తితులనూ విమర్శిస్తు, చెప్పిన శతకం అవటంవలన ఇది చదివినవారికి అప్పటి పరిస్థితులపై కొంత అవగాహన కల్పించటానికి దోహదకారి అవుతుంది.
అత్యంతమనోహరమైన శబ్ధజాలముతో, చక్కని భక్తిరసపురితమైన పద్యములు, నీతి, వ్యంగ్య, అధిక్షేప పద్యములు నిండిన ఈశతకం ప్రతిఒక్కరు చదవ వలసినది.
మీరు చదవండి. ఇతరులచే చదివించండి.

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top