శ్రీరామ కర్ణామృతము-3 - అచ్చంగా తెలుగు

శ్రీరామ కర్ణామృతము-3

Share This

శ్రీరామ కర్ణామృతము-3

          డా.బల్లూరి ఉమాదేవి.


21.శ్లో: రామం చందనశీతలం క్షితిసుతాహృన్మోహకం శ్రీకరం 
వైదేహీ నయనారవిందమిహిరం సంపూర్ణ చంద్రాననం 
రాజానాం కరుణా సమేతనయనం సీతా మనస్స్యందనం 
సీతాదర్పణ చారుగండ లలితం వందే సదా రాఘవం.
తెలుగు అనువాద పద్యము:
మ:వరశ్రీ చందన శీతలున్ శుభకరున్ వైదేహీ హృన్మోహకున్ 
ధరణీజానన కంజకంజ హితు సీతామానస స్యందనున్ 
కరుణాసంయుత లోచనున్ మిథిలారాట్కన్యామణీ దర్పణ 
స్ఫుర దత్యున్నత గండభాగు రఘు వంశ్యున్ రాము సేవించెదన్.
భావము :గంధము వలె చల్లనైనట్టి సీతమ్మను మోహింప చేయునట్టి,ఐశ్వర్యమును కల్గించునట్టి,సీతాదేవి యొక్క నేత్రపద్మములకు సూర్యుడైనట్టి పూర్ణచంద్రుని వంటి మోము కలిగినట్టి అందరికి రాజైనట్టి దయతో కూడిన కన్నులు కల్గినట్టి సీత మదిలో కొలువు తీరినట్టి ఆమెఅద్దములవంటి చెక్కిళ్ళయందు ప్రకాశించునట్టి రామునకు నమస్కరించుచున్నాను.
వ్యా :శ్రీ రాముని దివ్యమంగళరూపమును కవి చక్కగా వివరించు చున్నాడు.
22.శ్లో:రామం శ్యామాభిరామం రవి శశి నయనం కోటి సూర్యప్రకాశం 
దివ్యం దివ్యాస్త్రపాణిం శరముఖ శరధిం చారుకోదండ హస్తం 
కాలం కాలాగ్ని రుద్రం రిపుకులదహనం విఘ్న విచ్ఛేద దక్షం 
భీమం భీమాట్టహాసం సకల భయహరం రామచంద్రం భజేహం.
తెలుగు అనువాద పద్యం:
మ:శరచాపోజ్జ్వల హస్తు శత్రుకుల నిస్తారున్ సహస్రాంశు కో 
టి రమాభ్రాజితు వారిశోషణుని గోటీరాఢ్యు చంద్రార్క భా 
స్వరదక్షిద్వయు విఘ్నసంహారు ఘనశ్యామాంగు భీమాట్ట హా 
సరసోద్దీబితు సాధ్వసాఋ రఘు స్వామిన్భటింతృన్ మదిన్.
భావము:ఛామనఛాయ కలిగి మనోహరమైనట్టి,చంద్ర సూర్యులు నేత్రములుగా కలిగినట్టి కోటుసూర్యులవంటి కాంతి కలిగినట్టి గొప్పవాడైనట్టి ప్రశస్తాయుధములు హస్తమందు కలిగినట్టి బాణములు మెదలైన ఆయుధములకు సముద్రుడైనట్టి సొగసైన ధనుస్సు చేతియందు కలిగినట్టి కాలస్వరూపుడైనట్టి ప్రళయాగ్ని వలె భయంకరుడైనట్టి,శత్రువంశముల కగ్నియైనట్టి విఘ్నములను కొట్టివేయునట్టి భయంకరుడైనట్టి భయంకరమైన పెద్ద నవ్వు కలిగినట్టి సమస్తభయములను హరించునట్టి రామచంద్రుని సేవించుచున్నాను.
వ్యా:శ్రీ రాముని పరాక్రమాతిశయము జక్కగా వివరిించ బడినది. 
23.శ్లో:రామచంద్ర చరితాకథామృతం లక్ష్మణాగ్రజ గుణానుకీర్తనమ్, 
రాఘవేశ తవ పాదసేవనం,సంభవంతు మమ జన్మజన్మని.
తెలుగు అనువాదపద్యము:
ఉ: రామ భవత్కథామృతము రమ్యత గ్రోలగ నామకీర్తనల్ 
ప్రేమనొనర్ప నీదు గుణలీలలు సంస్మరణంబు సేయ మే 
ధామతి నీదు పావన పదద్వయ సేవ యొనర్చు నట్లుగా 
మామక జన్మజన్మముల మానక సత్కృప నిమ్ము వేడెదన్.
భావము:ఓ రామచంద్ర నీచరిత్రకథ అను అమృతమును ఓలక్ష్మణాగ్రజా!నీ గుణకీర్తనమును ఓ రాఘవేశా!నీపాదసేవయును నాకు ప్రతిజన్మమందు సంభవించుగాక. 
వ్యా:కవితో పాటు మనమూ స్వామి పాదసేవనము కావాలని వేడుకొందామా!
24.శ్లో: రామో మత్కులదైవతం సకరుణం రామం భజే సాదరం 
రామేణాఖిల ఘోర పాపనిహతీ రామాయ తస్మై నమః 
రామాన్నాస్తి జగత్త్రయైక సులభో రామస్య దాసోస్మ్యహం 
రామే ప్రీతి రతీవ మే కులగురో శ్రీరామ రక్షస్వ మామ్.
తెలుగు అనువాదపద్యము:
భావము:రాముడు నా కులదేవత.దయతో గూడిన రాముని ఆదరముతో కూడి సేవించుచున్నాను.రామునిచే నెల్లపాపములు నశించును.రామునికై నమస్కారము.రామునికంటె సులభుడు లేడు.నేను రాముని దాసుడను.నాకులగురువైన రామా నన్ను రక్షించుము. 
వ్యా: దాసత్వభావముతో మనమూ రాముని శరణు కోరుదామా!
25.శ్లో:శ్రీ రామచంద్ర తవకీర్తి సురద్రుమస్య 
తారాగణః సుమనసః ఫలమిందుబింబం 
మూలం ఫణాఫణిగతం గగనం చ మధ్యం 
శాఖా దిశో భువనమండల మాలవాలమ్.
తెలుగు అనువాదపద్యము:
ఉ:రాముని కీర్తి కల్పకము రమ్యసుమంబులు తారకల్ సుధా 
ధాముడు తత్ఫలంబు విదితంబగు శాఖలు దిగ్వితానముల్ 
భూమియు ప్రోది భోగిపతి మూలము మధ్యము పుష్కరంబగున్ 
రాము నుతింప నేరికి దరంబు కరంబతి భక్తి గొల్చెదన్.
భావము:ఓ రామా నీకీర్తి యనెడి కల్ప వృక్షమునకు చుక్కలు పువ్వులు.చంద్ర బింబము పండు.నాగ లోకమే ఆది.ఆకాశము చెట్టు.దిక్కులే కొమ్మలు.భూమి పాదు. 
వ్యా: శ్రీ రామచంద్రుని కీర్తిని కల్ప వృక్షముతో పోల్చి 
చెప్పబడింది.
26.వైదేహీం ముదితోభిజాద పులకాం గాఢం సమాలింగయన్ 
వామేన స్తమ చూచుకం పులకితం వామం కరేణ స్పృశన్
తత్త్వం దక్షిణ పాణినా కలితయా చిన్ముద్రయా బోధయన్ 
రామో మారుతిసేవిత స్సరదు మాం సామ్రాజ్య సింహనే.
తెలుగు అనువాద పద్యము:
శా:సీతన్ మోదము నొంద వామకర సంశ్లేషంబు గావింపుచున్ 
బ్రీతిన్ దత్కృచమంటి దక్షిణపు బాణిన్ దత్త్వమున్ దెల్పుచున్ 
వాతోత్పన్నుని సేవ గైకొనుచు సానందంబునన్ లోక వి 
ఖ్యాతిన్పంచముఖాసనస్థుడగు రామాధీశు బ్రార్థించెెదన్
భావము: పులకాంకురములు గల సీతను సంతోషముతో కౌగిలించుకొని పులకరించిన సీత యొక్క యెడమ స్తనాగ్రము మొడమ చేతితో నంటుచు ఙ్ఞానముద్రగల కుడిచేత దనను సేవించు నాఃజనేయునకుఙ్ఞానబోధ చేయుచు సామ్రాజ్య సింహాసనము నుందున్న రాముడు రక్షించు గాక.
వ్యా: శ్రీరాముని ప్రేమాలింగనము గూర్రి కవి వివరిస్తున్నాడు. 
27. శ్లో:వామాంక స్థితజానకీ పరిసలత్కోదండ దండం కరే 
చక్రం చోర్ధ్వ కరేణ బాహు యుగళే శంఖం శరం దక్షిణే     
బిభ్రాణం జలజాతపత్ర నయనం భద్రాద్రి మూర్ధ్ని స్థితం 
కేయూరాది విభూషితం రఘుపతిం రామం భజే శ్యామలం.
తెలుగు అనువాదపద్యము: 
మ:శరచాపాబ్జ రథాంగముల్ కరచతుష్కప్రాప్తమై యుండ 
స్థిర వామాంకమునందు సీత నియతిన్ సేవింప భద్రాద్రిపై 
నిరవైనట్టి సరోజనేత్రుఁబరు యోగీంద్రేంద్ర సంస్తుత్యు భా 
సుర కేయూర విభూషణున్ దలచెదన్ శుద్ధాంతరంగంబునన్.
భావము:ఎడమతొడపై సీతాదేవి ఆసీనురాలై సేవించుచుండగా శోభిల్లుచున్న ధనువు నొకచేత,పైచేత చక్రమును,రెండు కుడిచేతులందును శంఖమును,బాణమును ధరించినట్టి పద్మపురేకులవంటి కన్నులు కల్గినట్టి భద్రాచల శిఖరమందున్నట్టి భుజకీర్తులతో అలంకరింపబడినట్టి నల్లనైన రఘురాముని సేవించుచున్నాను.
వ్యా:శ్రీరాముని రూపు కనులకు కట్టినట్లు కవి చక్కగా వర్ణిస్తున్నాడు.
28.శ్లో:వామే భూమిసుతా పురస్తు హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుతః 
శతృఘ్నో భరతశ్చ పార్శ్వదళయో ర్వాయ్వాది కోణేష్వపి 
సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్ 
మధ్యే నీలసరోజ కోమలరుచిం రామం భజే శ్యామలం.
తెలుగు అనువాద పద్యము:
మ:తన వామాంకమునందు సీత చెలువొందన్ వెన్క సౌమిత్రి పా 
వనియున్ ముంగల శత్రుఘాతి భరతుల్ పార్శ్వంబులన్ భానునం 
దన నీలాంగద ముఖ్యులన్యమగు దిక్స్థానములందుండగా 
ఘన నీలాంగుఁదదంతర స్థితు మదిన్ గాంక్షింతు రామప్రభున్.
భావము:ఎడమ వైపున సీత,యెదుట హనుమంతుడు,వెనుక లక్ష్మణుడు,ప్రక్క భరత శత్రుఘ్నులు,వాయువ్యాది మూలలందు సుగ్రీవుడు,విభీషణుడు,అంగదుడు, జాంబవంతుడు వుండగా మధ్యలో నల్లకలువ వలె సుందరమైన కాంతిగల రాముని సేవించుచున్నాను.
వ్యా:సపరివారంతో వున్న శ్రీ రాముని రూపు చక్కగా వివరింపబడింది.
29.శ్లో:వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహా మంటపే 
మధ్యే పుష్పక మాసనే మణిమయే వీరాసనే సంస్థితమ్ 
అగ్రే వాచయతి ప్రభంజన సుతే తత్త్వం మునిభ్యః పరమ్ 
వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం.
తెలుగు అనువాద పద్యము:
మ:భాసుర కల్ప మూలమున భర్మగృహంబున బుష్పకాంతరో 
పాసిత నూత్నరత్నమయ పంచముఖాసనమందు ముఖ్య వీ 
రాసనుడై సతీ సహితుడై పరతత్త్వము సోదరాన్వితుం 
డై సరసన్ మరుత్సుత సమర్చితుడైన విభున్ భజించెదన్.
భావము:కల్పవృక్షము క్రింద బంగారు మంటపమునందు పుష్పకము నడుమ మాణిక్య పీఠమందు సీతాదేవితో కూడి వీరాసనమున ఆసీనుడై,ఎదుట హనుమంతుడు చదువుచుండ పరతత్త్వమును మునులకు చెప్పుచు భరతాదులచే పరివేష్ఠితుడైన రాముని సేవించుచున్నాను.
వ్యా:శ్రీరాముని ఆశ్రిత పరాయణత వ్యక్తం చేస్తూ కవి రాముని వర్ణిస్తున్నాడు.
30.శ్లో:వైదేహీం పరిరభ్య జాతపులకాం లజ్జావతీం  సుస్మితామ్ 
కాంచీ నూపుర హారకంకణ లసత్కర్ణావతంసోజ్జ్వలామ్ 
కస్తూరీ ఘనసార చర్చిత కుచాం చంద్రాననాం శ్యామలమ్ 
కందర్పా ధిక సుందరం రఘుపతిం శ్రీ రామ చంద్రం భజే.
తెలుగు అనువాద పద్యము:
చ:దరహసితాననన్ పులకితన్ ఘనసారమృగీ మదాగరు 
స్ఫుర దనులేపనన్ గనక భూషణ భూషిత బూర్ణచంద్ర సుం 
దర వదనన్ విదేహుని సుతన్ మది రంజిల జేయునట్టి కం 
ధర సమ వర్ణు నంగజ శత ప్రతిమానుని రాము నెన్నెదన్.
భావము:పులకాంకురములు కలిగి సిగ్గుగలదయై నవ్వు మొగము గలిగి ఒడ్డాణము,అందెలు,హారములు,కడియాలు,కర్ణభూషణాదులచే ప్రకాశించుచు కస్తూరిచే కర్పూరముచే పూయబడిన స్తనములుగలిగి చంద్రుని వంటి మోము గల సీతను ఆలింగనం చేసుకొన్నట్టి నల్లనివాడై మన్మథునికంటె మిక్కిలి సౌందర్యము కల్గినట్టి రఘువంశ శ్రేష్ఠుడైన రాముని సేవించుచున్నాను. 
వ్యా:అలంకృతుడై,సీతను ఆలింగనం చేసుకొన్న శ్రీ రాముని రూపము చక్కగా వర్ణింపబడింది.
 సశేషము.

No comments:

Post a Comment

Pages