శ్రీ రామకర్ణామృతం - 6 - అచ్చంగా తెలుగు

శ్రీ రామకర్ణామృతం - 6

Share This

శ్రీ రామకర్ణామృతం - 6 

                                                                       డా.బల్లూరి ఉమాదేవి     

 51.శ్లో:భూకంపం జనయన్ నభో విదళయ న్నంభోనిధిం క్షోభయన్

దైతేయాంశ్చ విమర్దయన్ గిరివరాన్ భిందన్ దిశః పూరయన్
వైదేహీ మతిమోదయన్ సకల గీర్వాణాన్ శిరః కంపయన్
కల్యాణో రఘురామ హస్త విలసత్కోదండ చండధ్వనిః.
తెలుగు అనువాద పద్యము.
ఉ:రాముని చాపమౌర్వి శుభరావమునన్ తలలూపు దేవతా
స్తోమము దైత్యు లార్తిగని సోలుదు రబ్దులు మ్రోయు మైథిలీ
భామిని సంతసించు వడి బ్రద్దలగున్ వసుధా ధరంబులున్
భూమి చలించు సంబరము బూరటిలున్ దిశలెల్ల ఘూర్ణిలున్.
భావము:శుభప్రదమగు రామునిబాణముతో విలసిల్లు ధనస్సుయొక్క చప్పుడు భూకంపము పుట్టించును.ఆకాశమును బ్రద్దలు చేయుచు సముద్రమును కలిపివేయుచు రాక్షసులను  మర్దించుచు పర్వతవులనుబ్రప్దలు గొట్టుచు,దిక్కులను నిందించుచు,సీతను సంతోషింప చేయుచు,దేవతలను తలలూచునట్లు చేయుచు వ్యాపించెను.
52.శ్లో:విమల కమల నేత్రం విస్ఫురన్నీల గాత్రం
తపనకృల పవిత్రం దానవధ్వాంత మిత్రం
భువనశుభ చరిత్రం భూమిపుత్రీ కళత్రం
దశరథవరపుత్రం నౌమి రామాఖ్యమిత్రం.
తెలుగు అనువాద పద్యము.
చం:సరసిజపత్రనేత్రు సురశాత్రవజైత్రుఁబత్రిపత్రునిన్
ధరణిసుతాకళత్రు జనతానుతిపాత్రును రాజపుత్రు భా
సుర సుచరిత్రు నీలవణి శోభితగాత్రు మహేశమిత్రు భా
స్కరకులసత్పవిత్రు గుణసాంద్రు రఘూద్వహు నాశ్రయించెదన్.
భావము:స్వచ్ఛమైన పద్మములవంటి నేత్రములు గలిగినట్టియు,ప్రకాశించుచున్న నల్లని శరీరము గలిగినట్టియు,సూర్యవంశమందు పవిత్రుడైనట్టియు,రాక్షసులను చీకటికి సూర్యుడైనట్టియు,లోకములకు శుభకరమైన చరిత్ర కలిగినట్టియు దశరథుని కుమారుడైనట్టియు స్నేహితుడైనట్టియు రాముని నమస్కరించుచున్నాను.
53.శ్లో:జననీ జానకీ సాక్షాజ్జనకో రఘునందనః
లక్ష్మణో మిత్ర మస్మాకం కో విచారః కుతో భయం.
శ్లో:జనకో రామచంద్రో మే జననీ జనకాత్మజా,
హనుమత్ప్రముఖాః సర్వోహరయో మమ బాంధవాః.
తెలుగు అనువాద పద్యము.
చం:జనకుడు రామచంద్రుడగు జానకి తల్లి సుమిత్రసూతి మా
కనయముమిత్రుడంగద మహాబలపుత్ర విభీషణార్కనం
దనముఖు లాత్మబాంధవజనంబులు గాన విచారమున్,భయం
బును గలుషంబు దీనతయు బొందునె మావకమానసంబునన్
భావము:మాకుసీత తల్లి.రాముడుతండ్రిలక్ష్మణుడు స్నేహితుడు.హనుమదాది వానరులందరూ బంధువులయివుండగా నేమి విచారము?ఎందువలన భయము?
54.శ్లో:జగతి విశదమంత్రం జానకీ ప్రాణమంత్రం
విబుధ వినుత మంత్రం విశ్వవిఖ్యాత మంత్రం.
దశరుద మంత్రం దైత్యసంహార మంత్రం
రఘుపతి నిజమంత్రం రామరామేతి మంత్రం.
తెలుగు అనువాద పద్యము.
చ:సకల జగత్పవిత్రము నిశాచర జైత్రము ధారుణీసుతా
ధిక ప్రమదప్రదం బఖిల దిక్పరిపాలక పాలనంబు సే
వక జన కల్పకంబు భయవారణవారణ కేసరీసమం
బకలుష మద్వితీయ మఖిలార్తి విరామము రామమంత్రమున్.
భావము:రామ రామ యను మంత్రము ప్రపంచమున నతి నిర్మలమైన మంత్రముఈతకు ప్రాణప్రదమైనది,దేవతలచే స్తోత్రము చేయబడినది,ప్రపంచమున ప్రఖ్యాతమైనది,దశరథ తనయృని మంత్రము,శ్రీరాముని స్రకీయ మంత్రము,
రాక్షస సంహారమైన మంత్రము.
55.శ్లో:సీతాయా దక్షిణే పార్శ్వే లక్ష్మణస్య చ పార్శ్వతః
తన్మధ్యేరాఘవం వందే ధనుర్బాణధరంహరిమ్.
చంద్రోపమమం మలయ చందన చర్చితాంగ
మందారపుష్పపరిపూజిత పాదపద్మం
బ్రహ్మేంద్ర వంద్యమనిశం మునిబృంద సేవ్యం
వందే౾రవింద నయనం రఘురామచంద్రం.
తెలుగు అనువాద పద్యము.
చం:సరస విదేహరాజ తనుసంభవ లక్ష్మణ యుక్తు దేవతా
తరు సుమ పూజితాంఘ్రి నవతామరసద్వితయున్ సరస్వతీ
శ్వర సురవర్య మౌనిజన వందితుఁజందన చర్చితున్ లస
ద్గురు శరచాపధారుని రఘూద్వహు రాముని నెంతు నెంతయున్.
భావము:సీతాలక్ష్మణులమధ్యము నందు ధనుర్బాణములను ధరించిన విహష్ణురూపుడగు రామునకు నమస్కరించుచున్నాను.చంద్రునితో తుల్యుడైనట్టియు,మలయబర్వతమునందలి గంధముచే పూయబడిన దేహము కలిగినట్టియు,మందార పుష్పములచే పూజింపబడు పాదపద్మములు గలిగినట్టియు,బ్రహ్మ చేతను,ఇంద్రుని చేతను నమస్కరింప దగినట్టియు
ఎల్లప్పుడు మునిసమూహమునకు సేవింప దగినట్టియు,పద్మముల వంటి నేత్రములు కల్గిన రాముని నమస్కరించుచున్నాను.
56.శ్లో:ఇక్ష్వాకు నందనం సుగ్రీవ పూజితం
త్రైలోక్య రక్షకం సద్యసంధం సదా
రాఘవం రఘుపతిం రాజీవ లోచనం
రామచంద్రం భజే రాఘవేశం భజే.
తెలుగు అనువాద పద్యము.
మ:మనువంశాంబుధి పూర్ణచంద్రు రఘురామస్వామి ద్రైలోక్య పా
వను సుగ్రీవ సమర్చితాంఘ్రి కమలున్ లక్ష్మీధరున్ సత్యసం
ధుని గంజాయత నేత్రు వీరు రఘునాథున్ రాఘవున్ రామచం
ద్రుని భక్తాంగణ కల్పకంబు మది సంతోషంబునం గొల్చెదన్.
భావము:ఇక్ష్వాకు వంశమును సంతోషింప చేయునట్టియు,సుగ్రీవునిచే పూజింపబడునట్టియు,సత్యమైన ప్రతిజ్ఞ గలిగినట్టియు,రఘువంశపు రాజుల కధిపతి యైనట్టియు పద్మముల వంటి నేత్రములు గలట్టియు రామచంద్రుని సేవించుచున్నాను.
57.శ్లో:బ్రహ్మామృతానంద ఫలప్రదాయినం
వేదాంద విజ్ఞాన సుగంధ పుష్పితం
సీతాశుభాంగాంచుద బాహుశాఖినం
శ్రీరామ కల్పద్రుమ మాశ్రయామః.
తెలుగు అనువాద పద్యము.
మ:అల సీతాంగలసత్కరోరు విటపంబై భవ్య వేదాంత ని
ర్మల సుజ్ఞాన సుగంధ పుష్పయుతమై బ్రహ్మామృతానంద స
త్ఫలదంబై వరతత్త్వ విద్వరులకున్ భావింప బ్రాధాన్యమై
యలరున్ శ్రీరఘురామ కల్పకము నేనశ్రాతమున్ గొల్చెదన్.
భావము:అమృతము వంటి బ్రహ్మానందమనెడు పండు నిచ్చునట్టిదియు,వేదాంత జ్ఞానమనెడు మంచి పరిమళముగల పువ్వులు గలిగినట్టియు,సీతాదేవి యొక్క శుభమైన దేహమందొప్పుచున్న చేయి యనెడు కొమ్మ గలిగి నట్టియు,శ్రీరామమూర్తియను కల్పవృక్షమునాశ్రయించుచున్నాను.
58.శ్లో:కనక నికషభాసా సీతాయాలింగితాంగో
నవకువలయ దామ శ్యామ వర్ణాభి రామః
అభినవ యుత విద్యున్నందితో మేఘఖండః
శమయతు మమ తాపం సర్వదా రామచంద్రః.
తెలుగు అనువాద పద్యము.
చ:ఉరుతర తప్త భర్మ నికషోజ్జ్వల యైన ధరా తనూభవన్
సరసత గూడి నీలమణిజాల విరాజితుడై తటిల్లతా
స్ఫురితసితా భ్రమో యనగ బొల్పు వహించిన రాఘవుండు మ
ద్దురిత సముద్భవం బయిన దుస్తర తాపము బాపి ప్రోవుతన్.
భావము:బంగారపు ఒరపు గీటువంటి కాంతిగల సీతచే కౌగిలింపబడిన దేహము గలిగినట్టియు,నల్లకలువ దండవలె చామనచాయచే మనోహరుడైనట్టియు,క్రొత్త మెరుపుతో కూడిన మేఘము ముక్క యైనట్టియు రాముడు నా సంసారబాధనెల్లప్పుడు శాంతి చేయుగాక.
59:శ్లో:అలం శాస్త్రాభ్యసైరల మసకృదామ్నాయ పఠనై
రలం తీర్థస్నానై రలమఖిల యాగవ్రతజపైః
ఆలం యోగాభ్యాసైరలమపి మహాపాతకభియా
యదస్మాకం రామస్మరణ మహిమా సో విజయతే.
తెలుగు అనువాద పద్యము.
ఉ:చాలును శాస్త్రపాఠములు చాలును వేదము లభ్యసించుటల్
చాలు జపంబులుం దపము చాలు వ్రతంబులు తీర్థయాత్రలున్
జాలు సదోపవాసములు సత్క్రతువుల్ ఘనయోగ నిష్ఠలున్
జాలగ భీతు మాన్ప రఘుసత్తమ సంస్మరణంబు గల్గుటన్.
భావము:ఏహేతువు వలన మాకు రామస్మరణ మహాత్మ్యము కలదో,ఆహేతువు వలన శాస్త్ర పఠనమెందులకు,వేదములేల ,గంగాది తీర్థస్నానములేల..యజ్ఞములు..వ్రతములు యేల,యాగములేల,గొప్పపాపములవలన భయమేల స్వామీ.
60.శ్లో:సీతా మనోజ మానస రాజహంస సంసార సంతాపహర క్షమావన్
శ్రీరామ దైత్యాంతక శాంత రూప శ్రీ తారక బ్రహ్మ నమో నమస్తే.
తెలుగు అనువాద పద్యము.
మ:కమనీయావనిజాతమానసమనఃకాసారహంసున్ హిత
క్షము దైత్యాంతకు శాంతరూపుని బృహత్సంసార సంతాప ఘో
రమహాంభోనిధి తారణున్ రఘువరృన్ రాజీవ పత్రేక్షణున్
విమలున్ దారకబ్రహ్మమున్ దలచి సేవింతున్ గృపాకాంక్షినై.
భావము:సీతాదేవి మనస్సనెడి సరస్సుకు రాజహంసవైన ఓ రామా సంసారభాధను మాన్పువాడా,శాంతమూర్తీ,దైత్యాంతకా,తారకబ్రహ్మవైన రామా నీకు నమస్కారము.

  సశేషము.                

No comments:

Post a Comment

Pages