మహిషాసురమర్ధనిశతకము - దిట్టకవి రామచంద్రకవి

దేవరకొండ సుబ్రహ్మణ్యం 


కవిపరిచయం
కవికుటుంబంమైన దిట్టకవివంశాన పుట్తిన రామచంద్రకవి ఆర్వేలనియోగి బ్రాహ్మణుడు. కాశ్యపగోత్రుడు. కృష్ణాజిల్లా నందిగామతాలూకాలోని గొట్టుముక్కల ఈతని నివాసస్థానము. ఉయ్యూరుతాలూకాలోని పెదమద్దాలి గ్రామంలోకూడా ఈకవి కొంతకాలం నివసించారు. ఇప్పటివరకు దొరకిన ఆధారాల ప్రకారం ఈ కవి దాదాపు క్రీ.శ. 1750 ప్రాంతము వాడాని చరిత్రకారుల నిర్ణయము.
శకుంతలాపరిణయము, సేతుమాహాత్మ్యము, రామకథాసారము మొదలగు గ్రంథముల కర్త దిట్టకవి పాపరాజకవి ఈతనికి తాత. రంగరాయచరిత్రము అనే చారిత్రిక ప్రబంధ రచయిత దిట్టకవి నారాయణకవి యీతని తండ్రి.
రామచంద్రకవి సంస్కృతాంధ్ర కవితావిశారదుడేకాక శాపానుగ్రహసమర్థుడు కూడా. తనకు సత్కారము గరుగనిచోట తిట్టుకవిత నుపయోగించి బెదిరించి బహుమతులు పొందిన గడుసరి. ఈ కవి చెప్పిన అనేకచాటువులు ఇప్పటికి ప్రచారంలో ఉన్నాయి. ఒక సారి ఈ కవి తనను గురించి తను చెప్పుకొన్న ఈ పద్యం చూడండి:
కం. దిట్టకవి రామచంద్రుఁడు
దిట్టిన ఱాయైనఁ బగులు దీవించిన యా
బెట్టైనఁ జిగురుఁ బెట్టును
గట్టిగఁ దొల్లింటిభీమకవి కాఁబోలున్
ఈ కవి రచించిన కృతులులలో 1. రఘుకులతిలకశతకము, 2. మహిషాసురమర్ధనిశతకము, 3. ఉద్దండరాయశతకము, 4. రాజగోపాలశతకము, 5. హేలావతీదండకము, 6. వాసిరెడ్డివంశచరిత్ర  ప్రబంధములోని కృత్యాది మాత్రమే లభ్యమైనవి. ఈకవి నిగ్రహానుగ్రహ సమర్ధుడు. ఇతని కవిత నిరర్గళధారాశోభితమై మనోజ్ఞముగా ఉండును.
శతకపరిచయము:
"మహిషాసురమర్ధని పుణ్యవర్థనీ" అనేమకుటంతో చంపకోత్పలమాలవృత్తాలలో వ్రాయబడిన ఈశతకము భక్తిరస శాతకము. ప్రతిపద్యములో భక్తిభావన ఉట్టిపడుతుంది. మంచిధారశుద్ధికలిగిన శతకము.
చ. తారకపర్వతాగ్రపరితఃపరిపుష్పితసత్కదంబకాం
తారసభాంతరస్థలసుధాకర రత్నమృగేంద్రపీఠికపైఁ
జేరి జగంబు లేలు శశిశేఖరగేహిని వైన నిన్నుఁ జె
న్నార భజింతునమ్మ మహిషాసురమర్ధని పుణ్యవర్ధనీ
చ. దమికుల మర్చకావళి కదంబవనంబు నివాసనిందు ఖం
డము తలపువ్వు భూషణ మనంతుఁడు చేతులకుం ద్రిశూలచ
క్రములును బ్రహ్మదండభిదురంబులు సాధనముల్ మహోగ్రసిం
హముగద వాహనంబు మహిషాసురమర్ధని పుణ్యవర్ధనీ
అష్టాదశ శక్తిరూపాలను స్మరించిన ఈ పద్యాలను చూడండి:
ఉ. తోరమెలర్పఁగాఁ గనకదుర్గయనన్ బురుహూతికాంబనా
నారయ జోగులాబ భ్రమరాంబ యనన్ మొదలైనలీల లిం
పారవహించి కాంచి మొదలైనపురంబుల నిల్చి విన్నపం
బారసి ప్రోతువమ్మ మహిషాసురమర్ధని పుణ్యవర్ధనీ
చ. ఘనముగ గాశికాపురిని గాంచిన నిజ్జయనింబురాపురం
బున బెజవాడలోనఁ బరిపూర్ణకృపారసపుణ్యమూర్తివై
జననుతకీర్తిచే నిలుచు చాడ్పున నాహృదయంబునందు నీ
వనయము నిల్వవమ్మ మహిషాసురమర్ధని పుణ్యవర్ధనీ
ఉ. హరిబలప్రభావమున హైమవతీ బగళాముఖీ ప్రచం
డారుణ భైరవీ ప్రముఖనామములన్ నవకోటిరూపముల్
ధీరతఁ దాల్చి ముఖ్యముగ దీకొని లోకములేలునట్టి కా
మారివధూటివీవు మహిషాసురమర్ధని పుణ్యవర్ధనీ
అష్టాదశపీఠ స్మరణమేకాక ఒక్కొక్క శక్తిస్వరూపానికి ఒక్కొక్క పద్యాన్ని అత్యంతసుందరంగా సమర్పించాడు ఈ కవి. కాశీ అన్నపూర్ణపై చెప్పిన ఈ పద్యం, శ్రీశైల భ్రమరాంబపై, బెజవాడ కనకదుర్గపై, లంకనందరి శాంకరీదేవిపై వరిసగగా చంపకోత్పలమాలలను సమర్పించిన తీరు అద్భుతం. వానిలో కొన్ని మచ్చుకు చూద్దాం.
ఉ. దక్షత నన్నపూర్ణయును ధన్యయశంబువహించి కాశిలో
భక్షణసేయుఁ దం చమృతపాయసమాకినువారికెల్ల బ్ర
త్యస్క,ఉగా నొసంగుచుఁ బ్రియమున లోకములేలు శ్రీవిశా
లాక్షివి నీవెసుమ్ము మహిషాసురమర్ధని పుణ్యవర్ధనీ
ఉ. పోలఁ గపాలమాలికలు బూని విభూధిధరించి మించి శ్రీ
శైలమునందు శంకరునిసన్నిధిఁ బెన్నిధివోలె లోకముల్
పాలనసేతు వీవు ప్రతిభన్ భ్రమరాంబ యనం దనర్చి యో
యైలబిలార్చితాంఘ్రి మహిషాసురమర్ధని పుణ్యవర్ధనీ
ఉ. తోరపుహేలచేఁ గనకదుర్గయనన్ బెజవాడ లోపలన్
జారుసువర్ణమూర్తివయి శైలతలంబున నిల్చి కార్యని
ర్ధారణధర్మమర్మకు వరంబు లొసంగినతల్లి నిన్నుఁ జె
న్నార భజింతునమ్మ మహిషాసురమర్ధని పుణ్యవర్ధనీ
చ. చలమున లంకలోపలను శాంకరినావిలసిల్లి రక్కసుల్
గొలువ సమస్తలోకములఁ గూరిమినేలుదువమ్మ చిన్ని వె
న్నెలదొరపూవుపెన్నెఱుల నెక్కొనుతల్లి తనూలతాజితా
త్యలఘుసువర్ణవల్లి మహిషాసురమర్ధని పుణ్యవర్ధనీ
ఈ విధంగా చెప్పుకుంటు పోతే ఈశతకంలోని ప్రతిపద్యము ఒక అమూల్య రత్నమే. ప్రతిపద్యంలో భక్తిరసము ఉట్టిపడుతుంది. ఉదాహరించి చెప్పటంకంటే చదివి ఆ భక్తిరసాన్ని గ్రోలటంలో ఉన్న ఆనందమే వేరు. మీరు చదవండి. మిగిలినవారితో చదివించండి.

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top