స్కానింగ్ బేబి

*************

- మోపిదేవి భాస్కరరావు .

 అమ్మా! దణ్ణం పెడతా

ఒక్కింత ఓపిక పట్టమ్మా 
రవ్వంత ఊపిరి పోయమ్మా 
ఈ పుణ్య భూమిలో నన్నూ పుట్టనీ యమ్మా !

అమ్మా !
నాకో రూపం రాక ముందే 
నేనే పాపం చేయకముందే 
భద్రంగా చూడాల్సిన నీవే 
చిద్రం చేసేస్తావా ?
నన్ను చిదిమేస్తావా ?

అమ్మా !
ఆడపిల్లంటే నీకు ఇంత అసహ్యమా..
ఆదిలోనె తునమడం అంత అవశ్యమా ..
తల్లీ ! నీ తల్లీ నీ లాగే ఆలోచిస్తే 
పాపం అనుకోక ఈ పాపం తానూ చేసేస్తే 
ఏదమ్మా స్త్రీ జాతికి ఉనికి ?
ఎలాగమ్మా మరో సృష్టి ఈ అవనికి ?

అమ్మా !
నీ అందం అణగారి పోతుంద నుకుంటే 
ఆవు పాలతోనే నన్ను పెంచమ్మా...
నా ఆకారం వికారమనిపిస్తే 
ఏ ఆశ్రమం ముందో దించమ్మా

అమ్మా !
గోరుముద్దలు తినిపించమని మారాం చేయను 
ఆడుకోవడానికి బొమ్మలు కావాలని 
అల్లరి చేయను .
అవికొనమని ,ఇవికొనమని 
అసలే అడగను 
కథ చెప్పనిదే నిద్ర పోనని 
నిన్ను వేదించ ను

అమ్మా !
వెన్నెల్లో చల్లదనం ఎందుకు ఉందని 
పూవుల్లొ తేనెను ఎవరు పోస్తున్నారని 
సముద్రంలో ఉప్పు ఎవరు కలిపారని 
నీళ్ళల్లో నిప్పు ఎవరు దాచారని 
అదేంటని ఇదేంట ని   నిన్ను విసిగించను

అమ్మా!
ముక్కూ చెవులు కుట్టించ వద్దమ్మా 
నగా నట్రా చేయించ వద్దమ్మా 
ఏ పండక్కీ కొత్త బట్టలు కొనొద్దమ్మా 
అప్పుడు కూడా ఏ హడావిడీ చేయోద్దమ్మా

అమ్మా !
పెళ్లి పేరుతో ఇల్లు గుల్ల చేయను 
కట్నం ఇచ్చి తాళి కట్టించుకోను 
నువు ఆశపడే అబ్బాయికి ఎందులోనూ తీసిపోను 
ఏ విధంగాను బరువు కాను. 
ఏ నాడు  మీ పరువు తీయను.

అమ్మా !
ఒక్కసారైనా నిన్ను 
అమ్మా అని పిలవాలని ఉందమ్మా 
అరుణోదయం లోని అందాన్ని 
ఒక్కసారైనా చూడాలని ఉందమ్మా ..

లోకం చూడని నన్ను 
ఇంకా లోకువగానే చూడ దలిస్తే ..
వేకువ చూడ నిచ్చి 
పాలల్లో ఇంత విషం కలిపి పట్టించే యమ్మా .

అమ్మా !
చిన్ని కోరిక తీర్చిన నిన్ను 
ఏనాడూ ద్వేషించను .
పాపా.... అపుడే వచ్చేశావెం ? అన్న 
పరమాత్మతో నీ గురించి భాషించను .

***

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top