శ్రీధర మాధురి – 24

( ప్రకృతిని గురించి పూజ్య గురుదేవులు శ్రీ వి.వి.శ్రీధర్ గురూజీ అమృత వాక్కులు )

 ప్రతిసారి నేను అడవికి వెళ్ళినప్పుడు, చెట్లనీ, మొక్కలనీ, పశుపక్ష్యాదులనీ హత్తుకుంటూ ఉంటాను. అవి కూడా ఎటువంటి సంకోచం లేకుండా స్పందిస్తాయి కనుక, వాటిలో దైవత్వం ప్రస్ఫుటమవుతుంది. అప్పుడు నేను చాలా సేపు వాటన్నింటితో మాట్లాడుతూ ఉండిపోతాను. వాటికి ప్రకృతి పట్ల, విశ్వం పట్ల మంచి అవగాహన ఉంటుంది. నిజానికి, వాటిలో చాలావరకు జాగృత స్థితిలో, జ్ఞానంతో ఉంటాయి. అందుకే లౌకిక స్థితిలో అజ్ఞానంతో ఉండే మనుషులకి వాటి భాష అర్ధం కాదేమో.
*** 
“నిశ్చయం” అనుకున్నది “అనిశ్చయం”, “అనిశ్చయం” అనుకున్నది “నిశ్చయం”. ప్రకృతిలో కొన్ని అంశాలు అవి అలా జరగాల్సి ఉన్నాయి కనుక జరుగుతాయి. ప్రకృతి యొక్క వ్యవస్థలో వాటికి స్థానం లేదు కనుక, కొన్ని జరుగవు. అందుకే, ప్రకృతికి సందిగ్ధంలో పెట్టడం ఇష్టం. ప్రకృతిని ఆస్వాదించాలంటే, ఒకరు ఈ ప్రకృతిలోని “ఊహించనలవి కాకపోవడం” అనే అంశాన్ని కూడా ఆస్వాదించాలి. ఈ ప్రకృతి వ్యవస్థలో ఒకరు ఆనందమయ స్థితిలో ఉండాలంటే, “అనిశ్చయమైన” జీవితం గడిపేందుకు ప్రకృతి మాత దీవెనలు కావాలి. అందుకే ఈ క్షణం జీవిస్తూ, మలుపులను, ఎగుడు దిగుడు ప్రయాణాన్ని ఆస్వాదించండి. దీనికి గొప్ప ధైర్యం కావాలి. ఇది పిరికి వాళ్లకు, తర్కంతో ఆలోచించేవాళ్ళకు కాదు. జీవితం వినోదంగా మారిపోయి, మీరు చాలా ఆనందంగా ఉండగలుగుతారు. అంతా దైవానుగ్రహం.
  ***  
 నా గురువులందరికీ సాష్టాంగ ప్రణామాలు. సద్గురువులు, అవధూతలు మనకు ప్రేరణగా నిలిచారు. వారు మనకోసం చేసిన/ చేస్తున్నవాటికి గానూ మనం వారి ఋణం ఎన్నటికీ తీర్చుకోలేము. నా ఈ చిన్ని జీవితంలో నాకు పరిచయమైన వారంతా అమూల్యమైన వరం వంటివారు. నేను వారిని చూసి, చాలా నేర్చుకున్నాను. మీరంతా నాకు ప్రకృతి మాత స్వరూపులు. మీలోని ప్రతిఒక్కరికీ సాష్టాంగనమస్కారం , మీరు నాకు ఎంతగానో సహకరించారు. దైవం మీఅందరినీ ఆశీర్వదించు గాక.
*** 
ఎవరైనా మంచివారిని మీరు కోల్పోతే, మరొకరు వస్తారు. అప్పుడు మీరు వీరు వారికన్నా మంచివారని గుర్తిస్తారు. ప్రకృతి మాత ఎల్లప్పుడు ఒకటికంటే మెరుగైన మరొకదాన్ని చూపుతుంది.
***
వెంకటాద్రి, నేను, మహర్షి రాజర్ ఒకరోజున అడవిలో ప్రకృతి, పరిణామం, జ్ఞానం కు సంబంధించిన అంశాలను మాట్లాడుకుంటూ వెళ్లసాగాము.హర్ష కూడా మా చర్చల్లో పాల్గొనాలని అనుకున్నాడు. నా మనసులో ఒక గొప్ప సందేహం కలిగింది. ఈ ప్రకృతి యెంత తెలివైనది ? రాజర్ నా సందేహాన్ని పసిగట్టారు.
నిజమే, ప్రకృతి యెంత తెలివైనది అంటే, అది వెంకటాద్రి, హర్ష ను మనతో చర్చల్లో పాల్గొనేలా చేస్తుంది. నా చర్చల్లో పడి, నేను వెంకటాద్రి ఒక తెలివైన కోతని, హర్ష ఒక అరటి చెట్టనీ మర్చిపోయాను. వారి చర్చలు అలౌకికంగా ఉంటాయి, ఈ రోజుకీ వారు ఎంతగా పరిణితి చెందారా, అని నేను ఆశ్చర్యపోతూ ఉంటాను. మనకు సిక్స్త్ సెన్స్ ఉందని గొప్పలు కొట్టుకోడానికి, మనుషులమైన మనం యెంత అహంకారంగా ప్రవర్తిస్తాము ? అలాగైతే నా ప్రమాణాల ప్రకారంగా వేంకటాద్రి, హర్ష లకు ఆరు కంటే ఎక్కువ జ్ఞానేంద్రియాలే ఉండాలి, వారి చర్చలు అలౌకికంగా, మానవ మేధస్సుకు అందనట్లుగా ఉంటాయి కనుక.
*** 
మహర్షి రాజర్ – ఏది అన్నింటికంటే గొప్పది ?
నేను – శిష్యుడి పట్ల గురువుకు ఉండే ప్రేమ.
మహర్షి రాజర్ – ఏది అన్నింటికంటే అధమమైనది ?
నేను –  జీవితంలో ఎవరినైనా విమర్శించడం.
మహర్షి రాజర్ – ఒక శిష్యుడి ప్రాధమిక ధర్మం ఏమిటి ?
మహర్షి రాజర్ – గురువు మాటల్ని విశ్వసించడం.
మహర్షి రాజర్ – శిష్యుడికి జ్ఞానోదయం ఎప్పుడు కలుగుతుంది ?
నేను – గురుసన్నిధిలో శిష్యుడు ఎల్లప్పుడూ జ్ఞానంతో ఉంటాడు.
మహర్షి రాజర్ – శిష్యుడు ఎప్పుడు మూర్ఖంగా అనిపిస్తాడు ?
నేను – గురువు తనకు దూరంగా ఉన్నారని భావించినప్పుడు.
మహర్షి రాజర్ – ఒక గురువుకు శిష్యుడు ఎందుకు అవసరం ?
నేను – తన ప్రేమను కురిపించేందుకు.
మహర్షి రాజర్ – మరి శిష్యుడికి గురువుతో పని ఏమిటి ?
నేను – ప్రకృతిని, విశ్వాన్ని మరింత మెరుగ్గా అవగాహన చేసుకునేందుకు.
మహర్షి రాజర్ – ఇన్నేళ్ళుగా నాతో గడిపిన జీవితం నీకు ఎలా అనిపించింది ?
నేను – నేను తేల్చి చెప్పదల్చుకోలేదు, కాని అది అమృతం, నా జీవితానికి అవి అమృత ఘడియలు. చాలా ఆనందంగా గడిపాను గురుదేవా.
ఈ ప్రశ్నలను అడిగాకా, మహర్షి రాజర్ యక్ష రాజైన ‘జయంతన్’ వైపు తిరిగి, “నా పుత్రుడు ఇచ్చిన జవాబులతో నీవు ఏకీభావిస్తావా ?” అని అడిగారు.
జయంతన్ – ఏకీభవిస్తాను, చాలా చక్కగా చెప్పాడు.
మహర్షి రాజర్ -  అయితే అతనికి “కైవల్య దీపిక తంత్ర’ అనే యక్ష గానంలోని ప్రయోగాన్ని నేర్పండి.
నేను మహర్షి రాజర్ కు, జయంతన్ కు నమస్కరించాను.
యక్ష రాజైన జయంతన్  నాకు యక్షగానంలోని 252వ అధ్యాయమైన “కైవల్య దీపిక తంత్ర ప్రయోగాన్ని” నేర్పసాగారు.
అంతా దైవానుగ్రహం...
 ***
మీ తల్లిదండ్రుల్ని ప్రేమించండి...
భార్యను ప్రేమించండి...
పిల్లల్ని ప్రేమించండి...
మిత్రులను ప్రేమించండి...
ఇరుగుపోరుగువారిని ప్రేమించండి...
మీ పరిసరాలను ప్రేమించండి...
మీరు చేసే పనిని ప్రేమించండి...
మీ ఆరోగ్యాన్ని ప్రేమించండి...
మీ రోగాన్ని ప్రేమించండి...
మీలోని మంచిని ప్రేమించండి...
మీలోని చెడును కూడా ప్రేమించండి...
ప్రకృతిని ప్రేమించండి...
ఇంకా, తప్పకుండా ...
మీ శత్రువులను కూడా ప్రేమించండి...
ఏది చేసినా దైవం పేరుతో చెయ్యండి, అప్పుడు మీరు అన్నింటా, అంతటా దైవాన్ని చూడగలుగుతారు. ఎల్లప్పుడూ పరమానందంలో ఉండగలుగుతారు.
***
ప్రకృతి దేనికీ తొందరపడదు. అయినా, అన్నీ సక్రమంగా జరుగుతాయి.
 ***

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top