Sunday, April 24, 2016

thumbnail

మాతృత్వానికి మరో కోణం

మాతృత్వానికి మరో కోణం               

రచన: కోసూరి ఉమాభారతి


అలారం మోగడంతో, తెల్లారుజామునఐదుగంటలకేనిద్ర లేచాను. ఈమధ్య వొళ్ళునొప్పులు ఎక్కువవ్వడంతో మెల్లగాపడకనుండిదిగివాష్ రూమ్ వైపు నడిచాను...
‘శాంతి కుంజ్’లోఇవాళజరగబోయేవార్షికోత్సవకార్యక్రమాల గురించిఆలోచిస్తూయింటిపనులు చేసుకోడం మొదలుపెట్టాను. ఇరవ్వయ్యవ వార్షికోత్సవం జరుపుకుంటున్న మావ్యవస్థకి, నేను పని చేయడం మొదలు పెట్టి కూడాపన్నెండు సంవత్సారాలు గడిచింది.
మాఅబ్బాయి అమెరికాకి, అమ్మాయి అత్తారింటికి వెళ్ళాక,‘శాంతి కుంజ్’ అనేధార్మిక సేవాసంస్థలో వార్డెన్ గా ఉద్యోగంలో చేరాను.  పని మొదలుపెట్టిన రెండేళ్ళకి, నా మీద నమ్మకం ఏర్పడి,బెంగుళూరు వాస్తవ్యులైన నిర్వాహకులు సంస్థ అజమాయిషీ మొత్తం నాకే వదిలేశారు.
అక్కడఆశ్రమంలోనివశించే వృద్దుల బాధ్యతలే కాకసేవాశ్రమం లోని  పిల్లల విద్యాబోధనతోసమయంగడిచిపోతుంది నాకు.నాచేతికిందపది మంది వరకుపని చేస్తారు.   ఆశ్రమంలోనివారికి, పనివారికి కూడా నేనంటే గౌరవం, ఇష్టం.. నా మాట తూచా తప్పకుండా పాటిస్తారు.    కాబట్టి అంతా సవ్యంగానే సాగిపోతుంది.
అక్కడ నివసించే స్త్రీల ఇక్కట్లకి జవాబులుగా సందేశాత్మకమైన కవితలు, కథలు రాసి, వారికి వినిపిస్తుంటాను.గత పదేళ్ళగా, వాటినిసేకరించినమామానేజర్ కమలమ్మ,  యాజమాన్యం ఆధ్వర్యంలో ‘’నీటిబుడగలు’ అనే పుస్తకంగా ప్రచురణ బాధ్యత చేపట్టింది కూడా. ఈరోజు జరగబోయే వార్షికోత్సవ సందర్భంగా ఆపుస్తకావిష్కరణచేయడానికి మైసూర్ నుండి వ్యవస్థయజమానులు సత్యనారాయణ బాబు కూడా వస్తున్నారు.
కార్యక్రమం గురించి ఆలోచిస్తూ,జడల్లిన జుట్టుని పైకిచుట్టి ముడి పిన్ను పెట్టాను.మా అమ్మాయి ఆస్ట్రేలియా నుండి వచ్చినప్పుడు నాకు కొనిపెట్టిన నీలి రంగు కాటన్ చీర బయటకి తీశాను.  మాచింగ్ బ్లౌజ్ కోసం వెతుకుతుండగా ఫోన్ మోగింది.  నంబర్చూస్తే,మా అబ్బాయి వరుణ్ దే... అమెరికా నుండి కాల్ చేసాడు...
‘బంగారు తండ్రి తరుచుగా ఫోన్ చేస్తూనే ఉంటాడు’ అనుకుంటూ ఫోన్ తీసాను.“అమ్మా నీపుస్తకావిష్కరణజరగబోతుందిగా... వెరీ హ్యాపీ.  ఇక నీవు రిటైర్మెంట్ తీసుకుని ఇక్కడికి వచ్చేయమ్మా. ఇక్కడ కొద్ది రోజులు,కావాలంటేఆస్ట్రేలియాలో వాణి వద్దకొద్ది రోజులు ఉండచ్చు.  సరేనా?” అన్నాడు.
“ఇక్కడ వీరికి నా అవసరం ఉంది కన్నా.  అలా వదిలేసి ఎలా వస్తాను చెప్పు.ఆ సంగతి అటుంచి, పిల్లలు కోడలు ఎలా ఉన్నారో చెప్పు.అయినాఎప్పటిలామీరే వచ్చి వెళ్ళుతుండండి కన్నా.. సరిపోతుంది. నేనెక్కడున్నా, నీవు సంతోషంగా ఉన్నావంటే, అదే నాకు పదివేలు,” అన్నాను.
మరి కాసేపు కబుర్లాడి ఫోన్ పెట్టానో లేదో మళ్ళీఫోన్ మోగింది.  ఈ సారి మా అమ్మాయి వాణి నుండి... “మమ్మీ,  అన్న కాల్ చేసాడా?” అంటూ కాసేపు తనూకబుర్లాడి,వార్షికోత్సవకార్యక్రమంలో నా ప్రసంగం రికార్డ్ చేసితనకివినిపించమంది......రాత్రికి మళ్ళీ ఫోన్ చేస్తానంటూ పెట్టేసింది.
మాకమలమ్మవీరిద్దరికీ అన్ని విషయాలు ఎప్పటికప్పుడు చేరవేస్తుంది మరి.
వాణి, వరుణ్ ల గురించి ఆలోచిస్తూ తయారవసాగాను.
దాదాపు ముప్పై ఏళ్ళ క్రితం, మావారుప్లేన్ఆక్సిడెంట్లోమరణించినప్పుడుపిల్లలు చిన్నవాళ్ళు.అంతటిదుఃఖాన్ని దిగమింగుకొని, ఇద్దరినీ పెంచి ప్రయోజకులని చేసాను.తండ్రి ప్రేమని కూడా అందించి వారి ఉన్నతికి పాటు పడ్డాను.ఆయన ఉంచి వెళ్ళిన పొలం, డాబా ఇల్లు అమ్మి ఇద్దరికీచదువు చెప్పించి, అమ్మాయి పెళ్లి చేసాను.ఇప్పుడువారివురూ తమ కుటుంబాలతో ఆనందంగాసాగిపోతున్నారు.
ఇద్దరూతరచుగాఫోన్లు చేసి,యోగక్షేమాలు కనుక్కుంటారు.... తరచుగావచ్చి పోతుంటారు. తమవద్దకు రమ్మనమంటారు,ఆర్ధిక సహాయం అందిస్తామంటారు.నేనువద్దంటాను... నాకున్న ఈ ఉద్యోగం మానసికంగా, ఆర్ధికంగా  కూడా సంతృప్తిగానే ఉంది. చాలు... అంత చాలు ... అనివారికి చెబుతుంటాను.
***
ఆటోలో ఆశ్రమానికి బయలు దేరాక,  ‘ప్రసంగం’ పేరిట నేను చెప్పవలసిన విషయంగురించి ఆలోచించాను.ప్రతి యేడు వార్షికోత్సవం సందర్భంగా నేను చెప్పే మాటలువినడానికి ఆశ్రమంలోని ఆడవారందరూ ఎంతగానో ఇష్టపడతారు, ఎదురు చూస్తారని వినికిడి... ఆశ్రమంలో ఉన్నది కూడా ఎక్కువమంది స్త్రీలే.. పెద్దవారు.వారిపిల్లలఅనాదరణకి, అలసత్వానికిగురైన వారే.  జీవితం పై విరక్తి చెందిన వారే...
తల్లడిల్లుతున్నఆ తల్లుల మాటలు వినీ వినీ, ఓ రకంగా నా మనసు రాటుదేరింది.పదేళ్ళగా,అమ్మతనానికికొత్తఅర్ధాలు వెతుక్కో సాగాను...
త్యాగాలు చేసి తిరస్కారానికి గురైన వారి వ్యధలకినాగుండెలు అవిసిపోయాయి... పదేళ్ళగా,వారి వెతల్లో మాతృత్వానికి మరో కోణం కనబడినన్ను కలవరపెట్టింది.
కలలో కూడాకన్నబిడ్డల క్షేమం కోరవలసిన మాతృమూర్తులుకంట తడిపెడుతుంటే నాకు ఎంతో బాధనిపించింది. వేదనాభరితమైన వారి ఆలోచనలు వారిబిడ్డల పట్ల శాపాలుగా మారవచ్చునన్న తలంపు కలిగించి, వారి మనసులని మరో ఉన్నతమైన దిశకు మళ్ళించాలని ప్రయత్నించసాగాను.
కన్నతల్లిలోని ప్రేమతత్వం కి కొత్త నిర్వచనం కనుగొని వారికి ఊరటనివ్వాలన్న ప్రయత్నం సాగించాను.. ఇవాళ నా మాటలు వారికి ఓ సందేశంలా, ఆ దిశగానే సాగాలని నా ఆలోచన.
***
కార్యక్రమం చక్కగా నిర్వహించారు కమలమ్మ తదితరులు.అందరికీ ధన్యవాదాలు తెలిపి, మైక్ చేతిలోకి తీసుకున్నాను.
“తోబుట్టువులకి,  పితృ సమానులు సత్యనారాయణ బాబుకి,పిన్నలకిశుభాకాంక్షలు....... స్త్రీత్వం-మాతృత్వం-ప్రేమతత్వం గురించి... మన ఆశ్రమానికి చెందినస్త్రీలందరికీ ఈ రోజు నేనోప్రేత్యేకసందేశాన్ని అందిస్తాను.
స్త్రీ తన జీవితంలోఓతనయగా, ఆలిగా, అమ్మగాచక్కగా ఇమిడిపోతుంది.. అది ప్రకృతి సిద్దంగా ఆమెకి సంక్రమించిన హక్కు, ధర్మం.తన మనుగడకి అదే నిర్వచనం అని నమ్ముతుంది.
మాతృత్వంకోసం అలమటించి,తన సంతానంయొక్క వృద్దిఅభివృద్ది కోసం పాటు పడుతుంది.  అమ్మతనం ఒక అద్బుత వరంగా జీవిస్తుంది... అదీ సహజమే. ఆమెజన్మ హక్కు కూడా...
అయితే,  పిల్లల ప్రాపకాన్ని తన భావిజీవితానికి పెట్టుబడిగా భావించకుండా, హుందాగాజీవితంలో సాగిపోవడమే మాతృత్వం యొక్క ప్రేమతత్వం. పిల్లలుతనని పట్టించుకోకపోతే, తల్లిఋణం తీర్చుకోడం లేదని మనసు కష్టపెట్టుకోవడం కన్నా,  ఎక్కడున్నా ఎలా ఉన్నా, తన సంతతి హాయిగా ఉండాలనిమనసారా కోరుకోవడమేఆమె మాతృత్వానికి గౌరవం.  పిల్లలనుండి ప్రేమానురాగాలు రాబట్టుకోలేక పోతున్నామన్న  వ్యధలు వదులుకోవాలి.  వాళ్ళేదో చేయలేదన్న  ఆరడి, ఆరాటం మానుకోవాలి.తమ దిగుళ్లని, నిరాశాలని శుభాశీస్సులుగా మార్చి వారికి అందిస్తే మాతృత్వానికి ఓ పరిపూర్ణత ఏర్పడుతుంది. ఇక వృద్దాప్యం, వైరాగ్యం, అనారోగ్యం ఎవరకైనా తప్పని అధ్యాయాలే. కాబట్టి మానసికంగా గాని శారీరకంగా కాని క్రింగిపోయే అవసరం లేదని గ్రహించి,... నిర్మలమైన మనసుతో తన జీవన పథంలో సాగిపోయినప్పుడే,‘అమ్మ’ అనే వ్యక్తి ‘అవ్యాజ్య ప్రేమస్వరూపమై’నిలుస్తుంది.
అలా నిర్మలమైన ఆలోచనలతో కొనసాగడానికి మనందరం ప్రయత్నిద్దాము.ఇక్కడ కలిసే మనుగడ సాగిస్తున్నాము కనుక,  అందుకోసం ఒకరికొకరం సహకరించుకుందాము....” అంటూ నా సందేశం ముగించాను....
***********************

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

Comment with Facebook

No Comments


Worlds Best Telugu Online Magazine

మా గురించి

నమస్కారం ! అచ్చతెలుగు లోగిలికి స్వాగతం.

నా పేరు భావరాజు పద్మిని.

5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి. 'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి 'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము.
వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....

aboutus.acchamgatelugu Click here to Read More. Feel free to reach us for more information