చిత్రకళా ప్రవీణ - ఆర్టిస్ట్ ఆదిలక్ష్మి - అచ్చంగా తెలుగు

చిత్రకళా ప్రవీణ - ఆర్టిస్ట్ ఆదిలక్ష్మి

Share This

చిత్రకళా ప్రవీణ - ఆర్టిస్ట్ ఆదిలక్ష్మి


"ప్రకృతి, అమ్మ నాకు ప్రేరణ." అంటారు  విభిన్న  చిత్రకళా  శైలుల్లో నిపుణురాలు ఆదిలక్ష్మి గారు. వాల్ హంగింగ్స్,  సారీ పెయింటింగ్, పాట్ పెయింటింగ్, షో పీసెస్, ఫ్రూట్ షేపింగ్,  లేస్ వర్క్స్  లో  తనకున్న నైపుణ్యంతో  ఎన్నో  వర్క్ షాప్ లను నిర్వాహించారు ఆమె. ఎవరికైనా 20 నిముషాల్లోనే  సులువుగా  చిత్రకళను నేర్పడంలో, కొద్ది క్షణాల్లోనే కలర్ కాంబినేషన్ ల పట్ల అవగాహన కల్పించడంలో, ఆమె నిపుణురాలు. ఆదిలక్ష్మి  గారితో  ముఖాముఖి, ఈ నెల  ప్రత్యేకించి మీ కోసం...
 1. మీ బాల్యం, కుటుంబ నేపధ్యం గురించి క్లుప్తంగా చెప్పండి. 
నేను ఆదిలక్ష్మిని. పుట్టిపెరిగింది పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురం. శ్రీమతి యర్రమిల్లి లలిత, వెంకట రత్నం గారు  మా తల్లిదండ్రులు. నాన్నగారు లాయరు, అమ్మ గృహిణి. మేము ముగ్గురు అక్కచెల్లెళ్ళం, ముగ్గురు అన్నదమ్ములం. నేను నరసాపురం లోనే మా తాతగారు స్థాపించిన కళాశలలొనే (వై.ఎన్. కళాశల) డిగ్రీ దాకా చదివాను. మావారు గుడిపాటి బ్రహ్మానందం. నాకు ఒక అబ్బాయి, అమ్మయి. ముగ్గురు మనవలు.
2. మీ ఇంట్లో ఆర్టిస్ట్ లు ఎవరైనా ఉన్నారా ?
మా ఇంట్లొ ఎవరు కళాకారులు లేరు కాని కళల పట్ల అభిమానం ఉండేది. మా
అమ్మ నాన్నగారు కుట్లు అల్లికలు బాగా చేసేవారు. దాని వల్ల నాకు కళల పట్ల ఆసక్తి పెరిగింది.
3. చిన్నప్పటి నుంచే బొమ్మలు వేసేవారా ? చిత్రకళ పట్ల మక్కువ ఎలా కలిగింది ?
నా చిన్నప్పుడు మా ఇంట్లో వార పత్రికలు , మాస పత్రికలు తెప్పించేవారు. అందులో చివరి పేజీలో వచ్చే చిత్రాలు, కథలకు వేసే బొమ్మలు చూసి పెనిసెలు రబ్బరు పట్టుకొని గంటలు గంటలు వేసేదాన్ని.మా ఇల్లు గోదావరి ఒడ్డున ఉండేది. (ఇప్పుడు కూడా వుందనుకోండి) మేడ మీద గది కిటికీ లోంచి గోదారి ఉదయిస్తున్న సూరీడు , గోదారిలో నీడ చూసుకుంటున్నట్లు వొంగి వున్న కొబ్బరి చెట్లు , దూరంగా మసకగా కనపడే పడవ చూస్తుంటే గదిలోంచి బయటకు రావాలనిపించేది కాదు. ఆ దృశ్యం ఇప్పటికీ నా కళ్ళముందు మెదులుతోంది. పెళ్ళి అయ్యాక మా వారు కూడా చాలా ప్రొత్సాహం ఇచ్చారు. నేను చాలా రంగాలలో కాలు పెట్టాను.
4. మీ గురువులు, అభిమానించే చిత్రకారులు ఎవరు ? మీ చిత్రకళా ప్రస్థానం ఎలా మొదలయ్యింది ?
నాకు గురువు అంటే మా అమ్మగారే. మమ్మల్ని ఒక్క నిమిషం కూడా ఖాళీగా వుండనిచ్చేవారు కాదు. సమయం వృథా చేయకుండా సద్వినియోగం చేయాలని, మనసుకు నచ్చిన వుపయోగకరమైన పనులు చేసుకోవాలని చెప్పేవారు. నరసాపురం లేసులకి ప్రసిద్ది కదా. లేసులు అల్లే వారిని ఇంటికి పిలిపించి నేర్పించారు. తరువాత మావారు వుద్యోగ రీత్యా విజయవాడలో వున్నప్పుడు  పైంటింగ్స్, నిబ్ పైంటింగ్స్, ఎంబోసింగ్ , సాఫ్ట్ టాయస్ , మ్యూరల్స్ , హాండ్ ఎంబ్రాయిడరీ ఇలా ఇంకా చాలా నేర్చుకున్నాను.
5. ఈ రంగాన్ని ఎంచుకున్నాకా మీరు ఎటువంటి ఒడిదుడుకులను
ఎదుర్కున్నారు ?  
ప్రతి కళాకారుడికి ఒకొక్క ప్రత్యేకత వుంటుంది. ఒక్కొక్కరిలొ ఒక్కొక్క కోణం నచ్చుతుంది. కళలు నా వృత్తి కాదు ప్రవృత్తి కనుక ఒడిదుడుకుల ప్రసక్తి లేదు.
6. మీరు వేసిన వాటిలో బాగా పాపులర్ అయిన బొమ్మ గురించి చెప్పండి.

నేను చేసిన వినాయకుడి మ్యూరల్ ని అందరు మెచ్చుకుంటారు.
7. మీరు పొందిన అవార్డులు, మర్చిపోలేని ప్రశంసల గురించి చెప్పండి.
విజయవాడలో ఎక్జిబిషన్ లో నా పైంటింగ్ కి ప్రథమ బహుమతి వచ్చింది.
మా ఇంటికి వచ్చిన వాళ్ళంతా నా ఆర్ట్ ని , నేను మా ఇల్లు పెట్టుకున్న తీరుని , మా రూఫ్ గార్డెన్ని మెచ్చుకుంటుంటే నాకెంతో ఆనందంగా , గర్వంగా వుంటుంది.
8. మీ అభిరుచులకు మీ కుటుంబసభ్యుల ప్రోత్సాహం ఎలా ఉంటుంది ?
మావారు, పిల్లలు , అక్కచెల్లెళ్ళు నన్ను చాలా ప్రొత్సహించారు. ఆర్ట్ కి
సంబంధించినవి  కొత్తవి కనబడితే మా పిల్లలు పంపిస్తారు. నేను ప్రత్యేకంగా చెప్పాలంటే పూజలు అవీ చేసేకన్నా పైంటింగ్స్ వేస్తూవుంటే ప్రశాంతంగా యోగా చేసినంత రిలాక్స్ అవుతాను.
9. భావి చిత్రకారులకు మీరిచ్చే సందేశం ఏమిటి ?
సందేశం ఇచ్చేంత పెద్దదాన్ని కాదుగాని కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్టు ఆసక్తి వుంటే ఏదేనా సాధించగలం. మన మీద మనకు ఆత్మ విశ్వాసం పెంచుకుని , వొడిదుడుకులు ఎదురుకుని దృఢ సంకల్పంతో అడుగు ముందుకు వెయ్యాలి. అప్పుడు ప్రగతి పధంలో దిగ్విజయంగా ముందుకు సాగగలరు.
****

No comments:

Post a Comment

Pages