ఆ గుడిలో ఇద్దరు దేవుళ్ళు

రచన:  నండూరి సుందరీ నాగమణి

“అమ్మా, టీ పొయ్యండి... బాగా తల నొస్తా వుంది...” అంట్ల గిన్నెల్లో నీళ్ళు నింపుతూ అన్నది నూకాలు.
ఆలోచనలోంచి తేరుకున్న మీనాక్షి, పొయ్యి మీద మరుగుతున్న నీళ్ళల్లో టీ పొడిని వేసి, మళ్ళీ ఆలోచనల్లోకి జారిపోయింది.
“ఏటమ్మా, ఏటైనాది, అదోరకంగా ఉన్నది మొకవంతానూ?” బరబరా గిన్నెలు తోముతూనే అడిగింది నూకాలు.
“ఏం చెప్పమంటావే? ఈరోజు చాలా విలువైనదే పోగొట్టుకున్నాను...” మ్లానమైన ముఖంతో మీనాక్షి చెబుతూ ఉండగానే ఆమె కళ్ళల్లో నీళ్ళు చిప్పిల్లాయి.
ప్రశ్నార్థకంగా చూసిన నూకాలుకు, పమిటకొంగు చాటునుంచి గొలుసు తీసి చూపించింది మీనాక్షి. నిండైన రెండు మంగళ సూత్రాలకు బదులుగా ఒకే ఒక పసుపుకొమ్ము పసుపు రాసిన నూలు దారానికి కట్టబడి ఉంది.
“అదేటమ్మా మీ సూత్రాలేయీ?
“మధ్యాహ్నం ఒంటిగంటకు బ్యాంకుకీ, అక్కడి నుంచి సూపర్ మార్కెట్ కీ వెళ్లి సరుకులు తెచ్చాను. వచ్చేటప్పుడు ఆటోలోనే వచ్చాను, కాని వెళ్ళేటప్పుడు బరువులేవీ లేవు కనుక సిటీ బస్సులో వెళ్లాను. ఇంటికొచ్చాక బాత్ రూములో ముఖం కడుక్కుంటూ ఉంటే  అప్పుడు గమనించానే నూకాలూ... గొలుసుకు దారం ఊడిపోయి, ఒక్కటే మంగళ సూత్రం వ్రేలాడుతూ ఉంది...” మీనాక్షి చెక్కుల మీదుగా దుఃఖాశ్రువులు జలజలా రాలాయి.
“మంచంమీద బాగా సూసినారా?”
“చూసానే, ఎక్కడా కనిపించలేదు. సిటీ బస్ లోనే పడిపోయి ఉండాలి. ఆ రోజుల్లో చెరోతులం పెట్టి, చక్కగా పైన కెంపులు పొదిగించి, మంచి డిజైన్ తో అందంగా చేయించారు. పెళ్లై పదిహేను సంవత్సరాలయినా చెక్కు చెదరనే లేదు. ఈరోజు ఏమిటో నా గ్రహచారం బావుండలేదే... అందుకే ఇలా జరిగింది. బంగారం ధర తెలుసుగా రోజు రోజుకూ చుక్కలను అంటుతోంది... వస్తువు పోయిందే అన్న బాధ కన్నా, శుక్రవారప్పూటా ఇలా జరిగిందే, ఏమౌతుందో అన్న భయం కూడా ఎక్కువగానే  ఉందే... మీ అయ్యగారు నన్నెంత సాధిస్తారో తలచుకుంటే...అమ్మో... వణుకొస్తోందంటే నమ్ము...” వాపోయింది మీనాక్షి.
“పోయిందే పొల్లు, ఉన్నాదే మనది అనుకోవాలమ్మ గోరూ... అంతకన్నా మనమేటి సేయగలవూ?” వేదాంత ధోరణిలో అంది నూకాలు.
“ఒసే నూకాలూ, ఇందాకటి నుంచీ నాలో ఒకటే ఆలోచనే... ఎవరికైనా దొరికితే, వాళ్ళు నాకు తెచ్చిస్తే ఎంత బాగుండునే... కానీ అలా జరుగుతుందా ఈ రోజుల్లో?” నీరసంగా అంది మీనాక్షి గ్లాసులో టీ పోసి నూకాలుకు అందిస్తూ.
“అలగెలగ జరుగుతాదే? జరగదే! దొరికినోడు తెచ్చియ్యడం మాట అలగుంచండి... దొంగతనం సేసీసీ, దొరనాగా మన ఎదురుంగానే తిరుగేస్తున్నా ఏటీ సెయ్యనేం గందా?” గిన్నెలు కడగటం పూర్తి చేసి నేల మీద కూర్చున్న నూకాలు గ్లాసు అందుకున్నట్టే అందుకొని, పక్కన పెట్టేసింది.
“అదేమిటే? ముందు టీ తాగు...”
“బాగా ఏడిగున్నాది. ముందల మీకో ఇసయం సెప్పాల నమ్ముతారు గదూ? మీ దగ్గర పనిలో సేరక మునుపు అంటే ఆర్నెల్ల కిందట... నా పెనిమిటీ, నానూ ఒకింట్లో పని సేసేవోళ్లం. మావోడు ఆ అయ్ గారి దగ్గర కారు డైవోరు గాను, నానేమో పొద్దుటేల నుంచీ మాపటేల దాకా ఇంటి పనీ, వొంట పనీ సేసే వోళ్ళం. మా బొట్టి పదో కలాసు సదువుతోంది కదమ్మా, పిల్ల పుస్కాలకి, పీజు కీ నా పెనిమిటి ఆడుంగరాన్ని తాకట్టెట్టేసి మూడేలు తెచ్చి ఆడి పరుసులో ఎట్టుకున్నాడు. ఆ రేత్తిరి ఇంటికెళ్ళి పరుసు సూసుకుంటే లేదమ్మ, యాడో పడిపోయినాది అనుకొని శానా దిగులడిపోనాడు. ఆ మర్నాడు కనబడ్డాది తల్లీ...”
“ఏమిటి, పర్సు దొరికిందా?” ఆశ్చర్యంగా అడిగింది మీనాక్షి.
పెదవి విరిచింది నూకాలు. “దొరక నేదమ్మా, కనబడ్డాది అంతే. మా అయ్ గారి దగ్గర...” బాధగా అంది నూకాలు.
“మీ అయ్ గారి దగ్గరా? ఛా ఆయన ఎందుకు తీసుకుంటాడు మీ పర్సు? అయినా మీ ఆయనకొక్కడికే ఉంటుందా అలాంటి పర్సు? పొరబడ్డారేమో మీరు... మీరు ఫారెస్ట్ ఆఫీసరు గారింట్లోనే కదా అప్పుడు పనిచేసింది?” నమ్మలేనట్టు అన్నది మీనాక్షి.
“మా మావ స్నేయితుడు దుబాయి నుండీ పంపినాడమ్మా ఆ పరుసు... దాని మీది డిజైనూ, ఆ రంగూ, ఇరు సుట్లా బంగారపు రంగులోన ఆ అంచూ మాకు బాగా గురుతే... ఆ రేత్రి కారులో పడిపోతే డబ్బులతో సైతంగా మా అయ్యగోరు తీసేసుకున్నారుండి. సీ సీ, అలాటి నీతి మాలినోల్ల ఉప్పు తినడం కూడా ఇట్టం నేక ఇద్దరమూ పనొగ్గేసి పారొచ్చీసినం”
“కాని నూకాలు, మీలాంటి వారి డబ్బుకు ఆశపడటానికి ఆయనకేం తక్కువ?” విస్మయంగా అంది మీనాక్షి.
“ఆయనంతే నమ్మ, ఊరికే వత్తుంటే పైసా వదలని మడిసి. అన్నీ దొంగ లెక్కలూ, లంచాలూను... లచ్చలు కోట్లు ఉండి ఏం నాబం అమ్మా, నీతీ బుద్ధీ లేకపోనాక? ఎప్పుడో పట్టుబడిపోతాడు నెండి!” ఏవగింపు గా అన్నది నూకాలు.
ఇంతలో కాలింగ్ బెల్ మ్రోగింది.
***
తలుపు తీసిన నూకాలు “రాండి బావూ...” అని పిలిచి, వంటగదిలోని వచ్చి మెల్లగా చెప్పింది... “అమ్మా తవరి కోసం ఆంజనేయ సామి గుడి సావులోరు ఒచ్చారు...” అంటూ...
ఆశ్చర్యపోతూ హాల్లోకి వచ్చిన మీనాక్షి, తెల్లని పంచె, చొక్కాలలో ఉన్న పూజారి గారిని చూడగానే కొంగు కప్పుకొని, రెండు చేతులూ జోడిస్తూ, “నమస్కారం పంతులు గారూ... కూర్చోండి...” అని కుర్చీ చూపింది.
“ఏవమ్మా, మీరీ ఉదయం గుడికి వచ్చినట్టున్నారు కదూ?” ఆమె ముఖం లోకి పరీక్షగా చూస్తూ అన్నాడు పూజారి.
“అవునండి... ఉదయం ఎనిమిది గంటలకు వచ్చాను...”
“అమ్మా, నీ మంగళ సూత్రాలు చూసుకున్నావా తల్లీ? ఇదిగో చూడు, ఇది నీదేనా?” షర్టు జేబులోంచి ఒక కాగితం పొట్లాం తీసి విప్పి చూపించాడు. అందులో కెంపుతో సహా మీనాక్షి బంగారు మంగళసూత్రం ధగధగా మెరిసిపోతోంది. ఆమెకి మూర్ఛ వచ్చినంత పనైంది.
“అయ్యోరూ, అది మా అమ్మగోరిదేనుండి... ఇందాకే సూసుకున్నారు పోయిందని...” సంభ్రమంగా అంది నూకాలు.
“అమ్మాయి, దీని జత సూత్రాన్ని చూపిస్తావా తల్లీ?” మీనాక్షిని ఉద్దేశించి అన్నాడాయన.
అదిరే గుండెలతో త్వరత్వరగా బెడ్ రూములోకి వెళ్ళింది మీనాక్షి.
“అది మీకు దొరికిందాండయ్యా? ఈరోజు లేచిన యాల మంచిది అమ్మగోరికి...” ఆనందంగా అంది నూకాలు.
మీనాక్షి తీసుకు వచ్చిన సూత్రాన్ని పరిశీలించి, తన దగ్గరున్న సూత్రంతో పోల్చి చూసి తృప్తిగా తలపంకించి, ఆమెకి ఇచ్చేసాడు పూజారి.
“ఉదయమే స్వామి హుండీ దగ్గరే కనిపించిందమ్మా... ఈరోజు గుడికి వచ్చిన ఆడువారు ఎవరెవరాని ఆలోచిస్తే నువ్వు వచ్చావని గుర్తు వచ్చింది. కాలనీలో ఉదయం గుడికి వచ్చిన ఇంకో ఇద్దరు ముగ్గురు ఇళ్ళకీ వెళ్లి అడిగాను, కాని ఇది తమది కాదని అన్నారు. మధ్యానం భోజనాల వేళ ఓ సారి వచ్చానమ్మా, నీ ఇల్లు తాళం పెట్టి ఉన్నది. అయితే నీదేనన్న మాట... జాగ్రత్తమ్మా, నేను వెళ్లి వస్తాను...” లేచాడు పూజారి.
“ఆగండి పంతులు గారూ, ఒక్క క్షణం...” అంటూ లోపలినుంచి కొత్త పంచెల చాపు తీసుకుని వచ్చి ఆయన చేతిలో పెట్టి, “అసలు మీకెలా కృతజ్ఞతలు చెప్పాలో కూడా తెలియటం లేదండి... ఈరోజుల్లో కూడా మీలాంటి వారున్నారంటే...” గద్గద స్వరంతో అంటూ ఆయనకి పాదాభివందనం చేసింది.
“అమ్మా, నేను ఆ రాంబంటు దగ్గర పనిచేస్తున్నాను... చేయాలనుకున్నా తప్పు చేయలేనమ్మా... ఇంకా నయం తల్లీ, బయటెక్కడో కాకుండా గుళ్ళోనే పడింది... రెండు సూత్రాలూ ఓ సారి దేవుడికి చూపించి గొలుసులో వేసుకోమ్మా... దీర్ఘ సుమంగళీ భవ!” ఆశీర్వదించి లేచాడాయన.
ఆయన గుమ్మం దాటీ దాటగానే, “వోలమ్మో, ఎంత దొడ్డ మడిసండీ ఈనగోరు?” అంటూ తెగ ఆశ్చర్య పడిపోయింది నూకాలు. “ఈ పంతులు బాబు గోరి కూతురికి లగ్గాలెట్టుకున్నారటమ్మా... వచ్చే వోరమే పెళ్లి... అయినా గాని బంగారానికి ఆశ పడిపోకుండా ఎలా తెచ్చిచ్చీసినారో సూసినారా? మీ పుణ్యం మంచిది అమ్మా, అందుకే దేవుడు మీ వొస్తువును మీకే అప్పజెప్పీసినాడు...” అంది నూకాలు సంబరంగా...
“నిజాయితీని మించిన దైవత్వం ఏముంది మరి? ఒకరకంగా ఈయనా దేవుడిలాంటి వాడేనే... ఆయన కూతురి పెళ్ళికి నా వంతు సాయం నేనూ చేస్తాను. ఈయన రూపంలో ఆ దేవుడే నా బంగారాన్ని నాకు అందజేశాడు నూకాలూ... హృదయం అనేది మంచిది కావాలి.   పెద్ద మనిషి, మంచి హోదాలో ఉన్న మీ ఫారెస్ట్ ఆఫీసర్ అయ్యగారి కన్నా ఈ పేద పూజారి గారు ఎన్నో మెట్ల ఎత్తున ఉన్నారు...” సంతోషంతో, నిశ్చింతతో చెమరించిన కనులను వత్తుకుంది మీనాక్షి...
***

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top