శ్రీ కంచి కామాక్షీ చరణ దాసుడు -- శ్రీ శ్యామశాస్త్రి

మధురిమ 


కర్నాటక సంగీతానికి 18వ శతాబ్దము స్వర్ణయుగము గా అభివర్ణిస్తారు...కారణం ఏమనగా సంగీత త్రిమూర్తులుగా  విశ్వవిఖ్యాతిగాంచిన శ్రీ త్యాగరాజు(1767-1847),ముత్తు స్వామి దీక్షితార్(1775-1835),శ్రీ శ్యామ శాస్త్రులవారు(1763-1827)వీరు ముగ్గురూ ఇంచుమించుగా ఒకేకాలమునకు అనగా ఈ 18వ శతాబ్దమునకు చెందినవారే.వీరు ముగ్గురూ ఆ శారదా అనుగ్రహంతో తమ విశిష్ట పద్దతులలో,విలక్షణమైన కీర్తనలను రచించి,తరించి భావితరాల వారిని కూడా తమ సంకీర్తనలతో తరింపజేస్తున్నారు.నవవిధ భక్తి మార్గాలలో ఒకటైన సంగీతం ద్వారా వీరు ముగ్గురూ భగవత్ సానిహిత్యాన్ని పొందగలిగారు.త్యాగరాజ స్వామి కృతులు పండిత పామరులను కూడా ఒకలాగే అలరించనివి.దీక్షితులవారివి వినాలన్నా,పాడాలనన్నా కాస్త సంగీత జ్ఞానం అవసరం.కాని శ్యామ శాస్త్రులవారివి వినాలన్నా ,పాడాలన్నా కూడా ఎంతో అపారమైఅన సంగీత జ్ఞానం,సంగీతానుభవం కూడా అవసరమే...రానున్న మేష రవికృత్తికా నక్షత్రం (తమిళకాలమానంప్రకారం)శ్యామశాస్త్రుల వారి 254వ జయంతి సందర్భంగా శ్యామశాస్త్రులవారు అర్చించిన ఆ బంగారు కామాక్షికిఅక్షర అర్చన గా ఈ వ్యాసాన్ని సమర్పిస్తున్నాను.
సంగీత త్రిమూర్తుల ముగ్గురిలోనూ అందరికంటే పెద్దవారైన శ్రీ శ్యామశాస్త్రులవారు 1763వ సం. అనగాచిత్రభాను నామ సంవత్సర మేష రవి కృత్తికా నక్షత్రమున తిరువారూరు లో జన్మించారు.సంగీత త్రిమూర్తుల ముగ్గురి జన్మ స్థానం ఈ తిరువారూరు. తండ్రి పేరు విశ్వనాథ శాస్త్రి.శ్యామశాస్త్రులవారి మొదటి పేరు వెంకట సుబ్రహ్మణ్యము,కానీ తల్లితండ్రులు ముద్దుగా శ్యామకృష్ణా అని పిలిచేవారట. వీరి పూర్వులు ఆంధ్ర ప్రదెశ్ లోని కంభంవాస్తవ్యులని,కాని అనతి కాలంలో వీరు ఆంధ్రదేశం నుండీ తమిళదేశమునకు వలస వెళ్ళినట్లుగా తెలియచున్నది.బాల్యమునుండే  శ్యామశాస్త్రి తల్లితండ్రుల వద్ద సంస్కృతాంధ్రములు,జ్యోతీష్యము,మేనమామ వద్ద సంగీతమునేర్చుకుని పాండిత్యము సంపాదించి తన 18వ ఏట తంజావూరునకు తల్లితండ్రులతో వచ్చి స్థిరపడినట్లుగా  చారిత్రకారులు చెప్పియున్నారు.
శ్రీ శ్యామశాస్త్రులవారి తండ్రిగారైన శ్రీ విశ్వనాథ శాస్త్రిగారు శ్రీవిద్యోపాశకులు మరియు  తన పూర్వికులనుండీ భాగ్యంగా సంక్రమించిన అర్చకవృత్తిని అతి పవిత్రతతో,భక్తితో నిర్వహిస్తూ తంజావూరిలో బంగారు కామాక్షి ఆలయం లో అర్చకులుగా అమ్మలను గన్న ఆ  అమ్మని ఆరాధిస్తూ ఉండేవారు.
అసలు ఈ బంగారు కామాక్షి విగ్రహానికి ఓ చరిత్ర ఉంది. ఒకప్పుడు ఈ బంగారు కామాక్షి అమ్మవారి విగ్రహం కంచిలోని కామాక్షి అమ్మవారి గుడిలోనే ఉండేదట,కానీ ముస్లిం రాజుల దండయాత్రల కారణం గా ఆ రోజుల్లో చాలా ఆలయాలలో విగ్రహాలు నాశనం అవుతూ ఉండేవి.ఆ దండయాత్రనుండీ కాపాడటానికి అప్పటి కంచికామకోటి పీఠపరమాచార్యులైనటువంటి శ్రీ  చంద్రశేఖర  సరస్వతి స్వామి(1746-1783)ఈ  బంగారు కామాక్షి విగ్రహాన్ని ముందుగా ఉదయార్పాళ్యం అనే గ్రామానికి ఆ తరువాత తంజావూరునకు పంపించేశారు.
అది కూడా ఎలాగంటే ఆ విగ్రహానికి ఒక నల్లగుడ్డ చుట్టి,ముఖానికి పునుగుపిల్లి  ఊటని (అది నల్లరంగు లో ఉంటుంది) పూసి ఎవ్వరికీ తెలియకుండా ఓ పల్లకిలో  పంపించివేశారు. చూసేవారికి అమ్మవారు సోకిన పిల్లని పక్కఊరు తీసుకుపోతున్నామని చెప్పారట.ఈ విధంగా ఆ బంగారు కామాక్షి కంచి నుండీ తంజావూరు చేరగా దాని అర్చించి, సంరక్షించే  సౌభాగ్యం శ్యామశాస్త్రులవారి వంశీయులకు లభించింది.
ఒకనాడు ఈ ఆలయానికి సంగీత స్వామి అనే ప్రసిద్ధ భరతనాట్య సంగీత శాస్త్రవేత్త ,యతీంద్రులు యాత్రార్ధియై వచ్చినప్పుడు విశ్వనాథ శాస్త్రి ఆయనను భిక్షకి తన ఇంటికి ఆహ్వానించెను.ఆ సమయంలో సంగీతస్వామి శ్యామశాస్త్రిని  చూసి ఇతడు భవిష్యత్తులో గొప్ప వాగ్గేయకారుడు కాగలడు అని తండ్రితో చెప్పుటయేకాక అక్కడ ఆయన ఓ మూడు సంవత్సరాలు ఉండి తాను అచ్చట ఉన్న సమయములో"నాయనా శ్యామా! నీవు సంగీత శాస్త్రములో అపారమైన పాండిత్యము గడించితివి కనుక నీవు తంజావూరు ఆస్థాన విద్వాంసుడగు శ్రీ పచ్చిమిరియం ఆది అప్పయ్యార్ గారి పాట ను తరచు గా వింటూ ఉండు అని చెప్పి" అతను కాశీ కి వెళ్ళిపోయారు. శ్యామశాస్త్రి అదేవిధముగా ఆది అప్పయ్య గారి గానము అత్యంత శ్రద్ధగా వింటూ ఉండేవాడట.అలావింటున్నప్పుడు ఆది అప్పయ్య శ్యామశాస్తిని "కామాక్షీ" అని ఆప్యాయముగా పిలుస్తూ తన గానము వినిపించేవారట.
తండ్రి మరణానంతరము కామాక్షీ దేవిని అర్చన చేసే భాగ్యము,బాధ్యత కూడా శ్యామశాస్తిపై పడ్డాయి.దేవి అనుగ్రహము వలన అత్యంత భక్తి శ్రద్ధలతో,అమ్మవారిని అర్చిస్తూ ఆశువుగా ఎన్నో కీర్తనలను రచించి సాటిలేని గాయకుడిగా పాడి తరించెడి వాడు,ఈ కృతులను సాధారణం గా సామాన్యులు పాఠము చెయ్యలేనంత అతి క్లిష్టమైన రాగ తాళములలో ఉండేవి.వీరు ప్రతీ శుక్రవారము అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో సేవించుచున్నప్పుడు  వారినోటి నుండీ ఎన్నో అద్భుతమైన రచనలు వెలువడుచుండేవట.అవి సుమారు 300 పైగా ఉండి శ్యామకృష్ణ అను ముద్రకలిగి కదళీ పాకములో ఉన్నవి.ఈ రచనలోనుండు క్లిష్టతను బట్టి వాటిని పాఠము చేయు అర్హతగల కొందరి శిష్యులకు మాత్రమే నేర్పినారట.అందుకే 300 కృతులలో కొన్ని మాత్రమే ప్రచారంలో ఉండటానికి కారణం.సంగీత త్రిమూర్తులలో అందరికంటే పెద్దవారైనా వీరు అందరికంటే తక్కువ రచనలు చేసినప్పటికీ అవి ఎంతో భక్తి రసానుభూతి కలిగినవి.
ఇక శాస్త్రీయ  సంగీత ప్రక్రియలలో ఒకటైన స్వరజితి కి వీరి స్వరజితులు పర్యాయ పదాలు.తోడి,యదుకుల కాంభోజి,భైరవి రాగాలలో వీరు రచించిన స్వరజితులను రత్న త్రయం అంటారు.వీరి అన్నికృతులలో,వర్ణాలలో,స్వరజితులలో మాతా-శిశు  భావం ప్రస్పుటంగా కనిపిస్తుంది.
ఉదా:నీ సుతుడనమ్మా ..అభిమానములేదా..
వినుత జన పాప విమోచనీ ఓ జననీ ,
అఖిలలోక జననీ అనాధ రక్షకీ ,
ఇక వారి అన్ని రచనలలో శ్యామకృష్ణ ,శ్యామకృష్ణ సహోదరీ అని ముద్రలు కనిపిస్తాయి. వారిప్రసిద్ధకృతులలోకొన్ని "నన్నుబ్రోవులలితా(లలితరాగం)", అఖిలాండేస్వరి(కాపి), హిమాద్రిసుతే(కల్యాణి), నన్నుబ్రోవరాదా (గౌళిపంతు), ఓజగదంబా (ఆనందభైరవి) ,రావెహిమగిరికుమారి(తోడి).
వీరు త్యాగరాజ స్వామికి పరమ మితృలగుట చే తరచూ వారి దగ్గరకు  వెళ్ళడం,వారితో మాట్లాడం,వారిశిష్యులను త్యాగరాజ స్వామి వారి దగ్గరకు పంపి వారి రచనలు కూడా వినిపింపచేస్తూ ఉండేవారట.అలాగే వారి సమకాలీనులైన దీక్షితులవారి దగ్గరకు కూడా తన శిష్యులను పంపి తన కృతులను వినిపింపచేసినప్పుడు..వీరి రచనలకు దీక్షితులవారు ముగ్ధులై విని,తన ఆదరాభిమానాలను శిష్యుల ద్వారా శ్యామశాస్త్రుల వారికి తెలియ జెప్పే వారట.
వీరు బొబ్బిలి కేశవయ్యను,అప్పుకుట్టి అను తంజావూరు ఆస్థాన విద్వాంసుడను "నాగపట్టణము"లోని ఒక పోటీలో ఓడించినట్లుగా కూడా తెలియచున్నది.
శ్యామశాస్త్రి గారికి   నిగ్రహ అనుగ్రహ శక్తులు అనేకము కలవు అనుటకు ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి.పతివ్రతల వలె వీరి భార్య కూడా వీరి కంటే 5 రోజుల ముందు స్వర్గస్తురాలయ్యారు.ఆ సమయంలో  తనను పరామర్శించుటకు  ఇంటికి వచ్చిన బంధు మితృలతో ఇక తనకు అయిదు దినములు మాత్రమే గడువు కలదని చెప్పి అదేవిధముగా ఆరవనాడు అనగా క్రీ.శ.వ్1827 అనగా వ్యయ నామ సంవత్సర మకరమాస(అనగా సూర్యుడు మకర రాశిలో ఉన్న మాసం)శుద్ధ దశమి నాడు తన 64ఏట కామాక్షి అమ్మవారి పాదపద్మములను చేరారు.వీరి కుమారుడూ,ముఖ్య శిష్యుడూ అయిన శ్రీ సుబ్బరాయ శాస్త్రి కూడా తండ్రి వలె ఎంతో మంచి గాయకుడిగా వర్ధిల్లెను.ఇంకా వీరి శిష్యులలో ముఖ్యులు శ్రీ పెరంబూర్ కృష్ణయ్య,ఆలగూర్ కృష్ణయ్య మొదలగు వారు.
నిను విన దిక్కెవరమ్మా అంటూ తాను జీవించినంత కాలం ఆ కామాక్షీ అమ్మవారి పాదారవిందాలని పూజిస్తూ,ఆ జగదంబ సేవలో తరించి,చివరికి ఆమెలోనే ఐక్యం అయిన శ్రీ శ్యామశాస్త్రులవారి కీర్తి ఆచంద్ర తారార్కం వర్ధిల్లి పుడమి పై సుస్వరము వర్ధిల్లినన్నాళ్ళూ వారి కృతులు విద్వాంసులచే గానం చెయ్యబడతాయి.
***
శ్యామశాస్త్రి  గారి కృతులను  క్రింది వీడియోలలో వీక్షించండి...

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top