ప్రేమతో నీ ఋషి – 14

యనమండ్ర శ్రీనివాస్


(జరిగిన కధ : కొన్ని శతాబ్దాల క్రితం... ఇంద్రుడి ఆజ్ఞమేరకు ,మేనక తన రూపలావణ్యాలతో విశ్వామిత్రుడిని సమ్మోహనపరచి, అతని తపస్సును భగ్నం చేస్తుంది. కొన్ని దశాబ్దాల క్రితం... మైసూరు మహారాజు సంస్థానంలో గొప్ప భారతీయ చిత్రకారుడిగా పేరుపొందిన ప్రద్యుమ్న ‘ప్రపంచ కొలంబియన్ ప్రదర్శన’ కోసం, రాకుమారి సుచిత్రాదేవినే తన చిత్రానికి నమూనాగా వాడుతూ, మేనక విశ్వామిత్రుడికి తపోభంగం చేసే సన్నివేశాన్ని అత్యద్భుతంగా చిత్రిస్తూ, ఈ క్రమంలో రాకుమారితో ప్రేమలో పడి గుప్తంగా రాజ్యం వదిలి పారిపోతాడు. రాజు పారెయ్యమన్న ఆ చిత్రం అనేకమంది చేతులు మారి, చివరగా  దాన్ని బ్రిటన్ తీసుకువెళ్ళాలన్న కోరికతో కొన్న ఒక విదేశీయుడి  వద్దకు చేరుతుంది. ఆ తర్వాత అది ఏమైందో ఎవరికీ తెలీదు. 
ప్రస్తుతం... ముంబై స్టాక్ ఎక్స్చేంజి లో పనిచేస్తున్న త్రివేది గారు, ఉదయాన్నే ఫాక్ష్ లో వచ్చిన సందేశం చూసి, అవాక్కవుతారు... కారణం తెలియాలంటే, కొంత గతం తెల్సుకోవాలి....  కొన్ని నెలల ముందు మాంచెస్టర్ లో  గొప్ప వ్యాపార దిగ్గజమైన మహేంద్ర, చేపట్టిన ‘ప్రద్యుమ్న ఆర్ట్ గేలరీ’ ప్రాజెక్ట్ కోసం చిత్రాలు సేకరించేందుకు అతని మాంచెస్టర్ ఆఫీస్ లో పనిచేస్తుంటారు స్నిగ్ధ, అప్సర. ఈ క్రమంలో స్నిగ్ధకు స్విస్ బ్యాంకు మాంచెస్టర్ ఆఫీస్ లో సీనియర్ క్లైంట్ బ్యాంకర్ గా పనిచేస్తున్న ఋషి తో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారుతుంది. ఋషిని  అప్సర సామీప్యంలో చూసిన స్నిగ్ధ మనసు క్షోభిస్తుంది. స్నిగ్ధ తో కలిసి ముంబై వెళ్తుండగా, జరిగినదానికి సంజాయిషీ ఇవ్వబోయిన ఋషిని పట్టించుకోదు  స్నిగ్ధ.  అతను మౌనం వహించి, కళ్ళుమూసుకుని, గత జ్ఞాపకాలు నెమరేసుకుంటూ ఉంటాడు...  ఆర్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్’ కోసం పనిచేసేందుకు మాంచెస్టర్ వచ్చి, ముందుగా ఆర్ట్ గురించిన అవగాహన కోసం ప్రయత్నిస్తున్న ఋషి, ఫేస్బుక్ లో స్నిగ్ధ ప్రొఫైల్ చూసి, అచ్చెరువొందుతాడు. స్నిగ్ధకు మహేంద్ర కంపెనీ లో ఉద్యోగం వస్తుంది. ఈలోగా ఋషి మాంచెస్టర్ ఆర్ట్ గేలరీ దర్శించేందుకు వచ్చి, స్నిగ్ధను కలిసి, ఆమెనుంచి ఆర్ట్ కు సంబంధించిన ఎన్నో విషయాలు తెలుసుకుంటాడు. ఫేస్ బుక్ లో ఋషి, స్నిగ్ధ చాటింగ్ ద్వారా వారిద్దరూ మరింత చేరువ అవుతారు. కొత్తగా చేరిన ఉద్యోగంలో మృణాళ్, అప్సరల ప్రవర్తన స్నిగ్ధకు ఆశ్చర్యం కలిగిస్తుంది, అదే ఋషితో చెప్తుంది. మహేంద్రను కలిసిన ఋషి, అతని వ్యాపార ప్రతిపాదనకు అంగీకరించి, స్నిగ్దను, అప్సరను ఆఫీస్ లో కలుస్తాడు. అప్సర, ఋషి మధ్య చనువు స్నిగ్ధకు ఆందోళన కలిగిస్తుంది. మహేంద్ర కంపెనీ నష్టాల్లో ఉందని, మీడియా వాళ్లకు తెలుస్తుంది. ఇక చదవండి...)
తాజాగా నిర్వాణ ప్లస్, కొన్ని క్లైంట్ స్థానాల్లో ఇంటలెక్చుయల్ ప్రాపర్టీ నియమాలను ఉల్లంఘించినట్లు మీడియాలో వార్త వచ్చింది. కంపెనీ ప్రస్తుతం ఈ క్లైంట్స్ తో చర్చలు జరిపి, కోర్ట్ బయటే వీరితో రాజీ కుదుర్చుకునే ప్రయత్నం చేస్తోంది.
“హుమ్ ... అలాంటిది ఏమీ లేదు. నేను వ్యక్తిగతంగా పరిష్కరించాల్సిన కొన్ని కోర్ట్ కేసులు ఉన్నాయి. మీకు తెలుసు కదా, ఒకసారి మీరు ఎదిగారంటే, మీ చుట్టూ, మిమ్మల్ని క్రిందికి దించే ప్రయత్నాలు జరుగుతాయి. ఇది ఏ కంపెనీకయినా, మామూలే. మేము కొందరు క్లైంట్స్ తో కొన్ని సమస్యల్ని ఎదుర్కుంటున్నాము. మా కౌన్సిల్స్ వారి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా, ఇటువంటి విషయాల్లో రాజకీయ పరపతి ప్రముఖ పాత్ర వహిస్తుంది కదా !” ఇలా అంటూ ఆయన వెంటనే తన మొబైల్ ను సైలెంట్ మోడ్ లో పెట్టి, ఋషితో మాట్లాడసాగాడు.
“ఋషి, వృత్తిపరమైన అంశాలు వదిలేద్దాం, వాటిని ఎలాగైనా మేనేజ్ చెయ్యవచ్చు. నీ గురించి నాకు చెప్పు. స్విస్ బ్యాంకింగ్ లాస్ గురించి, ప్రపంచ మార్కెట్లో ఏమి సమాచారం అందుతోంది? ఇకపై స్విస్ బ్యాంకులు తమ ఖాతాదారుల వివరాలను గోప్యంగా అంటున్నారు? నిజమేనా? మహేంద్ర ఋషిని ప్రశ్నించాడు.
“పూర్తిగా ఇది నిజం కాదు. మీకు తెలుసు కదా, సంప్రదాయబద్ధంగా స్విస్ బ్యాంకులు తమ క్లైంట్లకు ప్రైవసీని ఇవ్వడంలో నైపుణ్యాన్ని కలిగి ఉన్నాయి. కాని, ఈ మధ్యన దీన్ని అడ్డం పెట్టుకుని, వివిధ దేశాల్లోని వారు పన్ను ఎగ్గొడుతున్నారని వివాదాలు చెలరేగుతున్నాయి.”
“US స్విస్ బ్యాంకు విధానాలకు వ్యతిరేకంగా ఉందని విన్నాను,” మహేంద్ర ఆ వార్తను బాగా అనుసరిస్తున్నట్లు అనిపించింది. మహేంద్రకు కూడా ఏదో ఒక స్విస్ బ్యాంకు లో ఖాతా ఉండే ఉంటుందని ఋషికి అనిపించింది. కాని, అతను బయటపడలేదు.
“అవును, ఒక్క US లోనే కాదు, అన్ని దేశాలు స్విస్ బ్యాంకుల వల్ల తమకు కలిగే ఇబ్బందుల్ని వినిపిస్తున్నాయి. ఇప్పుడు, వీటిని పరిష్కరించేందుకు స్విస్ ప్రభుత్వం తాజాగా పన్ను ఎగవేత, పన్ను మోసాల అభ్యర్ధనల విషయంలో, విదేశీ ప్రభుత్వాలకు తాము సాయం చేస్తామని ప్రకటించింది. అంతర్జాతీయంగా బ్యాంకు వారికున్న కట్టుబాట్లను అంతా గౌరవించే ముందుగానే, బ్యాంకులు తమ క్లైంట్ లను రక్షించే విషయంపై దృష్టి పెడుతున్నాయి.” ఋషి ప్రస్తుత స్థితిని మహేంద్రకు వివరించాడు.
“మీడియాలో ఈ వార్త వ్యాపించాకా, చాలా దేశాల ప్రభుత్వాలు, భారత ప్రభుత్వంతో సహా, క్లైంట్ వివరాలు తెలుపమని మాకు లేఖలు రాసాయి.”ఋషి మాటల్లో చెప్పేసాడు, కానీ చెప్పి ఉండాల్సింది కాదని, తర్వాత భావించాడు.
మహేంద్ర ఇది విని ఆలోచనలో పడిపోయినట్లు అనిపించింది. ఈ విషయం గురించి మహేంద్రతో ఎంత చర్చిస్తే, బ్యాంకు అంతర్గత విషయాలు తను మహేంద్రకు తెలియజేసే ప్రమాదం అంత ఎక్కువగా ఉంటుంది. ఒక ప్రొఫెషనల్ బ్యాంకర్ గా అలా జరగడం అతనికి ఇష్టం లేదు. మహేంద్రను నిరాశ పరచడమూ అతనికి ఇష్టం లేదు.
స్నిగ్ధ వారికి అడ్డం వస్తూ, “సర్, ఋషి మనం ఇక్కడ కాస్త తేలికపాటి విషయాలు మాట్లాడుకుందామా? లేకపోతే ఈ డైనింగ్ రూమ్ ఏదో బోర్డు రూమ్ లాగా, అంతకంటే అధ్వానంగా ఓ కోర్ట్ గదిలా అనిపిస్తుంది. అప్పుడు నాకు నా పుట్టినరోజు గా కంటే, ఈ రోజు ఒక జడ్జిమెంట్ రోజులా అనిపిస్తుంది.” సన్నగా నవ్వుతూ అంది స్నిగ్ధ.
“అలాగే, సారీ స్నిగ్ధ. మీరు మాట్లాడండి, నేను వింటాను. ఈ మధ్య నేను పనులతో ఎంత బిజీగా ఉన్నానంటే, ఆఫీస్ వర్క్ గురించి తప్ప, నేను ఇతర విషయాలు మాట్లాడట్లేదు,” డిన్నర్ తింటూ అన్నాడు మహేంద్ర.
“మాట్లాడడం అంటే, ఋషి పనే, అతను మాట్లాడుతూ ఉంటే, నేను వింటూ ఉండిపోతాను. వాతావరణాన్ని తేలిక పరచాలంటే, మనం అతని ఎన్సైక్లోపీడియా మోడ్ ను స్విచ్ ఆన్ చెయ్యాలి, అంతే. అప్పుడు అద్భుతాలు వెలికి వస్తాయి.” ఋషికి ప్రాణస్నేహితురాలిగా ఉన్నందుకు స్నిగ్ధ గర్వపు ఛాయలు తొనికిసలాడుతుండగా, అంది.
“నేనూ ఏకీభవిస్తున్నాను. ఋషి అసాధ్యుడు. అతను పంచుకునే అంశాలు నిజంగా ఊహించలేనివి,” అంది అప్సర కూడా ఋషిని పొగుడుతూ.
వెంటనే ఒక అభద్రతా భావం స్నిగ్ధ మనసులో ప్రవేశించింది. గత కొన్నాళ్ళుగా ఋషి మీద అప్సరకు కన్ను పడిందన్న సంకేతాలను ఆమె సిక్స్త్ సెన్స్ మరోసారి అందించింది.
ఋషి ఆ పొగడ్తలన్నింటినీ ఆనందంగా స్వీకరించాడు. మహేంద్ర ఆసక్తికరంగా ఋషిని చూస్తూ, “అలాగా ఋషి? అయితే, నేనూ ఈ జ్ఞాన రత్నాల్ని నా స్వంత ప్రయోజనానికి వాడుకోకూడదు?” కన్నుగీటుతూ అన్నాడు మహేంద్ర.
“ తప్పకుండా సర్, ఇవి ముత్యాలో కాదో నేను చెప్పలేను. కాని, నేను కొన్ని విషయాల్ని సేకరిస్తూ ఉంటాను. వాటినే నేను ఎప్పటికప్పుడు తాజాగా అందిస్తూ ఉంటాను,” ఋషి ఒక ఆసక్తికరమైన అంశాన్ని చర్చకు తీసుకుని వచ్చాడు.
స్నిగ్ధ వెంటనే జోక్యం కల్పించుకుని, “ ఋషికి బాగా నచ్చిన అంశం ‘పెద్దలకు మాత్రమే !’ అని నేను చెప్పడం మర్చిపోయాను. పిల్లలు ఇందుకు దూరంగా ఉండాలి.” అంది. అప్సర వెంటనే,” స్నిగ్ధ, అయితే నువ్వు ఋషి జోక్ లు వినేంత ఎదగలేదు కదూ,” అంది, అప్సరకు అన్ని విషయాల్లో అనుభవం ఉండడం వల్ల ఆమె ఇప్పుడు స్నిగ్ధ కంటే కాస్త ముందు ఉంది.
ఋషి వెంటనే అప్సర చేసిన పొరబాటును సవరించేందుకు జోక్యం కల్పించుకుంటూ, “నేను ఈ విషయంలో మీతో ఏకీభవించను. ఈ రోజుల్లో పిల్లలకు తెలియనిది ఏదీ లేదు. నిజానికి, బాల్యం నుంచి వారి మనసుల్ని చిన్నప్పటి నుంచి కలుషితం చేసేది మనమే. మనం బోధించే నర్సరీ రైమ్స్ నుంచి ఇది మొదలౌతుంది తెలుసా?”
చివరి అంశం మహేంద్రను ఆకర్షించింది. “అవునా, ఎలాగా?” అడిగాడు ఉత్సుకతతో.
మహేంద్ర కూడా చర్చలో పాల్గొంటున్నందుకు స్నిగ్ధ ఆనందించింది. చాలామందికి తెలియకపోయినా, వ్యాపార దిగ్గజాలకు సైతం, గౌరవానికి భయపడి ప్రదర్శించని హాస్యస్పూర్తి ఉంటుంది. కాని ప్రైవేట్ పార్టీలలో, ఇది బయట పడుతుంది. మహేంద్ర ఇందుకు అతీతం ఏమీ కాదు.
ఋషి ఇలా కొనసాగించాడు,”ఉదాహరణకు ‘బా బా బ్లాక్ షీప్’ అన్న పద్యాన్ని తీసుకోండి. చారిత్రాత్మకంగా, ఈ పద్యం “ఒక రాజ్యంలో ఉత్పత్తి అయిన ఉన్నిలో మూడో వంతును రాజుకు పన్నుగా చెల్లించాలి,” అన్న రాజశాసనానికి తిరుగుబాటుగా వచ్చింది.”
అంతా నిశ్శబ్దంగా వినసాగారు. అంతా మనసులో ఆ రైం చదవసాగారు. ఋషి చెప్పిన అంశం సమంజసంగా ఉందని వారికి అనిపించింది. ఆ రైం ప్రకారం, 30% ఉన్నిని పన్ను క్రింద రాజ్యానికి చెల్లించాలి. నిస్సందేహంగా, పన్ను చెల్లించే విషయాన్ని హాస్యాస్పదంగా పిల్లల మనసులో ముద్ర వేసేందుకు ఇదొక మార్గం.
“గతంలో ప్రజల నుంచి పన్ను వసూలు చేసేందుకు ప్రభుత్వం అనేక మార్గాలను అవలంబించింది. పార్లమెంట్ లు ఈ అదనపు పన్నుల్ని ఆమోదించనప్పుడు పాలకులు వేరే పద్ధతుల్ని కనుగొన్నారు. ఉదాహరణకు, UK పార్లమెంట్ ఆల్కహాల్ పై అదనపు పన్ను విధించడాన్ని ఆమోదించలేదు, కింగ్ ఛార్లెస్ – 1 వేరే పద్ధతుల్ని అవలంబించారు. పానీయాల్లో ఆల్కహాల్ శాతాన్ని మార్చాలని, ఆయన శాసించారు, దీన్ని ‘పింట్’ లలో కొలిచేవారు. దీన్ని బట్టి, పింట్ లో సగమైన ‘జాక్’ తో కొలిచి, పానీయాల్లో ఆల్కహాల్ కలిపేవారు. కాని, జాక్ పరిమాణం అలాగే ఉంచారు. దీనివల్ల టాక్స్ మొత్తం పెరగకపోయినా, కొలత మార్చారు కనుక, ఆ రాష్ట్రానికి వచ్చే పన్నుల మొత్తం పెరిగింది. దీనివల్ల, ‘జిల్’ అంటే పింట్ లో నాలుగోవంతు కూడా తగ్గింది. ఇప్పుడు చరిత్రలోని ఈ అంశాన్ని చెప్పే నర్సరీ రైం ఏంటో మీరు పోల్చుకోగలరు.”
“జాక్ అండ్ జిల్ వెంట్ అప్ ద హిల్” స్నిగ్ధ ఉద్వేగంతో దాదాపు అరిచినట్టుగా చెప్పింది.
“సరిగ్గా చెప్పావు స్నిగ్ధా, జాక్, జిల్ కు తగ్గిన ఆల్కహాల్ వారా కలుపుకునేందుకు నీళ్ళు కావాల్సి వచ్చాయి. రాజాజ్ఞ వలన ముందుగా జాక్ పరిమాణం పడిపోయి, దానివల్ల జిల్ కూడా తగ్గిపోయింది. కాబట్టి పన్నుల పట్ల తిరుగుబాటును మనం చిన్నతనం నుంచి అలవాటు చేస్తున్నాము. అందుకే పెద్దయ్యాకా, మనమంతా పన్ను ఎగవేతకు పాల్పడుతున్నాం.” ముగించాడు ఋషి.
మహేంద్ర పూర్తిగా ఋషి చెప్పే విషయంలో లీనమైపోయాడు. “అద్భుతమైన దృక్పధం” అంటూ మొదటిసారి నర్సరీ రైమ్స్ గురించి అనుకున్నాడు.
“కాని, నాకు జాక్ అండ్ జిల్ పోయెమ్ ది వేరే వెర్షన్ ఇష్టం – ‘జాక్ అండ్ జిల్, వెంట్ అప్ ద హిల్, టు హావ్ దేర్ షేర్ ఆఫ్ ఫన్, జిల్ ఫర్గాట్ ద పిల్, అండ్ నౌ థెయ్ హావ్ అ సన్’ ఋషి గట్టిగా చెప్దామని అనుకున్నా, మహేంద్ర ముందు ఎందుకో ధైర్యం చెయ్యలేకపోయాడు. అందుకని, అప్సరకు మెసేజ్ ఇచ్చాడు.
అప్సర అతని మెసేజ్ చదివి, బైటికి చెప్పకపోయినా పగలబడి నవ్వింది. ఆడవాళ్ళకు సరదాగా ఉండే మగాళ్లంటే ఇష్టం అంటారు. అప్సర అందుకు అతీతం ఏమీ కాదు. ఆమె చూపులు ఋషి పట్ల ఆరాధనను వ్యక్తం చేస్తున్నాయి. స్నిగ్ధ ఇది గమనించినా, ఏమీ అనలేదు.
***
పార్టీ ముగిసాకా, ఋషి, స్నిగ్ధ కలిసి ఋషి కారులో వెళ్ళారు. ఋషి డ్రైవ్ చేస్తుండగా, స్నిగ్ధ మౌనంగా కూర్చుంది. అప్సర ఋషిని ఇష్టపడడం ఆమెకు నచ్చలేదు. ఋషి సమక్షంలో అప్సర ముఖం కొత్త వెలుగును సంతరించుకోవడం ఆమె గమనించింది. ఇది ఆమెకు అసంతృప్తిని కలిగించింది. ఋషి విషయంలో ఆమె పోస్సేస్సివ్ గా ఆలోచిస్తోంది.
“నువ్వు మౌనంగా ఎందుకున్నావు? ఒంట్లో బాలేదా?” స్నిగ్ధ ఆలోచనల్ని ఋషి ఎలాగో చదవగలిగాడు. అతను అప్సరను తప్పించుకోగాలిగినా, అతనిపై అప్సర విసిరే ఏదో వలలాంటి మాయ అతను ఎంత ప్రయత్నించినా తప్పించుకోనలవిగా చేస్తోంది. ఆ వలలో చిక్కకుండా ఉండేందుకు జాగ్రత్త పడాలని, అతను అనుకున్నాడు.
“ఈ ఆధునిక యుగానికి చెందిన ఋషి, ఒక అప్సరకు వశమయ్యే పురాణ గాధను పునరావృతం చేస్తాడా?” ఆలోచిస్తూ, అప్రయత్నంగా పైకే అనేసింది స్నిగ్ధ.
ఋషి ఇది వినగానే హఠాత్తుగా కార్ ఆపాడు. అతను స్నిగ్ధ కళ్ళలోకి చూస్తూ,” స్నిగ్ధా, ఏం మాట్లాడుతున్నావు? చింతించకు, అప్సర గురించి నాకు బాగా తెలుసు, నేను పసిపిల్లవాడినని అనుకోకు. నాకు నా పరిధులు తెలుసు. దిగులు పడకుండా, నీ పుట్టినరోజు రాత్రి హాయిగా నిద్రపో.” అన్నాడు.
స్నిగ్ధ సమాధానపడలేదు. “ఋషి, నువ్వే కదా, శుక్రవారం, 13 వ తేదీ, ప్రజల జీవితాల్లోకి ఏదో చెడును తీసుకుని వస్తుందని చెప్పావు. ఇవాళ దీనిపాల పడ్డది నేనే అనుకుంటా !” ఆమె జరిగిన సంఘటనలను వరుసగా కలిపి ఆలోచించే ప్రయత్నం చేస్తోంది.
శుక్రవారం గురించి స్నిగ్ధకు చెప్పినందుకు ఋషి బాధపడ్డాడు. అతను ఏదీ సీరియస్ గా చెప్పకపోయినా, స్నిగ్ధ లాంటి సున్నిత మనస్తత్వం కల స్త్రీ, దాన్ని సీరియస్ గా తీసుకోగలదని అతనికి బాగా తెలుసు. అతను మృదువుగా ఆమె చేతిని తీసుకుని, ముద్దు పెట్టుకుని,”ఐ లవ్ యు స్నిగ్ధ, ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. దిగులు పడకు. నేను ఋషిని, అప్సర లాంటి మేనక వల్లో పడేందుకు బ్రహ్మర్షి విశ్వామిత్రను కాను. “ అన్నాడు.
స్నిగ్ధ వెంటనే అతన్ని హత్తుకుంది. ఆమె కన్నీటి పర్యంతమయ్యింది. ఒక వ్యక్తి తనకు మాత్రమే సొంతమనే భావన వారు ఇతరుల కోసం పడిగాపులు పడుతున్నారని తెలియచేస్తుంది. ఆమె ఋషిని గాఢంగా ప్రేమిస్తోంది. ఋషి కాసేపు ఆమెను అలాగే పొదువుకున్నాడు. ఆమె కన్నీటిని తుడిచి, మరోసారి ఆమెను ముద్దు పెట్టుకున్నాడు. తర్వాత కార్ స్టార్ట్ చేసి, స్నిగ్దను ఆమె ఇంటివద్ద దింపాడు. ఆమెకు వీడ్కోలు చెప్తూ, చీకట్లోకి పయనించాడు. శుక్రవారం, 13 పద్దతిని మరోసారి తిట్టుకున్నాడు.
కాని, దీని ఫలితాన్ని మున్ముందు అనుభవించాల్సి వస్తుందని వారిద్దరూ ఊహించలేదు. ఋషి ఇంటికి వెళ్ళగానే గాఢ నిద్రలోకి వెళ్ళడం వల్ల, అర్ధరాత్రి అప్సర ఇచ్చిన మెసేజ్ ను చూసుకోలేదు.
అది అప్సర నుంచి వచ్చింది,” ఋషి, నువ్వు నిజంగా అసాధ్యుడివి. అసాధ్యాలను సుసాధ్యం చేసుకోవడం నాకిష్టం. గుడ్ నైట్,” అంటూ ఉంది. ఉదయం ఆ మెసేజ్ ను చూడగానే డిలీట్ చేసాడు ఋషి. కాని, ఇతరుల మనసులో మనం సృష్టించిన భావాలను డిలీట్ చెయ్యలేమని అతనికి తెలీదు.
(సశేషం...)

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top