ప్రకృతి ప్రేమికుడు - జయప్రకాశ్ గారితో ముఖాముఖి - అచ్చంగా తెలుగు

ప్రకృతి ప్రేమికుడు - జయప్రకాశ్ గారితో ముఖాముఖి

Share This

ప్రకృతి ప్రేమికుడు - జయప్రకాశ్ గారితో ముఖాముఖి 

భావరాజు పద్మిని 


చేసేది సాఫ్ట్వేర్ ఉద్యోగం, మనసంతా మన దేశపు వనరులను, ప్రకృతిని పరిరక్షించి, భావితరాలకు ఉజ్వల భవితను అందించడం మీద. వయసా  చిన్నదే ! చివరికి ఆక్సిడెంట్ అయినా, కాలు ఈడ్చుకుంటూ పలుచోట్లకు వెళ్లి, తన చక్కటి ఆడియో విసువల్ సందేశంతో,సూచనలతో, ఎందరికో ప్రేరణ, అవగాహన కలిగిస్తున్న ప్రకృతి ప్రేమికులు – శ్రీ జయప్రకాశ్ గారితో ముఖాముఖి ఈ నెల ప్రత్యేకించి మీకోసం.
ప్రకృతితో మీకున్న అనుబంధం ఎటువంటిది ?
చిన్నప్పటినుంచి క్లాసు రూమ్ లో కన్నా, చెట్ల క్రిందే పాఠాలు ఎక్కువ విన్నాను. విశాలమైన ఆటమైదానాలు, ఇంట్లో పూలతోటలు, బాటకు ఇరువైపులా పచ్చదనం, ఇలా అడుగడుగునా నా జీవితం ప్రకృతితో ముడిపడిపోయింది. ఆ చెట్ల నుంచి  వచ్చే కాగితం విలువ  తెలిసిన వాళ్ళం కనుక, ప్రతీ  ఏడాది మనం క్లాసు పుస్తకాల్లో మిగిలిపోయిన కాగితాలు అన్నీ కలిపి, బైండ్ చేయించుకుని, రఫ్ నోట్స్ గా వాడేవాళ్ళం. ఇదొక రకం రీ సైక్లింగ్ వంటిది. వనరులను సదుపయోగం చేసుకుంటూ, పొదుపుగా వాడేవాళ్ళం. ఇదే సరైన పధ్ధతి అని నాకు అనిపిస్తూ ఉంటుంది.
ప్రకృతి వనరుల పరిరక్షణకు మీరు ఎలా ఉద్యమించారు ?
ఇప్పుడు ఎక్కడ చూసినా వాతావరణ కాలుష్యం, వనరుల కొరత, వాహన కాలుష్యం కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కొంతైనా మార్పు తీసుకురావాలన్న తపన నాలో బలంగా కలిగింది.
2007 లో అంటే సుమారు పదేళ్ళ క్రితం మా IT సంస్థలో “మేక్ అ డిఫరెన్స్ “ అన్న పేరుతో వివిధ అంశాలపై సదస్సులు నిర్వహించమనేవారు. అందులో నేను పర్యావరణ పరిరక్షణ, ప్రకృతిపై అవగాహన అన్న అంశాన్ని ఎంచుకున్నాను. ఇందులో భాగంగా “పచ్చని జీవనశైలికి 10 సూత్రాలు “ అన్న అంశంతో కరపత్రాలు ముద్రించి, మా సాఫ్ట్వేర్ ఉద్యోగులం అందరం కూడళ్ళలో  నిలబడి పంచుతూ, “ ఈ కాగితాన్ని పారెయ్యకుండా భద్రపరచి, వీలైనప్పుడు చదవమని” ప్రమాణం చేయించుకుని మరీ ఇచ్చాము.
దానధర్మాలు, రోగాల మీద అందరూ ఉదారంగా ఖర్చుపెడతారు. కాని, ఆ రోగాలకు మూలకారణమైన పర్యావరణ కాలుష్యం గురించి కూడా మనం ఆలోచించాలి. వీళ్ళందరికీ ప్రేరణ కలిగించేందుకు కొత్తగా ఏమైనా చెయ్యాలి అని నాకు అనిపించింది. యెంత బిజీగా ఉన్నా “ఆన్యువల్ డే” టైం లో తల్లిదండ్రులు పిల్లలమీద దృష్టి పెడతారు. అందుకే, ఆ సమయంలో పిల్లలు పాడుతూ, నటిస్తూ ప్రోగ్రాం ఇచ్చేందుకు వీలుగా ఒక పాటను రూపొందించాము. ఈ పాట గ్రాండ్ గా ఉంటూనే మనసుకు హత్తుకునే సందేశాన్ని ఇస్తుంది. చూసేవారిని కన్నీరు పెట్టించి, ఆలోచింపచేస్తుంది.
7 నెలల పాటు మెయిన్ పాయింట్స్ అన్నీ రాసుకుని, రవీంద్రభారతిలో సినిమా వాళ్ళు ఏదో ప్రోగ్రాం చేస్తుంటే, వాళ్లకి స్పాన్సర్ చేసి, ప్రతి గంటకి ఒక్క నిముషం మాట్లాడే అవకాశాన్ని పొంది, మాట్లాడాను. దానితో వాళ్ళ దృష్టిలో పడి, పరిచయం చేసుకున్నాను. బాలు గారు, సునీత గారు ముఖ్యంగా సినీ దర్శకులు క్రిష్ గారు ఎంతో మెచ్చుకున్నారు. క్రిష్ గారు “ఇదంతా ఒక పాటగా రాయిస్తే బాగుంటుంది” అని చెప్పి, ఇటువంటి పాటను సిరివెన్నెల గారు లేక ఇ.ఎస్.మూర్తి గారు మాత్రమే రాయగలరు అని చెప్పారు.
ఇ.ఎస్.మూర్తి గారు స్వయంగా మ్యూజిక్ డైరెక్టర్ కావడంతో పాట రాసి, ట్యూన్ కూడా చేసారు. సునీత గారు పాడారు. మణిశర్మ గారు రికార్డింగ్ కి స్టూడియో ఇచ్చారు. పాట రికార్డు చేసి, అనేక వేదికలపై ప్రదర్శించడం జరిగింది.
బాగుందండి, ఈ పాటను ఏ విధంగా ప్రదర్శించేవారు ?
ఈ పాటను పిల్లలకి నేర్పి, వాళ్ళతో ప్రదర్శన ఇప్పించేవాళ్ళం. “ఓ మై డాడీ”  అంటూ సాగే ఈ పాటలో, ఒక పాప తన తండ్రిని ఆయన చిన్నప్పటి సంగతులు అన్నీ “ఇలా ఉండేవట కదా! “ అని అడుగుతున్నట్లుగా ఉంటుంది. ఆ పచ్చదనం, ఆ వనరులు, అన్నీ ఇప్పుడు మరీ లేవు కదా, అంటూ అడుగుతూ సాగుతుంది. చివరికి వందేమాతరంతో ముగుస్తుంది. ఈ పాట నిడివి 5 నిముషాలు.
ఇది ఎలా ప్రదర్శిస్తారు, నాటకం లాగానా ?
ఒక్కొక్క స్కూల్ వారు ఒక్కొక్క విధంగా స్క్రిప్ట్ రాసుకుని, ప్రదర్శన ఇస్తారండి. ఉదాహరణకు, ఒక స్కూల్ వారు, పాటకు ముందు తల్లిదండ్రులు ఇద్దరూ, “మన చిన్నప్పుడు యెంత బాగుండేదో కదా!” అని ముచ్చటించుకుంటున్నట్లుగా రాసారు. తర్వాత ఈ పాట మొదలౌతుంది. ఎవరి వీలుకు తగ్గట్టుగా వారు పాటకు ముందూ వెనుకా, స్క్రిప్ట్ రాసుకుని ప్రదర్శనలు ఇస్తున్నారు.
ఆ తర్వాత మీ ప్రస్థానం ఎలా కొనసాగింది ?
ఈ తర్వాత నేను రెండవ దశను ప్లాన్ చేసాను. అది పర్యావరణం పట్ల అవగాహన కలిగించేందుకు సెమినార్ లు
నిర్వహించడం. స్కూల్స్ కు వెళ్లి, మాట్లాడేవాడిని. ఇప్పటి దాకా 9 రాష్ట్రాల్లో, 150 సంస్థల్లో సుమారు 40 వేల మందికి సెమినార్ ఇచ్చాను. ఇది ఆడియో విసువల్ సెమినార్. అంతా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. రెండు గంటల పాటు నేను మాట్లాడితే, మిగతా మూడు గంటలు ఒక్కొక్కరూ వచ్చి, వారి అభిప్రాయాలను వెలిబుచ్చేవారు. కాలుష్యం, సూర్యకాంతి విశిష్టత, పచ్చదనం, పర్యావరణం, జంక్ ఫుడ్, వనరుల పొదుపు వంటి విభిన్న అంశాలు ఇందులో ఉంటాయి. హైదరాబాద్ లో “ఐ గో గ్రీన్ ఫౌండేషన్ ” అనే సంస్థను స్థాపించాను. క్రికెటర్ వి.వి.ఎస్. లక్ష్మణ్ గారి సహకారంతో చెట్లను కొట్టకుండా వాటిని వేళ్ళతో సహా పెకిలించి, మరొకచోటికి మార్చవచ్చని, నిరూపించాము. హైదరాబాద్ లో మెట్రో ప్రాజెక్ట్ జరుగుతూ ఉన్నప్పుడు, ప్రభుత్వం కూడా  ఇది చూసి స్పూర్తిని పొంది, సుమారు 364 చెట్లను రీలొకేట్ చేసింది. ఇది 2012 లో జరిగింది.
మీరు నిర్వహించిన వివిధ కార్యక్రమాల గురించి తెలియచెయ్యండి.
2012 లో హైదరాబాద్ లో బయో డైవర్సిటీ సదస్సు జరిగింది. ఇందులో నేను గంటన్నర పాటు ప్రెసెంటేషన్ ఇచ్చాను. వంద కోట్ల మంది జనాభా ఉన్న ఈ దేశంలో ఒక్కొక్కరూ ఒక్క చుక్క నీటిని, లేక ఒక్క యూనిట్ కరెంటును పొదుపు చేసినా, ఎన్నో వనరులు ఆదా అవుతాయి. ముఖ్యంగా “మన జీవనశైలిని మనం మార్చుకోవాలి “ అన్న విషయాన్ని నేను నొక్కి చెప్పాను. దానికి మంచి స్పందన లభించింది.
ఫారెస్ట్ అకాడమీతో కలిసి, మేము ప్రతి ఏడాది, “ఎ.పి. ఎన్విరాన్మెంట్ కనెక్ట్” అనే పేరుతో ఎర్త్ డే ని ఆన్యువల్ డే గా జరుపుతూ ఉంటాము. ఈ సందర్భంగా మేము పర్యావరణం గురించి అనేక ప్రాంతాల్లో సేవచేస్తున్న వివిధ వ్యక్తులను గుర్తించి సన్మానిస్తాము. వారు ఈ స్పూర్తితో వెనక్కు వెళ్లి, మరింత ఉత్సాహంగా పని చేస్తారు. ఒకసారి మేము రామయ్య అనే రైతును సన్మానించాము. అతను కోటి మొక్కలను నాటాడు. మేము సన్మానించిన నాలుగు నెలలకు అతనికి విశేషమైన గుర్తింపు లభించి, యూనివర్సిటీ డాక్టరేట్ కూడా దక్కింది.
ప్రస్తుతం మీరు ఏ ప్రాజెక్ట్ ల మీద పని చేస్తున్నారు ?
ప్రస్తుతం నేను “విద్యుత్ ను పొదుపుగా వాడటం” అన్న అంశం మీద, కాలుష్యం లేని విద్యుదుత్పాదన, వంటి వాటి మీద పనిచేస్తున్నాను. ఇందుకు అవసరమైన స్క్రిప్ట్ రాసుకుని, వీడియో రూపొందించుకుని, రికార్డు చేసాను. గత ఆరేళ్లుగా నేను జిల్లా రోటరీ క్లబ్ సంఘానికి పర్యావరణ పరిరక్షణ చైర్మన్ గా ఉన్నాను. విద్యుత్ పొదుపు, పర్యావరణ పరిరక్షణ, పిల్లలకు అవగాహనా కార్యక్రమాలు, ఇంధన పొదుపు వంటి అంశాలను గురించి ప్రసంగాలు ఇస్తాను. ఎనర్జీ స్మార్ట్ ఇండియా అనే ప్రోగ్రాం ద్వారా నెలకో గంట ఒక స్కూల్ కు వెళ్లి, “దం హై తో సోలార్ లగావ్, దిల్ హై తో బిజిలీ బచావ్” అన్న పేరుతో, ప్రతి స్కూల్ లో నెలకు ఐదు వేల యూనిట్ల కరెంటును పొదుపు చెయ్యడం ఎలాగో వివరిస్తాను. ఇదే స్క్రిప్ట్ ను తెలుగులో, హిందీలో అనువదించి, ప్రసంగాలు ఇస్తున్నాను.
ప్రస్తుతం 70 స్కూల్స్ లో ఈ పధకాన్ని అమలు చేస్తున్నారు. ఒక్కొక్క విద్యార్ధి చేత, కరెంటు బిల్ల్స్ తెప్పించి, వాటిని ఎలా తగ్గించాలో నేర్పుతాము. ఆ తర్వాతి నెల బిల్ తెచ్చి చూపిన విద్యార్ధి/ టీచర్ కు “ఎనర్జీ స్మార్ట్ స్టూడెంట్/స్టాఫ్” అన్న టైటిల్ ఇస్తాము. ఇలా ప్రతి స్కూల్ లో 3000-5000యూనిట్లు ఆదా అయినా, చాలా ప్రయోజనం కలుగుతుంది. ఇదే విషయాన్ని మోడీ గారి PMO లో వేసాము, ప్రెస్ మీట్ పెట్టాము. స్కూల్ అసోసియేషన్ లెవెల్ లో ఒక్కొక్క స్కూల్ నుంచి, ఒక్కొక్క టీచర్ సదస్సుకు హాజారైనా, ఆ స్కూల్స్ అన్నింటికీ టీచర్ ద్వారా ఆ సందేశం చేరినట్లే. అలాగే ఒక్కొక్కరూ ఇంధనం పొదుపు చేస్తే, క్రూడ్ ఆయిల్ పారామీటర్ షేక్ అవుతుంది.
మీ ఆలోచనా విధానాలను అందరికీ ఎలా చేరవేస్తారు?
ప్రతి స్కూల్ కు, ప్రతి వారి వద్దకు వెళ్లి చెప్పడం అనేది సాధ్యం కాదు కదండీ. అందుకే మేము http://igogreenfoundation.org/ అనే వెబ్సైటును ప్రారంభించి, హై వాల్యూ అవేర్నెస్ ను కల్పిస్తున్నాము. ఇందులో నుంచి మా పచ్చదనం పాట, వీడియోలు, నీటి పొదుపు, ఇంధన పొదుపుకు పాటించాల్సిన సూత్రాలు అన్నింటినీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతే కాదు ఇందులో ఇన్డోర్ మొక్కలు పెంచడం గురించిన సమాచారం కూడా ఉంది. అంతెందుకు చెట్లు కొట్టడం ఆపేందుకు హెల్ప్ లైన్ నంబెర్లు ఉన్నాయని, మీకు తెలుసా ? అలాగే చెత్త తీసివేతకు, తెరిచిఉన్న డ్రైనేజి మూతపై కంప్లైంట్ కు టోల్ ఫ్రీ నంబర్లు ఉన్నాయని మీకు తెలుసా ? (వాటిని దిగువ అందించడం జరిగింది) ఇటువంటి వివరాలన్నీ మా వెబ్సైటు లో ఉంచాము.
సమాజ శ్రేయస్సు కోసం మన జీవనశైలిలో ఎటువంటి మార్పులు రావాలి అని మీరు భావిస్తారు ?
జీవనశైలిలో మార్పులతో అద్భుతాలు జరుగుతాయనే చెప్పాలి. మన జీవనశైలిని మార్చేందుకు ఇంటికి ఒక్కరు ముందుకు వస్తే చాలని, నా అభిప్రాయం. ప్రతివారు ఎవరికి వారే కొన్ని నియమాలను ఏర్పరచుకోవాలి. ఉదాహరణకు నేను సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నా, ఖాళీ సమయంలో పర్యావరణం కోసం కృషి చేస్తున్నాను. అలాగే, మా కుటుంబ సభ్యులు విద్యుత్ పొదుపు వంటి అంశాల్లో నాకు ఎంతో బాగా సహకరిస్తారు.
పచ్చదనం పాటను హిందీలో కూడా రాయించి, ఇండియన్ ఐడల్ జూనియర్ ఒకమ్మాయితో పాడించాను. అది వీడియో గా రూపొందించేందుకు ఆర్టిస్ట్ నాగేంద్రబాబు గారితో బొమ్మలు వేయించాను. ఆఫిషియల్ ప్రెస్ రిలీస్ కోసం నేషనల్ మీడియా సహాయం కోసం చూస్తున్నాను.
జయప్రకాశ్ గారు, ఇన్నేళ్ళ మీ కృషిలో మీరు మర్చిపోలేని సంఘటన ఒకటి చెబుతారా ?

మా అమ్మాయి స్కూల్ లో  నేను తేగలిగిన మార్పు ఎప్పటికీ మర్చిపోలేనిది. స్కూల్ పేరు చిన్నగా రాసి, వారు “ఈ స్కూల్ కాలుష్యరహితమైనది. ఇక్కడ ప్లాస్టిక్స్, వాడకం నిషేధం” అన్న పెద్ద బోర్డు ను పెట్టారు. పర్యావరణ సంరక్షణ కోసం ప్రత్యేకించి ఒక టీచర్ ను పెట్టారు. విద్యుత్ పొదుపు చేసే ఒక్కొక్క విద్యార్ధికి ఒక ఎకౌంటు ను తెరిచి, వారు పొడుపు చేసిన రుసుమును అందులో వేస్తున్నారు. కొత్త బిల్డింగ్ కడితే, తక్కువ నీరు, తక్కువ కాలుష్యం కలిగించే “గ్రీన్ బిల్డింగ్” నే కడతామని అన్నారు. మొదట్లో నా కృషికి ఫలితం దక్కలేదని నిరాశ చెందినా, తర్వాత ఇదే విధానాన్ని ఒకరిని చూసి ఒకరు 18 చోట్ల మొదలుపెట్టారు.
మరొక సంఘటన – ఒకరోజున మా ఫ్రెండ్ ఒకరు ఫోన్ చేసి కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు. “నువ్వేదో పాట చేసావు అంటే సినిమా పాట అనుకున్నాను, ఇవాళ మా పాప ఆ పాటను పెర్ఫోరం చేసింది, అప్పుడే ఆ పాట గొప్పతనం తెలిసింది. నువ్వు చేస్తున్న కృషి నిజంగా అభినందనీయం” అన్నాడు. అప్పుడు నా పాట మంచి ప్రేరణను కలిగించినందుకు ఆనందంగా అనిపించింది.
భావితరాలకు మీరిచ్చే సందేశం ఏమిటి ?
ఏదైనా మార్పు రావాలంటే, అది ముందు మనతోనే మొదలుపెట్టాలి. పర్యావరణం కాపాడాలి అనుకున్నప్పుడు యెంత చిన్న పనైనా చేసేందుకు సిద్ధపడాలి. అలా మన నుంచి కుటుంబానికి, కుటుంబం నుంచి సంఘానికి, సంఘం నుంచి సమాజానికి మార్పు వ్యాపిస్తుంది. ఇదే నేనిచ్చే సందేశం.
అమూల్యమైన సందేశమండి, కృతఙ్ఞతలు, నమస్కారం.
నమస్కారం.
శ్రీ జయప్రకాశ్ గారు అందించిన వివరాలు :
Green Song - right click on web site link to save the file.  - http://www.igogreenfoundation.org/gallery/greensong/TheGreenSong_Telugu.mp3
Energy Smart India Initiative - 1 hr per month per school can save 5000 units of power - use it and save nation - http://www.igogreenfoundation.org/EnergySmartIndia.html
Toll Free Number to Complain against Tree Felling - 18004255364 ( AP and Telangana )
Toll Free Number for Garbage not lifting, open man hole etc 040 - 2111 1111 or www.ghmc.gov.in --> Grievances --> Call Centre --> Health and Sanitation section  ( takes few minutes to save hundreds of people from cancer ) Refer www.dontburnvt.org to know how other countries are taking care.

No comments:

Post a Comment

Pages