ఇండియన్ పికాసో - పద్మశ్రీ ఎస్వీ రామారావు - అచ్చంగా తెలుగు

ఇండియన్ పికాసో - పద్మశ్రీ ఎస్వీ రామారావు

Share This

ఇండియన్ పికాసో - పద్మశ్రీ ఎస్వీ రామారావు

భావరాజు పద్మిని


చిత్రకళలో ఒక విలక్షణమైన ప్రక్రియ నైరూప్య చిత్రకళ(Abstract Art). నైరూప్య కళ వాస్తవాన్ని వదిలిపెట్టి ,కళలోని ఊహల వర్ణనను సూచిస్తుంది. ఉదాహరణకు సాధారణంగా మన కలల నిండా నైరూప్య చిత్రాలు అంటే.. ఆబ్‌స్ట్రాక్ట్ ఇమేజెస్ ఉంటాయి. ఆ కలల స్వభావాన్ని వాటికీ నిజ జీవితానికి ఉన్న సంబంధాన్ని మనం అన్వయించుకుంటాము. . ఈ చిత్రాల్లో మనకు పరిచయమున్న రూపాలేవీ మనకు కనిపించవు. అంతా రేఖల, రంగుల ఇంద్రజాలంలా అనిపిస్తుంది. ఇంతకీ ఈ విధానం ఎలా పుట్టింది అంటే -
ఆకారాలతో కనిపించే ప్రతీదీ అబద్ధం, అశాశ్వతం కనుక, వస్తురూపమే మిధ్య అన్న భావన గత శతాబ్ద మధ్య కాలంలో పుట్టింది. అటువంటి అరూప భావనే ఒక రూపంగా ఎదిగింది. ఈ భావన మొదట చిత్ర కళలో, తర్వాత శిల్పంలో, సంగీతంలో, సాహిత్యంలో ప్రవేశించి విలక్షణమైన భావోద్రేగాలను ప్రకటించే విధానంగా రూపొందింది. సహజ రూపాన్ని వదిలేసి, అందులోని ప్రాధమిక రూపాన్ని విశ్లేషించే పద్ధతిలో బొమ్మలు గియ్యటమే నైరూప్య చిత్రకళ. ఈ చిత్రకళలో వినూత్న శైలిని అలవర్చుకుని, “ఇండియన్ పికాసో” గా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గొప్ప చిత్రకారులు పద్మశ్రీ ఎస్వీ రామారావు గారు.
రామారావు గారికి చిన్నతనం నుంచే చిత్రకారుడు కావాలనే కోరిక ఉండేది.
ఆయన తండ్రే ఆయనకు స్ఫూర్తిప్రదాత.     రామారావు తండ్రి గంగయ్య గారు ఆలయాలకు, ఇళ్లకు చెక్కతో అద్భుతమైన బొమ్మలు రూపకల్పన చేసేవారు. చదువు రాకపోయినా ఆయన ప్రతిభ రామారావును అబ్బురపరిచేది. చిత్రకళలో రాణించాలంటే ఊహాశక్తి చాలని, చదువు ముఖ్యం కాదని ఆయనకు అనాడే తెలిసింది. ఆయన తండ్రి గంగయ్య గారికి మాత్రం రామారావు ను చిత్రకారుడిని చేయడం ఇష్టంలేదు. దీంతో రామారావు ఒక రోజు ఇంటి నుంచి పారిపోయారు. ఊరి బయట రైలు బండి ఎక్కేశారు. రైలు కొన్ని ఊర్లు దాటిన తర్వాత రామారావుకు అమ్మా.. కుటుంబం సంగతి గుర్తురావడంతో తిరిగి ఇంటికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో చిత్రకారుడు కావాలన్న రామారావు కల ఎంత బలమైనదో ఆయన తండ్రికి తెలిసింది. ఆయన రామారావును తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన “మాధవపెద్ది గోఖలే” అనే ఒక చిత్రకారుడి దగ్గరకు తీసుకెళ్లారు. ఆయన దగ్గరే చాలాకాలం శిష్యరికం కూడా చేశారు రామారావు. ఆ తర్వాత మద్రాస్ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ లో చేరారు. 1962లో కామన్వెల్త్ ఫెలోషిప్ దక్కడంతో లండన్ చేరుకుని లండన్ యూనివర్సిటీలోని స్లేడ్ స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌లో చేరారు. వారి చిత్రకళా ప్రస్థానం గురించి వారి మాటల్లోనే చదవండి...
“12వ ఏటనుంచే చిత్రాలు గీయటం మొదలెట్టాను. హైస్కూలులో మా మాస్టారు వేణుగోపాలరావు తొలి గురువు. ఆయన ‘అగ స్టన్ జాన్స్’ మంత్రముగ్ధ రేఖల్ని నాకు పరిచయం చేసారు.  రెండు డిగ్రీలు చేసినా, చిత్రాలను గీస్తూ నాలోని చిత్రకారుణ్ణి బతికించుకున్నాను. చదువయిపోగానే చెన్నైలో కృష్ణారావనే ఆర్ట్ డెరైక్టర్ వద్ద సహాయకుడిగా చేరాను. ప్రముఖ చిత్రకారుడు మాధవపెద్ది గోఖలే సలహాతో మద్రాస్‌లో స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌లో చేరాను. ప్రవేశపరీక్షతోనే ఆరేళ్ల డిప్లొమా కోర్సులో ఎకాఎకిన మూడో సంవత్సరంలోకి నన్ను అనుమతించారు. దేవీప్రసాదరాయ్, ఫణిక్కర్ శిక్షణలో చిత్రకారుడి గా ఎదిగా. వేసవిలో సంజీవ్‌దేవ్ దగ్గరకొచ్చేవాడిని. జానపద చిత్రకారుడు శ్రీనివాస్ దగ్గర రెండు నెలల శిక్షణ తీసుకున్నా. మద్రాస్ కళాక్షేత్రంలో భారతీయ చిత్రకళను పరిశీలించాను. పుస్తకాలను అధ్యయనం చేస్తూ.. నాలోని భావాలను కాగితంపై పెడుతూ రచనావ్యాసంగం కొనసాగించాను. 1962లో కామన్‌వెల్త్ ఫెలోషిప్‌పై లండన్ వెళ్లాను.
గొప్ప ఆర్టిస్టుగా తిరిగి రావాలని నిర్ణయించుకుని వెళ్లిన నాకు, లండన్ నగరం
నా భావవిస్తీర్ణతకు దోహదపడింది. చిత్రకళ లోతుల్ని అన్వేషించాను. రేసులో ముందున్న పికాసోతో పోటీపడాలనుకున్నా. కాన్వాస్‌పై చేయకుండా బోర్డుమీదనే బొమ్మలను ఆసియా కళ ఆధారంగా వేయాలనుకున్నా. అప్పటికే ఆధిపత్యం చాటుతున్న పాశ్చాత్య నైరూప్య చిత్రకళలో నాదంటూ ఒక శైలికి తపించా. మ్యూజియంలలో బొమ్మలు చూస్తూ, లైబ్రరీల్లో పుస్తకాలను అధ్యయనం చేస్తూ గడిపాను. పంటకాల్వలో నీరు ఎలా ప్రవహిస్తుందో, నేను పుట్టి పెరిగిన గుడివాడ నాలో ప్రవహిస్తోంది. పచ్చని పంటపొలాలు, బిరబరా పరుగులిడే కృష్ణానది కాల్వలతో ఆయనది గాఢమైన అనుబంధం నాకు. అన్ని ప్రపంచపు చిత్రకళా రీతులను ఆకళింపు చేసుకున్నాను. ప్రవాహం నుండి తనకు కావలసిన నీటిని తీసుకునేందుకు రైతు చిన్న కాలువ త్రవ్వుకున్నట్లు, దేశదేశాల చిత్రకళా రీతుల నుండి, నాకు కావలసిన అంశాలను తీసుకుని, నాదైన చిత్రప్రవాహాన్ని సృష్టించుకున్నాను. పికాసో ఆఫ్రికా జానపదుల మాస్క్ ను ముడిసరుకుగా తీసుకున్నట్లు, నేను మొఘల్, రాజపుత్ కళ నుండి అలంకరణ రీతిని స్వీకరించాను. జపాన్ చిత్రకళ నుండి రేఖల్ని తీసుకున్నాను. వీటి మేళవింపుతో చిత్రాలు గియ్యటం మొదలుపెట్టాను.
లండన్‌లో తొలి ఎగ్జిబిషన్‌కు కృష్ణానదిని వస్తువుగా తీసుకుని ‘ఆప్టికల్
ఇల్యూషన్’లో సిరీస్ రూపొందించా. అద్భుతమన్నారు. సోలో ప్రదర్శన ఏర్పాటుచేశారు. ఆక్ష్ ఫర్డ్ యూనివర్సిటీ వారు దానిపై పొయిట్రీ రాశారు. అక్కడ్నుంచి వెనుదిరిగి చూడలేదు. పికాసో, బ్రాక్, మీరో, సల్వేడార్. డాలీ వంటి ప్రఖ్యాతుల చిత్రాల సరసన నా బొమ్మలకు స్థానం లభించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యున్నత స్థాయి మ్యుజియం లు నా చిత్రాలను కొనుగోలు చేసి, ప్రదర్శనకు ఉంచాయి. ప్రతిష్టాత్మకమైన బ్రిటిష్ ఇంటర్నేషనల్ ప్రింట్ బైన్నియల్ లండన్ లో ఏర్పాటు చేసే చిత్రకళా ప్రదర్శన కోసం పికాసో చిత్రాలతో పాటు నా చిత్రాలు కూడా ఎంపిక అయ్యాయి. ఈ ఎంపికను చిత్రకారులు నోబెల్ పురస్కారంతో సమానంగా భావిస్తాయి. ఇటువంటి అరుదైన గౌరవాలు దక్కడం దైవానుగ్రహం వల్ల నాకు కలిగిన అదృష్టంగా భావిస్తాను.
‘తనను మించిన కొడుకువు కావాలని’ అన్నారు నా తండ్రి. ఆ మాటను నెరవేర్చానని అనుకుంటున్నా. నైరూప్య చిత్రాలను నమ్ముకున్న
నాలాంటివారి బొమ్మలు విదేశీయుల్ని ఆకర్షించినా, ఇండియాలో ఆదరించలేదు. అందుకే స్వదేశీయుల కోసం వేయాలని ఆశపడ్డా. ఆ కోరిక ఇప్పుడు తీరబోతోంది. ఏడాదిన్నరగా ఢిల్లీలో ఉంటూ 80 పెయింటింగ్‌లు వేశాను. మరో ఇరవై చేస్తాను. భారతీయుల స్పిరిట్ ప్రకారం నా చిత్రాలు కొత్త రూపాన్ని దాల్చాయి. నైరూప్య చిత్రాల్లో ఇప్పుడు కృష్ణానది, చేప, అగ్ని, విత్తనం సబ్జెక్టులుగా తీసుకున్నా. ఆర్ట్‌లోని ప్రక్రియలు తెలియనివారిని కూడా ఆకర్షించేలా ప్రతీది వైవిధ్యంగా రూపొందించా. త్వరలో ఢిల్లీలో వన్‌మ్యాన్ షో, తర్వాత ఇండోఫ్రెంచి ఎగ్జిబిషన్‌లో నా చిత్రాల ప్రదర్శన ఉంటుంది. వచ్చే ఏడాదికి సాలార్‌జంగ్ మ్యూజియం వారు సంప్రదిస్తున్నారు. ఏపీజే అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఉన్నప్పుడు నేను  రాష్ట్రపతి భవన్‌ను సందర్శించాను.  నా చిత్ర కళను ఆయన ప్రత్యేకంగా అభినందించడం, ఎప్పటికీ మరచిపోలేని అనుభూతి.
సాహిత్యం అంటే కూడా నాకు వల్లమాలిన ప్రేమ. నాకు తెలుగు చదవడం, రాయడం వచ్చు కనుక, అప్పుడప్పుడు తెలుగులో కవితలు కూడా రాస్తూ ఉంటాను.”
ఇదీ క్లుప్తంగా మన భారత సంతతికి చెందిన అమెరికా చిత్రకారులు, పద్మశ్రీ ఎస్‌వీ రామారావు(76) కథ. ప్రకృతి నేపథ్యంగా వందలాది చిత్రాలను గీశారాయన.  ప్రస్తుతం ఆయన షికాగోలో స్థిరపడ్డారు. తన చిత్రకళను స్వదేశంలో అందరికీ పరిచయం చేసేందుకు ‘నేచర్స్ అబ్‌స్ట్రాక్ట్ గ్లోరీ’ పేరిట ఢిల్లీలో ధూమిమల్ ఆర్ట్ గ్యాలరీలో ఆమధ్యన  ఒక చిత్రకళా ప్రదర్శనను ఏర్పాటు చేశారు. అప్పట్లో  ఈ ప్రదర్శనను మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ప్రారంభించారు. ఎంచుకున్న మార్గంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, తన అకుంఠిత దీక్షతో అనుకున్న లక్ష్యాన్ని చేధించి, తన కుటుంబానికే కాక మన దేశానికీ గర్వకారణంగా నిలిచారు ఆయన. పద్మశ్రీ రామారావుగారు మరిన్ని విజయాలను స్వంతం చేసుకోవాలని, మనసారా ఆకాంక్షిస్తోంది “అచ్చంగా తెలుగు.”
***

No comments:

Post a Comment

Pages