Wednesday, March 23, 2016

thumbnail

బాలకృష్ణం..

"బాలకృష్ణం.."

- ప్రతాప వెంకట సుబ్బారాయుడు"అమ్మా..యశోదమ్మా.."
తలుపుకు ఉన్న గొళ్లెంతో శబ్దం చేస్తూ, వినిపించిన మాటలు విని వీధిద్వారం వైపు వచ్చింది యశోద.
దాదాపు ఊళ్లోని గోపస్త్రీలందరూ కట్టకట్టుకుని తనింటికి రావడం చూసి-"ఏవమ్మా! మా కృష్ణుడు, అమాయక బాలుడు. వాడు మీ ఇళ్లలోకి జొరబడి వెన్న తిని, పాలు తాగేస్తున్నాడని, తన అల్లరితో మిమ్మల్ని తెగ ఇబ్బంది పెడుతున్నాడని మీరు రోజూ చెబుతుంటే, అభాండాలు వేస్తుంటే, తట్టుకోలేక వాడి లేత నడుముకు తాడుకట్టి రోటికి బంధించాను..పాపిష్టిదాన్ని. ఇప్పుడు మీ కళ్లు చల్లబడ్దాయా? వాడు ఈనాడు బయటకు రాలేదు కదా! నా ఇంటనే కట్టివేయబడి ఉన్నాడు కదా! మరి ఏం చాడీలు చెబుదామని కట్ట కట్టుకుని ఇలా ఇంటిముందుకు వచ్చారు?" మనసులోని బాధను కన్నీళ్లతోనూ, మాటల్తోనూ వ్యక్తపరచింది యశోద.
"లేదమ్మా..లేదు. మేము నీకు బాలకృష్ణుడి ఆగడాలు చెప్పి చాలా తప్పుచేశాం. నువ్వు ఆ పసివాణ్ని రోటికి కట్టేసేంత నిర్ణయం తీసుకుంటావనుకోలేదు. మావల్ల గొప్ప పొరబాటే జరిగిపోయింది. కృష్ణుని అల్లరి లేని పల్లె నిశ్సబ్దమైపోయింది. ఆకులు కదలకుండా, పిట్టలు ఎగరకుండా ప్రకృతి స్థబ్దమైనట్టుగా ఉంది. ఇలాంటి ప్రశాంతతను తట్టుకోలేకపోతున్నాము. బాలకృష్ణుడు చేసే చిలిపి పనులు మాలో జీవం నింపేవి. చైతన్యాన్ని పంచేవి. ఇప్పుడు మా ఇళ్లలో ఉట్టిమీద పాలూ, పెరుగు అలాగే ఉన్నాయి..కాని మా మనసులు మాత్రం వెలితిగా ఉన్నాయి. మేము చెప్పామే అనుకో, పసిపిల్లవాడని కూడా చూడకుండా..తల్లివైవుండి అలా ఎలా కట్టేశావు? వాడు లేక మేమే ఇంతలా తల్లడిల్లి పోతున్నామే..మరి తల్లివి నువ్వెలా ఉండగలుగుతున్నావు? చాలమ్మా..చాలు..వెళ్లి కట్టువిప్పి, తాడు రాసుకుపోవడం వల్ల వాడి లేతనడుముకు కలిగిన వాతలకూ, గాయాలకూ కాస్త నవనీతం రాసి బయటకు పంపు..వాడిని చూసి ఎంతో కాలమైనట్టుగా ఉంది" అన్నారు బాధగా.
ఆ మాటలు విన్న యశోద ఉండబట్టలేక మాతృమమకారంతో పరుగు పరుగున ఇంటి పెరట్లోకి వెళ్లి అక్కడి దృశ్యం చూసి ఆశ్చర్యచకితురాలయింది.
అప్పటికే శ్రీకృష్ణుడు రోటిని బలంగా ఈడ్చుకుంటూ రెండు మద్ది చెట్లనుంచీ లాగడం వలన ఆ చెట్ల రూపంలో ఉన్న గంధర్వులకు శాపవిమోచనం కలిగి వారు ఆయనకు నమస్కరించి అదృశ్యమైపోయారు.
తర్వాత తేరుకుని, యశోద రోదిస్తూ, శ్రీకృష్ణుడికి ఉన్న కట్లు విప్పదీసి ఆత్రంగా అతని గాయాలకు ముద్దుల లేపనం అలది అతణ్ని సేదతీర్చింది.
అది చూసిన గోపికలు ‘ఆహా..ఎంతగొప్ప దృశ్యమిది. శ్రీకృష్ణుడి అల్లరి చేష్టలకు ఆలవాలమైన మా పల్లె ఎంత గొప్పది. నిత్యం అతన్నిఏదో విధంగా దర్శించుకునే మేమెంత గొప్పవాళ్లం.  భగవంతుడు కరుణాసముద్రుడు, మాకు అతనితో చరించే అదృష్టం ప్రసాదించాడు’ అని మనసులో తనమయత్వాన్నందుతూ, మైమరచిపోతూ ఇంటిదారి పట్టారు.
లోకాస్సమస్తా సుఖినో భవన్తు!
***

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

Comment with Facebook

No Comments


Worlds Best Telugu Online Magazine

మా గురించి

నమస్కారం ! అచ్చతెలుగు లోగిలికి స్వాగతం.

నా పేరు భావరాజు పద్మిని.

5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి. 'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి 'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము.
వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....

aboutus.acchamgatelugu Click here to Read More. Feel free to reach us for more information