కాలాన్ని కడిగేద్దాం రండి!

 డా. శ్రీమతి పుట్టపర్తి నాగపద్మిని

కాలం...
కమ్మ కమ్మని మాటలు చెబుతూ,
ఇన్నిరోజులూ,
నాలోంచీ ప్రవహించింది.
నన్ను బహురూపిని చేసింది.
యెలా అంటారా?
మొట్టమొదటి సారి పరిచయమైనపుదు,
నవ్వే రూపుదాల్చినట్టు యెదుట నిలబడింది!
సముద్ర తీరాన,
సైకత శీతల స్పర్శతో,
బాల్యపు రాచబాటలోకి నన్ను తీసుకెళ్ళింది.
సమ్మోహకంగా నవ్వుతూ, తెరమరుగయ్యింది.
కాలాన్ని కాకాపట్టి,
చిన్నతనపు గుజ్జనగూళ్ళలో,
దాక్కుపోదామనుకున్నా!
కాలం. కన్నుగప్పి,
పెన్న నీటి చెలమల్లో,
చల్లదనంగా వుండిపోదామనుకున్నా!
కానీ కాలానికి ఒళ్ళంతా కళ్ళేగా!
చీమలుదూరని చిట్టడవిలోనైనా,
నిన్ను పట్టి పలకరిస్తానని ఫక్కున నవ్వింది.
నన్ను యవ్వన వర్ణలోకంలోకి
వెంటబెట్టుకుని వచ్చింది,
ఠక్కున మాయమైపోయింది.
కనుచూపుమేరా, కందర్పుని కమనీయ క్రీడారంగాలే!
సారంగుని సరస సల్లాపాలే! అనుబంధాల వుయ్యాలపాటలే!
సీతాకోక చిలుకలతో మంతనాలాడుతూ,
వెన్నెల జలపాతాలతో మమేకమైపోతూ,
ఇరవైలలోనే ఇల్లుకట్టుకుని వుంటానని, వేడుకున్నా!
కాలం కాళ్ళు పట్టుకునైనా,
మనసిజుని సరసనే మైమరచిపోదామని పథకం వేసుకున్నా!
కాలం భళ్ళున నవ్వింది! పురాణాలు ప్రవచించింది!
రాముణ్ణీ, కృషుణ్ణీ తన సత్తాయేమిటొ అడిగిచూడమంది.
భీమసేనుడూ , భీష్ముడూ వచ్చినా, తనముందు నిలువలేరంది.
ఆ వాక్చాతుర్యానికి అవాక్కైపోయా!
కాలం పిడికిత్లో బందీనై,
అరవైల అంకణాల్లొకి అడుగుపెట్టా!
యెటు విన్నా, యేకాంత రాగాలు!
యెటు కన్నా వార్ధక్యపు వింత గాధలు !
కొమ్మ కొమ్మనా,
చల్లని స్పర్శ కై తల్లడిల్లిపోతున్న పండుటాకులు!
బొమ్మ కడుతున్న వైరాగ్య వీణాతంత్రులు!
చెప్పొద్దూ,
కాలాన్ని కంటిచూపుతో కాల్చేద్దమనుకున్నా!
యేమిటి నీ దౌర్జన్యమని నిలదీయాలనుకున్నా!
కనిపిస్తే, కాల రుద్రునిలా కబళించివేయాలనుకున్నా!
కానీ..
కాలం యెప్పుడో కరిగి ఆవిరైపోయింది!
ఇంతవరకూ
అరచేతిలో స్వర్గం చూపించిన కాలం,
అర క్షణంలో అంతర్ధానమైపొయింది!
ఇంక చేసేదేముంది?
ఫలితకేశాలతో మంతనాలాడటం మొదలెట్టా!
వయోధికుల విన్నపాలకోసం వేదికనేర్పాటుచేసి,
కాలాన్ని విశిష్ట అతిధిగా ఆహ్వానిద్దామని, ఆలోచిస్తున్నా!
పదిమంది ముందూ కడిగేద్దామనుకున్నా!
అందుకే మీవద్దకొచ్చా!
మీలో యెవరైనా కాలాన్ని చూశారా?
చూసేవుంటే,
మీకూ పరిచయమై ఉంటే,
దాని సెల్లు నంబరో,
డ్రైవింగ్ లైసెన్సు సమాచారమో,
ఆధార్ కార్డు వివరాలో,

దయచేసి ఇవ్వరూ?

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top