Saturday, April 23, 2016

thumbnail

గురుత్వంలో గురుస్థానం - శ్రీమతి వి.కృష్ణకుమారి

గురుత్వంలో  గురుస్థానం - శ్రీమతి వి.కృష్ణకుమారి

-బ్నిం 

నేను అన్నమాచార్య కళాకేంద్రంలో వీణ,గాత్రం వెలగబెడుతున్నపుడు ఆవిడ డాన్స్ టీచరుగా ఉన్నారు.
కూచిపూడి డాన్స్ టీచరుగా గరిమెళ్ళ వరలక్ష్మిగారిచే అపాయింటెడయిన నాట్యకళాకారిణి. ఆవిడ నాట్యం నేను స్టేజీ మీద చూడలేదు. చూడక్కరలేదు. ఆవిడ గొప్ప టీచర్. ఆవిడ శిష్యుల్లో ఆవిణ్ణి చూడొచ్చు. అందుకనే మా టీచర్ వరలక్ష్మిగారు ఈ అమ్మాయిని వాళ్ళ ఇన్సిట్యూట్ లో డాన్స్ టీచరుగా పెట్టుకున్నారు.

యస్... ఆ అమ్మాయి నల్లగొండ వెళ్ళిపోయి సొంత విద్యాలయం పెట్టుకొన్నప్పుడు చినవెంకటరెడ్డి ప్రోత్సాహంతో నేను ‘భారత దర్శనం’ అనే బ్యాలే రాశాను. ఎ గుడ్ హోస్ట్. నేనప్పుడు ఇంత పెద్దవాణ్ణి కూడా కాదు కనుక డిగ్నిటీ కోసం తాపత్రయ పడకుండా అల్లరి చిల్లరగా ఆవిడకి, ఆవిడ ప్రొడ్యూసర్ కి నచ్చేలా రెండ్రోజుల్లో గంట బ్యాలే ఫినిష్ చేసిచ్చాను.
పురుషోత్తమ చారి గారు సంగీతం చేశారు. పాపం నా సాహిత్యం ఆయనకు ఎందుకు నచ్చిందో కానీ, నాకు ఆయన సంగీతం నచ్చేది కాదు. అన్నీ కూడా
లలిత సంగీతంలా వుండేది. డాన్స్ కి ఉండాల్సిన రిథమిక్ లయగతులు అప్పుడు నాకు తక్కువే అనిపించింది.
 ఆ తరువాత కృష్ణకుమారి డాన్స్ కంపోజింగ్ చూసాక రఘునందన్ అనే కుర్రాడితో కూర్చుని జతులు, పదగతులకు అనువైన స్వరగతులు రూపొందిస్తూ డాన్స్ కి అనుగుణంగా మలచుకుందావిడ.
 ఆ తరువాత తాండవకృష్ణ కళామృత రవళి అనే అనుబంధ సంస్థని స్థాపించి ఆవిడ జండా గుంటూరులో పాతుకుంది.

గరిమెళ్ళ గోపాలకృష్ణ సంగీత సారధ్యంలో ఆవిడ ఎన్ని అద్భుతాలు చేసిందో అక్కడి నాట్య కళాప్రియులకి తెలుసు.
సరిగ్గా నేను పుట్టిన సంవత్సరంలో మూడు నెల్ల పదకొండు రోజులు ముందు పుట్టిన ఈ అమ్మాయి నాకన్నా చిన్నదే అనిపిస్తుంది.
నాన్నకో, అమ్మకో సంగీత, నాట్యకళాప్రియత్వం ఉంటే డాన్సర్ ని చెయ్యొచ్చు.
బి.ఏ.ఎకనామిక్స్ చదివినా, నాట్యం మీద మమకారం వదలని అభిరుచి ఆమెకి వేదాంతం రాధేశ్యాం,వేదాంతం రత్తయ శర్మ,చింతా ఆదినారాయణ శర్మ గార్ల గురత్వ భాగ్యం దొరికింది.
 వెంపటి చినసత్యం గారి ‘ఉపాద్యాయ నృత్య పునశ్చరణ’ తరగతుల్లో పాల్గొని
టీచర్స్ ట్రయినింగ్ అయి ఇంక గురువుగానే నా బాధ్యత అని నిశ్చయించుకుంది. అందుకే సికింద్రాబాద్, సీతాఫల్ మండిలో ఉన్న గరిమెళ్ళ వరలక్ష్మి గారి అన్నమాచార్య సంగీత సృత్యకళాకేంద్రంలో డాన్స్ టీచర్ గా ఎంపికయ్యారు.
 అక్కడే వరలక్ష్మి గారి దగ్గర వీణ కూడా నేర్చుకున్నారు. అంతకు మందో వెనకో ‘నాట్యకళాకౌముది’ , ‘నాట్య మయూరి’, ‘నాట్య శిరోమణి’ ఇలాంటి బిరుదులు ఎన్నో పురస్కారాలు పొందిన తర్వాత గరెమెళ్ళ బాలకృష్ణప్రసాద్, శోభారాజు, బాబుమోహన్, టి.వి.నారాయణ, రంగాచార్యులు, ఎన్.సి.హెచ్.కృష్ణమాచార్యులు గార్ల ప్రశంసల్ని పొందారు.
నాట్యగురువుగా వీరు వ్రాసిన విన్యాసాలు నచ్చి ఎందరో సంగీత నృత్య కళాకారులు ఈమెని అభినందించారు. నేడు ఆమె ఒక గురువు. ఆప్యాయంగా, ఆదరణగా నాట్యకళని ఆరాధిస్తూ వున్న విద్యార్థినీ,విద్యార్థులకు కల్పతరువు.
పాత్రః స్మరణీయులైన గురువుల ఆశీర్వాదమే తనని నేడీ స్థితికి నిలబెట్టిందని సవినయంగా స్మరించుకునే కృష్ణకుమారిగారు భారత దర్శనం, కాళీయ మర్దనం,గోండ్రు నృత్యం,రాధామాధవీయం,ఋతురాగాలు,స్వర్ణాంధ్ర భారతి, త్రికుటేశ్వర చరిత్ర,శివశంకరి అనే నృత్య రూపకాలకి కొరియోగ్రఫిచేసి,నిర్వహించి నేటికి 800  లకు పైగా ప్రదర్శనలిచ్చి ప్రశంసలు పొందారు.

 వీరి భర్త వర్రె.రంగారావుగారి ప్రోత్సాహం నాకు ప్రతీ అడుగులోనూ సహాయ పడుతోందని సవినయంగా చెప్పే కృష్ణకుమారిగారి అమ్మాయి లలితా కల్యాణి, అబ్బాయి శ్రీనివాస చక్రవర్తి కృష్ణకుమారిగారికి వెన్నుదన్నుగా ఉంటూ ఈ నాట్యకళాసంస్థని అభివృద్ధి పథంగా నడిపిస్తున్నారు. ఇంక ఆవిడ మనవరాలు చి||లక్ష్మీ శర్వాణి అమ్మమ్మ పేరుని నిలబెట్టడానికి గజ్జె కట్టుకుంది. ఆ పాప నృత్య ప్రదర్శనలలో అమ్మమ్మ ప్రతిభని మనం చూడగలుగుతాము. అంతకన్నా గురుస్థానం వహించిన కళాకారిణికి కావలసినదేముంది, అందుకే ఐ టూ ఫాన్ హర్.
***

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

Comment with Facebook

No Comments


Worlds Best Telugu Online Magazine

మా గురించి

నమస్కారం ! అచ్చతెలుగు లోగిలికి స్వాగతం.

నా పేరు భావరాజు పద్మిని.

5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి. 'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి 'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము.
వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....

aboutus.acchamgatelugu Click here to Read More. Feel free to reach us for more information