అడివి శాంతిశ్రీ-రచన శ్రీ అడివి బాపిరాజు( 1895-1952) - అచ్చంగా తెలుగు

అడివి శాంతిశ్రీ-రచన శ్రీ అడివి బాపిరాజు( 1895-1952)

Share This

అడివి శాంతిశ్రీ-రచన శ్రీ అడివి బాపిరాజు( 1895-1952)

పరిచయం : ఓలేటి శశికళ 


చారిత్రక నవల లనగానే కోటలు, సార్వభౌములు, రాచరికాలు, అంతఃపురాలు, రాజకీయ కుతంత్రాలు నేపధ్యంలో ఒకింత గంభీరంగా సాగిపోతాయని  చదవడానికి చిన్నమీమాంస .వాటికి భిన్నంగా ఆసాంతం ఉత్కంఠ భరితంగా, సౌందర్యపూరితంగా , కళాత్మకంగా, చారిత్రాత్మకంగా రూపొందించి , చరిత్ర, జీవితం కలిపి కలనేత చేసి, ఆద్యంతం రసభరితం చేయగల సాహితీ మేధావి శ్రీ అడివి బాపిరాజు గారు. అలా ప్రభావితురాలై, నేను పదే పదే చదివిన నవల “ అడివి శాంతిశ్రీ”. దీనికి ముందు  అడివి బాపిరాజుగారి గురించి క్లుప్త పరిచయం. “ అతడు గీసిన గీత బొమ్మై, అతడు పలికిన మాట పాటై, అతని హృదయము లోన మొత్తన అర్ధవత్ కృతియై, అతడు చూసిన చూపు మెరుపై, అతడు తలచిన తలపు వెలుగై, అతని జీవిక లోని తియ్యని అమృత రస ధునియై………… ఇదీ విశ్వనాధ వారి పలుకులలో బాపిరాజు గారు. బహుముఖ ప్రజ్ఞాశాలి. కధకుడు, గాయకుడు, చిత్రకారుడు, నాట్యకారుడు, కళాదర్శకుడు, పత్రికా సంపాదకుడు, స్వాతంత్ర సమర యోధుడు, బహు భాషా కోవిదుడు. ఆంధ్ర-తెలంగాణాలకు సాహిత్య వారధిగా నిలిచిన వాడు. ఎల్లలు లేని ప్రతిభావంతుడు. జీవితంలో కష్టసుఖాలను పడుగు పేకగా అనుభవించిన వాడు. భావ స్వేఛ్ఛాజీవి. దేశ,కాల, పరిస్థితుల చట్రంలో ఇమడని కవీంద్రుడు. ఆంధ్రా రవీంద్రనాధ్ టాగూర్ అనబడ్డ కళా ప్రపూర్ణు డాయన. చరిత్ర లోతుల్లోకి వెళ్ళి , ఆంధ్రుల చరిత్రకు అక్షర రూపమిచ్చిన రూప శిల్పిఆయన. అందుకే ఆయన “ చారిత్రక నవలా చక్రవర్తి “ అన దగ్గవారు. ఆయన చారిత్రక నవలల్లో 5 ఆణిముత్యాలు. హిమబిందు- ఆంధ్ర శాతవాహనుల ప్రధమ చరిత్ర అడివి శాంతిశ్రీ-శాతవాహనుల అంతిమ దశ, ఇక్ష్వాకుల కాలం అంశుమతి- చాళుక్యుల చరిత్ర గోన గన్నారెడ్డి- కాకతీయ వైభవం మధుర వాణి- తంజావూరు నాయక రాజుల జీవిత చిత్రం. వీటి ద్వారా  తెలుగు వారి చారిత్రిక వైభవాన్ని, ఘనతను ఆవిష్కరింప చేసారు. చారిత్రిక నవలా రచనలో వీరి శైలి అద్భుతం.  చరిత్రకు ప్రత్యక్షసాక్షిలా మన కళ్ళకు కట్టిపడేస్తారు. ఆంధ్ర శాతవాహన పాలకుల అవసాన దశని కధావస్తువుగా తీసుకుని, దానిలోరాజకీయం, యుద్ధతంత్రం, అన్ని తరగతుల ప్రజాజీవితం, అంతఃపుర రాణీవాసం, జానపద జీవన వైవిధ్యం, దేశభక్తి, బౌధ్ధమత స్వర్ణయుగం, హైందవ ధర్మ పునరుద్ధరణా యత్నం, సంఘ మర్యాదలు, రాచరిక ధోరణులు ………సమ్మిళితం చేసి, అంతర్వాహిలా సాగిపోయే శృంగార రస భరిత, అపూర్వ యవ్వన హృదయ ప్రేమ కావ్యంగా మలచడం ఆయనకే సాధ్యమయ్యింది. కధా నేపధ్యమంతా ఆంధ్ర, కళింగ, నైసర్గిక ప్రాంతం. శాతవాహన ఘన విశాల సామ్రాజ్యం. వారి రాజధాని కృష్ణా జల పునీత, సస్యశ్యమల క్షేత్ర పులకిత, మహైశ్వర్య భోగిత ధాన్యకటకం. విజయపురి, పూగీ దేశం, అమరావతి, నాగార్జున కొండ……మనకు పరిచయ స్ధలాలే. కధకు నాందిగా కృష్ణా తరంగిణీ ప్రశంస చేస్తారు కవి. “ఏనాటి కాంతవు! యుగయుగాల నుండి గంభీరంగా ప్రవహిస్తున్నావు నువ్వు. గంగా సింధు యమునాబ్రహ్మపుత్రలు నీకు కడగొట్టు చెల్లెళ్ళు. నీవూ, గోదావరి కవల పిల్లలు. నీవే జంబూనదివి. నీ ఇసుకలో బంగారు కణికలు, బంగారు రజను మిలమిల మెరసిపోయేది. ఈనాటికి నీ తీరాన స్వర్ణగిరి నిలిచి ఉంది. బంగారు గనులు నీ యొడ్డుల తలదాచుకొన్నవి. నీ గంభీరగర్భములో జగమెరుగని వజ్రాలు రత్నాలు నిదురిస్తున్నవి. నీది రతనాలబొజ్జ.
కృష్ణవేణీ! నీలనదీ! ప్రేమమరూ! అనేకాంధ్ర సార్వభౌమ సహచరీ! ఆంధ్రాంగనా! నీవు నీలవవుషవై, లోకానికి నిత్యత్వాన్ని ఉపదేశిస్తూ ఉంటావు. నీవు నిర్మలాంగివై, నిత్యసృష్టిని లోకానికి పాటపాడి వినిపిస్తూ ఉంటావు. ప్రతియామినీ నీరవఘటికలలో నీ అక్క గోదావరితో హృదయమార వాకోవాక్యాలు పలుకుతూ ఉంటావు. నీవు ఆంధ్ర వసుంధరానీలమేఖలవు.””.……అంటూ. ఇక కధలోకి……ధాన్యకటకం రాజధానిగా, శాతవాహనుల అత్యంత పరాక్రమ వంతుడయిన ఆఖరి చక్రవర్తి “యజ్ఞశ్రీ” పరిపాలనా కాలం. ప్రభువు యజ్ఞశ్రీ వృద్ధాప్యం కారణాన ఆయన అల్లుడు, అత్యంత శక్తిమంతుడు, ధీమంతుడు అయిన “ఇక్ష్వాకు శాంతి మూల ప్రభువు” చక్రవర్తికి అండదండగా, దక్షతతో రాజ్యరక్షణ చేస్తూ ఉంటాడు. శాంతి మూలుని పట్టమహిషి “ సారసికా దేవి”, బౌద్ధ మతావలంబకులయిన” మాఠరీ” ప్రభువుల ఆడపడుచు. వీరి కుమార్తె “ శాంతిశ్రీ”. అపురూప సౌందర్యవతి. గుణవతి, విద్యావంతురాలు, వినయశీలి. తండ్రి హైందవ ధర్మ పరాయణుడయిప్పటికీ., తల్లి ప్రభావము వలన బౌధ్ధం మీద ఆరాధన పెంచు కుంటుంది. ఐహిక బంధాలు విడిచి పెట్టి, బౌధ్ధ భిక్షుణిగా మారాలని తలపోస్తూ ఉంటుంది. నవలలో కధానాయకుడు “ అడవి బ్రహ్మదత్త ప్రభువు.”విజయపుర మహారాజు. శాతవాహనులకు సామంతునిగా. శాంతి మూలునికి అత్యంత ప్రీతి పాత్రునిగా సామ్రాజ్య రక్షణలో కుడిభుజంగా ఉంటూ ఉంటాడు.. ఆపస్థంభ సూత్రుడు, కృష్ణ యజుర్వేద శాఖాధ్యాయి. బ్రహ్మదత్తుడు గొప్ప కవి, పరాక్రమ వంతుడు, గొప్ప సేనాపతి, రాజనీతి కోవిదుడు, సుందరాకారుడు. కవిత్వావేశంలో ఆంధ్ర ప్రాకృతం, దేవభాషలో అనర్గళంగా గాధలు, కావ్యాలు సృష్టిస్తాడు. కళల్లో మమేకమై రాజనీతి, సేనా నాయకత్వాన్ని కూడా మరచిపోతుంటాడు. ఇంతటి ఉత్తముణ్ణి అల్లుడు చేసుకోవాలని శాంతి మూలుని కోరిక. శాంతిశ్రీ మనసును సన్యాసం నుంచి మరల్చ దలచి తండ్రి ఆమెను అవివాహితుడయిన బ్రహ్మదత్తుని వద్దకు కళాభ్యాసంకై పంపుతాడు. తొలి చూపులోనే శాంతిశ్రీ ప్రేమలో పడిపోతాడు బ్రహ్మదత్తుడు.కానీ ఆమెకు అతని యెడల గురుభక్తి తప్ప, ప్రేమ భావనలు ఏ మాత్రమూ ఉండవు. అది గ్రహించిన బ్రహ్మదత్తుడు స్నేహ సాన్నిహిత్యంతో ఆమె మనసులోమరులు గొలపడానికి ప్రేమ భావనలు ఉద్దీపించడానికి ప్రయత్నిస్తుంటాడు. ఆమె స్నేహితురాళ్ళయిన అంతఃపుర కాంతల ప్రేమ గాధలు, బ్రహ్మదత్తుని మదన మోహనాకారం, గంభీర, ధీరత్వం, ఔదార్యం ఆమె మంచు మనసును ఇనతాపంలా కరిగిస్తూ ఉంటుంది. ఆమెను క్రమముగా తన గురువు హిందూ మతోన్ముఖురాలను కూడా చేయగలుగుతాడు. ఈ విధంగా ఆ నవజవ్వని మనసులో మదన శరాలు సంధించబడే వేళ , అవరోధంగా ఎన్నోరాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృద్ధ చక్రవర్తి యజ్ఞశ్రీ మరణిస్తాడు. అతని కుమారుడు “ విజయిశ్రీ” ధాన్యకటక సిహాసనం అధిష్టిస్తాడు. కొన్నాళ్ళకి అతని మరణంతో అతని కుమారుడు అసమర్ధుడు, అయోగ్యుడూ అయిన “చంద్రశ్రీ”ని సింహాసనంపై నిలిపి పాలన చేస్తుంటాడు శాంతి మూలుడు. యజ్ఞశ్రీ శాతవాహన సార్వభౌముని తమ్ముని మనవడయిన పులమావి ప్రభువు శాంతిశ్రీ అందం విని , ఆ బాలిక తనకు మహారాణి కావాలని వాంఛిస్తాడు. అప్పటికే తన మనసు తన వశములో లేదని తెలియలేని శాంతిశ్రీ , రాజకీయ కారణాల వలన, సామ్రాజ్య సంరక్షణ తక్షణ కర్తవ్యమైనందున పులమావిని పెండ్లాడడానికి సమ్మతించి అతని రాజమందిరంలో బందీగా ప్రవేశిస్తుంది. అప్పుడే ఆమెకు తాను బ్రహ్మదత్తుని ఎంత ప్రేమిస్తోందో అర్ధమవుతుంది. అతనికై తపిస్తుంది. ఆపై అనేక నాటకీయ సంఘటనల అనంతరం, బ్రహ్మదత్తుడు పులమావిని ఓడించి శాంతిశ్రీని వీరోచితంగా గెలుచుకుంటాడు. అప్పటికే ప్రేమ, వివాహం గురించి, ఆర్షధర్మప్రాముఖ్యత గురించి తెలుసుకున్న శాంతిశ్రీ సంతోషంగా అతనిని స్వీకరించి ఇక్ష్వాకు శాంతిశ్రీ కాస్తా “ అడవి శాంతిశ్రీ” గా రూపాంతరం చెందుతుంది. గొప్ప నవల. తప్పక చదవ వలసినది. ఆద్యంతము రసభరితంగా, రమ్యమనోహర వర్ణనలతో, శృంగార రస పుష్టితో, ధార్మిక వృష్టితో సాగిపోయే కధ ఏ తరానికయినా కొత్తకధే. చారిత్రకమైనా, సాంఘికమైనా, ఏ నవలకు అదేసాటి. తన బహుముఖీన ప్రజ్ఞను ప్రతినవలలోనూ ప్రదర్శించి తన్మయులను చేసిన బాపిరాజు గారు సార్థకజన్ముడు. అడివి బాపిరాజు గారు గొప్ప భావుకుడు.  ఆయన రచనలన్నీ అవి నవలలైనా, కథలైనా, కవిత్వమైనా భావుకతకు పట్టం కట్టాయి. కాల్పనికత మూర్తీభవించిన రచయిత బాపిరాజు. ఆయన అపూర్వ సృష్టి “అడివి శాంతిశ్రీ”. ఎమెస్కో వారు, విశాలాంధ్ర వారి ముద్రణలో విడుదలయ్యింది.

No comments:

Post a Comment

Pages