శ్రీసుముఖి

- ప్రతాప వెంకట సుబ్బారాయుడు

శ్రీదుర్ముఖీ అన్న ఆ పేరేంటమ్మా?

మేము బెంబేలెత్తిపోమూ

రక రకాల సమస్యలతో..

ఈతి బాధలతో..

ప్రకృతి విలయ తాండవంతో..

ఉగ్రవాదంతో..

అసలే మేము అతలాకుతలమవుతుంటే

నువ్వలాంటి పేరుతో వస్తే

మరింత హడలిపోమూ..

అయినా పేరెలాంటిదైనా నవనీత మనసుతో

ఏతెంచుతావన్న ఆశ ఓమూలుంది

పండగ సొబగుని ప్రతి ఇంటి తోరణం చేసి

కోయిల సుస్వరాన్ని ఆస్వాదిస్తూ

షడ్రుచుల పచ్చడి సేవనంతో

పంచాంగ శ్రవణాహ్లాదాన్ని అనుభూతిస్తూ

నీ రాకకై ఎదురుచూస్తున్నాము

మా ఆశలు ఆవిరిచేయక

కలలు కల్లలు చేయక

అవనిని సుసంపన్నం చేసి

అందరికీ సుఖ సంతోషాలు పంచు!

అప్పుడు నువ్వు చరిత్రలో

శ్రీదుర్ముఖీలా కాక శ్రీసుముఖీలా నిలిచిపోతావు!

***

 

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top