ప్రకృతి మాత - అచ్చంగా తెలుగు

ప్రకృతి మాత

Share This

ప్రకృతి మాత

 దోమల శోభారాణి. 


“సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మేసదా
పద్మపత్ర విశాలాక్షీ పద్మకేసరి వర్ధనీ
నిత్యం పద్మలయా దేవీ సా మాం పాతు సరస్వతీ
భగవతీ భారతీ నిశ్శేష జాడ్యాపహా”
            అంటూ భవాని ఆలపించిన ప్రార్థన శ్లోకం సరస్వతీదేవీ దేవాలయంలోని భక్తుల వీనుల విందుగా వీణానాదాలయ్యాయి. ‘సరస్వతీ దేవీ సహితం పులకించి పోయింది’.. అన్నట్లుగా గుడి గంటలు మ్రోగాయి.
             ఆలయ పూజారి, భక్తులు మైమరచి కనులు మూసి ఆలకిస్తూ ఆస్వాదించిన తన్మయత్వం నుండి గుడి గంటలతో తేరుకున్నారు.
            అచ్చం సరస్వతీ దేవి ముఖ వర్చస్సు కలిగిన భవానిని చూడగానే పూజారి మనసు ఉప్పొంగింది. తన అరవైయేళ్ళ అనుభవంలో సైతం కొన్ని పదాల ఉచ్చారణ తడబాటును తడుముకోవాల్సి వస్తుంది. అలాంటిది అంత చిన్న అమ్మాయి పట్టుమని పదేండ్లు వుంటాయో లేదో..!. సరస్వతీ దేవి శ్లోకాన్ని కంఠతా ఇసుమంత పొల్లు బోకుండా వల్లించడం విస్మయం చెందాడు పూజారి.
            “ఎవరమ్మా నువ్వు? ఎవరమ్మాయివి.. ఎప్పుడూ చూడలేదే నిన్ను.. ఏం పేరు?” అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు పూజారి. అతడి ప్రశ్నల పరంపరలలో ఆత్మీయత.. అనురాగం.. సంతోషం తొణికిసలాడాయి.
            “నా పేరు భవాని” అంది.
            ఆమె స్వరం కోకిల గానం.. ‘తథాస్తు’ అన్నట్లు మరో మారు గుడి గంటలు మ్రోగాయి.
            “ఈ ఊరికి ఈమధ్యనే వచ్చాం పూజారి గారూ.. మా నాన్న గారు హెడ్మాస్టర్”
            “ఓ..! ” అంటూ ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవిగా చేస్తూ “దయానందం గారి అమ్మాయివా..”
            అవునన్నట్లు తలూపింది భవాని. ప్రేమగా భవాని తల నిమిరి హారతి కార్యక్రమంలో నిమగ్నమయ్యాడు పూజారి.
            ఆలయ వాతావరణం చాలా ప్రశాంతంగా వుంది. ఆ ఊరి వాతావరణానికి భిన్నంగా.. ఎందుకు ఈ తేడా.. అని లిప్త కాలం కనులు మూసి ఆలోచనలో పడిన భవాని పూజారి హారతి అందిచడంతో కళ్ళు తెరిచింది. హారతి కళ్ళకద్దుకుని అలయంలో తన పుస్తకాల సంచి ప్రక్కన కాసేపు కూర్చుంది.
            మళ్ళీ ఆలోచనలు.. భవాని మనసు వివిధ రాగాల సరిగమలు పాడుతోంది.. అన్నీ ఆ ఊరి కలహ దృశ్యాలే.. ఆమె చిన్న బుర్రలో తాపత్ర్యపు అలలు ఎగిసి పడుతున్నాయి..
            “ఏమ్మా.. ఇంకా దేవీమాత స్థుతిలోనే వున్నావా?.. ” అంటూ పూజారి పలకరింపుతో చటుక్కున లేచి నిల్చుంది భవాని.
            “బడికి సమయం అవుతుంది కదా.. అన్నట్టు ఏ క్లాసు చదువుతున్నావ్?” అంటూ ఆప్యాయంగా అడిగాడు.
            “ఆరో తరగతి” అంది భవాని.
            “ఆహా..! చాలా సంతోషం తల్లీ.. నేనేదో మూడో నాలుగో అనుకున్నా.. ఆసరస్వతీ దేవి కటాక్షం నీకు ఎల్లప్పుడూ వుంటుంది” అంటూ వెనుదిరుగ బోయిన పూజారి భవాని ఏదో అడుగడానికి సందేహిస్తుందన్నట్లు గమనించాడు. “ఏంటమ్మా? ఏమైనా అడుగాలనుకుంటున్నావా?. నిర్భయంగా అడుగు తల్లీ..!” అంటూ భవాని తల నిమిరాడు.
            “గుళ్ళో ఉన్న ప్రశాంతత మన ఊర్లో ఎందుకు లేదు పూజారి గారూ.. మేము ఈ ఊరికి వచ్చి నప్పటి నుండీ గమనిస్తున్నాను. ఎప్పుడూ ఏదో ఒక వాడలో తగువులాటలు.. కీచులాటలు..  అకారణంగా గట్టిగా కేకలేసుకోవటం.. ఎందుకలా..? ” అంటూ అమాయకంగా ప్రశ్నించింది.
            అంత చిన్న వయసులో ఆమె ఆలోచనా ధోరణికి పూజారి ఆశ్చర్యపోయాడు. పైగా అంత పరిపక్వంగా మాట్లాడ్డం ఒకింత విస్మయానికి లోనయ్యాడు. ఎలా చెప్పాలా అని కాసేపు మౌనంగా ఆలోచించాడు. ఆమె లోని దైవ భక్తిని గమనించి అదే దారిలో చెబితే సులభంగా అర్థమవుతుందనే విషయాన్ని తన పెదవులపై చిరునవ్వు రూపంలో ప్రదర్శించాడు..
            “అమ్మా భవానీ.. గుళ్ళోకి రాగానే నీకు ఎలా అనిపించింది.. యిక్కడి వాతావరణం ప్రతీ భక్తున్ని ముగ్ధున్ని చేస్తుంది. గుడి చుట్టూ పచ్చని చెట్లు.. వాని కొమ్మల్లో నృత్యం చేసే సుగంధ భరిత పుష్పాలు.. వాటికి తోడు ఆలయంలో వెలిగించే కర్పూర హారతుల సువాసనలు మన హృదయాల కల్మషాన్ని కడిగేస్తాయి. మదిలో ఎంత బాధ వున్నా గుడిలో అడుగు పెట్టగానే ప్రశాంతత చేకూరుతుంది. ఇలాంటి వాతావరణం మన వాడల్లో.. ఇళ్ళల్లో ఏది?. ఎక్కడ చూసిన మురికి కాలువలు. దుర్ఘంధ పూరిత గాలులు.. అవి వూళ్ళోని మనుషుల మనసులను కలుషితం చేస్తున్నాయి. మరి మనుషులు స్నేహ పూర్వకంగా మాట్లాడుకునే బదులు కాట్లాడుకోక ఏం చేస్తారు.. అయినా మన చేతుల్లో ఏముంది? అంతా ఆభగవతేచ్చ.. టైమవుతోంది.. బడికి వెళ్ళమ్మా. అసలే మీ నాన్న గారు సమయంమ్మీద నడిచే మనిషి..” అంటూ నడుముకు కట్టుకున్న తుండగుడ్డను విడిచి భుజంపై వేసుకుని గుడి ప్రక్కనే వున్న తన నివాసానికి దారి తీసాడు.
            భవాని మనసులో మరింత అలజడి మొదలయ్యింది. పూజారి మాటలు తననింకా అఘాతంలోకి తోసేసాయి. గౌతమ బుద్ధునికి మనుషుల బాధల వలయంలో జ్ఞానోదయమైనట్లు.. భవాని మదిలో ఆ అఘాతంలోనే ఆశాకిరణం అంకురించింది. తృప్తిగా ధరహాస మోముతో పుస్తకాల సంచిని భుజానికి తగిలించుకొని బడి వైపు పరుగులు తీసింది.
***
            అది ప్రభుత్వ పాఠశాల మునిపల్లె.
            ప్రార్థన గంట మ్రోగింది. విద్యార్థులంతా తమ తమ తరగతుల వారిగా బడి ముందున్న ఆవరణలో నిల్చున్నారు. వారి ముందు నిల్చున్న డ్రిల్ మాస్టారు రత్నాకర్  విజిల్ ఊదుతూ వరుసలను సర్దాడు. రత్నాకర్ వెనుక ఉపాద్యాయులు నిలబడ్డారు.. మధ్యలో ప్రథానోపాద్యాయులు దయానందం.
             రత్నాకర్ విజిల్ సంకేతాలతో విద్యార్థులంతా ముక్థ కంఠంగా ‘వందే మాతరం’  ప్రార్థనా గీతాన్ని ఆలపించారు. ఆతరువాత ‘ప్రతిజ్ఞ’ చేసారు.
            మళ్ళీ విజిల్.. దాని కనుగుణంగా పిల్లలంతా విశ్రమ స్థాయిలో నిలపడ్డారు.
            ప్రార్థన అనంతరం ప్రతీ రోజు వరుసగా ఒక తరగతి నుండి ఒక విద్యార్థి  నిన్న తాను చేసిన మంచి పనుల గురించి మూడు ముక్కలు చెప్పాలి. అనంతరం మున్ముందు చేయబోయే పనుల గురించి రెండు మాటలు మాట్లాడాలి.. ఒక సూక్తి చెప్పాలి. అలా చెప్పిన ప్రతీ విద్యార్థికి బహుమతులు అంద జేస్తానని దయానందం ఆ పాఠశాలలో చేరిన రోజున ప్రకటించాడు.
            విద్యార్థి మాట్లాడిన తరువాత తెలుగు మాస్టారు అతడి మాటలను విశ్లేసించటం పరిపాటి.
            దాంతో విద్యార్థుల్లో ఉత్సాహం పెరుగుతుంది.. ఏదైనా ఒక మంచి పని చేయాలనే జిజ్ఞాస ఏర్పడుతుంది.. దానికి తోడు నిర్భయంగా మాట్లాడటం అలవడుతుంది అని దయానందం ఆలోచన. కొద్ది రోజుల్లోనే తన పిల్లల్లో ఉత్సాహం గమనించాడు.
            తన ఆలోచనలు ఫలిస్తున్నాయి. కాని ‘సాధించిన దానికి సంతృప్తిని చెందీ.. అదే విజయమనుకుంటే పొరబాటోయీ..’ అనే శ్రీశ్రీ పాట అతడి ఆదర్శం.    మరిన్ని నూతన కార్యక్రమాలు చేబట్టాలనే తలంపుతో వున్నాడు.
            ఆ రోజు అరవ తరగతి విద్యార్థులలో నుండి ఒకరు మాట్లాడాలి. ఎవరు ముడుకు వస్తారా అనే  ఉత్సుకతతో విద్యార్థుల తలలన్నీ ఆరవ తరగతి విద్యార్థుల శ్రేణి వైపు మళ్ళాయి.
            భవాని వస్తూవుండటంతో పిల్లలంతా హెడ్మాస్టరు గారి అమ్మాయి అనే సంతోషంతో చప్పట్లు కొట్టారు. దయానందంలో సైతం ఆసక్తి పెరిగింది. తన బిడ్డ ఏం చెబుతుందా..! అని ఉద్వేగానికి గురయ్యాడు.
            అయినా భవానిని సందేహించక్కర లేదు. ఆమె క్లాసులో ఫస్టు.. ఉపన్యాస, వక్తృత్వ పోటీలలో ఫస్టు.. చిత్రలేఖనంలో అందె వేసిన చేయి. ఆటలు.. వేదికపై నృత్యం.. పాటలు.. నటన చెప్పనక్కర లేదు. అలా అన్ని కళల్లో ప్రవేశించడానికి కారణం దయానందం నిరంతర కృషి ఫలితం.. భగవంతుని కృప.. సతస్వతీ దేవి కటాక్షం.
            “మన పాఠశాల గౌరవనీయ ప్రథానోపాద్యాయులు, ఉపాద్యాయులకు నమస్కారం.. ” అంటూ మొదలు పెట్టింది భవాని.
            పాఠశాల సాంతం నిశ్శబ్దమయమైంది.
            “మనం ఒక్కొక్కరం చేసిన మంచి పనులు, చేయ బోయే పనులు చెప్పడం మంచిదే కాని మనమంతా కలిసి ఐకమత్యంగా మన ఊరికి ఒక మంచి పని చేస్తే మరీ మంచిదని నా అభిప్రాయం”
            విద్యార్థులు, అద్యాపకులు ఆసక్తిగా విన సాగారు.
            “మన బడిలో.. గుడిలో.. వున్న వాతావరణం మన ఊరిలో లేదు. వాడలన్నీ మురికి కూపాలు. దుర్ఘంధంతో ప్రజల మనసులు మలినమై పోతున్నాయి. ప్రజల్లో అసూయ ద్వేషాలు పెరిగి పోతున్నాయి. అంతెందుకు  పాఠశాలలో ఉన్నంత మన స్నేహ భావం బయట కనబడటం లేదని గ్రహిస్తూనేవున్నాం. ఊరంతా బడిమయమై.. గుడిదరిలా తీర్చి దిద్దాలననేదే నా అభిమతం.. పర్యావరణ పరి రక్షణే మన ధ్యేయం.. ఆప్రకృతి మాత సంరక్షణే మన ప్రథమ కర్తవ్యం”
            విద్యార్థులంతా తాము సైతం అన్నట్లుగా చప్పట్లతో తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. దయానందం తన కూతురు దూర దృష్టిని మనసులోనే అభినందించాడు. ఉపాద్యాయుల హృదయాలలో ఆలోచనలు అంకురించాయి.
            “కేవలం చప్పట్లు కాదు.. కార్యాచరణ ముఖ్యం. మనం తలపెట్టబోయే కార్యక్రమం విజయవంతం కావాలంటే వయోజన విద్యను అభివృద్ధి చేయాలి. మన తల్లి దండ్రులు నిరక్షరాస్యులైతే వారికి చదువు నేర్పాలి.
            ముగ్గులు నేర్చుకునే ఆడవారికి మూడక్షరాలు నేర్చుకోవటం బ్రహ్మవిద్యేమీ కాదు.
            ముల్లు కర్రలు చేతబూనే మగవారికి చదువులో మూడడుగులు ముందుకు సాగటం పెద్ద కష్టమేమీ గాదు.
            మన ఊరి ప్రగతికి నా అభిప్రాయాలలో కొన్ని...
             ప్రతీ ఇంట మరుగుదొడ్డి వసతి కల్పించుకోవాలి. డ్రైనేజీ విధానంలో మార్పు రావాలి. రోడ్లు మెరుగు పర్చాలి. ప్రతీ ఇంటికి స్వచ్చమైన త్రాగు నీరు లభించాలి. ఈ పనులన్నీ పూర్తి  అయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని గ్రామ సర్పంచ్ గారికి విజ్ఞాపన పత్రం సమర్పిద్దాం..
            మనమంతా శ్రమ దానం చేస్తూ వాడ వాడలా చెట్లు పూల మొక్కలు నాటుదాం..
            ముందుగా మన ఇంటి నుండి ఈ పని ప్రారంభిద్దాం..
            పూర్వం మన పల్లె మునులకు నిలయం. చాలా ప్రశాంతంగా వుండేదని ప్రతీతి. అందుకే దీని పేరు మునిపల్లె అని వచ్చిందట. కాని నేడు మురికి పల్లెగా మారింది. దీని పూర్వ వైభవం తెప్పిద్దాం.. ముని పల్లెను తీర్చి దిద్దుదామని మనమంతా ప్రతిజ్ఞ పూనుదాం...
            దీనికి అనుకూలంగా పాఠశాల కాలనిర్ణయ పట్టికను మార్చాలని గ్రామ పునర్మిణానికి ప్రణాళికను రూపొందించి గ్రామ పెద్దలతో మాట్లాడాలని మన ప్రధానోపాద్యాయుల గారితో సవినయంగా మనవి చేసుకుంటున్నాను.. వచ్చే సంక్రాంతి సెలవుల్లో మన పనులు ప్రారంభిద్దాం. వేసవి సెలవులంతా పనిచేద్దాం.. తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మరో సారి మన ఉపద్యాయ బృందానికి విజ్ఞప్తి చేస్తున్నాను” అంటూ ఉపాద్యాయుల వైపు తిరిగి నమస్కరించింది.
            విద్యార్థుల కరతాళ ధ్వనులు మిన్నంటాయి..
            తెలుగు మాస్టారు భవాని అంతరంగాన్ని విషదీకరించాడు.
            ఇది ఒక సాహస కృత్యమే గాని విద్యార్థి శక్తికి.. ఇదేమీ అతీతం కాదని ప్రోత్సాహ వాక్యాలు పలికాడు.
            రత్నాకర్ హెడ్మాస్టర్ వైపు చూసాడు ఏమైనా చెబుతారా అన్నట్లుగా.  దయానందం మౌనంగా తలతో సంజ్ఞ చేసాడు.
            లాంగ్ విజిల్ మ్రోగింది..
            పిల్లలంతా తమ తమ తరగతి గదుల్లోకి చీమల బారులయ్యారు.
***
            ఉపాద్యాయులకు పనులు అప్పగించే తనకు తన కూతురు పని అప్పగించడం అది గ్రామానికి సంబంధించి కావటం గర్వపడ్డాడు దయానందం. విద్యార్థులను నిరుత్సాహ పర్చవద్దని గట్టి నిర్ణయం తీసుకున్నాడు.
            ముందుగా తన ఉపాద్యాయ మిత్ర బృందాన్ని సమావేశ పర్చాడు. విద్యార్థుల ఉత్సుకతను మరో మారు వివరించాడు. ఒక కమిటీని ఏర్పర్చాడు. అందులో అందరినీ భాగస్వాములను చేసాడు. వారి సూచనల మేరకు విద్యార్థుల శ్రమ దానానికి కార్యాచరణ ప్రణాళిక రచించాడు. పాఠశాల కార్యక్రమాలకు అంతరాయం కలుగకుండా అధిక సమయం వెచ్చించాలని రెండు చేతులా నమస్కరించాడు. నాకూతురు సూచించిందని గాకుండా విద్యార్థులు గ్రామ సంక్షేమం కోసం పడుతున్న తపన అని భావించండని అభ్యర్థించాడు.
            అద్యాపక బృందం గ్రామాభివృద్ధికి మద్ధతు పలికింది..
            రత్నయ్య రథ సారథి అయ్యాడు.
            దయానందం రత్నాకర్‍లు కలిసి వెళ్ళి జిల్లా కలెక్టర్‍ను కలిసారు.
            మునిపల్లె గ్రామాభి వృద్ధికై విద్యార్థుల శ్రమదానంతో తాము చేబట్టబోయే ప్రణాళిక ఫైల్‍ను సమర్పించారు.
            ఒక కాపీని మునిపల్లె గ్రామ సర్పంచి మణెమ్మ గారికి, పోలీసు అధికారులకు  విద్యార్థి నాయకులు, అద్యాపక బృందంతో కలిసి అందజేసారు. వాటి  తాలూకు కాపీలను తమ విద్యాశాఖాధి కారులకు స్వయంగా తాను వెళ్ళి వివరించాడు.
            పాఠశాలలో జరుగుతున్న అలజడి ‘పిల్లకాయ చేష్టలు’ అని కొట్టి పారేసారు మునిపల్లె ప్రజలు.
            దానిని ఒక సవాలుగా తీసుకుంది పాఠశాల.
***
            ఆవాళ రెండవ శని వారం.. సెలవు దినం.
            సరస్వతీ దేవి ఆలయం కలియ తిరిగింది భవాని. పూజారి సూచనల మేరకు కొన్ని పూలమొక్కలను సేకరించింది. ఆలయ ముందున్న విఘ్నేశ్వరున్ని ప్రార్థించి తన తన లక్ష్యాన్ని ఆరంభించింది.
             ముందుగా వారు వుంటున్న ఇంటి ముందు సేకరించిన పూల మొక్కలను నాటసాగింది..
            దయానందం మనసు ఉప్పొంగింది.
            ఈ ఊరికి బదిలీ కావటానికి కొద్ది రోజుల ముందు బస్సు ప్రమాదం జరిగింది. అందులో మరణించిన తన కొడుకును భవానిలో చూసుకుంటున్నాడు..
            కొడుకు జ్ఞపకాలతో మతి బ్రమించి గతించిన తన భార్య కోరికలను భవాని నెరవేర్చాలన్నదే అతడి కోరిక.
            తన భార్య వుంటే ఎంత సంతోషించేదో..!   అని మదిలోని తలంపు అప్రయత్నంగా కన్నీళ్ళు తెప్పించాయి. భవాని చూడకుండా జాగ్రత్త పడ్డాడు. సాక్షాత్తు ప్రకృతి మాతలా కనబడే భవానిని తన హృదయానికి హత్తుకున్నాడు.
            “భవానీ.. నీ ఆలోచన అద్వితీయంరా.. ఊరి కోసం నువ్వు కంటున్న కలలను వాస్తవం చేస్తాను.. మీ అమ్మ మీద ప్రమాణం చేసి చెబుతున్నా..” అంటూ భవాని నుదురును ముద్దాడాడు. భవాని మనసు పొంగి పోయింది. ఫోటో లోని భవాని తల్లి దీవిస్తోంది.. అన్నయ్య చిరునవ్వులు చిందిస్తున్నాడు.
            పూల మొక్కలతో ఇంటి అందం హెచ్చింది. అటుగా వెళ్ళే జనాల హృదయాలను ఆకట్టుకుంది. తమ ఇంటి ముందు నుండి నిత్యం విస విస లాడుతూ వెళ్ళే జనం మిస మిస లాడే పూలను చూస్తూ.. ముసి ముసి నవ్వులతో కదులుతున్నారు. వారిని చూస్తూ భవాని తన పని ఫలితం ఫలిస్తోంది.. అన్నట్లు దయానందంతో గుస గుస లాడింది.
            మన ప్రధాని ఇచ్చిన ‘స్వచ్చా భారత్’ అనే నినాదం మునిపల్లె పాఠశాలకు కలిసి వచ్చింది. విద్యార్థుల శ్రమదానానికి మద్ధతుగా నిలిచింది.
            జిల్లా కలెక్టర్ అదేశాలతో ఒక లారీలో వివిధ రకాల పూల మొక్కలు మరో లారీలో వృక్ష సంపద మునిపల్లెకు చేరింది.
            విద్యార్థుల్లో ఉత్సాహం రెట్టింపు అయ్యింది.
            ***
            ప్రతీ సంవత్సరం ప్రభుత్వం ఇచ్చిన నిధులను సకాలంలో వినియోగించుకోక మురిగి పోయేవి. ఈ సంవత్సరం నిధులను వినియోగించుకోవడమే గాకుండా అదనంగా మరిన్ని నిధులు మంజూరు చేయించుకోవాలని సర్పంచి మణెమ్మకు సలహా ఇచ్చాడు దయానందం.
            కేవలం సలహా ఇవ్వటమే కాదు.. పాఠశాల తరఫునా కొంత ధన సాయం చేయాలని మనసులో నిర్ణయించుకున్నాడు.
            తన నిర్ణయాన్ని అద్యాక బృందంతో చర్చించాడు. వారూ ముందుకు వచ్చారు. ఒక నెల జీతాన్ని గ్రామానికి విరాళంగా ఇచ్చారు.
            ఈ విషయం తెలుసుకున్న కలెక్టరు ప్రభుత్వ దృష్టికి  తీసుకు వెళ్ళాడు. మునిపల్లెలో పని చేస్తున్న ఉద్యోగస్తుల వృత్తి పన్ను మునిపల్లె లోనే వినియోగమయ్యేలా చూసాడు. తన పరిధిలోని మరికొన్ని సదుపాయాలను కల్పించాడు.
            క్రమేణా రోజు రోజుకు ఊరి వాడల్లో మార్పు వస్తూ వుండటంతో సర్పంచి మణెమ్మలో చలనం కల్గింది.
            ‘పనికి ఆహారం’ అనే పథకాన్ని సద్వినియోగ పర్చుకోవాలని తన వార్డు మెంబర్లను సమావేశపర్చి విజ్ఞప్తి చేసింది.
            ముందుగా ఊరి మురికి కాలువల పని పట్టాలని, ప్రతీ ఇంట మరుగు దొడ్డి కట్టించుకోవాలని వాటికై ప్రభుత్వం ఇచ్చే సబ్సీడీని వినియోగించుకోవాలని ప్రజల్లో చైతన్యం కల్గించింది. ఆ దిశగా అడుగులు వేసింది.
            సంక్రాంతి సెలవుల్లో మునిపల్లె మండలమైన నంగునూరు జూనియర్ కాలేజీ నుండి కేంద్ర ప్రభుత్వ పథకం ‘జాతీయ సేవా సంస్థ (ఎన్.ఎస్.ఎస్.)’ విద్యార్థులు  ముని పల్లె విద్యార్థులకు తోడయ్యారు. వారి పనుల్లో పాటలు.. రాత్రి వేళల్లో నాటకాలు.. నాటకం మధ్య విరామ అంకంలో భవాని ఉపన్యాసాలు గ్రామ ప్రజలను జాగృతం చేస్తున్నాయి.
            ఆరోజు భవాని మాటలు ఇంకా మునిపల్లెలో మారుమ్రోగి పోతునే వున్నాయి..
            “నా ప్రియమైన మునిపల్లె గ్రామ ప్రజలారా.. మన విద్యార్థి లోకం గ్రామ అభివృద్ధికై చేస్తున్న కృషి మీరంతా చూస్తూనే వున్నారు. గ్రామమంటే మట్టి మ్రానులతో బాటు మనుషులుకూడా.. మనుషులంటే మానవత్వం కల్గిన వారు. మద్యపానంతో ఒడలు మర్చి పోయే సంస్కార హీనులు కాదు.  తాగే వారి సంఖ్య పెరిగిన కొద్దీ దుకాణాలు వెలుస్తున్నాయి.  అసలు మద్యపానం కొనే వారే లేకుంటే దుకాణాలు మూత పడక తప్పవు. మీ రక్తాని చెమటగా మార్చి సంపాదించే ప్రతీ పైసను మద్యానికి చెల్లిస్తున్నారు. అందుకే అది బలోపేతమౌతోంది. కొన్నాళ్ళకు అది గెలుస్తుంది. మనం ఓడి పోతాం. ఊళ్ళు స్మశానాలుగా మారుతాయి.. మనం గెలిచి అది ఓడి పోయి పారి పోతే మన గ్రామాలు బాగుపడతాయి. అది మీ చేతుల్లో వుంది.. మీ చేతల్లోవుంది..”
            పిల్లలు అటు చదువుకుంటూ నిర్విరామంగా శ్రమ దానం చేయటం ప్రజలు సిగ్గు పడ్డారు.. వారి కాలూ కాలూ కదిలింది.. చేయీ చేయీ కలిసింది. విద్యార్థులకు తోడై నిల్చింది.
            సంక్రాంతి సెలవులు పూర్తయ్యే సరికి మునిపల్లె గ్రామ స్వరూపమే మారి పోయింది.
            వాడల్లో మురికి కాలువలు మాయమయ్యాయి.. పూల చెట్లు మురిసి పోయాయి.
            ప్రజల జీవన సరళిలో మార్పు కనబడుతోంది...
            మద్యం దుకాణాలు ఒక్కొక్కటిగా మూత పడ్తూ వస్తున్నాయి.
***
            వేసవి సెలవులు ముగిసాయి..  పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి.   భవాని ఇప్పుడు పదవ తరగతి..
                        “యా కుందేదు తుషార హార ధవళా యా శుభ్రవస్త్రావృతా
                         యా వీణా వరదండ మండి తకరా యా శ్వేత పద్మాసనా,
                         యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవైః సదా వందితా
                         సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేష జాడ్యాపహా.”
            భవాని సరస్వతీ దేవి ప్రార్థన శ్లోకం దేవాలయంలోనే గాకుండా గుడిపైనున్న ధ్వని విస్తారకాల ప్రభావంతో మునిపల్లె మారుమూల సైతం మారుమ్రోగి పోతోంది..
            ఇంతలో పరు పరుగున వచ్చాడు పూజారి.
            “భవానీ.. నీ జన్మ తరించిందమ్మా.. సాక్షాత్తు ఆ సరస్వతీ దేవి అవతారమే నీది. మా ఊరి బతుకులు బాగు చేయడానికోసం అవతరించిన ప్రకృతి మాతవి” అంటూ భవాని ముందు సాష్టాంగ నమస్కారం చేయసాగాడు.
            “పూజారి గారూ.. ” అంటూ భయాందోళనతో వెనక్కి నడిచింది భవాని.
            “అలా తిరస్కరించకు తల్లీ. నన్ను కటాక్షించు..” అంటూ వేడుకోసాగాడు.
            పూజారి కళ్ళ నిండా పొంగి పొరలుతున్న కన్నీళ్ళో.. లేక ఆనంద భాష్పాలో.. అర్థం కావటం లేదు. భక్తులంతా ఆశ్చర్య చకితులయ్యారు.
            “భవానీ.. నీ కరుణాకటాక్షంతో మన ఊరి వాతావరణం గుడి వాతావరణంలో ఐక్యమయ్యింది. సారా దుకాణాల వలయం వయోజన విద్యా నిలయమయ్యింది.. మన మునిపల్లె నూటికి నూరుశాతం అక్షరాస్యత సాధించింది. ఊళ్ళో ప్రజల ఐక్యమత్యంతో రక్షక భటులకు పని లేకుండా పోయింది. నువ్వు అనుకున్నది సాధించావు. మరొక్క తీపి కబురు చెప్పనా తల్లీ..” అంటుంటే పూజారి కళ్ళు తుడ్చుకున్నాడు. నోట మాట రావటం లేదు.
            గుళ్ళోని భక్తుల గుండెల వేగం పెరిగింది.
            భవాని ఆనందం.. ఆవేదన సమానంగా ఆస్వాదించే అలవాటుకు పడి పోయింది. తనను ప్రాణపదంగా ప్రేమించే తల్లీ, అన్నయ్య కాల గర్భంలో కలిసినప్పటి నుండి తనవ్యాపకం బడి.. గుడి.. తండ్రి ఒడి. కలహాలెరుగని కుటుంబం తమది. అదే వాతావరణం ప్రతీ ఇంటా నెలకొల్పాలనే తపన తనది. విద్యార్థినిల్లో తన తల్లిని.. విద్యార్థుల్లో తన అన్నయ్యను చూసుకుంటూ చదువే ఊపిరిగా బతుకుతోంది.
            గుడి గంటలు మ్రోగుతున్నాయి..
            భక్తులంతా ఊపిరి బిగపట్టి పూజారి తీపి కబురు కోసం వేచివున్నారు.
            “అమ్మా భవానీ.. ఈ సంవత్సరం మన మునిపల్లె ‘ఆదర్శగ్రామం’ గా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది..
            మా భవానిని కేంద్ర ప్రభుత్వం నుండి ‘సాహస బాల’ అవార్డు అందుకోబోతోంది..” అంటూండగా గుడి గంటలు సరస్వతీ దేవి వీణా నాదంలా వినబడసాగాయి.
***

No comments:

Post a Comment

Pages