Wednesday, March 23, 2016

thumbnail

ఆకాశపాకాశ మాయెఁ గోమలినడుము

అన్నమయ్య పదాల పరమార్థం                                          

ఆకాశపాకాశ మాయెఁ గోమలినడుము(రేకు: 0058-4 సంపుటం: 06-100)

డా. తాడేపల్లి పతంజలి



పల్లవి
          వేంకటేశుని  పొందు యొక్క వేగము తెలుపుట కొరకు  ;కోమలి నడుము ఆకాశపాకాశము (అల్లకల్లోలం) అయింది
          చరణము1
          ఎర్రని పెదవిపై  పగలు పూటే చుక్కలు మొలిచాయి. మొగము చుట్టూ గాలి గుడిలా కస్తూరి గుండ్రంగా అద్దుకొంది. ఇది రాబోయే           మన్మథ సంగ్రామములో కోమలి భర్తతో చేసే గోటి నొక్కుల సరసాలకు సూచన.
          చరణము 2
          కనుబొమ్మలలోని  బెదిరింపులు  ఇంద్రధనుస్సులను గెలిచాయి. కన్నులలో  ఎర్రటి మేఘాలు గొప్పగా మొలిచాయి.   అధికమయిన కుంకుమ చెమటల నెత్తురులు నాయికపై కురియటానికి వానకు మారుగా తయారయ్యాయి.
          చరణము 3.
                నాయికకు  ఎడమ తొడ అదిరింది.( శకున శాస్త్రం ప్రకారం శుభం) భూకంపపు జ్ఞానము  చలించకుండా కలిగింది.వేంకటేశుని           అభిప్రాయము ప్రకారము కలిగిన పొందు కొంగుబంగారమయింది (సులభ సాధ్యమైంది)  . అందుకే కోరికలు ఆమెకు మీరి           పోయాయి.
పరమార్థం
            అన్నమయ్య కీర్తనల్లో చాలా వరకు “వేంకటశైలవల్లభ   రతిక్రీడారహస్యంబులు”(సంకీర్తన లక్షణము 12 వ పద్యం)ఇంకోమాటలో           చెప్పాలంటే స్వామి వారి శృంగార క్రీడలకు    సంబంధించిన రహస్యాలను తెలియ          చేసేవి.ఈ కీర్తన    కూడా  ఈ విభాగానికి           చెందిందే.
          “బ్రహ్మ దేవుడు సమస్త సౌందర్య కాంతి సమూహాన్ని(లావణ్య పుంజంబు) ఈ ద్రౌపదిగా నిర్మించాడేమో !     అందువల్లే ఈమె           లాంటి   కాంతి ఇతర స్త్రీలల్లో కనబడదు” అని  గాంధారి దేవి కోడళ్లు – ద్రౌపది దేవిని చూసినప్పుడు           అనుకొన్నారట.(నన్నయ సభా.ప.02-160)
          లావణ్యము అంటే అందమని అందరం అనుకొంటాం.  లవణము యొక్క భావము లావణ్యము అన్నారు.విశ్వనాథ. రాతి ఉప్పు           పగులగొడితే పలకలు పలకలుగా ఉంటుంది.సూర్య కిరణాలు దాని మీద పడినప్పుడు అది తళతళలాడుతుంది.కౌరవ స్త్రీల           చూపులు ప్రసరించి ద్రౌపది శరీర కాంతి జిగేలుమని వెలిగిందని వారి వివరణ.  విశ్వనాథ వివరణకు నోచుకొన్న లావణ్య శబ్దం            అన్నమయ్య నాయికలకు కూడా వర్తిస్తుంది.
          నాయిక కనుబొమ్మలలోని  బెదిరింపులు  ఇంద్రధనుస్సులను గెలిచాయి. వాటిని మించి పోయాయి అనే భావ చిత్రం లావణ్య   సీమ అంటే తప్పేమి లేదు.బెదిరింపులు ఇంద్రధనుస్సులంత అందంగా ఉంటాయండీ ! అని ఎవరైనా ప్రశ్నిస్తే వాడి శృంగార రస  విహీన జీవితాన్ని చూసి జాలి పడవలసినదే.  విశాలమైన కాటుక కళ్లతో నాయిక ఉత్తుత్తి బెదిరింపులు చేస్తుంటే , ఆ సమయంలో కదులుతున్న ఆమె  కనుబొమలు అందమైన ఇంద్ర ధనుస్సులను మీరెంత అని తీసి పడేస్తాయి.
          “నాయికకు భూకంపపు జ్ఞానము  చలించకుండా కలిగింది”-చివరి చరణంలోని ఈ భావాన్ని ఎవరికి వారు ఆలోచనతో           గ్రహించవలసినదే.ఆలోచనామృతానికి అందే భావాలు అన్నమయ్య  చాలా చెబుతుంటాడు.
                                      ఈ కీర్తనలోని పరమార్థం ఆనందం.స్వస్తి
 పల్లవి:                 ఆకాశపాకాశ మాయెఁ గోమలినడుము
                           వైకుంఠపతిపొందు వడిఁ దెలుపుకొఱకు
 చ.1:                   పరగఁ గెమ్మోవిపై పగలు చుక్కలు వొడిచె
                            పరివేషమృగనాభిఁ బరగె మోము
                            మరునిసమరమునఁ గోమలి విభునితోఁ జెనకు
                            సరసతల కిదియ సూచన చంద మాయె
చ.2:                        ఎలమి బొమ్మలజంకె లింద్రధనువులు వొడిచె
                                మొలచెఁ గన్నులఁగావి మొయిలు ఘనమై
                                కొలఁది కగ్గలపుఁగుంకుమచెమట నెత్తురులు
                                పొలఁతిపైఁ గురియుటకుఁ బోటివలె నాయె
చ.3:                         అంగనకునెడమతొడ అదరి భూకంపంబు
                                సంగతి వహించెఁ జంచలము లేక
                                ఇంగితంబుగ వేంకటేశుఁ గూడినపొందు
                                కొంగుబంగారమై కోరికలు మీఱె
 ****

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

Comment with Facebook

No Comments


Worlds Best Telugu Online Magazine

మా గురించి

నమస్కారం ! అచ్చతెలుగు లోగిలికి స్వాగతం.

నా పేరు భావరాజు పద్మిని.

5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి. 'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి 'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము.
వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....

aboutus.acchamgatelugu Click here to Read More. Feel free to reach us for more information