రాకుంటే మానుఁగాక రంతులేఁటికే - అచ్చంగా తెలుగు

రాకుంటే మానుఁగాక రంతులేఁటికే

Share This

అన్నమయ్య  శృంగార ( భక్తి) మాధురి

  రాకుంటే మానుఁగాక రంతులేఁటికే

డా. తాడేపల్లి పతంజలి


అన్నమయ్య  ఒక చెలికత్తెగా మారి  అలమేలుమంగమ్మతో ముచ్చట్లాడుతున్నాడు.
పల్లవి:   రాకుంటే మానుఁగాక రంతులేఁటికే
            వేఁకపు గుబ్బలాండ్ల విటుడాఁతఁడు
చ.1:     అంపిన కప్పురమొల్ల నంటేఁ దాననుఁ గాక
            వంపు మోముతోడ నీకు వాడనేఁటికే
            చెంపల లప్పలు నిండఁ జెరిగిన కప్పురపు -
            గంపకొప్పుల సతుల ఘనుఁడాతడు
చ.2:     ఒద్దికగాకక్కడనే వుంటే దానుండుఁ గాక
            ముద్దుమోము వంచి నీకు మొక్కనేఁటికే
            చద్దికి వేఁడికి మంచిచక్క సతుల మోవి
            పొద్దునొద్దుకారగించే భోగి యాతఁడు
చ.3:     అబ్బురపు వేంకటేశుఁడైతే దానవుఁ గాక
            గబ్బి చూపులెల్లా నీకై గప్పనేఁటికే
            జొబ్బిలేటి జవ్వాదిసోనల పన్నీట నన్ను
            గుబ్బలంటి సరసానఁ గూడెనాతఁడు (రేకు: 0001-5సం:     05-005)

ముఖ్య పదాల అర్థాలు

            రంతులేఁటికే=ఆటలెందుకే!
            వేఁకపు =ఉపద్రవం, వెగటు,వెక్కసం;
            గుబ్బలాండ్ల = యౌవనము గల ఆడవాళ్ల యొక్క
            విటుడాఁతఁడు= శృంగారి ఆ వేంకటేశుడు.
            అంపిన=పంపిన
            కప్పురము+ఒల్లను+అంటే=  కర్పూరమును ఇష్ట పడనంటే
            వంపు మోము= వంకరజుట్టుతో అందమైన మొగము
            వాడనేఁటికే= వాడన్ +ఏటికే=వాడిపోయింది ఎందుకే?
            లప్పలు = రాసులు
            గంపకొప్పుల =పెద్దకొప్పులున్న
            సతుల = పతివ్రతల
            ఒద్దికగాక=ఆనుకూల్యములేక, ప్రేమ లేక
            ముద్దుమోము = అందమైన ముఖము
            చద్దికి వేఁడికి = ప్రొద్దున, మధ్యాహ్నము వచ్చు.
            మంచిచక్క=అందమయిన చోటు(రుజువు)
            పొద్దునొద్దు= ఎప్పుడూ
            ఆరగించే=భుజించే
             భోగి =అనుభవశాలియైనపురుషుడు
            అబ్బురపు = ఆశ్చర్యపు
            గబ్బి చూపులెల్లా= గర్వపు , మోసపు చూపులు
            జొబ్బిలేటి= స్రవించు
             జవ్వాదిసోనల = జవ్వాది సుగంధ ద్రవ్యముల సన్నని వానల
            పన్నీట = చల్లని నీరు
            సరసాన= వినోదాన

తాత్పర్య విశేషాలు

            ఏమే అలమేలుమంగమ్మా ! ఆ వేంకటేశుడు రాకపోతే రాక పొమ్మను. ఆటలెందుకే!
            అయినా వాడు వెగటు కలిగించే  యౌవనము గల ఆడవాళ్ల యొక్క శృంగారి(అలాంటివానికి నీలాంటి అందగత్తెల పనిలేదు)
            01.అలమేలుమంగా ! వాడికోసం నువ్వు ముచ్చట పడి కర్పూర  తాంబూలముపంపించావు.
            వాడు కర్పూర  తాంబూలము ఇష్ట పడనంటే వంకరజుట్టుతో అందమైన నీ మొగము వాడిపోయింది ఎందుకే?
            ఆ వేంకటేశుడు తక్కువ వాడా !చెంపలలో రాసులు రాసులు కర్పూరము నింపుకొని, తన పరాక్రమముతో అవి             చెదిరిపోగా, పెద్ద కొప్పులున్న పతివ్రతల కథానాయకుడు తల్లీ !ఆ వేంకటేశుడు. నీదగ్గరికి  ఎందుకు వస్తాడే!
            02.నీమీద ప్రేమ లేకుండా ఆ పతివ్రతల దగ్గరనే ఆయనని ఉంటే ఉండమను.నీదగ్గరికి వచ్చినప్పుడు నిన్ను కరిగించటానికి నీ         ముద్దుల మోమును వంచి నీకు మొక్కటం ఎందుకే?         ప్రొద్దున, మధ్యాహ్నము అయనగారి రసికత్వపు విడిది ఆ పతివ్రతల          పెదవులు.  ప్రతినిత్యము వాటిని భుజించే భోగి నిన్ను బతిమిలాడుకోవటం ఎందుకే?
            03.అందరికీ తన మహిమలతో ఆశ్చర్యము కలిగించే వేంకటేశునిగా ఆయనకు లోకంలో పేరుంటే ఉండుగాక !
            నీదగ్గరకు వచ్చి  తన గర్వపు , మోసపు చూపులను నీ మీద కప్పటం ఎందుకు?
            ఏమిటంటున్నావు?అలమేలు మంగా ! వేంకటేశుడు  జవ్వాది సుగంధ ద్రవ్యముల సన్నని వానలలో తడిపి,    గుబ్బలంటి నీకు      పరవశం  కలిగించి నిన్ను వినోదంతో కలుస్తున్నాడా ! నేను చెప్పినవన్నీ మరిచిపోయావా !    హతోస్మి.          

            ఆంతర్యము

                        వేంకటేశుని సాన్నిహిత్యంలో, మధుర భక్తి పారవశ్యములో  అన్నమయ్య హృదయములో పాడుకొన్న కీర్తన             ఇది.లౌకిక శృంగారపు పదాల  పరదాల చాటున చిన్ని కృష్ణుని గజ్జెల చప్పుడు వినిపిస్తుంటుంది. . స్వస్తి.       
++++

No comments:

Post a Comment

Pages