ఇలా ఎందరున్నారు ?- 16 - అచ్చంగా తెలుగు

ఇలా ఎందరున్నారు ?- 16

Share This

ఇలా ఎందరున్నారు ?- 16     

అంగులూరి అంజనీదేవి

(జరిగిన కధ : సంకేత, శివాని, పల్లవి, హిందూ స్నేహితురాళ్ళు, ఇంజనీరింగ్ చదువుతూ ఉంటారు. ఆ కాలేజీ లోనే చదువుతున్న శ్రీహర్ష తండ్రి ,సంకేత తండ్రి  స్నేహితుడుకావడంతో ఆమె వాళ్ళ ఇంట్లోనే ఉంటూ చదువుకుంటుంది. నీలిమ శ్రీహర్ష ఇంట్లో పనిమనిషి, 10 వ తరగతి వరకు చదువుకుంటుంది. కోడలు కాంచనమాల తనను ఎలా చూస్తుందో నీలిమకు చెప్తుంది వరమ్మ. కాలేజీ ఫీజు కట్టేందుకు, తగినంత డబ్బు లేకపోవడంతో తన స్నేహితురాళ్ళను అప్పు అడిగేందుకు వెళ్ళిన సంకేతను, పల్లవి బలవంతంగా బాగా డబ్బున్న అనంత్ పుట్టినరోజు వేడుకకు తీసుకు వెళ్తుంది. బాగా చదివే సంకేత తీరును ఇష్టపడి, ఆమె ఫీజును కడతాడు అనంత్. సంకేతకు అనంత్ పట్ల ఒక గౌరవ భావం కలుగుతుంది. అనంత్ కూడా సంకేతను ఇష్టపడుతూ ఉంటాడు. అనంత్ రూమ్ కు వెళ్తుంది పల్లవి. అతను ఎన్నో గాడ్జెట్ లను చూపిస్తాడు, ఒక మొబైల్ ను గిఫ్ట్ ఇస్తాడు. ఆమె ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతుంది. అతని సమక్షమే ఆమెకు లోకమవుతుంది. అనంత్ తో సంకేత  ప్రేమను గురించి నీలిమకు చెబుతుంది శివాని.  సంకేతను చూసేందుకు ఆమె ఇంటికి వస్తుంది అనంత్ తల్లి శరద్రుతి. అనంత్ తనతో తిరిగింది కేవలం కాలక్షేపానికే అని తెలిసిన సంకేత మనసు ముక్కలవుతుంది. అతన్ని నిలదీసేందుకు వెళ్ళిన సంకేత, ప్రస్తుతం అతను మరో అమ్మాయితో ఇదే ఆట మొదలు పెట్టాడని తెలుసుకుంటుంది. ఆ దెబ్బ నుంచి కోలుకోలేక పోతుంది. ఇక చదవండి... )
                “ఈ కట్ల డిజైన్ నీ బాడీకి బాగా సెట్ అయింది పల్లవీ! చూడటానికి చాలా బావున్నావు” అన్నాడు నవ్వి.
          “నీకు బాగుంటే ఏం లాభం? బాగుండేవాళ్లకి బాగుండాలి కాని....” అంది.
          శ్రీహర్ష సన్నగా నవ్వుకున్నాడు.
“శ్రీహర్ష నీకీ విషయం తెలుసా?” అంది సడన్ గా అతని వైపు తలతిప్పి...
“చెప్పకుండానే ఎలా తెలుస్తుంది?” అదే నవ్వుతో అడిగాడు.
“అనంత్ సంకేతను కాకుండా ప్రత్యూషను పెళ్లి చేసుకుంటున్నాడట...” అంది.
శ్రీహర్ష ఆశ్చర్యపోయి చూస్తూ” అనంత్ సంకేతను చేసుకుంటాడని ఎవరన్నారు? మన కాలేజీలో ఎవరైనా అలా అన్నారా?” అన్నాడు.
ఆమెనే చూస్తూ.... “ఇది స్టయిలా?” అన్నాడు నవ్వుతూ శ్రీహర్ష.
“కాదా మరి! నేనేమైనా బాయ్ ఫ్రెండ్ ని కలవటానికి వెళ్తూ ఎవరైనా చూస్తారని ఇలా కట్టుకున్నాననుకుంటున్నావా?”
“అబ్బే... నేను అలా ఏం అనుకోలేదు” అన్నాడు చాలా తేలిగ్గా.
ఆమె కండక్టర్ రాగానే తను ఏ వూరు వెళ్లాలో చెప్పి డబ్బులిచ్చి టికెట్ తీసుకుంది.
శ్రీహర్ష ఆవూరి పేరు వినగానే “ఏం పనిమీద వెళ్తూ వున్నావు” అన్నాడు పల్లవి తీసుకున్న టికెట్ వైపు చూసి.
“మినీ ప్రాజెక్ట్ వర్క్ పనిమీద వెళ్తున్నాను హర్ష! ఇది సంకేత చెయ్యట్లేదు తెలుసా! నీ మెయిన్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందా?” అంది.
“అయింది....” అన్నాడు శ్రీహర్ష, కొద్దిసేపయ్యాక కాస్త తలవంచి యాదృశ్చికంగా ఆమె మోకాలి వైపు చూసి షాకింగ్ గా ‘నీ కాలికి ఈ కట్టేంటి’ అన్నాడు.
ఆ కట్టుముడిని ఇంకాస్త గట్టిగా వేస్తూ “ఇది కట్టులా వుందా? నిజం చెప్పు శ్రీహర్షా! నేను నడిచేటప్పుడు మోకాలికి ఈ కట్టు చాలా పాష్ గా, వెరైటీ డిజైన్ లా వుంది కదూ!” అంది పల్లవి ముచ్చటగా దాని వైపే చూస్తూ.
“ఫ్చ్! అలా ఏం అన్పించటం లేదు. నువ్వలా ఊహించుకుంటున్నావా?” అన్నాడు శ్రీహర్ష.
“అవును!” అంది.
“ఇంతకీ ఆ కట్టేంటి?” అడిగాడు దాన్నే చూస్తూ.....”
“ఓ గంటక్రితం ఆటోలోంచి హడావుడిగా దిగుతుంటే ప్యాంట్ చిరిగింది. ఆ చిరుగు మీద ఖర్చీప్ కట్టి కవర్ చేసుకున్నాను. చూడటానికి బావుంటుందో లేదో అనుకున్నాను. ఎవరైనా అడిగితే కొత్తగా వచ్చిన ఫ్యాషన్ అది అని చెబుదామనుకున్నాను.... అలా చెబితే నువ్వే నమ్మలేదు. మిగతావాళ్ళు ఏమి నమ్ముతారు. ఎప్పుడైనా చిరుగు చిరుగే – కట్టుకట్టే! ఫ్యాషన్ ఎలా అవుతుంది? బోడి బడాయి కాకుంటే..... “ అని తనలో తను అనుకుంది.
“ఒక విషయం చెప్పనా పల్లవి” అన్నాడు శ్రీహర్ష. ఒక అబ్బాయి కాని, అమ్మాయి కాని 13 నుండి 18 సంవత్సరాలలోపు చెడిపోతే ఆ తప్పు తల్లిదండ్రులది.... ఆ తర్వాత చెడిపోతే వాళ్ళు చేస్తున్న ఫ్రెండ్ షిప్ ది... ఎప్పుడైనా మన జీవితాన్ని మనమే రచించుకోవాలి... ఎవరికో నచ్చినట్లు నడుచుకుంటే ఫలితాలు వికటిస్తాయి... అప్పుడు తల్లిదండ్రులను, స్నేహితులను, హాస్టల్ వాళ్లను తిట్టుకుని ఏం లాభం? ఒకసారి ఆలోచించు”.... అన్నాడు.
దిమ్మదిరిగింది పల్లవికి....
ఎందుకంటే తను ఈ మధ్యనే ఎక్కువగా నెట్ కెలుతుంది. తనని వాచ్ మెన్ ఆపటంలేదు. రికార్డులో తను పెట్టె సైన్ ఆపటంలేదు. అనవసరంగా కాంచన ఆంటీని కామెంట్ చేశాను కదా అని పశ్చాత్తాపపడింది.
శ్రీహర్ష అది గ్రహించి, వెంటనే నవ్వుతూ “ అప్పుడు నీ ఈ-మెయిల్ ఫ్రెండ్ నిన్నేదో అన్నాడని విన్నాను” అన్నాడు సరదాగా.
ఈ సైబర్ ప్రపచంలో జరుగుతున్న ప్రేమ సందడి అంతా ఇంతా కాదు. అందుకే పల్లవి బాధగా చూసి “వాడి బొంద! వాడు నన్నసలు రియల్ గా చూడనేలేదు... నువ్వు నాకు నచ్చలేదు అన్నాడు... చూసివుంటే ఇంకేమనేవాడో దేవుడికే తెలియాలి! నేను మాత్రం ఆ క్షణం నుండే లైఫ్ లో ఎవరికీ ఈ-మెయిల్ చెయ్యకూడదు అనుకున్నాను... నన్ను నమ్ము శ్రీహర్షా!! అంది తన చేతిని తలపై పెట్టుకుంటూ.
శ్రీహర్ష మళ్లీ నవ్వి “ అలా డిసైడైపోయ్యావన్నమాట...బావుంది ఎందుకైనా మంచిది టైం చూడు... దేనికైనా మంచి టైం ముఖ్యం కదా !” అన్నాడు.
పల్లవి నవ్వకుండా కళ్ళు పెద్దవి చేసి చూసి, సరదాగా కొట్టబోయి అంతలోనే ఆగింది. ఒక్కక్షణం ఆలోచనగా ఏటో చూస్తూ.
“శ్రీహర్ష! అయిందేదో అయింది. అదంతా మరచిపోయి సంకేతను నువ్వు పెళ్ళి చేసుకుంటే ఎలా వుంటుంది? ఎంతయినా ఒకరికి ఒకరు చిన్నప్పటి నుండి బాగా తెలిసిన వాళ్లు కదా మీరు...!” అంది.
శ్రీహర్షనే కాదు, వెనకసీట్లో కాళ్లు ముడుచుకొని నిస్త్రాణగా పడుకొని వాళ్ల మాటలు వింటున్న సంకేత కూడా అదిరిపడింది.
సంకేత తన ఊరు వెళ్తూ ముందే బస్సు ఎక్కింది, సీటంతా ఖాళీగా వుండటంతో బస్సు ఎక్కగానే పడుకుంది. అందుకే ఆమె శ్రీహర్షకి, పల్లవికి కనిపించలేదు.
శ్రీహర్ష నిట్టూర్చి “ నాకు సంకేత అంటే గౌరవమే తప్ప పెళ్ళి చేసుకునేటంతటి ఫీలింగ్ లేదు. దాస్ కి సంకేత అంటే ప్రాణం సంకేత ఒప్పుకుంటే అతను చేసుకుంటాడు. అతని ఆర్ధిక పరిస్థితి కూడా ఇప్పుడు బాగుంది. చెప్పాలంటే ఒక సాఫ్ట్ వేర్ ఎంప్లాయికి కూడా అతనికున్నంత ఆదాయం లేదు....” అన్నాడు.
“...కానీ అతనికి చదువులేదు కదా! సంకేత ఒప్పుకుంటుందో లేదో! దేన్నైనా ఒప్పుకుంటేనే కదా అద్భుతంగా ఆస్వాదించగలుగుతారు. నీకు తెలియందేమీ వుంది శ్రీహర్షా! మనం నచ్చటంవేరు. మనకి నచ్చటంవేరు కదా!” అంది.
శ్రీహర్ష మాట్లాడలేదు....
పల్లవి కూడా మాట్లాడకుండా తన మాటల్ని అంతటితో ఆపేసింది. వెనకసీట్లో వున్న సంకేతకి లేచి కూర్చునే ఓపికలేక, ఆశక్తిలేక నిరామయంగా చూస్తూ అలాగే పడుకొని వుంది... ఆమె మనసులో మాత్రం “ వీల్లేంటి తన గురించి ఇలా ఆలోచించుకుంటున్నారు? సాధ్యం కాక వూరుకుంది కాని లేకుంటే వీళ్లిద్దర్నీ ఓ బొందతీసి అందులో పాతిపెట్టాలి.. అసలే తన రాత బాగాలేక, మనసు బాగాలేక తనుంటే!”.. అని అనుకుంది.
వాళ్ల స్టేజి రాగానే వాళ్ళు దిగిపోయారు.
సంకేత తన ఊరు రాగానే నెమ్మదిగా బస్ దిగి ఇంటి కెళ్ళింది.
*****
సంకేత వూరెల్లిందని తెలిసి విషయం అర్ధమై ‘అసలే మతిచెడివుంది ఏమవుతుందో ఏమో’ అని కంగారు పడిపోతూ సంకేతవాళ్ల ఊరెళ్ళింది హిందు.
హిందూను చూడగానే సంకేత ముఖంలో వేదనాచ్చాయలు అలుముకున్నాయి.
సంకేత తల్లి, దండ్రి పొలం వెళ్లటంతో ఇల్లంతా ఖాళీగా వుంది.
“నువ్వు నాకు దూరంగా వుంటూ, ఎక్కువగా పల్లవితో, శివానితో తిరుగుతుంటే ఇలాంటిదేదో జరుగుతుందని ముందే ఊహించాను. అయినా సాధ్యమైనంత వరకు నా మాటలతో నిన్ను మార్చాలనే చూశాను. నువ్వు వినే స్థితిని దాటిపోయావు. కానీ అనంత్ ఇంత చెడ్డవాడని మాత్రం నేను ఊహించలేదు...” అంది హిందు సంకేత పక్కన కూర్చుంటూ.
...సంకేత హిందూ ఒడిలో తలపెట్టుకొని మెల్లిగా “అనంత్ నువ్వు అనుకున్నంత చెడ్డవాడేం కాదు” అంది.
హిందూ ఒక్కక్షణం సంకేతనే చూస్తూ “ మభ్య పెట్టుకోవటంలో ఉన్నంత మహాదానందం మరెక్కడా వుండదట... మరి నేను వెళ్ళనా?” అంటూ లేవబోయింది.
“అప్పుడేనా! ఉండవే! నేనింత బాధ పడుతుంటే నీకెలా వెళ్లాలనిపిస్తోంది?”
కోపంగా చూసి మంచివాడేగా బాధదేనికి? ఇంకొంచెం ఎక్కువగా ప్రేమించక...
“నాకతన్ని ప్రేమించాలనేం లేదు. ఏదో మాయ ఆవరించినట్లు దగ్గరయ్యాను... దగ్గరయ్యాక తెలిసింది. ఇలా కుమిలిపోవటానికే దగ్గరయ్యనేమో అని, ఈ బాధ తగ్గేదేలాగో అర్ధం కావటం లేదు” అంది సంకేత.
అది ఒక యాక్సిడెంట్ అనుకోవే! శివాని చూడు ఎంత డేర్ గా ఉంటుందో, అది ఎప్పుడైనా బాధపడగా చూశామా! అంది హిందూ.
శివాని పేరు వినగానే సంకేత ముఖం అదోలా పెట్టి “అది ప్రేమించినా, స్నేహం చేసినా బిజినెస్ దృష్టితోనే చేస్తుంది. అదో పెద్ద మెటీరియలిస్ట్! దాంతో నాకు పోలికేంటి!” అంది.
“మరి అనంత్ నిన్నే దృష్టితో చూశాడు. వ్యాపార దృష్టితో కాదా, ఆ ఉద్దేశమే లేకుంటే ప్రత్యూషనెందుకు ఎంపిక చేసుకుంటాడు... శివానికి అనంత్ కి పెద్ద తేడా కన్పించలేదు నాకు...” అంది.
సంకేత లేచికూర్చుంటూ “అదేంటో హిందూ! నాకు నేనే ఆశ్చర్యంగా అన్పిస్తున్నాను. కాలు దెబ్బతిన్నా నృత్యం చేసిన వాళ్ళున్నారు... చేతులు రెండు పోయినా నోటితో అందమైన బొమ్మలు గీసి ‘ఔరా’ అనిపించు కున్నవాళ్ళు ఉన్నారు. నాకు అన్ని అవయవాలు బాగున్నాయి మనసొక్కటేగా లేనిది... అన్నిటికన్నా మనసంత గొప్పదానే?” అడిగింది సంకేత.
“గట్టిగా కళ్ళుమూసుకుని తల విదిలిస్తే పోయేదానికి మనసు మీద ఇంత ఎనాలసిస్ అవసరమా సంకేతా? ఎందుకయినా మంచిది ఒకసారి మీ అమ్మానాన్నతో మాట్లాడి సైక్రియాట్రిస్ట్ ని కలువు. లేకుంటే నువ్వు త్వరగా ఇందులోంచి బయటపడలేవు..”
“మా అమ్మా, నాన్న అలాంటి మాటలు వినరు హిందూ! నాకు పెళ్ళి చెయ్యాలంటున్నారు. అక్కడ వుండలేక ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా నా మనసుకి కష్టం కలిగేలా మాట్లాడుతున్నారు.... ఇక ఎక్కడికి వెల్లోద్దంటున్నారు. వెళ్తే కాళ్లు విరగ్గొడతాడట. నిజానికి అతన్ని మరచిపోవాలనే చూస్తున్నాను. ఈలోపలే దీనికి పరిష్కారం పెళ్లే అంటూ, పెళ్ళి చెయ్యాలంటున్నారు.పెళ్లి చేస్తే నేను బ్రతుకుతానా? ఏ పురుగులమందో తాగి చావనా? అంది పిచ్చిదానిలా చూస్తూ సంకేత.
దిగ్ర్భాంతిగా చూసింది హిందూ.
... ఎలా వున్న సంకేత ఎలా మారింది...? ఒకే ఒక్క అనంత్ పరిచయం అసలు జీవితమే లేకుండా చేసేలా వుంది. దీన్ని ఎలాగైనా మార్చాలి...
అందుకే హిందూ కోపంగా చూసి “చస్తే మళ్ళీ నిన్ను నువ్వు పుట్టించుకోగలవా? ఎవరినో ప్రేమించినంత గొప్పగా నిన్ను నువ్వు ప్రేమించుకో వెందుకు? నీకన్నా నీకు ఆ అనంత్ ముఖ్యమా? ఇప్పుడు నీ ప్రాణం తీసుకుంటే నీ తల్లిదండ్రులు నరాలు పగిలేలా ఏడుస్తారు. అనంత్ మాత్రం ఒక్క చుక్క కన్నీటిని కూడా వృథా చేసుకోడు. అలాంటి అతనికోసం నువ్వు నీ ప్రాణం తీసుకుంటావా? బయలుదేరు వెళ్దాం! నువ్వు బుద్దిగా చదువుకుంటే మీవాళ్ళ నీకు పెళ్ళిచెయ్యరు... అలా అని వాళ్లను నేను ఒప్పిస్తాను. నువ్వు నా మాట వింటే నీకు నేను కొత్త లైఫ్ ని ఇస్తాను” అంది.
సంకేత ఇంకేమో మాట్లాడబోయింది.
“నువ్వింకా ఏమి మాట్లాడినా నేను వినను. మీ వాళ్ళు రాగానే మాట్లాడి నాతో తీసుకెళ్తాను. ఏ సమస్యను పరిష్కారం చేసుకోవాలన్నా చదువుకావాలి... “ అంది హిందూ.
హిందూ మాటలు ఆగిపోకముందే నరసింహం, శశమ్మ పొలం నుండి వచ్చారు.
నరసింహం హిందూని చూడగానే ముఖం అదోలా పెట్టుకుని పలకరించకుండానే వెళ్లి దూరంగా కూర్చున్నాడు. బాధనిపించింది హిందూకి...
సంకేత అది గమనించి “అదేం పట్టించుకోకే! మా నాన్న నేను వచ్చినప్పటి నుండి కోపంగానే వున్నాడు. నాతో మాట్లాడటం లేదు. అమ్మతో కూడా సరిగా మాట్లాడటం లేదు.
హిందూ ఒక్కక్షణం ఆలోచించింది. నరసింహమే కాదు. శశమ్మ కూడా హిందూని పలకరించలేదు.
హిందూ శశమ్మ ని చూస్తూ “నాతో అంకుల్ మాట్లాడలేదు. మీరు కూడా నన్ను పలకరించకుండానే వంటగదిలోకి వెళ్లి బిజీగా వున్నట్లు నటిస్తున్నారు. మేం పిల్లలం ఆంటీ! మా పట్ల ఇంత నిరసన అవసరమా! అది అసలే మనసుచెడి వుంది. ఆ మాత్రం అర్ధం చేసుకోలేరా?” అంది హిందూ.
అప్పుడు నోరేత్తింది శశమ్మ “మనసు చెడగొట్టుకునేంత అవసరం ఏమొచ్చింది దానికి...? నువ్వు కూడా దాని వయసు దానివే! నువ్వేమైనా ఇలాంటి పని చేసి మీ అమ్మను బాధపెట్టావా? నేను తల్లిని హిందూ! పీనుగులా ఇంటికొచ్చిన దాన్ని చూడగానే ఎంత ఏడ్చుకున్నానో నాకే తెలుసు. దాన్ని కన్నాం! ఇంత దాన్ని చేశాం! చదివిస్తున్నాం! పెళ్లి చెయ్యలేమా! అదెందుకిలా తొందరపడాలి?” అంది బాధగా.
“ఆంటీ! దీని గురించి నేను మాట్లాడలేను. మీరు కూడా ఎక్కువగా ఆలోచింది మనసుపాడు చేసుకోవద్దు. సంకేత అసలే నిరాశగా వుంది. దాన్ని నేను తీసికెళ్లి చదువులో పడేటట్లు చేస్తాను...” అంది.
శశమ్మ మాట్లాడలేదు. హిందూ అంటే అమెక్ మంచి అభిప్రాయం వుంది. ఒక్క నిముషం మౌనంగా గడిచాక..” నాదేముంది హిందూ అంతా మీ అంకుల్ ఇష్టమేగా! కొట్టినా, తిట్టినా ఆయనకు అదంటే ప్రాణం. దానికి పెళ్ళి చెయ్యాలనే అనుకుంటున్నాడు. ఇకదాన్ని కాలేజీకి పంపుతారో లేదో అంది.
హిందూ అర్ధం చేసుకుంది.... “ఒక్క నిముషం ఆంటీ! ఇప్పుడే వస్తాను” అంటూ నరసింహం దగ్గరకి వెళ్లింది.
ఆయన హిందూని చూసి కూడా చూడనట్లే గంభీరంగా కూర్చున్నాడు. ఆయన్నలా చూస్తుంటే జంకుగా వుంది హిందూకి. అయినా ధైర్యం చేసి... “అంకుల్ మీరు పెద్దవారు. మా శ్రేయస్సు కోరేవారు మాతో మాట్లాడకుండా మౌనంగా వుంటే సమస్య పరిష్కారం అవుతుందా?” అంది.
ఆయన ముఖంలో అదే గంభీరత.
“సంకేత మీముందు తిరుగుతుంటే మీకింకా బాధగా వుంటుంది. అందుకే సంకేతను నేను తీసికెల్తాను. నాతో పంపించండి!” అని అంది బ్రతిమాలుతున్న ధోరణిలో.
ఆయన మాట్లాడలేదు.
“సంకేత ఇప్పుడున్న పరిస్థితిలో పెళ్ళి చెయ్యటం కన్నా చదివిస్తేనే దానికి ఎక్కువ న్యాయం జరుగుతుంది. నాతో తీసికెళ్లి దానికి బాగా కౌన్సిలింగ్ ఇస్తాను... ఏమంటారంకుల్?”
ఆయన నవ్వి “కౌన్సిలింగ్ ఇవ్వగానే పోయిన సబ్జక్టులు పాసవుతుందా? అయిన డిటేయిండ్ వెనక్కి పోతుందా? ఎవరికీ చెబుతావు తల్లీ ఈ మాటలు. దాన్ని నీవెంత తీసికెళితే అది ఏం చేస్తుందో నాకు తెలుసు... అదిప్పుడు మానసికరోగి, వాడ్ని మర్చిపోవటం కోసం ఇంకొకడి వెంటపడుతుంది ప్రేమిస్తున్నానంటూ...! అప్పుడు నేనేం చేయాలి?
హిందూ వినలేని దానిలా “అబ్బా! అంకుల్! అలా ఎంకుకాలోచిస్తారు మీరు? నిజమైన ప్రేమకి మరపు వుండదు” అంది.
మరచిపోలేకనే ఆ కోపంతో ఇంకొకడి వెంటపడడం జరుగుతంది. మేము పల్లెలో ఉన్నంత మాత్రాన లాజిక్కులు తెలియకుండా లేము. దాన్ని ఇలాగే వుండనీయి! మా చావేదో మేం చస్తాం! నువ్వింకేం మాట్లాడకుండా వెళ్ళిపోవటం మంచిది. ఎందుకంటే నేను బాధలో ఉన్నవాడ్ని... కోపం కూడా వూరికూరికే వస్తోంది. ఆ కోపంలో నేను నా బిడ్డనయితే తిట్టుకోగలను కాని, నిన్ను తిట్టలేను...” అన్నాడు.
ఒకక్షణం అవాక్కయి ఆ తర్వాత “అంకుల్! నేను దాని స్నేహితురాలిని. దాని మేలు కోరేదాన్ని... నేను దాన్ని తీసికెళ్తే వచ్చే నష్టం కన్నా లాభమే ఎక్కువ ఉంటుంది’ అంది.
ఆయనకి ఎంత ఆపుకుందామన్నా కోపం, ఆవేశం ఆగటం లేదు. “నువ్వంత మంచి స్నేహితురాలివే అయితే అదలా చెడిపోతుంటే చూస్తూ వూరుకుంటావా?దాన్ని కొట్టో, తిట్టో దారిలో పెట్టేదానివి... ఆ బాధ్యత ఒక స్నేహితురాలిగా నీకు లేదా?” అన్నాడు.
“వుందంకుల్! కానీ అదేం చిన్నపిల్ల కాదు. ప్రాబ్లం ని ఇంతదాకా తెచ్చుకుంటుందని నేనూ అన్కోలేదు. జరిగిందేదో జరిగింది. దాన్ని నాతో పంపండంకుల్!” అంది.
ఆలోచిస్తూ తలవంచుకున్నాడేకాని ఆయన అప్పుడేం మాట్లాడలేదు. చూడమ్మా!
భోజనాలయ్యాక ఏమనుకున్నాడో ఏమో హిందూని పిలిచి చూడమ్మా! మాకు ఆస్తులు లేకపోయినా బాధపడం కాని, జీవితం చిందరవందర అయితే తట్టుకోలేము నీ స్నేహమే దానికో ఆస్తి లాంటిది అనుకుంటున్నాను. తీసికెళ్ళు. బాగా చదివించు... మా శివరామకృష్ణ తలుపులు దానికెప్పుడూ ఆహ్వానం పలుకుతూనే వుంటాయి. ఆ విషయంలో నాకు ఇబ్బందేం లేదు” అన్నాడు.
ఆయన అంత త్వరగా సంకేతను పంపుటాడని అనుకొని హిందూ ఆనందపడుతూ “నా మీద మీకున్న నమ్మకాన్ని జీవితాంతం కాపాడుకుంటానంకుల్!” అని మాత్రం అంది.
నరసింహం సంకేతతో మాట్లాడకపోయినా – వాళ్లిద్దరు  వెళ్ళేటప్పుడు బస్ వరకు వెళ్ళాడు.
*****
జాబ్ ట్రైనింగ్ కోసం మైసూరు వెళ్ళాడు శ్రీహర్ష.
ఎంత పెద్ద గాయాన్నైనా మాన్పగలిగే శక్తి కాలానికి ఉంది.
‘లక్ష్యం ముఖ్యం ప్రేమ కాదు’ అని వూరి నుండి వచ్చినప్పటి నుండి సంకేతకి అనేకసార్లు చెప్పి – చల్లపడ్డ ఇనుమును నలగ్గొట్టినట్లు కొట్టీ, కొట్టీ సాగదీసి వదిలింది హిందు. ఎప్పుడో తప్ప ప్రతిరోజు కాలేజీకి వెళ్లేముందు సంకేత దగ్గరకు వచ్చి సంకేతను వెంటబెట్టుకొని కాలేజీకి తీసుకెళ్తుంది.
సంకేత ఇప్పుడు సర్వం మరచి చదువే ధ్యేయంగా మార్చుకొని బుద్ధిగా చదువుకుంటుంది.... అది చూసి ఒకరోజు నీలిమ వరమ్మతో కూడా అంది సంకేతమ్మను హిందూ మేడమ్ మార్చేసిందని సంబరపడిపోతూ స్నేహంలో వుండే గొప్పతనం గురించి వరమ్మతో చెప్పింది.
“నువ్వు చెప్పేది నిజమే నీలిమా! ఏ మార్పు అయినా స్నేహితుల ద్వారానే సాధ్యం! అది మంచా – చెడ్డా అన్నది కాదు. టైం బాగుండలే కాని పరిస్థితుల్లో మార్పు ఎంతసేపు వస్తుందిచెప్పు! ఏ మార్పు అయినా యవ్వనంలోనే రావాలి. ఎందుకంటే యవ్వనంలో ఏర్పడిన భావాలు మనిషిని వెంటాడుతుంటాయి. అందుకే మనుషులు ఏ లక్ష్యాలను ఏర్పరచుకోవాలన్నా యవ్వనంలోనే ఎక్కువగా సాధ్యమవుతుంది” అంటూ యవ్వనానికి వున్న ప్రాధాన్యతను చెప్పింది వరమ్మ.
నీలిమ ఒకవైపు ఆమె మాటల వింటూనే వరమ్మ మంచం పక్కన వున్న పాత న్యూస్ పేపర్లను ఓ కట్టలా కట్టి “ ఇవన్నీ రేపు అమ్మేస్తాను వరమ్మా!” అంది.
వరమ్మ దృష్టి అకస్మాత్తుగా ఆ పేపర్ల కట్ట పక్కన వున్న నాలుగు రోజుల క్రితం పేపర్ పై పడింది అందులో కన్పిస్తున్న ఫోటో వైపు దీక్షగా చూస్తూ...
“ఏదీ ఆ పేపర్ ఇలా ఇవ్వు” అంది.
నీలిమ వెంటనే ఆ పేపర్ తీసి వరమ్మ చేతిలో పెట్టింది.
“ఈ ఫోటోలో వుంది అనంత్ కదూ!” అంది వరమ్మ, అనంత్ శ్రీహర్షతో ఒకటిరెండు సార్లు తన ఇంటికి రావటం వరమ్మకి బాగా గుర్తు.
వరమ్మ కదిలిపోతూ “ఎంత ఘోరం జరిగింది? ఇది సంకేతకి తెలుసా?”.
అక్కడికి దగ్గరలోనే వున్న సంకేత “ఏంటి! సంకేతకి తెలుసా అంటున్నారు?” అంటూ వాళ్ళదగ్గరికి వచ్చింది సంకేత
వరమ్మ వెంటనే పేపర్ దాచేయబోయింది.
సంకేత లాక్కుని అందులో ఏముందో చూసి షాకైంది.
...అనంత్ ఫ్రెండ్స్ తో బెట్ కట్టి కారు రేసింగ్ లో పాల్గొని కాలు విరగొట్టుకున్నాడు. విపరీతమైన గాయాలతో హాస్పిటల్ పాలయ్యాడు. దీనివల్ల అతను జాబ్ ట్రైనింగ్ పీరియడ్ మిస్సయ్యాడు... ఇన్ని రోజులు చదివిన చదువుకు అర్ధం లేకుండా చేసుకున్నాడు.
సెలవులోస్తే చాలు బెట్ పేరుతో ఇప్పటి యువకుల్లో కొందరు ప్రాణాలమీదకి తెచ్చుకుని తమ లక్ష్యాలను, కెరియర్ ను ఎలా ద్వంసం చేసుకుంటున్నారో తెలియాలంటే అనంతే దానికి నిదర్శనం అని హెడ్ లైన్స్ లో రాసి వుంది.
షాక్ లోంచి తేరుకోలేక బిగుసుకుపోయి నిలబడింది సంకేత. అది చూసి వరమ్మ వెంటనే సంకేత భుజం తట్టి కదిలించింది.
పేపర్ని చేతులతో అలాగే పట్టుకొని, ఆ పేపర్లో ముఖమా దాచుకుని ఏడ్చింది సంకేత...
ఆ ఏడుపు ఎందుకో? అనంత్ కోసం సంకేత ఏడుస్తుందా!!!
మనిషి గుర్తించకుండా, ఆ మనిషికోసం కొంత త్యాగాన్ని కలిగి ఉండకుండా... ఒక మనిషిని స్వీకరించి, ఆ మనిషి జీవితంలోకి వెళ్ళి దాన్ని సీరియస్ గా తీసుకోకుండా నిర్ణయం తీసుకునేముందు కూడా ఆ మనిషి గురించి పూర్తిగా పట్టించు కోకుండా వుండే అనంత్ కోసం ఒక్క కన్నీటి చుక్క రాల్చినా వృథాయే కదా అని వరమ్మ నీలిమ ఆలోచిస్తుంటే....
(సశేషం )

No comments:

Post a Comment

Pages