పంపర పనస సలాడ్ - అచ్చంగా తెలుగు

పంపర పనస సలాడ్

Share This

పంపర పనస సలాడ్ 

అక్కిరాజు ప్రసాద్ 


పంపర పనసలో మంచి ఔషధ గుణాలున్నాయి. విటమిన్ సీ పుష్కలంగా ఉండే ఈ పండు చక్కెర వ్యాధి ఉన్నవారికి దివ్యౌషధం. అలాగే, జీర్ణ వ్యవస్థను శుద్ధి చేయటానికి ఎంతో తోడ్పడుతుంది. పంపర పనస ఉష్ణమండల ప్రాంతాల్లో విరివిగా పండుతుంది. నిమ్మజాతికి చెందిన ఈ పండులో క్యాన్సర్ నిరోధకాలు ఉన్నాయి. లావు తగ్గటానికి, లివర్ సమస్యలు నిరోధించటానికి, రక్త ప్రసరణ అభివృద్ధి పరచటానికి, గుండె మరియు చర్మ ఆరోగ్యానికి ఈ పండు చాలా ప్రభావవంతమైనది. పులుపు, వగరు, తీపి రుచుల కలయికతో ఉండే ఈ పండు లోపల దానిమ్మ గింజల రంగు తొనలు లేదా తెల్లని తొనలు ఉంటాయి. పండు తినాలంటే ఈ పులులు-వగరు-తీపిల కలయికను ఇష్టపడాలి. అందుకనే, సలాడ్‌గా చేస్తే సులువుగా తినవచ్చు, ఔషధ విలువలు కూడా పోవు.  పంపర పనస బజారులో కొనుక్కునేటప్పుడు కాయ గట్టిదిగా ఉండాలి, అంటే తొక్క గానీ, పండు గానీ మెత్తబడగూడదు. మెత్తగా ఉంటే దాదాపుగా లోపల పండు ఎండిపోయినట్లే. అప్పుడు పండు తొనలు తిత్తిలా ఉంటాయి. తింటానికి బాగోవు.
కావలసిన పదార్థాలు:
సలాడ్ కొరకు:
ఒక పంపర పనస కాయ తొనలు, తొక్క లేకుండా తీసినవి (పూర్తిగా ఛిద్రం కాకుండా గోబీ పువ్వంతవిగా చేసుకోవాలి)
చిన్న ఉల్లిపాయ సన్నగా కోసిన ముక్కలు 1/2 కప్పు
నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు (నిలువుగా కోసినవి)
కొత్తిమీర సన్నగా కోసినది 1/4 కప్పు
పుదీనా ఆకులు సన్నగా కోసినవి 1/4 కప్పు
వేయించిన వేరుశనగపప్పు కచ్చాపచ్చాగా నలిగినవి 1/4 కప్పు
సన్నగా కోసిన పచ్చికొబ్బరి ముక్కలు 1/4 కప్పు
సలాడ్ డ్రెస్సింగ్ కొరకు:
చింతపండు గుజ్జు 2 టీ స్పూన్లు (తొక్కలు గింజలు లేకుండా)
కొబ్బరి పాలు 4 టేబుల్ స్పూన్లు
నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు
నాలుగైదు ఎండుమిర్చి వేయించి రుబ్బిన పేస్టు 2 టేబుల్ స్పూన్లు
సోయా సాస్ 1 టేబుల్ స్పూన్
పంచదార లేదా బెల్లం ఒక టీ స్పూన్
ముందుగా ఉల్లి, వెల్లుల్లి ముక్కలను బాణలిలో ఆలివ్ ఆయిల్ వేసి రంగు మారేంత వరకూ వేయించాలి. వాటిని ఒక టిష్యూ పేపర్‌లో వేసి నూనె పేపరుకు దిగిన తరువాత ఒక చిన్న గిన్నెలో ఉంచుకోవాలి. తరువాత కొబ్బరి ముక్కలను రంగు మారేంతవరకు వేయించి పక్కకు ఉంచుకోవాలి. వేయించిన వేరుశనగపప్పును ఒకమారు మిక్సీలో తక్కువ స్పీడ్‌లో పలుకులు పలుకులుగా వచ్చేలా తిప్పాలి. డ్రెస్సింగ్ కోసం చెప్పిన పదార్థాలను మిక్సీలో పలుచగా జారేలా రుబ్బుకోవాలి. పంపరపనస ముక్కలపై వేయించిన వేరుశనగపప్పుల పలుకులు, వేయించిన కొబ్బరి ముక్కలు వేసి ఒకసారి కలపాలి. దీనిపైన కొత్తిమీర, పుదీన వేసి పైన సరిపడినంత డ్రెస్సింగ్ వేసి కలియబెట్టాలి. కలిపేటప్పుడు పంపరపనస ముక్కలు తునిగి పోకుండా చూసుకోవాలి. తరువాత దానిపై వేయించిన ఉల్లి వెల్లుల్లి ముక్కలను, మరింత కొత్తిమీరను అందంగా అలంకరించాలి. పంపర పనస సలాడ్ ఒక పదినిమిషాల్లో చేసుకోవచ్చు.

No comments:

Post a Comment

Pages