పుష్యమిత్ర - అచ్చంగా తెలుగు

పుష్యమిత్ర

(ఫిక్షన్ విత్ హిస్టారికల్ టచ్)

టేకుమళ్ళ వెంకటప్పయ్య

9490400858

ప్రైం మినిస్టర్ ఆంతరంగిక సమావేశాలకు మాత్రమే ఉపయోగించే కాన్ఫరెన్సు హాలు లో డిఫెన్సు మినిస్టర్, ఇస్రో (ఇండియన్ స్పేస్ రిసర్చ్ ఆర్గనిజేషన్) ఛైర్మన్, విదేశీ వ్యవహారాల మంత్రి తదితర ముఖ్యులు ఒక కీలక సమావేశం కోసం ఎదురుచూస్తున్నారు. ఇంకో ఐదు నిముషాల్లో ప్రైం మినిస్టర్ వస్తారు. దేశానికి ప్రతిష్టాత్మకమైన ఒక ప్రాజెక్టు గురించి సమావేశం. ఇది సఫలీకృతం అయితే భారత దేశం రక్షణ వ్యవస్థ ప్రపంచంలో ప్రధమ స్థానం లో ఉంటుంది.
ఖచ్చితంగా ఎనిమిది గంటలకు ప్రైం మినిస్టర్  తన ఆంతరంగిక కార్యదర్శితో ప్రవేశించారు. "గుడ్ మార్నింగ్ టు ఎవిరీ బడీ.. నాకు ఇంకో గంటలో వేరే ముఖ్యమైన మీటింగ్ ఉంది. ఫార్మాలిటీస్ ఏమీ లేకుండా అసలు విషయానికి వస్తాను". మనదేశ రక్షణ వ్యవస్త ఎంత పటిష్టమైనప్పటికీ అందులో ఎన్నో లోటుపాట్లు లేకపోలేదు. ఈ ప్రాజెక్టు అబ్దుల్ కలాం గారి కల. క‌ల‌లు క‌నండి. వాటిని నిజం చేసుకోవ‌డానికి ప్ర‌య‌త్నించండి అంటూ సందేశం ఇచ్చిన ఆయన ఇప్పుడు ఉండి ఉంటే ఎంతో సంతోషించే వారు. మనకు ఆయన 'ఇండియన్ గ్లోబల్- ఐ' ప్రాజెక్టు ఇచ్చి పది సంవత్సరాలైంది. కానీ సాంకేతిక కారణాలవల్లా, విదేశీ సహాయం లేకుండా పూర్తిగా మన భారతదేశంలోనే తయారు చేయాలన్న మనవాళ్ళ పట్టుదలవల్ల కొంత ఆలశ్యం అయింది.
మీకు ఈ ప్రాజెక్టు గురించి డా.సతీష్ చంద్ర, ఇస్రో ఛైర్మన్ క్లుప్తంగా మీకు తెలియ జేస్తారు అని ప్రైం మినిస్టర్ అనగానే... సతీష్ చంద్ర లేచి “రాడార్ ప్రిన్సిపుల్ మీకందరికీ తెలిసిందే.  బాగా అర్ధమయ్యేందుకు చిన్న  ఉదాహరణ తో చెప్పాలి. ఒక గబ్బిలం చీకటిలో కూడా ఎలా ప్రయాణం చేయగలదో తెలుసా? కటిక చీకట్లో కూడా చెట్లకు, పుట్టలకు, స్తంభాలకు గుద్దుకోకుండా ఎలా ఎగరగలుగుతున్నాయో చాలా కాలం వరకు శాస్త్రజ్జులకు అర్థం కాలేదు. అది తెలుసుకోవడానికి ఒక ప్రయోగం చేసారు. పెద్ద గదిలో అడ్డంగా కొన్ని తీగలని కట్టి,కొన్ని గబ్బిలాలని పట్టుకొని, వాటి కళ్ళకు గంతలు కట్టి, ఆ గదిలో విడిచిపెట్టారు. అవి ఏ తీగలకైనా తగిలితే ఒక గంట మ్రోగేటట్లు అమర్చారు. కానీ అవి ఒక్క  తీగకైనా తగలకుండా మామూలు వేగంతో అవి సునాయాసంగా తీగల మధ్య సందుల్లోంచి ఎగురగలిగాయి. అంటే కళ్ళతో చూడకుండానే గబ్బిలాలు దారి తెలుసు కొంటున్నాయి అని రుజువు అయింది.కాని ఇది ఎలా సాధ్యం? అని అలోచిస్తే  అది ఎగురుతున్నప్పుడు నోటితో సన్నని కూత వేస్తుంది. ఆ కూత మామూలు శబ్ద తరంగాల కన్నా ఎక్కువ ఫ్రీక్వెన్సీ కలది కావడం చేత (సెకండుకి 45వేలు నుండి 50 వేలు సార్లు) అది మన చెవులకి వినిపించదు . ఈ హై ఫ్రీ క్వెన్సీ శబ్ద తరంగాలు ఎదురుగా  ఉన్న అడ్డంకులకి తగిలి, దాదాపు అదే వేగం తో వెనక్కి తిరిగి వచ్చి, గబ్బిలం చెవులకి తగులుతాయి. వీటి చెవులు బహు సున్నితమైనవి కావడం చేత పరావర్తనం చెంది తిరిగి వచ్చిన అల్పాల్పమైన శబ్దాలను విని, ఎదురుగా ఉన్న అడ్డంకిని గుర్తించ గలుగుతాయి.ఆ వస్తువు స్థిరంగా ఉందో లేక కదులుతోందో,  ఒక వేళ కదులుతూ ఉంటే ఏ దిశలో ఎంత వేగంతో కదులుతోందో, ఖచ్చితంగా తెలుసుకోగలుగుతాయి ! ఈ గబ్బిలం సూత్రం ఆధారంగానే రాడార్ కనిపెట్టారు. ఇక మన ఇండియన్ గ్లోబల్- ఐ విషయానికొస్తే...  సాధారణ రాడార్ దాదాపు వెయ్యి కిలోమీటర్ల దూరం కవర్ చేస్తే ఇది 10 రెట్లు ఎక్కువ దూరం కవర్ చేస్తుంది. అదీ 360 డిగ్రీలలో తిరుగుతూ.. గాలిలో తేలుతూ.. కేవలం ఆకాశం లోనే కాకుండా సముద్రంలో కూడా ఎటువంటి షిప్పులు వస్తున్నా వాటిని పసి గట్టవచ్చు. ఎంత డేగ కన్ను అంటే ఆ వాహనాలమీది గుర్తులను కూడా వాటి నంబర్లతో సహా స్పష్టంగా చూడగలం. ఈ ప్రాజెక్టుకు దాదాపు 100 కోట్లు ఖర్చు అయింది. మొదటగా దీన్ని మనం మనదేశానికి ఉత్తరాన హిమాలయాల మీద నిర్మిస్తున్నాం. ఇది సంకేతాలను ఇస్రో వారికీ మన డిఫెన్సు రీసర్చ్ వారికీ పంపుతుంది. దాన్ని వారు నిరంతరం పరిశీలించి ఏదైనా అత్యవసర సమాచారమైతే తెలియ జేస్తారు. ఇది చాలా రహస్యంగా జరగాల్సిన వ్యవహారం. ఇది మనం మీడియావారికి మన శాటిలైట్లకో మరో దానికో ఉపయోగపడే విషయం గా చెప్పండి. ఇతర దేశాలకు తెలిస్తే ధ్వంసం చేస్తారు. జాగ్రత్త అంటూ ముగించాడు తన ఉపన్యాసాన్ని.
అందరూ లేచి కరతాళ ధ్వనులతో సతీష్ చంద్ర కు కరచాలనం చేసారు. ప్రాజెక్టుకు ఇంత ఖర్చు పెట్టి చేసినందుకు ఆయన తన హృదయపూర్వక  అభినందనలు తెలియ జేస్తూ " ఇలాంటి "గ్లోబల్ ఐ" లను దక్షిణాన కన్యాకుమారి వద్దా, తూర్పున విశాఖపట్నం వద్దా, పశ్చిమ దిక్కున గోవా ప్రాంతంలో నిర్మిస్తే మన దేశానికి రక్షణ వ్యవస్త లో తిరుగులేదు. ఈ గ్లోబల్-ఐ ల పక్కనే పది వేల కిలోమీటర్ల రేంజి గల మిసైల్ లాంచింగ్ ప్రాజెక్టులను ఏర్పాటు చేసి,   సరి అయిన లాంగిట్యూడ్ లాంగిట్యూడ్ లను గ్లోబల్-ఐ ద్వారా గుర్తించి మిసైల్ ను వదిలితే రెప్ప పాటు కాలంలో శత్రు విమానాలనూ, షిప్పులనూ భస్మీ పటలం చెయ్యొచ్చు" అనగానే కరతాళ ధ్వనులు. "ఐతే వీటన్నిటికీ చాలా ధనం కావాలి ప్రభుత్వం వారు ఏర్పాటు చేస్తే శ్రీహరికోట లోని మన స్ప్రాబ్ (సాలిడ్ ప్రొపల్లెంట్ స్పేస్ బూస్టర్ ప్లాంటు), స్టెక్సు (స్తాటిక్ టెస్త్ అండ్ ఎవాల్యుయేషన్ కాంప్లెక్సు) లలో స్వదేశీ పరిజ్ఞానం తోనే గొప్ప అద్భుతాలను మనం సృష్టించుకోవచ్చు. అనగానే మళ్ళీ కరతాళ ధ్వనులు.
ప్రైం మినిస్టర్ అందుకుంటూ “మన బార్డర్లో నిత్యం జరిగే కాల్పులు, భారత భూభాగాన్ని ఆక్రమించుకోడానికి వివిధ దేశాలు చేస్తున్న దారుణ మారణ కాండలు మీకు తెలిసినవే. మనం ఇటీవల ఒక దేశంతో ఏర్పాటు చేసుకున్న శాంతి సమావేశాలు విఫలమయిన విషయం కూడా మీకు తెలుసు. మనకు పటిష్టమైన రక్షణ వ్యవస్త ఉంటే తప్ప ఇలాంటివి ఎదుర్కొనలేము. ఈ రోజు జనవరి 2 వ తారీకు. ఏప్రిల్ 1 వ తేదీనాటికి ఇండియన్ గ్లోబల్- ఐ పూర్తి స్థాయిలో పనిచెయ్యాలి” అని ఆదేశించగానే అంగీకారం గా తలవూపారు ఇస్రో ఛైర్మన్.  ఐతే గ్లోబల్ ఐ నిర్మాణం తో బాటూ జరగబోయే సంఘటనలను వారెవ్వరూ వూహించలేదు. వూహించలేరు కూడా.
*   *   *
ఇస్రో డైరక్టర్ల సమావేశం లో ఛైర్మన్ సతీష్ చంద్ర మాట్లాడుతూ "మనం అతి కొద్దివ్యవధి లో అంటే 3 నెలలో  ఇండియన్ గ్లోబల్- ఐ ని హిమాలయాల పర్వతాల మీద మన ఇండియన్ బార్డర్లో నిర్మించాల్సి ఉంది. ఈ రోజునుండే కష్టపడితే తప్ప అది సాధ్యం కాదు. మనకు గ్లోబ్ తయారు చేసేదానికి ఎంతకాలం పడుతుంది కనిష్కవర్ధన్? అనగానే ఛీఫ్ ప్రాజెక్ట్ డైరక్టర్ లేచి కనీసం రెండు నెలలలు పడుతుంది సార్! అదీ రోజుకు కనీసం 18 గంటలు పనిచేస్తే! అన్నాడు. "పర్వాలేదు రెండు షిఫ్టులుగా పనిచేయండి.. రేపే పని మొదలుపెట్టండి" అని అంటూ.. కనస్ట్రక్షన్ ఛీఫ్ వేపు తిరిగి.. ఈలోపు మనం హిమాలయాలపై టవర్ నిర్మాణం చేపట్టాలి. రాడార్ గది, అవసరమైతే మిసైల్స్ అక్కడనుండే వదిలేదానికి కావలసిన ఇంఫ్రాస్ట్రక్చర్ అంతా రెడీ చెయ్యండి. హైఫ్రీక్వెన్సీ యాంటెన్నాలు నిర్మించండి.  ఈ లోపు కావలసిన టెక్నికల్ మెటీరియల్ రెడీ చేసుకుంటే నేను డిఫెన్సు మినిస్టర్ తో మాట్లాడుతాను. ఎయిర్ ఫోర్సు సహకారం తీసుకుని రెండు నెలల్లో టవర్ నిర్మాణం పూర్తి చెయ్యాలి" అనగానే అందరూ ఓకే అన్నట్టుగా బొటనవేలు పైకి లేపి చూపించారు. "గుడ్" రేపటినుండి నాకు ప్రతిరోజూ ప్రాజెక్టు ప్రోగెస్ రిపోర్ట్ అన్ని శాఖల నుండీ రావాలి, అలాగే డయిలీ రిపోర్టులో మరుసటి రోజు కార్యక్రమం దానికి తలెత్తే ఇబ్బందులు ఏమైనా ఉంటే ముందుగా తెలియ జెయ్యండి ఏదీ చివరి నిముషం వరకూ ఆగవద్దు" అని అధికారపూర్వకంగా  గంభీర స్వరంతో చెప్పారు.
యుద్ధ ప్రాతిపదిక మీద పనులు జరుగుతుండడంతో  సతీష్ చంద్ర ఒక టెక్నికల్ టీం ను దిల్లీ కి పంపి హిమాలయ పర్వతాల మీద మన బార్డర్లో మంచి చదునైన ప్రదేశం కనీసం  రెండు వేల గజాలు ఉండేట్టు చూసి రమ్మని పంపారు.  ఆ టీం ఎయిర్ ఫోర్సు వారి సాయంతో హెలికాప్టర్లతో హిమాలయాల మీద అనువైన ప్రదేశం కోసం వెదకడం ప్రారంభించారు.
*  *  *
"మిస్టర్ హైదర్ ఖాన్...హిమలయాల పర్వతాలపై భారత భూభాగంలో జరుగుతున్న హడావుడి గమనించారా?" హుంకరించాడు.. పాకిస్థాన్ ప్రెసిడెంట్. "జీ... వాళ్ళు ఏదో శాటిలైట్ ట్రాకింగ్ స్టేషన్ లాంటిది ఏదో నిర్మిస్తున్నారని విన్నాను" అని అర్మీ చీఫ్ అనగానే "నాన్సెన్స్....విన్నాను ఏంటి?" తెలుసుకున్నారా? ఇన్వెస్టిగేషన్ చేసారా?"   "జీ..లేదు... తెలుసుకుంటాను" అనగానే.. "నీలాంటి సోమరిపోతులవల్లనే మన దేశం ఇలా ఉంది! ఎవరైనా భారత దేశం హిమాలయాలు బాగా పరిచయం ఉన్న వ్యక్తిని పర్వతారోహణ లో శిక్షణ పొందిన వారిని ఈ పనికి పంపండి".  "సర్! ఏజెంట్ కరిముల్లా మంచి నమ్మకస్తుడు. ఇండియాలో అనేక ప్రాజెక్టులు సమర్ధవంతంగా డీల్ చేసిన వాడు. లాస్ట్ ఇయర్ కొరియర్ (వార్తాహరుడు) నుండి మెకానిక్ (విధ్వంసాలు చేసే వ్యక్తి) గా ప్రొమోట్ అయ్యాడు. అతన్ని పంపిస్తాను మీకు వారం రోజుల్లో మొత్తం రిపోర్టు ఇస్తాను" చీఫ్ అనగానే.. "వారం రోజులా!! కుదరదు నాకు మూడు రోజుల్లో కావాలి. కేవలం డెబ్భై రెండు గంటల్లో రిపోర్టు నా దగ్గరకు రావాలి. నిన్న జరిగిన మీటింగులో మతపెద్దలు అడిగిన దానికి సమాధానం చెప్పుకోలేకపోయాను. లేదంటే మీకు ఉద్వాసన తప్పదు. నౌ యు కెన్ గో" మళ్ళీ గర్జించాడు ప్రెసిడెంట్.  (సశేషం)
 *  *  *

No comments:

Post a Comment

Pages