ప్రేమతో నీ ఋషి – 13

యనమండ్ర శ్రీనివాస్


( జరిగిన కధ : కొన్ని శతాబ్దాల క్రితం... ఇంద్రుడి ఆజ్ఞమేరకు ,మేనక తన రూపలావణ్యాలతో విశ్వామిత్రుడిని సమ్మోహనపరచి, అతని తపస్సును భగ్నం చేస్తుంది. కొన్ని దశాబ్దాల క్రితం... మైసూరు మహారాజు సంస్థానంలో గొప్ప భారతీయ చిత్రకారుడిగా పేరుపొందిన ప్రద్యుమ్న ‘ప్రపంచ కొలంబియన్ ప్రదర్శన’ కోసం, రాకుమారి సుచిత్రాదేవినే తన చిత్రానికి నమూనాగా వాడుతూ, మేనక విశ్వామిత్రుడికి తపోభంగం చేసే సన్నివేశాన్ని అత్యద్భుతంగా చిత్రిస్తూ, ఈ క్రమంలో రాకుమారితో ప్రేమలో పడి గుప్తంగా రాజ్యం వదిలి పారిపోతాడు. రాజు పారెయ్యమన్న ఆ చిత్రం అనేకమంది చేతులు మారి, చివరగా  దాన్ని బ్రిటన్ తీసుకువెళ్ళాలన్న కోరికతో కొన్న ఒక విదేశీయుడి  వద్దకు చేరుతుంది. ఆ తర్వాత అది ఏమైందో ఎవరికీ తెలీదు. 
ప్రస్తుతం... ముంబై స్టాక్ ఎక్స్చేంజి లో పనిచేస్తున్న త్రివేది గారు, ఉదయాన్నే ఫాక్ష్ లో వచ్చిన సందేశం చూసి, అవాక్కవుతారు... కారణం తెలియాలంటే, కొంత గతం తెల్సుకోవాలి....  కొన్ని నెలల ముందు మాంచెస్టర్ లో  గొప్ప వ్యాపార దిగ్గజమైన మహేంద్ర, చేపట్టిన ‘ప్రద్యుమ్న ఆర్ట్ గేలరీ’ ప్రాజెక్ట్ కోసం చిత్రాలు సేకరించేందుకు అతని మాంచెస్టర్ ఆఫీస్ లో పనిచేస్తుంటారు స్నిగ్ధ, అప్సర. ఈ క్రమంలో స్నిగ్ధకు స్విస్ బ్యాంకు మాంచెస్టర్ ఆఫీస్ లో సీనియర్ క్లైంట్ బ్యాంకర్ గా పనిచేస్తున్న ఋషి తో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారుతుంది. ఋషిని  అప్సర సామీప్యంలో చూసిన స్నిగ్ధ మనసు క్షోభిస్తుంది. స్నిగ్ధ తో కలిసి ముంబై వెళ్తుండగా, జరిగినదానికి సంజాయిషీ ఇవ్వబోయిన ఋషిని పట్టించుకోదు  స్నిగ్ధ.  అతను మౌనం వహించి, కళ్ళుమూసుకుని, గత జ్ఞాపకాలు నెమరేసుకుంటూ ఉంటాడు...  ఆర్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్’ కోసం పనిచేసేందుకు మాంచెస్టర్ వచ్చి, ముందుగా ఆర్ట్ గురించిన అవగాహన కోసం ప్రయత్నిస్తున్న ఋషి, ఫేస్బుక్ లో స్నిగ్ధ ప్రొఫైల్ చూసి, అచ్చెరువొందుతాడు. స్నిగ్ధకు మహేంద్ర కంపెనీ లో ఉద్యోగం వస్తుంది. ఈలోగా ఋషి మాంచెస్టర్ ఆర్ట్ గేలరీ దర్శించేందుకు వచ్చి, స్నిగ్ధను కలిసి, ఆమెనుంచి ఆర్ట్ కు సంబంధించిన ఎన్నో విషయాలు తెలుసుకుంటాడు. ఫేస్ బుక్ లో ఋషి, స్నిగ్ధ చాటింగ్ ద్వారా వారిద్దరూ మరింత చేరువ అవుతారు. కొత్తగా చేరిన ఉద్యోగంలో మృణాళ్, అప్సరల ప్రవర్తన స్నిగ్ధకు ఆశ్చర్యం కలిగిస్తుంది, అదే ఋషితో చెప్తుంది. మహేంద్రను కలిసిన ఋషి, అతని వ్యాపార ప్రతిపాదనకు అంగీకరించి, స్నిగ్దను, అప్సరను ఆఫీస్ లో కలుస్తాడు. అప్సర, ఋషి మధ్య చనువు స్నిగ్ధకు ఆందోళన కలిగిస్తుంది. ఇక చదవండి...)
ఆగష్టు 13, 2010
రోజులు గడుస్తుండగా ఋషి, స్నిగ్ధ, అప్సర తమ తమ పనుల్లో బిజీగా ఉన్నారు. అన్నీ బాగున్నట్టే కనిపించసాగింది.
కాని ఎక్కువ కాలం జీవితాలు సాఫీగా సాగిపోవడం సహజంగానే దైవానికి ఇష్టం ఉండదు కదా ! ఆ ప్రశాంత స్థితిని కాసేపు నిలువరించేందుకు సంక్లిష్టతను తీసుకువస్తారు. ఇదే ఋషి, స్నిగ్ధ ల జీవితాల్లోనూ జరిగింది. వారిద్దరి మధ్య దూరం రెండు కారణాల వల్ల సృష్టించబడింది. ఒకటి అప్సర, మరొకటి ప్రద్యుమ్న పెయింటింగ్.
ట్రాఫ్ఫోర్డ్ సెంటర్ – స్నిగ్ధ, రుహి లు మామూలుగా కలుసుకునే చోటే, ఇదంతా ఒక్కరోజులో జరిగింది. ఆరోజు స్నిగ్ధ పుట్టినరోజు.
“స్నిగ్ధ, ఇది నీ అసలు పుట్టినరోజేనా ? నేను నీ ఫేస్బుక్ చూసాను, అందులో వేరే తేదీ ఉంది,” ఋషి స్నిగ్దను అడిగాడు.
స్నిగ్ధ నవ్వి, “నువ్వు సరిగ్గానే చెప్పావు. ఫేస్బుక్ లో ఉన్నది నా అసలు పుట్టినరోజు. కాని, నేను ఇంగ్లీష్ క్యాలెండరు ప్రకారం జరుపుకోను. నాకు తెలుగు క్యాలెండరు వాడటం ఇష్టం. అందుకే ప్రతీ ఏడాది, నా పుట్టినరోజు వేర్వేరు తేదీల్లో జరుపుకుంటాను. ఇవాళ నేను ఇంకా ఆనందంగా ఉన్నాను, ఎందుకంటే, ఈ పార్టీకి మహేంద్ర కూడా రానున్నారు,” అంది.
“అవును, ఆ విధంగా ఈ రోజు నీకు ఎంతో ప్రత్యేకమైనది. కాని నిన్ను ఆటపట్టించాలి అంటే, ఈ రోజు శుక్రవారం, 13వ తేదీ. ఈ రోజున అంతా ఏదైనా కొత్తగా చేసేందుకు ఇష్టపడరు.”
“అవునా? కాని ఎందుకు? ఈ రోజుకు ఏదైనా ప్రత్యేకమైన విశిష్టత ఉందా ?” ఆత్రంగా అడిగింది స్నిగ్ధ.
“అవును, 13 అనేది దురదృష్టకరమైన సంఖ్య అని, చాలా మంది నమ్మకం. 12 అనే అంకె, సంపూర్ణతను సూచిస్తుంది – ఏడాదికి 12 నెలలు, 12 రాశులు, రోజుకు 12 గంటలు. 13 ఆ సంపూర్ణతకు భంగం కలిగిస్తుంది అని భావిస్తారు.”
తన పుట్టినరోజున ఇటువంటి అనవసర చర్చలు జరగడం స్నిగ్ధకు కాస్త ఇబ్బందిగా ఉంది. ఆమెకు మూడనమ్మకాలను నమ్మదు. అందుకే ఆమె ఋషిని మాట్లడనిచ్చింది.
“శుక్రవారాన్ని పాతరోజుల్లో కూడా దురదృష్టకరంగా భావించేవారు. ఉదాహరణకు, ఇప్పటికీ కూడా “బ్లాక్ ఫ్రైడే” న స్టాక్ మార్కెట్ పడిపోతుంది. అందుకే, శుక్రవారం, 13 కలయిక అనేకమందికి భయాన్ని కలిగిస్తుంది. జీసస్ కూడా ఈ రోజునే చనిపోయాడని, అప్పుడు సరిగ్గా అతని వద్ద 13 మంది ఉన్నారని, వారితో ఆయన చివరి విందు చేస్తున్నారని, అంటారు”
ఋషి మాట్లాడడం పూర్తి చెయ్యగానే, స్నిగ్ధ దిగ్భ్రమతో మూగబోయింది. ఋషి ఆ నిశ్శబ్దాన్ని తిరిగి ఛేదిస్తూ, మళ్ళీ ఇలా కొనసాగించాడు.
“చింతించకు, మూడనమ్మకాలు ప్రపంచంలో సహజమే. కాని అంతా వాటిని నమ్మరు. తేలిగ్గా తీసుకుని, నీ పుట్టినరోజును ఆస్వాదించు.”
అలా అంటూ అతను ఆమెకొక పుట్టినరోజు కానుకను ఇచ్చాడు, ‘బిజౌక్ష్ ‘ అనే స్విస్ వాచ్ అది. అది పింక్ కలర్ లో చూడముచ్చటగా ఉంది, ఇది స్విట్జర్లాండ్ లో చేత్తో చేసిన సంప్రదాయ వాచ్. ఋషి స్నిగ్ధ కోసం దాన్ని ఆర్డర్ ఇచ్చి, ప్రత్యేకంగా చేయించాడు.
స్నిగ్ధ ఆ వాచ్ అందాన్ని చూసి మురిసిపోయింది. అంత అద్భుతమైన కానుక ఇచ్చినందుకు ఆమె ఋషికి కృతఙ్ఞతలు తెలిపింది. దీని కోసం ఋషికి ఎంత ఖర్చు అయ్యిందో ఆమెకు బాగా తెలుసు. అందుకే, తీసుకోనంటే ఋషి బాధపడతాడని, ఆమె ఆ బహుమతి తీసుకుంది.
ఆ వాచ్ తయారీలోని పనితీరును, సౌందర్యాన్ని గమనిస్తూ, ఋషి ఆమె మనసులో సృష్టించిన భయాన్ని ఆమె మర్చిపోయింది.
కాని, ఆమె మూడనమ్మకాలను నమ్మినా, నమ్మకపోయినా, ఆ రోజు ఆమె జీవితంలో మార్పు తేబోతోంది, అది ఇంకా ఆమె తెలుసుకోవాల్సి ఉంది. ఆ క్షణాలు అప్సర, మహేంద్ర రెస్టారెంట్ లోకి రావడంతో మొదలయ్యాయి.
“హలో, స్నిగ్ధ, పుట్టినరోజు శుభాకాంక్షలు,” మహేంద్ర పూల బొకే తో ఆమెకు శుభాకాంక్షలు తెలిపాడు. అప్సర కూడా ఆయన్ను అనుసరించింది.
స్నిగ్ధ ఆనందంతో పొంగిపోయింది. ఏడాది క్రితం ఆమె కేవలం ఒక కాలేజీ ఇంటర్న్. కాని ఈరోజు ఆమె గొప్ప వ్యాపార దిగ్గజమైన మహేంద్రతో కూర్చుని భోజనం చేస్తోంది.
వారు ఋషిని కూడా పలకరించారు. అప్సర ఋషితో తన సంభాషణ కొనసాగించింది, మహేంద్ర స్నిగ్ధ వైపు తిరిగారు.
“అయితే స్నిగ్ధ, పుట్టినరోజు గురించి నువ్వు చాలా తక్కువ సమయం ముందు చెప్పడం వల్ల, నేను నీకోసం ఏమీ తీసుకుని రాలేకపోయాను. కాని నా తరఫున నీకొక ఓపెన్ ఆఫర్. నీకు కావాల్సిన పెయింటింగ్ అడుగు, నీకు ఇప్పించే ఏర్పాటు చేస్తాను. నా ప్రాజెక్ట్ స్వప్నాన్ని సాకారం చేసేందుకు అహర్నిశలూ కష్టపడుతూ, దాన్ని సమర్ధవంతంగా ముగిస్తున్న నీకోసం నేను చెయ్యగలిగింది ఇదే.” మహేంద్ర  నిజాయితీగా అన్నారు.
స్నిగ్ధ మొదట ఆయనకు వినమ్రంగా కృతఙ్ఞతలు చెప్పి, ఏమీ వద్దంది. అయినా మహేంద్ర ఆమెను మొహమాట పడవద్దని, ఒక పెయింటింగ్ ను ఎన్నుకోమని, ఒత్తిడి తెచ్చారు.
స్నిగ్ధ వెంటనే స్పందించలేకపోయింది. కాని కొన్ని క్షణాల తర్వాత, ఆమె మనసువిప్పి, ఇలా అంది, “ సర్, అయితే నేను అడిగింది మీరు కాదనకూడదు.”
మహేంద్ర ఆమెను నిస్సంకోచంగా అడగమన్నారు.
“సర్, నాకొక పోర్ట్రైట్ బహుమతిగా కావాలి. ఒక ‘డిఎన్ఏ’ పోర్ట్రైట్. ఇది డిజిటల్ పెయింటింగ్ లలో తాజా ఆవిష్కరణ. ఇందుకు నాకు కావలసింది, మీ వేలిముద్ర. దీన్ని ఒక వ్యాపారికి పంపితే, దాన్ని అతనొక అద్భుతమైన పెయింటింగ్ గా మార్చి పంపుతాడు,” అంది  స్నిగ్ధ.
మహేంద్రకు ఆమె కోరిక బాగా నచ్చింది. వ్యక్తిగత జీవితంలో కూడా ఆమె కళాభిరుచిని ఆయన మెచ్చుకున్నారు.
డిఎన్ఏ పోర్ట్రైట్ అనేది ఆధునిక ఆవిష్కరణ. డిఎన్ఏ ఆర్ట్ లో నిపుణులైన వ్యాపారుల్ని, చిత్రాలతో మానసిక అనుబంధం ఉన్నవారు కలుస్తారు. డిఎన్ఏ ఆర్ట్ అనేది, కొనుగోలు చేసేవారిని, చిత్రంతో మేళవించి, కోనుగోలుదారుడి ప్రత్యేకతను, చిత్రంలో కళాత్మకంగా ప్రతిబింబిస్తుంది.
వ్యాపారి వెబ్సైటులో ఒక కిట్ ను రిజిస్టర్ చేసుకునే వీలు ఉంది. రిజిస్టర్ చేసుకున్న కొన్ని వారాల తర్వాత ఈ కిట్ కొనుగోలుదారుడికి అందుతుంది. చిత్రంపై కావలసిన ముద్రలను కొనుగోలుదారుడు సేకరించాలి. అది వేలిముద్ర,  ముద్ర, పాదముద్ర, ఏమైనా కావచ్చు. ఈ ముద్రలను “డిజిటల్ ఆర్ట్ టెక్నిక్ “ ద్వారా పెయింటింగ్ లాగా మారుస్తారు. వెబ్సైటులో వినియోగదారులు ఎన్నుకునేందుకు అనేక నమూనాలు ఉన్నాయి. అంతేకాక, ఆ వెబ్సైటులో చిత్రంపై కొనుగోలుదారుడి సంతకాన్ని సృష్టించేందుకు కూడా వసతి ఉంది.
పుట్టినరోజు బహుమతిని గురించి వినగానే ఋషి, అప్సర – మహేంద్ర, స్నిగ్ధ వైపు తిరిగారు. అప్సర నవ్వి, “ కాని ఇవాళ మనం మృణాల్ ను మిస్ అవుతున్నాము. ఇప్పుడే అతను ఆఫీస్ నుంచి బైటికి వచ్చాడు. మన ఆర్ట్ మ్యుజియం కు ఒక పెయింటింగ్ ను అమ్మేందుకు సిద్ధంగా ఉన్న ఒక ఇటలీ ఆర్ట్ కలెక్టర్ ను కలవమని నేను అతనికి చెప్పాను,” అంది.
స్నిగ్ధ మృణాల్ ను తప్పించుకున్నందుకు సంతోషంగా ఉన్నా, బైటికి మాత్రం ,” అవును, మృణాల్ లేనందుకు నాకూ బాధగానే ఉన్నా, మహేంద్ర గారు దొరకడం కూడా ముఖ్యమే కదా. కాబట్టి, అందరూ బహుమతి ఇచ్చేందుకు సిద్ధమైతే, నేను వెంటనే మన వేలిముద్రలు తీసుకుంటాను.” అంది.
“వేలిముద్రలా? బయటివారితో అవి పంచుకోవడం మంచిదేనా ?” మహేంద్ర మొదట అభ్యంతరం వ్యక్తపరిచారు, “ప్రతి మనిషికి ప్రత్యేకమైనవి అవే కదా !”
“నిజమే సర్, నాకు మీరన్నది అర్ధమవుతుంది. కాని, వేలిముద్రలు పంచుకోవడం అనేది ప్రమాదం కాదని నాకు చెప్పారు. ఇది కేవలం మనదైన ఒక మధుర జ్ఞాపకం కోసమేనని, నేను హామీ ఇస్తున్నాను. మన రెటినా కు గాని, ఏ ఇతర అవయవాలకు గాని, మనం నకలును సృష్టించలేము.” మహేంద్ర ఏమనుకుంటారో అన్న సంకోచం ఉన్నా, ఆమె మామూలుగా చెప్పేందుకు ప్రయత్నించింది. కాని ఆమె భావంలో స్పష్టత ఉన్నందువల్ల, సూటిగా చెప్పగలుగుతోంది.
“స్నిగ్ధ- మనిషికి ప్రత్యేకమైనవి కేవలం రెటీనా, వేలిముద్రలు మాత్రమే కాదు, పెదవుల ముద్రలు కూడా ప్రతి వ్యక్తికీ ప్రత్యేకమైనవే !” ఋషి సంభాషణను తేలిక పరిచేందుకు అందులో జోక్యం కల్పించుకున్నాడు.
“ఋషి, నువ్వెప్పుడూ ఇలాగే కొంటెగా మాట్లాడతావు. నీవంటి వాళ్ళు బ్యాంకింగ్ ఇండస్ట్రీ లో ఉంటే, ఇక మాకు ATM లు, క్రెడిట్ కార్డు లు అక్కర్లేదు. నువ్వు ఆర్ధిక లావాదేవీలకు ‘కిస్సింగ్ మెషిన్’ లను కనిపెడతావు. మాల్ల్స్ లో బిల్లింగ్ కౌంటర్ వద్ద, కార్డు ను స్వైప్ చేసే బదులు, మెషిన్ లకు ముద్దు పెట్టి వెళ్ళే వాళ్ళతో ఎగ్జిట్ డోర్లు నిండిపోతాయి,” అప్సర అందరినీ పగలబడి నవ్వేలా చేసింది.
వాతావరణం తేలిక పడ్డాకా, స్నిగ్ధ వెంటనే తన బాగ్ లోంచి గ్రీటింగ్ కార్డు లాగా కనిపిస్తూ, పైన ఒక స్టికర్ ఉన్న చిన్న కిట్ ను తీసింది. తర్వాత, దాన్ని తెరిచి, ఒక ప్రత్యేకమైన “ఇంకు పాడ్” ను తీసింది. వేళ్ళకు ఇంకును అద్ది, వేలిముద్రను ఆ కార్డు పై ఉన్న ప్రత్యేకమైన ఖాళీ స్థలంలో వెయ్యవచ్చు.
స్నిగ్ధ అందరికీ వేర్వేరు కార్డ్స్ ఇచ్చింది. నెట్ లో దీని గురించి చదివినప్పటి ఆమె దీన్ని తన మిత్రులు అందరికీ ‘గిఫ్టింగ్ టూల్’ లాగా వాడుతోంది. అది తక్కువ ఖరీదైనదే అయినా, సృజనాత్మకమైన ఆలోచనలు ఉన్నవారికి అది ప్రత్యేకమైన బహుమతి.
వారు పూర్తీ చెయ్యగానే, స్నిగ్ధ జాగ్రత్తగా అన్నీ తీసుకుని, బాగ్ లో పెట్టింది. వారంతా డిన్నర్ కోసం వెళ్ళారు. వారు భోజనం చేస్తూ ఉండగా, మహేంద్రకు వరుసగా కాల్స్ రాసాగాయి. ఋషి ఇది గమనించి, మహేంద్ర పని ముగిసాకా, ఇలా అన్నాడు.
“హలో సర్, మీరు ఏదో పనిలో చాలా హడావిడిగా ఉన్నట్లు ఉన్నారు. అంతా బానే ఉందిగా.”
తాజాగా నిర్వాణా ప్లస్ ఎదుర్కుంటున్న సమస్యల గురించి రుషి వార్తాపత్రికల్లో చదువుతున్నాడు. ఇండియా లోని టాప్ సాఫ్ట్వేర్ కంపెనీలలో ఇది ఇంకా ప్రధమ స్థానంలోనే ఉండగా, కంపెనీ ప్రతిష్ట తాజాగా మీడియా వాళ్ళ దృష్టిని ఆకర్షించింది.
(సశేషం...)

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top