Saturday, January 23, 2016

thumbnail

కోరుకుంటే లక్ష్యాన్ని చేరుకుంటామా?

కోరుకుంటే లక్ష్యాన్ని చేరుకుంటామా?

బి.వి.సత్యనాగేష్ 

      
  
లక్ష్యం లేని జీవితం అన్నీవున్న అనాధ జీవితం లాంటిది. లక్ష్యం అనేది మనిషిని ఒక మార్గంలో నడిపిస్తుంది. భవిష్యత్తును నిర్దేశిస్తుంది. జీవితానికి దర్శకత్వం వహిస్తుంది. ఫలితాల గురించి పోరాడేటట్లు చేస్తుంది. అయితే లక్ష్యాలనేవి రాతపూర్వకంగా వుండాలి. రాతపూర్వకంగా లేని లక్ష్యాలు కేవలం ఆశలు మాత్రమే. ఆశించడం వేరు – శాసించడం వేరు. బలమైన కోరిక జీవితాన్ని శాసిస్తుంది. అందుకని లక్ష్యాలను రాతపూర్వకంగా, ఖచ్చితంగా రాసుకుని పధ్ధతి ప్రకారం ఆచరిస్తే సాధ్యం అవుతుంది.
          లక్ష్యాలున్న జీవితంలో అవకాశాలు తరువాత అవకాశాలు కనబడతాయి. లక్ష్యాలు లేని జీవితంలో సమస్యలు తరువాత సమస్యలు వచ్చిపడతాయి.
చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకోవడం నేరమే అంటారు డాక్టర్ అబ్దుల్ కలాం. నిజమే! మనిషికున్న అనంతమైన శక్తికి అల్పమైన లక్ష్యాలను పెట్టుకోవటం నేరమే! ఆధునిక సమాజంలో ఎటువంటి వనరులు లేని ఎంతోమంది అద్భుతాలను చేసి చూపిస్తున్నారు, అంగవైకల్యం వున్నవారు కూడా వారి వైకల్యాన్ని భూతద్దంలో చూడకుండా లక్ష్యాల వైపు చూస్తున్నారు. సాధించి చూపిస్తున్నారు. ఇది కేవలం వారి ఆలోచనా విధానమేనని గుర్తించాలి. మనోవైఖరి, ఆలోచనా సరళి, మానసిక దృక్పథం అనే పదాలకున్న అర్ధం అదే మరి!
90% మార్కులకు ప్రయత్నిస్తే కనీసం 60% మార్కులైనా వస్తాయంటూ వుంటారు. అలాగే లక్ష్యాలు పెద్దగా వుండాలి. లక్ష్యాలు కురచ (చిన్న)గా ఉండకూడదు. చురుకుగా వుండాలి. అందుకని పెద్ద లక్ష్యాలను పెట్టుకుని చురుకుగా పని చెయ్యాలి. అందుకే ఇంగ్లీషులో “ goals should be smart” అంటారు. smart అంటే ఏంటో చూద్దాం. ఈ smart అనే ఎక్రోనిమ్ ను కొన్ని దశాబ్దాల క్రితం ఎవరో పరిచయం చేసేరు.
S= Specific- నిర్దిష్టమైనది
M= Measurable- కొలవగలిగినది
A= Action plan- ప్రణాలికా ప్రక్రియ
R= Realistic- వాస్తవమైనది
T= Time bound – కాలపరిమితి గలది.
లక్ష్యం నిర్దిష్టంగా వుండాలి. అనుకున్న సమయంలో అనుకున్న రీతిలో అనుకున్న స్థాయిలో చేరగలిగినదై వుండాలి. వాస్తవానికి దగ్గరగా వుండాలి. రైలు ప్రయాణం మన జీవితానికి ఒక పాఠం నేర్పుతుంది. వివరాల్లోకి వెళ్దాం.
రైల్వేస్టేషన్ కెళ్ళి రైలు ఎక్కాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నామనే అంశం చాలా ముఖ్యం. మనం ఎక్కడి నుంచి వచ్చేమనేది టికెట్టు ఇచ్చేవాడికి అనవసరం. మీరెక్కడికి వెళ్ళాలనేది మాత్రం చాలా ముఖ్యమైన అంశం. అపుడే మనకు టికెట్టు ఇయ్యగలుగుతాడు. అలాగే మనం ధనవంతుల ఇంట్లో పుట్టామా లేక బీదవారి కుటుంబంలో జన్మించామా అనేది ముఖ్యం కాదు. మనం జీవితంలో ఏం సాధించాలనేది ముఖ్యం. ఈ సందర్భంలో ప్రపంచంలోనే అంత గొప్పధనవంతుడు వారెన్ బఫెట్ అన్న మాటలను గుర్తు చేసుకుందాం.
“ నువ్వు బీదవాడిగా చనిపోతే అది నీ తప్పు
నువ్వు బీదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు”. – వారెన్ బఫెట్
అందుకని లక్ష్యాలు చాలా ముఖ్యం. ఎక్కడి కెల్లాలనే విషయం తెలుసుకోకుండా, టికెట్టు తీసుకోకుండా ఏదో  ఏదో ఒక రైలు ఎక్కితే.... ప్రయాణం మాత్రం చేస్తూనే వుంటాం కాని గమ్యస్థానం పై లక్ష్యం లేనట్లే. అలాంటి ప్రయాణం వల్ల డబ్బు/సమయం వృథా అవుతాయి. అలాగే మన జీవితమనే ప్రయాణంలో కూడా మన గమ్యం, లక్ష్యం ఏంటో తెలియకుండా కాలాన్ని గడిపేస్తూ వుంటే చివరికి బాధ మాత్రమే మిగులుతుంది.
మనం పుట్టినప్పటినుండి తుదిశ్వాస వరకు వున్న జీవితకాలాన్ని సద్వినియోగపరచుకుంటే మన లక్ష్యాలను చెరగాలుగుతాం. అయితే క్రమశిక్షణ ఎంతో అవసరం. రైలు ప్రయాణమనేది రైలును నడిపే వ్యక్తికి ఉద్యోగం. రైలు ఉద్యోగి డ్యూటీ చేసినట్లుగా క్రమశిక్షణతో ఆచరిస్తే లక్ష్యాలను చేరడం సులభతరమౌతుంది. లక్ష్యాలను చేరే మార్గంలో మన ఆలోచనా సరళికి రైలు ప్రయాణంకు వున్న సారూప్యత చూద్దాం.
1.రైలు నిర్దేశించిన సమయానికి బయలుదేరుతుంది.
 • మన లక్ష్యాలను కూడా ప్రణాళికా ప్రక్రియ ప్రకారం మొదలుపెట్టాలి. షెడ్యూల్ ప్రకారం పట్టుదలగా మొదలు పెట్టాల్సిందే.
2.రైలు ఎవ్వరి గురించి ఎదురు చూడదు. సమయం ప్రకారం సిగ్నల్ ఇవ్వగానే బయలుదేరుతుంది.
 • మన లక్ష్యాలను కూడా వున్న వనరులతో మొదలుపెట్టాలి.
3.నిర్దేశించిన సమయంలో గమ్యస్థానానికి చేరడానికి నిరంతరం కృషి చేస్తూవుంటుంది.
 • కాలపరిమితి (dead line/time mouond) ప్రకారం లక్ష్యాలను చేరడానికి నిరంతరం/సానుకూల దృక్పథం,క్రమశిక్షణతో కృషి చేస్తూనే వుండాలి.
4.రైలు నిర్దేశించిన ట్రాక్ పైనే వెళ్తుంది.
 • మన లక్ష్యాల విషయంలో పక్కచూపులు, బలహీనతలను పక్కకు పెట్టి వదిలిన బాణంలా లక్ష్యం వైపే దృష్టి పెట్టాలి.
5.ప్రయాణీకులున్నప్పటికీ.. అన్ని స్టేషన్లలో ఆగదు. నిర్దేశించిన స్టేషన్లలోనే ఆగుతుంది.
 • మన జీవితంలో కూడా పనికి రాని పనులు, పరిచయాలు, కాలక్షేపం అనేపేరుతో సమయాన్ని వృథాచేస్తూవుంటాం. అలా కాకుండా రైలు ప్రయాణంలా సాగిపోవాలంటే మన లక్ష్యాలకు సంబంధించిన వాటికే సమయాన్ని కేటాయించాలి, మనిషికి కొంత/వినోదం,స్వాంతన (RECREATION) అవసరమే! కాని లక్ష్యాలున్న వారు ‘Time pass’ అనే పదాన్ని ప్రమాదకరమైన పదంగా గుర్తించాలి. ప్రేమ వ్యవహారాలు,బలహీనతల బారిన పది పరవశం పొందితే పరాయి వశం/అవడం తప్పదు.పర్యావసానాలు మారడం తప్పదు. ఆ కారణంగా చేరవలసిన లక్ష్యం నేరవేరదు.
6.రైలు ప్రయాణంలో కంపార్ట్ మెంటును బట్టి వసతులు, ఆదరణ వుంటుంది, ఎయిర్ కండిషన్ కోచ్, స్లీపర్ కోచ్,జనరల్ కంపార్ట్ మెంట్లులో తేడా ఉంటుంది.
 • మన జీవితమనే ప్రయాణంలో కూడా మన లక్ష్యసాధన అనే కృషిని బట్టే ఆదాయం, వసతులు, పేరు ప్రఖ్యాతులు, ప్రజాదరణలను పొందగలుగుతాం.
రైలు టికెట్టు కూడా ప్రయాణం గురించి కొన్ని ఖచ్చితమైన వివరాలనందిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ,భవిష్యత్తులో వివరాలలో మార్పులుండవు. మన లక్ష్యసాధన అనే ప్రయాణంలో కూడా వివరాలు అంత ఖచ్చితంగా వుంటే లక్ష్యం చేరడం సులభతరం అవుతుంది. మన లక్ష్యాల ప్రాధాన్యతలలో కూడా మార్పులు చేయకూడదు, రైలు టికెట్టు వివరాలను చూద్దాం!
ట్రైన్ పేరు, నంబర్, బయలుదేరే సమయం, గమ్యం అనే స్టేషన్ పేరు, గమ్యాన్ని చేరే తేది, గమ్యాన్ని చేరే సమయం, కంపార్ట్ మెంట్ నంబర్, సీటు నంబర్, ప్రయాణించే రూటు, ఖర్చు, ప్రయాణానికి పట్టే సమయం, ప్రయాణ దూరాన్ని కిలోమీటర్లలో చూపుతూ రైలు టికెట్టు ఎన్నో వివరాలనిస్తుంది. వీటిల్లో ఏ విధమైన మార్పులు వుండవు.
మన జీవితమనే ప్రయాణంలో ఖచ్చితమైన వివరాలతో SMART అనే రూలును పాటిస్తే ఖచ్చితంగా లక్ష్యాలకు పట్టే సమయాన్ని బట్టి ఈ వర్గీకరణ జరిగింది. వాటిని ఈ క్రింది విధంగా చెప్పుకోవచ్చు.
 1. Immediate goals:ఒకరోజు నుంచి ఒక వారం రోజులలో పూర్తి చెయ్యగలిగేవి.
 2. Short term goal:ఒక వారం కంటే ఎక్కువ రోజులు లేదా మూడు నెలలు లోగా పూర్తి చెయ్యగలిగేవి
 3. Mid-term goal:మూడు నెలలు కంటే ఎక్కువ కాలం లేక ఒక సంవత్సర కాలమో పూర్తి చెయ్యగలగాలి.
 4. Long term goal:ఒక సంత్సరకాలం కంటే ఎక్కువ సమయం లేదా మూడు సంవత్సరాల సమయంలో పూర్తి చెయ్యగలగాలి.
 5. Life goals: జీవితంలోని అంతిమలక్ష్యం, పైన పేర్కొన్న నాలుగు లక్ష్యాలను చేరుకుంటూ అంతిమ లక్ష్యాన్ని చేరడం, అన్నిరకాల లక్ష్యాలకు SMART రూల్ ను పాటిస్తే సాధించగలం.
ప్రయత్నంలోనే ప్రగతిని సాధించగలం. ఒక ఉదాహరణను చూద్దాం. జ్యోతి రంజన్ బాగర్తి అనే 32 సంవత్సరాల యువకుడు 10 సంవత్సరాలు తాను కోరుకున్న లక్ష్యం గురించి కృషి చేసేడు. అంత సమయం అవసరమా? అనే అనుమానం వస్తుంది. వివరాల్లోకి వెళ్దాం.
ఒరిస్సా రాష్ట్రానికి చెందిన బాగర్తి ఆర్ధికపరిస్థితులు బాగాలేక 18వ సంవత్సరంలోనే కాగ్నిజెంట్ టెక్నాలజీస్ అనే కంపెనీలో సెక్యూరిటిగార్డుగా ఉద్యోగాన్ని చేపట్టేడు. తర్వాత చదువును ఆపలేదు. B.Sc లో 85%, M.Sc లో  97% సంపాదించి ‘గోల్డ్ మెడల్ ను సాధించుకున్నాడు. సెక్యూరిటి సూపర్ వైజర్ గా ప్రమోషన్ సంపాదించుకుని 10 సంవత్సరాలు కృషితో జాతీయస్థాయి సివిల్ సర్వీసెస్ లో IAS కు ఎంపికయ్యాడు. జ్యోతి రంజన్ బాగర్తి వివరాలు ఇంటర్నెట్ లో కూడా వున్నాయి.
SMART రూల్ ని పాటించి మీ లక్ష్యాలను చేరుకోండి. చుక్క, చుక్క కలిసి ప్రవాహం అయినట్లు లక్ష్యాలతో జీవితాన్ని సార్ధకం చేసుకోండి. కోరుకుంటే లక్ష్యాలను చేరుకోగలం. ఆలశ్యమెందుకు? పదండి ముందుకు.

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

Comment with Facebook

No Comments


Worlds Best Telugu Online Magazine

మా గురించి

నమస్కారం ! అచ్చతెలుగు లోగిలికి స్వాగతం.

నా పేరు భావరాజు పద్మిని.

5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి. 'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి 'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము.
వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....

aboutus.acchamgatelugu Click here to Read More. Feel free to reach us for more information