సీతమ్మ మాయమ్మ - అచ్చంగా తెలుగు

సీతమ్మ మాయమ్మ

Share This

సీతమ్మ మాయమ్మ

 అక్కిరాజు శ్రీహరి


( మనమే దేవుళ్ళం అంటుంది వేదాంతం. దేవుడే మానవుడిగా ఈ లోకంలో నడయాడితే ఎలా వుంటుందన్నది ఆది కవి వాల్మీకి హృదయం. అది త్రేతాయుగం. జంబూద్వీపం, భరతవర్షం,భరతఖండం, మిథిలానగరం.... )
శ్రీ సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. జనకుని జన్మ ధన్యమైంది. సీతా రాములు అగ్నిసాక్షిగా దంపతులయారు.  మిథిలానగరం పండగ చేసుకొంది. దాశరథులు భార్యలతో అయోధ్య చేరారు. అది సీత, రాముడు ఏకాంతంగా వున్న సమయం.  '  నేను మిమ్మల్ని ఒకటి అడగాలి. మీ బుద్ధి, బలపరాక్రమాలు  ప్రజల ఆలనా పాలనా చూడటానికి అంకితమైపోతాయి.  ఆ మనసు మాత్రం నా కివ్వండి. చాలు’ అంది సీత.  'గడసరివే, సరే, మరి నీ మనసూ నాకివ్వాలి సుమా ', అన్నాడు సుగుణాభి రాముడు. మనసులు ఇచ్చిపుచ్చుకున్న సీతారాముల ఆదర్శ దాంపత్యానికి  అదే  నాంది.                        సంతోషంగా జీవితం గడుస్తోంది. పండ్రెండేళ్ళు గడిచాయి. దశరథుడు రాముని పట్టాభిషిక్తుణ్ణి  చేయటానికి నిశ్చయించాడు. పట్టాభిషేకానికి తయారవుతుండగా దశరథుని నుంచి పిలుపు వచ్చింది రాముడికి. అంతఃపురానికి వెళ్ళివచ్చిన రాముడు సీతతో వివరించి చెప్పాడు తండ్రిగారి మాట,తల్లి కైకేయి ఆజ్ఞ ఐన పదునాలుగేండ్ల వనవాసం గురించి. ఆశ్చర్య పోయిన సీత తేరుకొని చెప్పింది  'నేనూ  మీ వెంట అరణ్యానికి వస్తున్నాను ' అని.   రాముడు నచ్చచెప్పటానికి ప్రయత్నించాడు.కఠినమైన ఆ జీవితానికి  మృదువైన ఆమె శరీరం  తాళలేదని వారించాడు. అయినా సీత వినలేదు.ఎటువంటి కష్టాలనైనా తట్టుకోగల ధైర్యం వుందని, రామునితోపాటే తన మనుగడ అని వాదించి ఒప్పించింది. సీతారామ లక్ష్మణులు అయోధ్య  విడిచి కోసలదేశం దాటి, చిత్రకూటంలో కొన్నాళ్ళు గడిపి దండకారణ్యం చేరి పంచవటిలో నివసిస్తున్నారు.  రకరకాల చెట్లతో రంగురంగుల పూలతో సడి చేస్తూ పారే సెలయేళ్ళతో మనోహరంగా వున్న ప్రకృతిని చూస్తూ మురిసిపోయింది సీత. అలాంటి అరణ్యంలో  ఒకరోజు వెండిచుక్కలతో బంగారపు వన్నెదేహంతో మెరిసిపోతున్న ఒక జింక కనబడింది సీతకు. చెంగు చెంగున గంతులేస్తున్న ఆ లేడిని పట్టుకొని అయోధ్యకు తీసుకొనివెళ్ళాలన్న కోరిక కలిగి రాముణ్ణి అడిగింది. లక్ష్మణుడు వారిస్తున్నా వినక రాముడు ఆ జింక వెనక పరుగెత్తాడు  బాణం గురిపెట్టి. లక్ష్మణుడు, సీత పర్ణశాలలో రామునికోసం ఎదురుచూస్తూ వున్నారు. ఇంతలో 'హా సీతా! హా లక్ష్మణా !’ అన్న రాముని కేకతో అరణ్యం దద్దరిల్లింది. ఇది విన్న వెంటనే సీత రామునికి ఏదో ఆపద వచ్చిందని   లక్ష్మణుని వెళ్ళమంది.   రాముని వంటి పరాక్రమశాలికి ఏ ఆపదా రాదు భయపడవద్దన్నాడు లక్ష్మణుడు.  సీత వినిపించుకోలేదు. మరిది నియతిని శంకిస్తూ అనరాని మాటలు అనేసరికి లక్ష్మణుడు బాధతో ' అమ్మా!, అన్నగారి మాట దాటి నేను వెళుతున్నాను, జాగ్రత్తగా వుండండి ' అని చెప్పి రాముని కోసం వెళ్ళాడు. ఆ అడవిలో ఒంటరిగా మిగిలింది సీత. క్షణం క్రితం అలరించిన ప్రకృతే ఇప్పుడు భయపెడుతోంది. ఆకుల చప్పుడూ అలజడి చేస్తోంది. అప్పుడు వచ్చాడు ఓ మునివేషధారి భిక్షకోసం.  మగవారు లేరు, అతిధిసత్కారానికై మళ్ళీ రమ్మన్నా వినని ఆ మునికి భిక్ష ఇవ్వడం కోసం బయటకు వచ్చిన సీతకు అతని అసలు రూపం తెలియవచ్చింది. తన భయంకర రాక్షస రూపం చూపిస్తూ, తాను లంక నేత రావణుణ్ణని ఆమెకోసమే వచ్చానని చెప్పి సీత జుట్టు పట్టి లాగి, ఒడిసిపట్టి తన రథంలోకి ఎక్కించి లంకకు తీసుకుపోయాడు. అశోకవనంలో శింశుప  వృక్షం కింద మాసిన చీరలో వడలిన వదనంతో కూర్చొనివుంది జానకి.చుట్టూ కాపలాగా వికృత ఆకారాలతో వున్నారు రాక్షస వనితలు. తెల్లవారకుండానే  బాగా అలంకరించుకొని వచ్చాడు రావణుడు. ' నీకు మళ్ళీ చెబుతున్నాను, నా మాట విని నాకై రా, నిన్ను కాపాడే వారెవరూ లేరు, రారు.' అంటూ చెప్పబోయాడు. సీత మాత్రం ఓ గడ్డిపరక అడ్డుపెట్టి చెప్పింది, ' నా భర్త లేనపుడు వచ్చి నన్ను తీసుకువచ్చిన పిరికివాడివి. నీ బెదిరింపులకి బెదిరే బేలనుకాను.అడుగు ముందుకు వేశావా మట్టిలో కలిసిపోతావు, దుర్మార్గుడా ' అంటూ తల పక్కకు తిప్పి కూర్చుంది. రావణుడు విసుగ్గా తిరిగిపోయాడు. చెట్టు కొమ్మపై  ఆకులచాటున కూర్చుండి ఇదంతా చూసిన ఆ కోతి అప్పుడు దిగివచ్చి సీతను చూసి సంబరపడిపోయి తనను పరిచయం చేసుకొంది.' అమ్మా,నేను రామదూతను, హనుమానుడంటారు నన్ను. వానర రాజు సుగ్రీవుని బంటుని. రామలక్ష్మణులు నిన్ను వెతుక్కొంటూ కిష్కింధకు వచ్చారు.సుగ్రీవునితో స్నేహం చేసి, ధర్మం తప్పిన ఆయన అన్న వాలిని చంపి, రాజ్యాన్ని ఇప్పించారు. సుగ్రీవుడు నీ జాడ తెలియటం కోసం  వానరులను అంతటా పంపించాడు. అలా నేను ఇక్కడకు వచ్చి నిన్ను చూసాను. ఇక రాముడు రావటమే ఆలస్యం '    సీతకు ప్రాణం లేచి వచ్చినట్లయింది. హనుమంతునితో కబుర్లు చెప్పింది. రాముని గురించి మళ్ళీ మళ్ళీ అడిగి తెలుసుకొంది.  సీతకు ధైర్యం చెప్పి ఆనవాలుగా ఆమె చూడామణి తీసుకొని తిరుగు ప్రయాణమయాడు ఆంజనేయుడు. మళ్ళీ చిగురించిన లతలా వుంది సీత ఆ వనంలో. రాముని ధ్యానంలో వున్న ఆమెకు రాక్షస స్త్రీలు  పరుగుపరుగున వచ్చి చెప్పారు, 'ఇంతకుమునుపు నీతో మాటలాడి వెళ్ళిన కోతి వనాన్ని ధ్వంసం చేయటమేగాక, రావణుని ఒక కొడుకుని చంపింది, దర్బారులో నానాకూతలూ కూసింది. కోపగించిన రావణుడు ఆ కోతి తోకకు నిప్పెట్టాడు '. ఇది విన్న సీత అగ్నిని ప్రార్ధించింది హనుమంతుని చల్లగా చూడమని. కొద్దిసేపటికి మారుతియే అక్కడకు వచ్చి ' అమ్మా జానకీమాతా, మీకేమీ అవలేదుకదా, ఏదో కోతిచేష్ట , రాముని శక్తి చూపించాలని, ఈ లంకను కాల్చాను. ఇక నాకు సెలవు ' అంటూ తిరిగి వెళ్ళిపోయాడు. అటుతర్వాత సీత ప్రతి ఘడియ లెక్కపెడుతోంది.ఆత్రుతతో రాముని రాకకై ఎదురుచూడసాగింది. విభీషణుని  కూతురు  త్రిజట  వివరించింది , శ్రీరామ లక్ష్మణులు వానర సైన్యంతో సహా సముద్రందాటి లంక ఒడ్డున వున్నారని, విభీషణుడు అన్నగారికి చెప్పినా వినకపోయేసరికి రాముని శరణు కోరాడని, ఇక యుద్ధం మొదలవబోతోందని.  ఆపై ప్రతి దినమూ వింటున్న వార్తలకి సీత వదనంలో ఆనందం విరిసింది. రావణుడి తమ్ములు,కొడుకులు, బంధువులతో సహా అంతా చావగా చివరికి జరిగిన రామ రావణ యుద్ధంలో రావణుడు చంపబడ్డాడు. ఆ మరునాడు విభీషణుడు వచ్చి  సీతకు అంతా వివరించి చెప్పి 'శ్రీరాముడు నిన్ను సకలలాంఛనాలతో తోడ్కొని రమ్మన్నాడు ' అన్నాడు. అప్పుడు చక్కగా స్నానం చేసి అలంకరించుకొన్న సీత  చంద్రకిరణం తాకి అప్పుడే విరిసిన కలువ పూవులా వుంది. రాముని చూడాలని, ఆయన మాటలు వినాలని తహతహలాడుతున్న మనసుతో బయలుదేరింది. సముద్రపు ఒడ్డున అందరూ సీతకోసం ఎదురుచూస్తున్నారు. వానర మూక ఎగిరి ఎగిరి చూడటానికి ముందుకొస్తున్నారు. ఆమె కోసమే కదా వారంతా కిష్కింధ  నుండి వచ్చి ఘోర యుద్ధం చేసింది మరి. సీత రామునికి ఒకింత దగ్గరగా వచ్చి ఆయన వైపు చూసింది. రాముడు తల ఎత్తలేదు. ఆమెవైపు చూడలేదు.  మెల్లగా అన్నాడు,'నిన్ను తెచ్చినందుకు ఆ రావణుని చంపాను. ఇంతకాలం ఒక కామోద్రేకి నివాసంలో వున్నావు. ఇక నీవు నీ ఇష్టమైన  చోటుకి వెళ్ళవచ్చు.' ఎవరూ తలంచని ఈ మాటలు నమ్మలేనివారై అందరూ మాటలురాక నిలుచుండిపోయారు. సీతలో కదలిక వచ్చింది. లక్ష్మణుని చూస్తూ అంది, ' లక్ష్మణా, ఆ రోజు నిన్ను లేని కోరిక అంటగట్టి నిందించినందులకు ఈ రోజు నాపై ఈ నింద. జరిగిన దానిలో నా తప్పేమీ లేదే? లంకలో వున్నా నేను నిప్పులా వున్నానయ్యా. ఓ రామా!  సామాన్య మానవుడిలా వుంది నీ ఆలోచన. అవును మరి ప్రజలను పాలించబోతున్నావు కదా! వారి అనుమానాలు తీర్చాలేమో! నా పవిత్రత నాకు తెలుసు, నీ మనసుకు తెల్సు. భూమినుంచి వచ్చినదాన్ని అగ్ని ప్రవేశం నాకో ప్రశ్న కాదు .అది నా మనసుకున్న శక్తి. లక్ష్మణా, చితిని పేర్చు’ అంది సీత. కళ్ళనిండా నీళ్ళతో అన్నగారి వైపు ఒకసారి చూసి లక్ష్మణుడు చితిపేర్చటము, సీత అగ్నిలోకి నడవటము వెంట వెంటనే జరిగిపోయాయి. సీత అడుగుపడగానే అగ్ని చల్లారిపోయింది. నిశ్చేష్టులై  చూస్తున్న వారంతా ఒక్కసారిగా జయజయధ్వానాలు చేసారు. సీతారాములు మళ్ళీ ఒకటయ్యారు. అయోధ్యలో అందరి సమక్షంలో శ్రీరామచంద్రుని పట్టాభిషేకం అతి వైభవంగా జరిగింది. ఒక మాట…. తండ్రి మాట విని ముని వెంట యాగరక్షణకు వెళ్ళటం, శక్తితో విల్లు విరిచి సీతను పెళ్ళాడటం, తల్లి ఆజ్ఞమేర అడవులకు వెళ్ళటం,సీత కోరిందని బంగరు జింక వెంటపడటం,సీత కనపడకపోతే ఏడవటం,స్నేహితుల సాయంతో రావణున్ని చంపటం, ప్రజలు ఏమైన అనుకుంటారని సీతను శంకించటం ఓ మానవుడు చేసే,చేయగలిగే పనులు. అయితే రాజభవనంలో పెరిగినా అరణ్యంలో బతకగల శక్తి వుండటం, ఓ కామోద్రేకి చెరలో ధైర్యంతో గడపగలగటం, భర్తే తన శీలం శంకిస్తే తట్టుకొని నిలబడగలగటం, దైవత్వం వున్న సీత మాత్రమే చేయగలిగింది. మానవుడిగా మిగిలిపోకు, నీలోని దైవత్వాన్ని గుర్తించమంటోంది ఈ సీత. ఈ ధీ శక్తి, మనోస్థైర్యం వున్న సీతమ్మలు ఎందరో ఆనాడూ, ఈనాడూ. ఈ అమ్మలందరికీ  వందనాలు.
(సీతారాములను రమ్యమైన రీతిలో చూపించిన ' బాపు రమణ ' లకే ఈ  కథ అంకితం ! )

No comments:

Post a Comment

Pages