శ్రీధరమాధురి – 26

(నిజమైన విద్యార్ధి ఎలా ఉండాలో పూజ్య శ్రీ వి.వి.శ్రీధర్ గురూజీ అమృత వాక్కుల్లో చదవండి.)


విద్యార్ధులు శ్రద్ధగా వినడం అనే కళను అలవర్చుకోవాలి. విద్యార్ధి తాను ఆ సంస్థలో చేరిన ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. సంఘం, దేశం, ప్రపంచం వారి ప్రయోజనం కోసం నిస్వార్ధంగా సేవలు అందించేవారి కోసం ఎదురుచూస్తున్నాయి. విద్యార్దే మెరుగైన ప్రపంచానికి ఆశాదీపం.
‘క్రమశిక్షణ’ అన్నది విద్యార్ధికి పర్యాయపదం. ఒక విద్యార్ధి క్రమశిక్షణను కలిగి ఉంటే తప్ప, విద్యా వ్యవస్థ నుంచి అతను ఏమీ నేర్చుకోలేడు. ఒక విద్యార్ధి స్వచ్ఛందంగా క్రమశిక్షణ పాటించడాన్ని అలవర్చుకోవాలి.
యువతలో ప్రతి ఒక్కరూ గొప్ప జ్ఞాపకశక్తితో దీవించబడ్డారు. వయసు పెరిగేకొద్దీ జ్ఞాపకశక్తి తగ్గుతుంది. విద్యార్ధులకు విశ్లేషనాత్మక శక్తి ఉండదు. వయసు పెరిగేకొద్దీ విశ్లేషణా నైపుణ్యం పెరుగుతుంది. విద్యాభ్యాస దశలో విద్యార్ధి నెమ్మదిగా విశ్లేషణా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి. అధ్యాపకులకు ఉన్న విస్తృతమైన అనుభవం వల్ల వారికి అద్భుతమైన విశ్లేషణా శక్తి ఉంటుంది. కాబట్టి, విద్యార్ధి విషయాన్ని వంటబట్టించుకునేందుకు  కృషి చెయ్యాలి, ఇందుకు కీలకమైనది విశ్లేషణే !
ఒక విద్యార్ధికి నేటి సమాజం “బెటర్ థాన్ ది బెస్ట్ (మెరుగైన వాటికంటే శ్రేష్టమైన వాటిని)” ను కోరుకుంటోందని తెలుసు. నాణ్యత అనేది కీలకమైనదిగా మారింది. విద్యలో ప్రావీణ్యం లేకుండా ఒకరు ఈ ప్రపంచంలో విజయాన్ని ఆశించలేరు.
విద్య అనేది డబ్బును, అధికారాన్ని సవాలు చేస్తుంది. విద్య డబ్బును, అధికారాన్ని నియంత్రిస్తుంది. డబ్బు, అధికారం విద్యను నియంత్రించడం అనే ప్రస్తుత పరిస్థితిని సమీక్షించుకోవాల్సి ఉంది. విద్యార్ధి సంఘాలు విద్య సహాయంతో డబ్బు, అధికారం తెచ్చిన దుస్థితిని రూపుమాపాల్సి ఉంది. ఇది జరగాలంటే, విద్యార్ధులు విద్యకు ప్రాధాన్యం ఇచ్చి, తక్కిన అంశాలు అన్నింటినీ ప్రక్కన పెట్టాలి.
ఒక విద్యార్ధి ప్రతికూలతను, నిరాశావాదాన్ని మనసులోకి ప్రవేశించనివ్వకూడదు. అతను సానుకూల దృక్పధంతో, ఆశావాదంతో జీవించడం నేర్చుకోవాలి. ఒక్క సానుకూల దృక్పధం అతను నేర్చుకున్న వాటిని ఇముడ్చుకునేలా చేస్తుంది. అతను నిరాశకు గురికాకూడదు, లేక నిరాశ పడకూడదు. విద్యార్ధి సంఘాల్ని గురించి శ్రద్ధ వహిస్తూ, వారి ఆసక్తిని పరిరక్షిస్తూ ఉండడం ప్రతి ఒక్కరి బాధ్యత. వారు ఉత్తమమైన ఫలితాలను చూపాలంటే, వారికి ప్రోత్సాహాన్ని అందించాలి, ఇందువల్ల, పెద్ద ఎత్తున మానవాళికి మేలు జరుగుతుంది.
చాలా వరకు గొడవలు, మనస్పర్ధలు, వాదనలు అజ్ఞానం వల్ల ఉదయిస్తాయి. కేవలం విద్య మాత్రమే ఈ విషాదానికి ఒక పరిష్కారాన్ని చూపించగలుగుతుంది. విద్య పెరిగే కొద్దీ, స్పర్ధలు తగ్గుతాయి. కాబట్టి తాను ఎంచుకున్న క్షేత్రంలో ప్రావీణ్యాన్ని సాధించడం విద్యార్ధి లక్ష్యం కావాలి. భవిష్యత్తులో దీనివల్ల అతను శాంతి సామరస్యాల్ని నెలకొల్ప గలుగుతాడు. అజ్ఞానం వల్ల ఏర్పడే దుష్పరిణామాల నుంచి  మానవాళిని కాపాడే ఆశాదీపం అతనే.
యువత కొత్త ఆలోచనలతో వస్తుంది. ప్రతీ తరం పూర్తిగా కొత్త అంశాల్ని, ప్రత్యేకమైన అంశాల్ని తెస్తుంది. మూస పోసినట్లుగా కాక, వైవిధ్యంగా ఆలోచించే సామర్ధ్యం విద్యార్ధికి ఉంది. అతను అనుకరించడు, ప్రస్తుత పరిస్థితికి తగని దేన్నైనా అతను త్రోసిపుచ్చుతాడు. అభివృద్ధిని సాధించే మార్గాలను అన్వేషించి, వినియోగించుకోవడం అతనికి ఇష్టం. ప్రస్తుత తరం మరింత జ్ఞానాన్ని కలిగిఉంది, వారు త్వరగా నేర్చుకుంటారు. ఇప్పటి విద్యార్ధికి పాఠాలు అవసరం లేదు. అతనికి మార్గం చూపే మార్గదర్శి కావాలి. ఇప్పుడున్న విద్యార్ధి సామర్ధ్యం అపారం.
మీ పిల్లల్ని బలవంతపెట్టకండి. వారికి స్వేచ్ఛనిచ్చి, వారికి కావాల్సింది ఎంచుకోనివ్వండి. మీఋ వారిని గురించి కనే కలలన్నీ వారి మీద రుద్దకండి. వారి జీవితాన్ని వారిని గడపనివ్వండి. వారికి ఆసరా ఇవ్వండి. పెద్దల చర్యలు పిల్లల ఒత్తిడికి కారణం కాకూడదు. విద్యార్ధి దశలో యువత ఒత్తిడికి లోనైతే, పెద్దలుగా మిమ్మల్ని మీరు ఎప్పటికీ క్షమించలేరు. వారు ఏమి చదువుకోవాలని అనుకుంటున్నారో చెప్పనివ్వండి. అది వారి జీవితం, వారికి ఎంచుకునే అవకాశం ఇచ్చి తీరాలి.
జ్ఞానం జీవితకాలం నిలిచి ఉంటుంది. దాన్ని ఎప్పటికప్పుడు తాజా పరచాలి. విద్యార్ధి జ్ఞానాన్ని దూరదృష్టితో చూడాలి, కేవలం పరీక్షల కోసమో, డిగ్రీ పొందేందుకో కాదు. అతను తన జీవితం వంక చూడాలి, అది పూర్తిగా పరీక్షలతో నిండి ఉంది. జ్ఞానం, దాన్ని ఎప్పటికప్పుడు మెరుగు పరచుకోడం అనేవి, జీవితంలోని వివిధ దశల్లో అతనికి ఉపయోగిస్తాయి. మానవ జీవితంలో బాహ్య లేక వ్యక్తిగత జీవితం నుంచి విరమించుకునే అవకాశం ఉంది, కాని జ్ఞానసముపార్జన నుంచి, నవీకరణ నుంచి విరమించుకోవడం ఉండదు.
డబ్బు సంపాదించేందుకు సులువైన మార్గాలున్నాయి, అధికారాన్ని చేజిక్కించుకునేందుకు కూడా ఉన్నాయి. కాని, జ్ఞానసముపార్జనకు సులువైన పద్ధతులు ఏమీ లేవు. ఒక విద్యార్ధి అంకిత భావంతో అందుకోసం కృషి చేసి, దాన్ని సాధించుకోవాలి.
కాలం అమూల్యమైనది. కోల్పోయిన కాలాన్ని తిరిగి పొందలేము. ఒక విద్యార్ధి తన విలువైన సమయాన్ని కోల్పోతే, దాన్ని తిరిగి పొందలేడు. అందుకే విద్యార్ధి అన్నింట్లో తలదూర్చి, కాలాన్ని వృధా చెయ్యకూడదు. స్నేహితుల్ని ఎంచుకునే విషయంలో కూడా వారు జాగ్రత్తగా ఉండాలి. మరీ ఎక్కువమంది మిత్రులతో కాలం గడుపుతుంటే, అతని విద్యాభ్యాసం దెబ్బతింటుంది. కాలాన్ని సద్వినియోగ పరచుకోవడం, విద్యార్ధులకు తప్పనిసరి.
***

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top