యువత - అచ్చంగా తెలుగు

యువత 

                                                                        ప్రతాప వెంకట సుబ్బారాయుడు


"ఇక్కడ యూత్.. అమ్మా.. యూత్..దడ దడ లాడించేస్తాం"
ఇది ఒక సినిమాలో హీరో డైలాగ్.
నిజమే! యూత్ పవర్ ఫుల్ రీసోర్స్. రాజకీయాల్లో రాణించాలన్నా, సినిమాలు సక్సెస్ కావాలన్న యూత్ సపోర్ట్ తప్పనిసరి.
కాని యువతరానికి లాభమేమిటి?
ఏమీలేదు..వాళ్ళని పావులుగా వాడుకుని బాగుపడిన వాళ్ళు ఎందరో వున్నారు. కాని చదువుకోవలసిన వయసులో చదువుని నిర్లక్ష్యం చేసి లేనిపోని హీరోయిజంతో బతుకు బండలుచేసుకున్న వాళ్ళు ఎందరో!
తల్లిదండ్రులు తమ సంతానం మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. తమకి లేని చదువు తమ పిల్లల కన్నా అబ్బాలని, తమ కన్నా తమ పిల్లలు ఉన్నతంగా ఉండాలని కలలు కంటారు. అందుకని కడుపు మాడ్చుకుని పైస పైస కూడపెట్టి, పట్నంలో చదివిస్తూ అవసరమొచ్చినా.. లేకపోయినా డబ్బు పంపిస్తుంటారు. ఆ డబ్బుని తేరిపార చూస్తే వాళ్ళ జాలిమొహాలు కనిపిస్తాయి. వాటి వాసన చూస్తే చెమట వాసన నాసికాపుటాలకి సోకుతుంది. ఆ డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ క్లబ్బులనీ..పబ్బులనీ లేనిపోని అలవాట్లు చేసుకుంటే భవిష్యత్తుని కోల్పోయేదెవరు? మీ నాన్న పాత డొక్కు సైకిల్ మీద వెళుతూ మీకు బైకు కొని ఇచ్చుండొచ్చు. బైకు మీద ర్యాష్ గా డ్రైవ్ చేసి యాక్స్ డెంట్ కి గురైతే..బస్సుల్లో ఫుట్ బోర్డ్ ప్రయాణం చేస్తూ జారిపడితే..తమ అభిమాన హీరోకోసం గొడవలు పడడం..అల్లర్లు జరిగినప్పుడు ముందుండడం వల్ల జరగకూడనిదేమైనా జరిగితే..ఏ కాలో చెయ్యో కోల్పోతే ఎవరు బాధ పడేది? మీమీదే ఆశలుపెట్టుకుని వృద్ధాప్యంలో ఆసరాగా వుంటారనుకుంటే..కడుపు కోత మిగల్చడం న్యాయమా?
సమాజానికి న్యాయంచేద్దామని బయల్దేరేముందు మీ వాళ్ళకి ఏం న్యాయంచేశారో..చేస్తున్నారో ఆలోచించండి. మీలో దేశానికి ఉపయోగపడే భవిష్యత్ సైంటిస్టులున్నారు, రోగాలని దూరం చేసే డాక్టర్లున్నారు, న్యాయవ్యవస్థకి దన్నుగా నిలిచే లాయర్లున్నారు, భావి తరానికి మార్గదర్శులుకాగలిగే ఉపాధ్యాయులున్నారు, ఇంజనీర్లున్నారు. కాని క్షణికావేశంలో మిమ్మల్ని మీరు కోల్పోతే అందరికీ మిగిల్చేది అంధకారమే కదా!
చెడు అలవాట్లు చేసుకున్నా, ప్రేమ పేరుతో మోసపోయినా విలువైన జీవితం చేజారినట్టే! మీ గురించి మీరు ఆలోచించండి! మీ కన్న వాళ్ళని గురించి ఆలోచించండి!!
కాంపిటిషన్ అందరికీ నిద్రాహారాలు లేకుండా చేస్తోంది. ఎంత చదివినా..ఎంత తెలుసుకున్నా ఇంకా సముద్రమంత మనముందుంటోంది. గ్లోబలైజేషన్ వల్ల దేశమే కుగ్రామమైపోతోంది. ప్రపంచముతో పోటీ పడవలసి వస్తోంది. ఇది గుర్తెరిగి మసలుకోవాలి.
యువత అంటే దేశానికి వెన్నెముక. మీ ఐఖ్యత ఓ మహత్తర బలం అది వృధా కాకూడదు. దేశాన్ని ముందుకి నడిపించే శక్తి కావాలి.
కర్తవ్యోన్ముఖులు..కార్యోన్ముఖులు మీరే. ఆదర్శవంతంగా వుంటూ..జవాబుదారీ తనాన్ని పెంపొందించుకుంటూ..ముందుకు..మున్ముందుకు సాగాలి.
***
                                                                     

No comments:

Post a Comment

Pages