శ్రీరామ సంకీర్తనా సుధ (శ్రీరామ నవమి ప్రత్యేక కానుక ) - అచ్చంగా తెలుగు

శ్రీరామ సంకీర్తనా సుధ (శ్రీరామ నవమి ప్రత్యేక కానుక )

Share This

శ్రీరామ సంకీర్తనా సుధ (శ్రీరామ నవమి ప్రత్యేక కానుక )

మధురిమ 


"జయంతి తే సుకృతినో రససిద్ధాః కవీశ్వరాహః నాస్తి తేషా యశః కాయే జరామరణజం భయం  " అని శ్రీ భతృహరి చెప్పినట్లుగా చక్కని కీర్తనలు రచించినవారు చిరస్మరణీయులు.వారి యశః కాయమునకు జరామరణాలుండవు.వారి కీర్తి ఆచంద్రార్కం.అట్టి కీర్తనలను రచించిన వాగ్గేయకారులందరూ తమ మనోనేత్రము తో భగవంతుని దర్శించి ,ఆ భక్తి భావ తరంగాలలో ఓలలాడి, తాదాప్యత చెందిన తరువాత , వారి మనసులనుండీ జాలువారినవే… భక్తి ప్రధానమైన సంకీర్తనలు. భారతీయ సంసృతిలో,జీవనశైలిలో గల విశిష్టత ఏమిటంటే జీవితంలో ప్రతీ అంశం,ప్రతీ సంఘటన ఓ చక్కటి భకిప్రధానమైన పాటతో ప్రారంభించి ముగించగలం.అందుకేనేమో భారతదేశం లొ మాతృ మూర్తులందరూ పిల్లలకు భగవత్భక్తిని ఉగ్గుపాలతో నూరిపోస్తారు.అందుకే అన్నమాచర్యులవారు వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము అన్నారు. జో అచ్చుతానంద జో జో ముకుందా అన్న లాలిపాట తెలియని తల్లి తెలుగునాట కానరాదు.నిద్రపుచ్చేటప్పుడు పాడిన లాలిపాట సహితం ఈ దేశంలో భగవన్నామస్మరణమే. సంగీతము కేవలము ఆత్మానందానికి కాక మోక్షప్రాప్తికి ఒక సాధన కూడా.. అందుకే సంగీత సాధన కూడా భగవత్ ఆరాధనే .. ఎందరో కారణ  జన్ములు స్వయముగా సుమధుర భక్తి కీర్తనలను రచించి,రాగయుక్తంగా స్వరపరిచి,గానం చేసి… వారు తరించడమే కాదు సంకీర్తనా నిధి ని భావితరాలకు పెన్నిధి గా సమకూర్చిపెట్టారు. అయితే ఎందరో దేవతా మూర్తులపై ఎన్నెనో వేలకొలదీ కీర్తనలు రచింపబడ్డా…. శాస్త్రీయ సంగీతంలో సకలసుగుణాభిరాముడైన ఆ శ్రీరామచంద్రుడిదే అగ్రస్థానం.రాముడిపై కొన్ని వేల సంకీర్తనలు ఎందరో వాగ్గేయకారులు భక్తి భావన్ని  అద్భుతంగా ప్రతిబింబిస్తూ రచించారు. దక్షిణ భారతదేశంలొ శ్రీ త్యాగరాజ స్వామి,భద్రాచల రామదాసు,శ్రీ పురందరదాసు,పట్నం సుబ్రహ్మణ్యయ్యార్ అలానే ఉత్తర భారతదేశం లో తులసీదాసు,సూరదాసు మొదలగు ఎందరో భక్తుల శ్రీరామ  కీర్తనామృతాలు లోకమున శాశ్వత కీర్తిని గడించాయి. రానున్న చైత్రసుద్ధ నవమి శ్రీరామ నవమి సందర్భంగా నిరంతర తారకమంత్ర స్మరణతోనే తమ జీవితాలను ఆ శ్రీరామ పాదారవిందాలకు  అంకితంచేసిన కొందరు వాగ్గేయకారులగురించి కొన్ని రామకీర్తనామృతాలగురించి మీకు తెలియజేసే  ప్రయత్నమే  ఈ రామకీర్తనా సుధ. అయితే కీర్తన అనే ప్రక్రియకు శ్రీకారం చుట్టినది పదకవితాపితామహులు శ్రీ అన్నమాచార్యులవారైనా రామకీర్తనా గానం అనే కైంకర్యంతో తన జీవితమంతా ఆ స్వామి సేవలో గడిపి చివరికి రాముని పాదపద్మాలకే తన జీవితాన్ని అర్పించిన రామభక్తి సామ్రాజ్యానికి తొలి చక్రవర్తి శ్రీ భద్రాచల రామదాసు. ఈయన జీవితం  అందరికీ సుపరిచితమే అయితే బాల్యమునందే రామాయణ  గ్రంధము పఠించి,రామభక్తిని అలవరుచుకుని,రామునిపై సంకీర్తనలు రచించి పాడేవారట.శ్రీ రఘునాథభట్టాచార్యులవారిచే మంత్రోపదేశం  పొంది వైష్ణవదీక్షను స్వీకరించి,భక్త కబీర్ దాస్ చేత తారకమంత్రోపదేశమును పొందిన తరువాత "తారక మంత్రము కూరిన దొరికెను ధన్యుడనైతిని " అను ధన్యాసి రాగ కీర్తనను రచించెను.రామదాసు ఆ రాముని పై ఎన్నో దివ్యనామ సంకీర్తనలు తెలుగు సంస్కృత భాషలలో రచించగా వాటి శైలి కూడా సులభంగా ఉండటంచేత పండిత పామరులను ఒకేవిహంగా భక్తి మార్గంలోకి ఆకర్షించాయి.రామదాసు కీర్తన లేని భజన దక్షిణ దేశంలో కనిపించదు అన్నది నిజం. శ్రీ రామదాసు వారు కీర్తనలు జైలుశిక్ష అనుభవించకముందూ  రాసారు(శ్రీరామ దివ్య నామము),జైలులో రాసారు(ఇక్ష్వాకుకుల తిలక), విముక్తి చెందినతరువాత కూడా రాసారు(అంతా రామమయం). భద్రాద్రి,భద్రశైలి మొదలగు ముద్రలతో సహజ భక్తి భావావే శంతో,తన్మయత్వంతో,అప్రయత్నంగా సంకీర్తనా భావానుగుణంగా  వచ్చిన సరళమైన రచనలు ఆయనవి.కొన్ని సంకీర్తనల పల్లవులలో  సంస్కృత సమాసాలు మొదలైనవి ఉన్నప్పటికీ అవి సుబోధకమైన ద్రాక్షాపాక శైలిలొ ఉంటూ ,వాటిని అనుసరిస్తూ అచ్చమైన తెలుగు నుడికారంతో చరణాలను రచించారు. ఉదా:" రామా దైవ శిఖామణి సురరాజ మహోజ్వల  భూమణి తామరసాక్ష  సుధీమణి భవ్యతారక భక్తచింతామణి." ఇక బహుళ జనాదరణ పొందిన రామదాసు కీర్తనలు కొన్ని.. ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండీ.. తక్కువేమి మనకూ రాముడు ఒక్కడుండు వరకూ.. ఏతీరుగ నను దయచూసెదవో ఇనవంశోత్తమ రామా. గరుడగమన రారా నన్నే నీ కరుణనేలుకోరా.. శ్రీ రామ నీ నామమేమి రుచిరా.. చరణములే నమ్మితీ.. సీతా రామ స్వామి నే చేసిన నేరములేమి.. నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి ఇక్ష్వాకు కులతిలక అంతా రామ మయం...కేవలం భక్తిమార్గమే కాక జ్ఞాన మార్గమును కూడా తోడుచేసుకుని వైరాగ్యము సిద్ధింపచేసుకున్న యోగిపుంగవుడు రామదాసు.ఆ విషయం ఆయన యొక్క ఈ కీర్తనలోనే స్పష్టం అగుచున్నది. భళి వైరాగ్యమెంతో బాగైయున్నది చంచలమైన నా మనసు నిశ్చలమైయున్నది అరిషడ్వర్గము నన్నంటకున్నది శ్రీహరి నామస్మరణమే జిహ్వకు అనువైయున్నది గురుధ్యానమునందే మనసు కుదురైయున్నది చిత్తమ్ము ఇరువదియారింటిపై నిరవై యున్నది పరమ శాంత మెన్న బాగై యున్నది మాకు పరతత్వమునందే బుద్ధి పుట్టియున్నది విరసము వేరు లేని విధమయి యున్నది ప్రకృతిగా తెగబాసి మోమునకు తెరువై యున్నది గురి భద్రాద్రీశునందే గురుతై యున్నది ఇప్పుడరమరలేక రామదాసు డనదగియున్నది. ఇంతటి మహా భక్తుడు జ్ఞాని కనుకనే త్యాగరాజ స్వామి సహితం తన రచనలలో రామదాసుని గూర్చి క్షీరసాగరశయన అను దేవగాంధారి రాగ కృతిలో,బృందావనలోల అనుకృతిలో ధీరుడౌ రామదాసుని అని ఆయన గురించి పేర్కొన్నారు. ఇక తన జీవితకాలం లో అయిదు కోట్లసార్లు ఆ తారకమంత్రాన్ని జపించి ధన్యుడైన సుకవి సామ్రాట్ శ్రీత్యాగరాజ స్వామి.రామ భక్తి గానామృతంలో తను తరించడమేకాకుండా వాటి శ్రవణ,గానంవల్ల మనల్ని కూడా ఆ రామగాన సుధా పానం చేయిస్తూ రామ భక్తుడనే ఘనకీర్తిని మాత్రమే  శేషంగా ఈ లౌకిక ప్రపంచంలో  మిగుల్చుకున్న రామభక్తి సామ్రాజ్యనికి చక్రవర్తి శ్రీ త్యాగయ్య. త్యాగరాజ స్వామి జీవిత చరిత్ర ఆయన జీవితంలో అన్ని సంఘటనలు మనకి ఆయన సంకీర్తనల వల్లే తెలుస్తున్నవి.త్యాగరాజస్వామి కీర్తనలయొక్క  విశిష్టత ఏమిటంటే అవి సంగీత సాహిత్య ఉభయ ప్రధానమైనవి,అయన రచించిన అన్ని కృతులూ ఏదో ఒక అద్భుత సంఘటన ఆధారంగా ఆయన గళమునుండీ జాలువారినవే. ఉదా: తంజావూరు రాజైన శరభోజీ మహారాజు తన ఆస్థానం లో కచేరీ చెయ్యడానికి ఆహ్వానించగా ఐహిక  సుఖాలపై ఆశక్తిలేని త్యాగరాజు"నిధి చాల సుఖమా రాముని సన్నిధి సేవ సుఖమా? నిజముగ బల్కు మనసా " అన్న కృతిలో ఆత్మపరిశోధన గావించుకున్నారు. అన్నగారైన జపేసుడు ఈ రాజధిక్కారానికి ఆగ్రహించి త్యాగయ్య పూజించే శ్రీరామ పంచాయతన విగ్రహమును కావేరిలో పారవేసినప్పుడు రాముడు కానరాక ఎంతో దుఃఖించిన స్వామి"ఎందుదాగినాడో"అని పాడుకుంటూ సొమ్మసిల్లి నిద్రించినారట...దీనజనరక్షకుడైన ఆ రాముడు తానున్న చోటు స్వప్నములో చెప్పగా ...ఆ స్వప్నవృత్తాంతము  శిష్యులకు చెప్పి కావేరి తీరానికి వెళ్ళి వెతకగా శ్రీరమ దర్శనము కలిగినందుకు "కనుగొంటిని శ్రీరాముని నేడు".అన్న కృతిని రారా మాయింటిదాకా అన్న రచనలతో స్వామిని సేవించారు. ఇక ఆయన రామునిపై రచించిన పంచరత్నాలకు వాటికవే సాటి.మొదటిదైన జగదాంనదకారకా జయజానకీ ప్రాణ నాయకా అన్న కీర్తనలో జగత్తుకే ఆనందం కలిగించేవాడు రాముడని సంబోదించారు..త్యాగరాజస్వామి కృతులన్నీ పాడుకోగలిగితే సంపూర్ణ రామయణాన్ని మనం గానం చేసినట్లే..ఎందుకంటే వారికృతులలో ఇంచుమించు చాలవరకూ అన్నీ రామాయన గాధని విన్నవించేవే...ఇక ఆయన అన్ని కీర్తనలలో.. రాముడే కధానాయకుడు.విష్ణువు అని చెప్పవలిసివచ్చిన చోటకూడా త్యాగయ్య రామా అనే వ్యవహరించారు.ఆయన కృతులన్నిటిలో రాముడు పరబ్రహ్మ స్వరూపుడు. ఆయన భావావేశాన్ని ఎంతో పరిపూర్ణంగా వ్యక్తపరిచారు  అనడానికి "సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మా తండ్రి"అనే కృతే ఉదాహరణ.ఈ కీర్తన యొక్క చరణంలో "పరమేశ, వశిష్ట, పరాశర, నారద, సౌనాక, శుక, సురపతి, గౌతమ, లంబోదర, గుహ,సనాకాదులు.ధర నిజ భాగవతాగ్రేసరులెవ్వరో వారెల్లరూ వరత్యాగరాజునికి పరమబాంధవులు ఓ మనసా"  అన్నారు.. త్రికరణసుద్ధిగా రాముడినీ నమ్మేడు కాబట్టే తనకి జీవితంలో ఇంకేమీ వద్దు  ఆ రాముని సేవా భాగ్యం చాలు అనుకోగలిగారు కాబట్టే "శ్రీ రామా పాదమా నీ కృపజాలునే" అని రాయగలిగారు కదా.. తాను భార్యావియోగంతో దఃఖ సాగరంలో ఉన్నప్పుడు కూడా "నగుమోము గనలేని నా జాలి దెలిసి నను బ్రోవ రాదా? శ్రీ రఘువర"  అని విన్నవించుకున్నాడు.నిజమైన భక్తునికి భగవంతుడు దాసుడే మరి.అలాంటి భక్తుడు ప్రశ్నించినా చిద్విలాసంగా ఓ చిరునవ్వు నవ్వుతాడు. అందుకే త్యాగరాజ స్వామి "నన్ను  బ్రోవ నీకు ఇంత తామసామా? నాపై నేరమేమి బల్కుమా?" అన్నాడు. రామ భక్తి తప్ప వేరేమీ తెలియని త్యాగయ్య "రామ భక్తి సామ్రాజ్యం యేమానవులకొచ్చెనో ఆ మానవుల సందర్శనం అత్యంత బ్రహ్మానందమే మనసా" అని రచించారు. అప్పుడప్పుడు ఎంతటి గొప్ప వ్యక్తికైనా కష్టకాలం లో భగవంతునిపై విశ్వాసం చెదిరిపోవడం సామాన్యులకు సహజం.కానీ త్యాగయ్య పురొషోత్తముడు కనుక "ఉండేది రాముడొక్కడు యూరక జెడిపోకు మనసా"అన్న కీర్తనయొక్క చరణంలో "తామాసాదిగుణరహితుడు,ధర్మాత్ముడు,సర్వసముడు,క్షేమకరుడు,త్యాగరాజ చిత్తహితుడు..జగమునిండి  ఉండేది రాముడొకడు  యూరక జెడిపోకు మనసా " అని మనసుని అదుపులో పెట్టుకునే శక్తిని మనకు ఈ కీర్తన ద్వారా అందించారు. మనసా వాచా కర్మణా రామ ధ్యానం తప్ప ఇంకేమీ ఆశించలేదు కనుక రామ సందర్శనా భాగ్యాన్ని కూడా పొందగలిగి "నను పాలింపగ నడచీ వచ్చితివా"  అని తన ఆనందాన్నీ ఇలా కీర్తన ద్వారా తెలియపరిచారు.స్వామి పాదాలకు నమస్కారం చేసి "రఘునాయకా నీ పాదయుగ రాజీవములు నే విడజాల" అని తన ఆనందాస్రువులతో స్వామి  పాదాలు కడిగి పునీతులయ్యారు. త్యాగయ్య ప్రతీ కీర్తన ఎంత అనుభవించి రచించారో అనడానికి ఉదాహరణ "శ్రీ రామ జయ రామ శృంగార రామ యని చింతింప రారె ఓ మనసా" అన్న కీర్తన చరణంలో "దశరధుడు శ్రీరామ.. రారా యని పిలువ తపమేమి చేసెనో" అనీ "ధర్మాత్ము చరణంబు సోక శివచాపంబు తపమేమి చేసెనో  తెలియా" అని రచించడమే. భక్తి,జ్ఞానము అనే నిధి తనవద్ద లెక్క లేనంత ఉన్నా ఐహిక సుఖాలేమీ కోరక  "జ్ఞానమొసగరాదా నీ నామముచే నా మది నిర్మలమైనది."  అని అదే పదే వేడుకున్నారు .ఎప్పుడు ఆయన రాముడికి ఓ దాసుడువలె సేవచెయ్యాలని ,తరించాలని అనుకున్నాడు.అందుకే "బంటురీతి కోలువీయ్య వయ్య రామా" అని ప్రార్ధించాడు. ఇక సీతా రాముల కళ్యాణం కళ్ళారా చూసారేమో స్వామి,,, ఆ వైభవాన్నంతా కళ్ళకు కట్టినట్లుగా"సీతా కళ్యాణా వైభోగమే ..రామా కళ్యాణా వైభోగమే" అని ఎంతో మధురంగా ఆ కళ్యాణాన్ని వర్ణించారు. మనసులో రామయ్య తండ్రి,వాక్కులో రామనామం,చివరికి చేరుకోవలసినది రామ సానిధ్యం ఇదే పరమావధిగా  భావించి,సేవించి,తరించి ముక్తిని పొందినవారుకనుకనే "వందనము రఘునందనా సెతుబంధనా భక్త చందనా  రామా" అని రామ కీర్తనా గాన సేవా సౌభాగ్యంతోనే కాలాన్ని సద్వినియోగపరిచిన ధన్యజీవి. అలాగే 19వ శతాబ్ద వాగ్గేయకారులైన శ్రీ పట్నం సుబ్రహ్మణ్యయ్యార్  రచించిన "రఘువంశ సుధాంబుధి చంద్ర శ్రీరామా" మరియూ మైసూరు వాసుదేవాచారి రచించిన "బ్రోచేవారెవరురా నినువినా రఘువరా" వంటివి కూడా రామునిపై రచింపబడిన మధుర కీర్తనలు. ఈ విధంగా కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో రామునిపై ఎన్నో మధుర కీర్తనలు దైవాంశ సంభూతులైన ఎందరో వాగ్గేయకారుల ద్వారా రచింపబడ్డాయి.అలాంటి సుమధుర సంకీర్తనలను రచించిన వారు "ఎందరో మహానుభావులు వారందరికీ వందనములు".
"శ్రీ రామ రక్ష సర్వజగత్రక్ష ".

No comments:

Post a Comment

Pages