నాకు నచ్చిన కధ -నల్లజర్ల రోడ్ -శ్రీ దేవరకొండ బాల గంగాధర తిలక్

 టీవీయస్.శాస్త్రి


(ఈ కథ చదివి నేను దాదాపు ఇరవయ్యి సంవత్సరాలకు  పైగా అయ్యింది.ఇప్పటికీ నా మస్తిష్కంలో భద్రంగానే ఉంది.  ​తిలక్ వచన కవితా రచయితగా ​ఎంత ప్రసిద్ధుడో కథకుడిగా అంతకన్నా ​ ​సుప్రసిద్ధుడు.వేదికల మీద మానవీయ విలువలను గురించి మెట్టవేదాంత ఉపన్యాసాలు చేసే స్వామీజీలను,నాయకులను చూసినప్పుడల్లా నాకు ఈ కథ గుర్తుకొచ్చి,వళ్ళు జలదరిస్తుంది. 
ఈ కథను ఆధారంగా తీసుకొని అన్ని భాషలలోనూ అనేక కథలు వచ్చాయి.ఒక్క తెలుగులోనే దాదాపు ముప్పయికి పైగా కథలు వచ్చా​యట.పాముకి విషం కోరల్లోనే ఉంటుంది.మనిషికి 
​​నిలువెల్లా విషమే.పాము విషం వైద్యంలో మనిషి మరణించే ముందు కొద్ది సేపు బతికించటానికి కూడా వాడుతారు.పాము విషం ఒక విధంగా 'అమృతం' లాంటిదేనన్న మాట!మరి మనిషి కాటేస్తే! దానికి మందే లేదు.ఇక కథలోకి వెళ్లుదాం)
****
ధనవంతుడైన  రామచంద్రం తన స్నేహితుడైన భూషణంతో కలిసి  యవ్వనంలో​ ​​ఉన్న తెలిసిన ఒక కుర్రవాడిని వెంట తీసుకొని తన పాత కారులో తణుకునుంచి ఏలూరుకు బయలు దేరాడు.ఏలూరుకు ఉదయమే వారు వచ్చారు. ఏలూరులో పనులన్నీ ముగించుకొని మళ్ళీ తిరిగి తణుకుకి వెళ్ళాలి.మరుసటి రోజు తణుకులో కలెక్టర్ గారింట్లో పెళ్లి. ఆ పెళ్లి బాధ్యత అంతా వీరిదే.ఏలూరులో పనులన్నీ పూర్తి అయ్యేటప్పటికి రాత్రి పదిగంటలు అయింది.అవి బ్రిటిష్ వారు పాలించేరోజులు. ఏలూరులోనే ఆగిపోతే బాగుండేది కానీ మరుసటి రోజు ఉదయమే కలెక్టర్ గారింట్లో పెళ్లికి వీరి హాజర్ తప్పనిసరి.
ఆ రోజుల్లో రాత్రి ఎనిమది గంటలకే ఊరంతా సద్దుమణుగుతుంది.ప్రయాణ సాధనాల రాకపోకలుండవు.వారి కారులోనే తణుకుకి వెళ్ళటానికి నిశ్చయించుకున్నారు.దోవ అంతా​ ​వంపులు తిరుగుతూ
పోతుంది.రాత్రి పదకొండు గంటలు కావస్తుంది.అదంతా దట్టమైన అటవీ ప్రాంతం.అడవి మధ్యలో ​ఉన్నారు వాళ్ళు.కారు శబ్దం తప్ప మరే శబ్దం వినపడినా భయం వేస్తుంది.ఇంతలో కారు ఆగిపోయింది. కారులోని వారికి చెమటలు పడుతున్నాయి.వాళ్ళ అదృష్టం కొద్దీ కారు పది నిముషాలలో బాగయ్యింది,బయలుదేరారు. ​ఇంకా అడవి చాలా ​ఉంది.అడవి దాటి అవతలికి వెళితే గండం గడిచినట్లే! ఆ అడవిలో పులులూ,విష సర్పాలు ​ఎక్కువగా ​ఉంటాయంటారు.అన్నిటి మీదా సమానంగా వెన్నెలను వివక్షత లేకుండా వెదజల్లే చంద్రుడిని చూసినా వీరికి భయం వేస్తుంది.మళ్ళీ కారు ఆగిపోయింది.ఈ డొక్కు కారులో ​ఎందుకు వచ్చామా! అని మిగిలిన ​ఇద్దరూ చికాకు పడుతున్నారు. రామచంద్రం కిందకు దిగాడు,కారు బాగు చేసుకుందామని.రాత్రి పన్నెండు గంటలయ్యింది.రామచంద్రం ఇంజను మీద బాదటానికి కర్ర కోసం రోడ్డుతిగి తుప్పల్లోకి వెళ్ళాడు.ఒక పెద్ద విష సర్పం అతని పాదం మీద కాటు వేసి క్షణంలో అదృశ్యమైంది.ఇంతలో రామచంద్రం---'ఒరే భూషణం!పాము కరిచిందిరా!'--అనే అరుపు అడవి అంతా ప్రతిధ్వనించింది.భూషణం,ఆ కుర్రవాడు భయంతో తల బాదుకుంటున్నారు,​ఏమి చెయ్యాలో తోచక.రామచంద్రం పరిస్థితి దారుణంగా ​ఉంది. నోటి వెంట నురగ వస్తుంది.భూషణం,పెద్దగా 
అరుస్తున్నాడు---'నా స్నేహితుడిని ఎవరైనా కాపాడండి,వాడిని బతికించిన వారికి ​ఎన్ని లక్షలైనా ​ఇస్తాం !,ఆస్తి అంతా కూడా ఇస్తాం​!​  అని. దూరంగా సన్నని ఎర్రటి మంట కదిలి వస్తున్నట్లున్నది. దానితో పాటు మువ్వల సవ్వడి కూడా వినిపిస్తుంది.ఎవరో వస్తున్నట్లు అనిపించింది.వచ్చినవాడు వీరిని సమీపించాడు.అతని పేరు సిద్ధయ్య.కోడె త్రాచుల విషం తీసి వైద్యానికి ​ఉపయోగించటం అతని వ్యాపకం. ఆ అడవిలో ఒక చిన్న గుడిసె వేసుకొని తన కూతురితో అక్కడే ​ఉంటాడు. సిద్ధయ్య వాళ్ళను తన గుడిసెలోకి తీసుకెళ్ళాడు.రామచంద్రాన్నిమంచం మీద పడుకోపెట్టమన్నాడు.రామచంద్రం పరిస్థితి విషమంగానే ​ఉంది.రామచంద్రం  మంచం చుట్టూ తిరుగుతూ ​ఏదో మంత్రం వే​సాడు సిద్ధయ్య.అతని కూతురు ప్రమాదమని తెలిసి కూడా అడవిలోకి వెళ్లి ​ఏదో ఆకు తెచ్చి పసరు పిండి కొంత పసరు తాగించింది.దైవత్వం ​ఉంటేనే ఒక మనిషి ప్రాణం కాపాడగలం. దేవుడి రూపంలో ​ఉన్న సిద్ధయ్య ముందు మృత్యువు తలదించుకొని వెళ్ళింది.రామచంద్రం బతికాడు.అందుకు ప్రతిఫలంగా వాళ్ళు ఎంతో కొంత డబ్బు ఇస్తే ,సిద్ధయ్య తీసుకోలేదు.డబ్బు తీసుకుంటే  వైద్యం పనిచేయదట!మనిషిని సాటి మనిషి కాపాడటంలో గో​ప్పేమీ లేదట!తెలతెల వారుతుంది.మొదటి బస్సు తిరిగే సమయం. త్వరగా వెళ్ళాలి.కలెక్టర్ గారి అబ్బాయి వివాహ సమయానికన్నా తణుకుకి చేరుకోవాలి.ముగ్గురూ వేగంగా నడుచుకుంటూ రోడ్డు వైపుకి వెళుతున్నారు.దూరంగా బస్సు కనపడుతుంది. ఇంతలో సిద్ధయ్య కూతురు పెద్దగా ఏడుస్తూ---'అయ్యా మా అయ్యను కాపాడండి!మా అయ్యను పాము కరిచింది. ఒక్కదాన్నే అన్నీచూసుకోలేకపోతున్నాను,మందులు ఇవ్వలేక పోతున్నాను. మీకు దండం పెడతాను,వచ్చి మా అయ్యను కాపాడండి..' అని ఏడుస్తూనే బతిమాలుతుంది.బస్సు రానే వచ్చింది.'​ ​ఏమి చెయ్యగలం!అవతల కలక్టర్ గారింట్లో పెళ్ళికి వెళ్ళాలి​ ​' అని ముగ్గురూ అనుకొని రెండు పది రూపాయల నోట్లు ఆ అమ్మాయి ముఖం మీదికి విసిరివేసి ,బస్సు ఎక్కి  వెళ్ళిపోయారు.బస్సు రేపిన దుమ్ములో ఆ అమ్మాయి ముఖం కూడా కనబడటం లేదు.​-------ఇదీ కధ! ​
*****
చూ​సారు కదా!మనిషి వేసే కాటు ఎంత  భయంకరంగా ​ఉంటుందో.పైసా ధనం ఆశించకుండా సాటి మనిషిని కాపాడి​న ఒక ఆటవికుడు దేవుడు.రెండు పది​ ​రూపాయల​ ​నోట్లతో కాపాడిన మనిషిని  
కాటేసినవాడు 'నాగరీకుడు'.ఏమి చదువుకోని సిద్ధయ్యకు తెలిసిన మానవత్వపు విలువలు కూడా లేనటువంటి ఈ నాగరీకులు ప్రాణం కాపాడిన దైవాన్నే కాటేసే విష సర్పాలు.ఆది కావ్యమైన రామాయణం అడవిలోనే పుట్టింది.భార్యా వియోగంతో బాధ పడుతున్న శ్రీ రాముడికి చక్కని ఆతిధ్యం ఇచ్చి ఆదరించిన శబరి ఒక ఆటవికురాలు.ఈశ్వరుడికి తన కళ్ళు అర్పించి అనన్య భక్తి అంటే ఏమిటో తెలియచేసిన కన్నప్ప ఆటవికుడు.సాటి మనిషిని కాటేసే మనం నాగరీకులం.ఇలాంటి విష సర్పాలు మనలో ఇంకా చాలా ​ఉండవచ్చని నా అభిప్రాయం​!
***

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top