సినీగేయ రచయత 'భాస్కరభట్ల' గారితో ముఖాముఖి 

భావరాజు పద్మిని 


ఏ దన్నూ లేకుండా సినీ జగతిలోకి వచ్చి, ఒక స్థానం సంపాదించుకోవాలి అంటే, చాలా కష్టం. కాని, అసాధ్యం మాత్రం కాదని, భాస్కరభట్ల గారితో మాట్లాడితే తెలుస్తుంది. లక్ష్యం స్పష్టంగా ఉండటం, వ్యుహాత్మకమైన ప్రణాళిక, పని విషయంలో అంకితభావంతో చేసే పరిశ్రమ ఆయనను ఇండస్ట్రీ లోని గొప్ప పాటల రచయతలతో పాటు అగ్ర స్థానంలో నిలబెట్టాయి. వారితో ముఖాముఖి ఈ నెల ప్రత్యేకించి, మీ కోసం...
నమస్కారమండీ. మీరు రచనలు చెయ్యడం ఏ వయసు నుంచి ప్రారంభించారు?
నమస్కారమండీ. చిన్నప్పటి నుంచి నాకు రచనలు అంటే ఇష్టం. మా మాతామహులు ‘రాజగోపాలచార్యులు’ గారని, ఆయన చిన్నప్పటి నుంచి పద్యాలవీ నేర్పించారు. అలాగా కూర్చోబెట్టి పేపర్ చదవడం, శతకాలు అవీ నేర్పడం, ఇలాంటివి అన్నీ అలవాటు చేసారు. అక్కడినుంచి సాహిత్యం మీద ఆసక్తి పెరిగింది. ముందు చదవడం బాగా అలవాటయ్యింది, ఆ తర్వాత రాయడం అలవాటయ్యింది.
సాహిత్యం పట్ల మీకు అభిరుచి ఎలా కలిగింది ?
శ్రీశ్రీ గారి వీరాభిమానిని నేను. శ్రీశ్రీ, తిలక్ వీరి రచనలు బాగా ఇష్టం, ఎక్కువగా చదివేవాడిని. నాకు తెలిసి ఏడవ తరగతిలో రాయడం మొదలుపెట్టాను. ప్రభుత్వ స్కూల్ లో బ్లాకు బోర్డు మీద ఒక ప్రోస్ అనుకుని, రాసేవాడిని. అందరూ మెచ్చుకునేవాళ్ళు. నలుగురిలో ప్రత్యేకంగా అనిపించేది. కానీ అంత సీరియస్ గా తీసుకోలేదు.
కొన్నేళ్ళ  తర్వాత నేను తొమ్మిదో తరగతిలో ఉండగా రాజోలులో మంచి కవిగా పేరుపొందిన మిత్రుడు సూర్యనారాయణ అనే అతను కలిసాడు. అతను ఆ ఎడిటర్  ఫ్రెండ్. అదొక లోకల్ డైలీ పేపర్ పత్రికాఫీసు. నేనో పద్యం ఇచ్చేసి, వెళ్ళిపోతున్నా. “ఏంటిది ?” అని అడిగాడు. “కవిత్వం” అన్నాను. “ఏదో లైన్ కింద లైన్ ఒకటి పొడుగ్గా, ఒకటి పొట్టిగా రాసేస్తే దాన్ని కవిత్వం అనరు. శ్రీశ్రీ తెలుసా, తిలక్ తెలుసా?” అని అడిగాడు. తెలీదన్నాను. “ముందు తెలుసుకుని చదువు, శ్రీశ్రీ కవితలు చదివాకా ఒక జ్వరం వస్తుంది, అది తగ్గాకా కవితలు రాయి ” అన్నాడు. అప్పుడు శ్రీశ్రీ మహాప్రస్థానం కంఠతా పట్టేశాను. ఆ వయసులో ఇటువంటి కవితలు చదవడం అంటే ‘అనప్రాసన రోజు ఆవకాయ తిన్నట్లు’ ఉంటుంది.  ఆ తర్వాత ఒకటి రెండేళ్ళు పద్యాలు రాయలేదు. ఇదీ చాలా కష్టమైన ప్రక్రియ అనుకున్నాను. రాజమండ్రి లోని గౌతమి లైబ్రరీ,  ఇన్నీసు పేట లైబ్రరీ, సీతంపేట లైబ్రరీ ఇలా లైబ్రరీ లకు వెళ్లి చదువుకుంటూ ఉండేవాడిని. అవి తీసిన దగ్గరి నుంచి, మూసేసేదాకా పుస్తకాల మధ్య దూరిపోయే వాడిని. ఒక్కోసారి లైబ్రేరియన్ లేక అసిస్టెంట్ లైబ్రేరియన్ వచ్చి, ‘చాలు చదివింది, వెళ్ళమంటే, ‘ అప్పుడు వెళ్ళే వాడిని.
అక్కడ శివరామకృష్ణ అని, మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు. అతనికి ఓ కిళ్ళీ కొట్టు ఉండేది. అక్కడికి వెళ్లి, వారపత్రికలు అన్నీ చదివేవాడిని. నాకో స్టూల్ వేసి, కూర్చోపెట్టేవాడు. వాడు వచ్చిన పుస్తకాలన్నీ దాచి, నాకు చదివేందుకు ఇచ్చేవాడు. మామూలుగా చదవనివ్వరు, కానీ నేను ఫ్రెండ్ ను కనుక, నాకు ఆ విధంగా సాయపడేవాడు. లస్సి ఇచ్చేవాడు, వాళ్ళ అన్నయ్య వాళ్ళు లేనప్పుడు నిమ్మకాయ సోడా ఇవ్వడం చేసేవాడు. అలా చదువుకునేవాడిని. అలా అన్నిరకాల సాహిత్యంతో అలా పరిచయం ఏర్పడింది.
నేను 10 వ తరగతిలో ఉండగా రాజమండ్రిలో సాహిత్య పీఠం పెట్టారు. వాళ్ళు ‘కవి సమ్మేళనం’ అనౌన్స్ చేసారు. కొత్త కవులను రాయమన్నారు. అప్పుడు తెలుగు యూనివర్సిటీలో నేను కవిత రాసి స్టేజి మీద చదివాను. అందరూ మెచ్చుకున్నారు. అప్పుడు ఉన్నవాళ్ళలో ఎండ్లూరు సుధాకర్, బేతవోలు రామబ్రహ్మం గారు, యాకూబ్, వంటివారు ఉన్నారు. అలా చదవడం జరిగింది. తర్వాత విరివిగా రాయటం మొదలు పెట్టాను. ఇప్పటికీ రాయడం కంటే, నాకు చదవడం ఇష్టం. మంచి పాఠకుడిని. అలా నా ప్రస్తానం మొదలయ్యింది.
ఒక జర్నలిస్ట్ గా, సినీ గేయ రచయతగా, జీవితాన్ని వివిధ పార్స్వాల నుంచి చూసారు కదండీ మీరు. జీవితానికి మీరిచ్చే నిర్వచనం ?
నాది ఆశావాద దృక్పధం. ఎప్పుడైనా నిరాశ చెందినా, వెంటనే దాన్ని మనసులోంచి తీసేస్తాను. ‘మనం హైదరాబాద్ ఎందుకొచ్చాము? రచయతగా ఎదగడానికి, గొడవ పడేందుకు కాదు కదా !’ అని సర్ది చెప్పుకుంటాను. ఎప్పటికప్పుడు నా కళ్ళముందు నా లక్ష్యం స్పష్టంగా కనబడేది. అందుకే నేను స్కూల్ లో కాని, కాలేజిలో కాని అల్లరిగా ఉండేవాడిని కాదు. నాకు నచ్చితే తప్ప, ఎక్కువగా కలవను. నిరాశ అనేది, అనుకున్నది అందకపోవడం అనేది, నా జీవితంలో లేదు. దానికి కారణం వ్యూహాత్మకంగా ఆలోచించడమే కారణం.
జాబ్స్ ఎందుకో నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం లేదు. వేసవి సెలవలు వసస్తే, రాసేందుకు ఏమీ ఉండదని, ఏడుపు వచ్చేది. మళ్ళీ టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ అన్నీ రాసేసేవాడిని. ఇప్పుడూ హైదరాబాద్ వచ్చి సినిమాల్లో రాసెయ్యాలి అనుకుంటే ఎవరూ ఇవ్వరు కదా! చాలామందికి ఎంత ప్రయత్నించినా అవకాశం దక్కదు కూడాను. నాకు చేతిలో పెన్ ఉండాలి, రాస్తూ ఉండాలి. అందుకని, నేను రాసే వృత్తిలో ఉండాలని నిర్ణయించుకున్నాను.చివరికి జర్నలిసం ను ఎంచుకున్నాను. ఇంటర్ లో స్పెషల్ తెలుగుతో చదివాకా, ఈనాడులో కంట్రిబ్యూటర్ గా చేరి, పార్ట్ టైం ఉద్యోగం చేస్తూనే, వి.టి.కాలేజీ లో డిగ్రీ చదవసాగాను. అలా ఉద్యోగం చెయ్యడం వల్ల కవి సమ్మేళనాలు, సాహితీ సభలు, అవధానాలు దగ్గరగా చూసే అవకాశం ఉంటుంది, సాహితీవేత్తలను కలిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ ప్రేరణ పొందే అవకాశం ఉంటుంది. అందుకే పోటీలకు కవితలు పంపడం, ఎక్కడ ఏ కార్యక్రమం ఉన్నా బస్సు ఎక్కి వెళ్ళిపోవడం చేస్తూ ఉండేవాడిని. ఇలా చేస్తూ ఉండగా నాకు డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉండగా ‘నువ్వు బాగా రాస్తున్నావు, నీలాంటి వాడు హైదరాబాద్ లో ఉండాలి’ అంటూ నాకు ఈనాడు హైదరాబద్ లో సినిమా పేజి స్టాఫ్ రిపోర్టర్ గా ఆఫర్  ఇచ్చారు. అవకాశాన్ని అందిపుచ్చుకోవడం నాకు అలవాటు. ‘మనం జీవితంలో ‘లిరిక్ రైటర్’ అవ్వాలి అనుకుంటున్నాము. అలాంటప్పుడు రాజమండ్రిలో కన్నా హైదరాబాద్ లో ఉండాలి కదా. అప్పుడే నా లక్ష్యానికి దగ్గరగా ఉండగలను’ అనుకుని, డిగ్రీ పూర్తి చెయ్యకుండానే హైదరాబాద్ వచ్చేసాను. 1994-2000 వరకు హైదరాబాద్ లో ఈనాడు, సితారలో  సినిమా పేజి రిపోర్టర్ గా పనిచేసాను.
 'పాట కోసం పదాల వేట' అంత కష్టమా? ఒక పాట రాసేందుకు సుమారు ఎంత సమయం తీసుకుంటారు ?
ఇండస్ట్రీలో నాకు ‘ఫాస్టెస్ట్ రైటర్’ అని పేరుంది. అవసరాన్ని బట్టి, నేను గంటలో, రెండు గంటల్లో కూడా పాట రాయగలుగుతాను.  ఎక్కువగా నాకు లాస్ట్ మినిట్ పాటలు వస్తాయి. వేరే వాళ్లకు ఇచ్చి, వాళ్ళు రాయక, షూటింగ్ కు సమయం మించిపోతూ ఉంటే, అందరికీ భాస్కరభట్ల గుర్తుకు వస్తాడు. అలా నాకంటూ ఒక ముద్ర పడిపోయింది. అలా ఒక్కరోజులో నైనా నమ్మకంగా రాసిస్తానని గుర్తింపు వచ్చింది. అలా నాకు తక్కువ సమయంలో రాసే పాటలే ఎక్కువ దక్కాయి. ఒక్కోసారి పాటను క్రాస్ చెక్ చేసుకునే టైం కూడా ఇవ్వరు. అలా ఓ 60 % పాటలు అలాగే రాసాను. అందుకు ఉదాహరణ ఐదు గంటల్లో రాసిన ‘నీ కళ్ళతోటి నా కళ్ళలోకి’ పాట.
ఇంతవరకూ నడిచిన మీ సినీ ప్రస్తానం మీకు ఎటువంటి అనుభూతుల్ని కలిగించింది ?
చాలా హ్యాపీ అండి, ఎందుకంటే, నేను అవాలనుకున్నది అయ్యాను. రచయతగా ఇన్నాళ్ళు ఇండస్ట్రీ లో నిలవగలగడం కష్టం. నేను 16 సం. నుంచి పాటలు రాస్తున్నాను. ఇప్పుడు నాకు 41 ఏళ్ళు. ఇంత కాంపిటీషన్ లో వచ్చి, ఫేడ్ అవుట్ అవకుండా, నిలబడ్డాను. సినిమా మలుపు తిరిగిన ప్రతీ సారి అందులో నా పాట ఒకటి ఉండడం నాకు ఎంతో సంతోషకరం.
ప్రస్తుతం సినీ పరిశ్రమలో రచయతలకు ఎటువంటి గౌరవం లభిస్తోంది?
గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకోవాలని నా భావన. మనల్ని బట్టే ఎదుటి వాళ్ళు మనకు విలువని ఇస్తారు. నేను వివాదాలకు చాలా దూరంగా ఉంటాను. ‘అవ్వదు’ అంటే అవదని చెప్పేస్తాను. ఫోన్ ఆఫ్ చేసుకోడం, బాధ్యతా రహితంగా ప్రవర్తించడం, ఇస్తానని అన్న టైం కి ఇవ్వకపోడం, నా జీవితంలో లేవు. అందుకే ఇండస్ట్రీ లో నేను అజాతశత్రువుని. దర్శకనిర్మాతలే కాదు, లిరిక్ రైటర్ లు కూడా నన్ను అభిమానిస్తారు.
నేను చాలామందిని చూసి, ఎలా ఉండకూడదో నేర్చుకున్నాను. “వాళ్ళు మనల్ని ఏమి అడుగుతున్నారు, పాట రాయమన్నారు, అంతే కదా ! అంటే, నీకు పనుంది, చేతులు కట్టేసి కూర్చోపెట్టలేదు కదా. చెయ్యలేనప్పుడు, వేరే పనులు ఉన్నప్పుడు రాయనని చెప్పెయ్యాలి. కాని, ఒప్పుకుని, ఇవ్వకుండా ఇబ్బంది పెట్టే హక్కు నీకు లేదు. ఇలాగే వివాదాలు వస్తాయి కదా ! అందుకే నేను అలాంటి పనులు పెట్టుకోకుండా, నాకు కావాల్సిన ఇండస్ట్రీ కోరుకునే విధంగా తయారయ్యాను. అందుకే అందరితో ‘భయ్యా’ అని తిరిగే చనువుంది. పాటలు కూడా వెళ్లి ఇమ్మని ఎప్పుడూ అడగలేదు. అలా నాకు ఇష్టం ఉండదు.
మీ విజయంలో మీ అర్ధాంగి లలిత గారి పాత్ర గురించి చెప్పండి.
ఈ రైటర్లు కొంచెం తిక్కతిక్కగా ఉంటారు. అంటే అనేక సందర్భాల్లో పాట రాయాలి, రాసినప్పుడు ఆ సిటుయేషన్ మనదే అన్నట్లుగా ఊహించుకుని, పరకాయప్రవేశం చేసి పాట రాయాలి. ఒక్కోసారి పాట టైం అయిపోతూ ఉంటుంది, ఐడియా రాదు, నిద్ర పట్టదు, ఫోన్లు, మెసేజ్ లు వస్తుంటాయి. ఇదీ చాలా చికాకు కలిగించి ఇబ్బంది పెడుతుంది. దీనితో మైండ్సెట్ రకరకాలుగా ఉంటుంది. ఆ సమయంలో మా శ్రీమతి వచ్చి, 'ఏమండీ, ఏం వండమంటారు?" అని అడిగితే, "ఏమొద్దు, ఆ తలుపేసేయ్, రాసుకుంటాను," అంటుంటాను. ఇవన్నీ భరించేది భార్యే ! ఇది ఏ రైటర్ కైనా, మ్యూజిక్ డైరెక్టర్ కైనా మామూలే. పెళ్ళైతే  భార్య, కాకపొతే తల్లిదండ్రులు మనల్ని అర్ధం చేసుకోవాలి. అలా నన్ను అర్ధం చేసుకునే భార్య దొరకడం నా అదృష్టం. “ఎక్కడికి వెళ్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు,” ఏమీ అడగదండి. లంచ్ బ్రేక్ కి మెసేజ్ పెడుతుంది,”లంచ్ కి వస్తున్నారా?” అని. “లేదు, రావట్లేదు అంటే, డిన్నర్ టైం కి పెడుతుంది. అంతే, మధ్యలో ఫోన్ కూడా చెయ్యదు. ఏ సిటుయేషన్ లో ఉంటారో, ఏ డైరెక్టర్ తో ఉంటారో, లేక పాట ఓకే చేయించుకునే పనిలో ఉంటారా అని, ఇంతగా ఆలోచించే భార్య దొరకడం నాకో గొప్ప వరం. పిల్లల్ని స్కూల్ కి పంపడం, స్కూల్ ఫీజులు కట్టడం, ఇంటిపనులు అన్నీ తనే చేసుకుంటుంది. నేను ఆ విషయంలో పెద్ద సోమరిపోతుని అని చెప్పవచ్చు. నన్నో గాజు బొమ్మలా చూసుకుంటుంది. నావరకు చాలా విషయాలు రావు.
అంతే కాక, పెళ్లిరోజు, పుట్టినరోజు ఇలాంటి వాటిలో అర్జెంటు పని వచ్చినా, అడ్డుచెప్పదు. మొన్న జూలై 21 మా ఆవిడ పుట్టిన రోజు. ఆ రోజు కుటుంబంతో గడపాలని అనుకున్నాను. సరిగ్గా అదే సమయంలో 18 వ తేదీన మారుతి ఫోన్ చేసి, “భలే భలే మగాడివోయ్” టైటిల్ సాంగ్  మూడు రోజుల్లో రాసివ్వాలి అన్నాడు. 'ఇది ఒప్పుకుంటే, మా ఆవిడ పుట్టినరోజున అనుకున్నట్టుగా కుటుంబానికి సమయం కేటాయించలేను కదా,' అనుకుని,   'ఓ గంటలో చెప్తానని' చెప్పి,  తనను అడిగాను. పాటని డబ్బుతో నేను తూచలేదు, కాకపొతే ఒక మంచి పాట రాసి, పేరుపొందే అవకాశం చేజారిపోకూడదని ఆలోచిస్తాను.
నాకు వచ్చిన ఒక అవకాశం చేజారిపోకూడదని, ప్రతి అవకాశం ప్రత్యేకమైనది అని, మరోరోజున  పెళ్లిరోజు జరుపుకుందామని, తను వెంటనే ఒప్పేసుకోమని చెప్పింది. ఇటువంటి భార్య దొరకడం నా పూర్వజన్మ సుకృతం.
మీ ఇంట్లో ఏదో స్పెషల్ పులిహోర తయారవుతుందట. ఆ కిటుకు ఏదో వివరిస్తారా ?
మా ఇంటి పులిహోర బాగా ప్రసిద్ధమయ్యింది. దీనికో కధ ఉందండీ. ఇదీ ఎలా మొదలైంది అంటే, ఓ సారి ‘గోలీమార్’ రికార్డింగ్ అయ్యింది. రాత్రి పది- పదిన్నర అయ్యింది, నేను పూరీ గారు వెళ్తుంటే, ఆయనకు పులిహోర తినాలని అనిపించింది. మామూలుగా ఆయన ఫుడ్ విషయంలో అంత ప్రాముఖ్యాన్ని ఇవ్వరు. కానీ ఆయనకు ఎందుకో తినాలనిపించింది.  డ్రైవర్ కి చెప్పి, రెండు మూడు హోటల్స్ తిరిగారు, ఎక్కడా దొరకలేదు. నేను ఇంటికి వెళ్ళిపోయాను. మర్నాడు నా భార్యతో పులిహోర చేయించి, లంచ్ టైం కి తీసుకుని వెళ్లాను. ఆయన షాక్ అయ్యారు. ‘ఏంటి తమ్ముడూ, ఊరికే అన్నాను, నిజంగా తెచ్చారు,’ అంటూ తిని చాలా మెచ్చుకున్నారు. అలా మాఇంటి పులిహోర ఫేమస్ అయిపొయింది.
తర్వాత ఓ సారి గోవా వెళ్లాను. గోవా అంటే మనకు గంట ప్రయాణమే కదా ! బిజినెస్ మాన్ సిట్టింగ్స్ కి. ‘ఏం తిందాం’ అంటే, పులిహోర తెచ్చాను అన్నాను. ఓ సారి బాంకాక్ వెళ్లాను, పట్టుకు వెళ్లాను. ఎప్పుడైనా 2,3 నెలలు ఐపోతే ‘తమ్ముడూ, పులిహోర తిని చాలా రోజులు అయిపొయింది తమ్ముడూ, అన్నయ్యను మర్చిపోతున్నావ్?’ అని అడిగి తెప్పించుకుంటారు. ఇలా మాఇంటి పులిహోర ఫేమస్ అయిపొయింది.
నేను భోజన ప్రియుడిని. నాకు నచ్చినదే వండమంటాను. ఈ విషయంలో నేను నా భార్యను కాస్త వేదిస్తాను. ముందు చెప్పినా, అప్పటికి అప్పుడే మనసు మార్చుకుంటాను. తను ఓపిగ్గా వండి పెడుతుంది. ఎక్కడ ఫుడ్ బాగుంది అని తెలిసినా కార్ వేసుకుని వెళ్లి, తినేసి వచ్చేస్తాను. కేవలం ఫుడ్ కోసమే వెళ్తాను. ఒక్కోసారి 2,3 రోజులు వెళ్ళిపోయి, ఆ ఏరియాలు అన్నీ కవర్ చేసి వచ్చేస్తాను. భోజనం చేసేటప్పుడు, పడుకునేటప్పుడు మాత్రం నా ఫోన్ ఆఫ్ చేసుకుంటాను. ఇవి కనీసావసరాలు కదండీ.
మీరు రాసినవాటిలో మీకు బాగా ఇష్టమైన పాట ఏది ? ‘అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు’లో పాటలు అన్నీ మీరే రాసారా ?
చాలా ఉన్నాయండి. ‘అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు’ లో రెండు పాటలు రాసాను. ఇవి కూడా వంశీ గారితో ప్రమేయం లేకుండా రాయించి, షూట్ చేసారు. ఇందుకు వంశీ గారు అలిగారట కూడా. కాని, ఆ తర్వాత ఆయనే పిలిచి, సరదాగా కాసేపు సినిమాలో పాట రాయించారు. అదీ ఇదీ అని చెప్పలేను కాని, చాలా పాటలు నాకు ఇష్టమైనవి ఉన్నాయి.
మీ ‘మినీ కవితల’ గురించి చెప్పండి. చాలా బాగున్నాయి.
ఎక్కువ నిడివితో రాయడం ఎందుకో నాకు ఇష్టం ఉండదు. ‘అల్పం లో అనల్పం’ గా అర్ధాన్ని ఇచ్చేవి రాయడం నాకు ఇష్టం. చిన్న చిన్న కవితలు చదవడం నాకు ఇష్టం. అలాంటి ఇష్టం ఉన్నవాళ్ళ కోసం రాయడం మొదలుపెట్టాను. ఇవి హైకూ సదృశ కవితలు. దీనికి ప్రేరణ గోపరాజు రాధాకృష్ణ గారు ‘ఆల్బం’ అనే హైకూల పుస్తకం. అలాగే పెన్నా శివరామ కృష్ణ గారు, బి.వి.వి. ప్రసాద్ గారు, వంటి వారి హైకూలు చదివాను. కాని, ఆ ఛందస్సు నాకు పట్టుబడలేదు. కాని నా శైలిలో రాయడం మొదలుపెట్టాను. దీనికి మంచి ఆదరణ లభించింది, ఇప్పటిదాకా సుమారు 75 రాసాను, వంద అయ్యాకా పుస్తక రూపంలో తేవాలని యోచన. అక్బర్ గారు బొమ్మలేసారు, అఫ్సర్ గారు ముందుమాట రాసారు, త్రివిక్రమ్ గారు వెనుక మాట రాసారు.  ‘పాదముద్రలు’ అనే పేరుతొ ఒక బ్లాగ్ లో పెట్టాను. మినీ కవితలనే కాదు, నాకు కవితలు రాయడం ఇష్టం. కవిగా ఉండాలి, జీవించాలి, పోవాలి అన్నది నాకు ఇష్టం. రంగనాథ్ గారు పోయినప్పుడు ఓ కవిత రాసాను. ‘నువ్వు పోవడం అంటే, నువ్వొక్కడే పోవడం కాదు, నీ చుట్టూ ఉన్న అనుబంధాల దారాల్ని బలవంతంగా తెంచేసుకుని పోవడం’ అని రాసాను. ఇది నా పేస్ బుక్ లో ఉంది. దీన్ని ఎంతోమంది షేర్ చేసుకున్నారు. నాకు
మీరు అందుకున్న అవార్డులు/ప్రశంసలలో మర్చిపోలేనిది ఏది ?
అంత గొప్ప అవార్డులు ఏమీ రాలేదు కానీండి, ‘కృష్ణా నగరే’ అనే సినిమాలో ఒక పాట రాసాను. ఆ తర్వాత ఇండస్ట్రీ లో చిన్న టెక్నీషియన్ ల నుంచి డ్రైవర్లు, భోజనం పెట్టేవారు, అందరూ నన్ను గౌరవించడం మొదలుపెట్టారు. ప్రేమగా పెడతారు. అప్పుడు నాకు ఆ పాట ఎంతగా మమేకమైపోయిందో నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. అలా వాళ్ళు పెట్టేటప్పుడు, నా కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. ఒకవేళ ఆ పాట రాసే ఛాన్స్ మిస్ అయి ఉంటే ? అందుకే నేను ప్రతి నిముషం చాలా అప్రమత్తంగా ఉంటాను. దొరికిన ప్రతి అవకాశాన్ని అంది పుచ్చుకుంటాను. ఇలా అందరి అభిమానాన్ని పొందడం నా జీవితంలో మర్చిపోలేని విషయం.
భాస్కరభట్ల గారు మరిన్ని గొప్ప గేయాలు రాసి, సినీ వినీలాకాశంలో ధృవతారగా వెలగాలని మనసారా ఆశిస్తోంది "అచ్చంగా తెలుగు".
***

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top