డబ్బింగ్ ఆర్టిస్ట్ - అచ్చంగా తెలుగు

డబ్బింగ్ ఆర్టిస్ట్

Share This

డబ్బింగ్ ఆర్టిస్ట్

పెయ్యేటి శ్రీదేవి

         
' అమ్మా!  నీకు డాక్టర్ రాసిచ్చిన మందులు తెచ్చానమ్మా.  ఇక నీ జబ్బు మటుమాయం!  నీకే దిగులూ వుండదు.  సంతోషంగా లేచి తిరుగుతావు.  అసలు టైముకి మందులు వేసుకుని, బలమైన ఆహారం తీసుకుంటూ, ఏ దిగులూ లేకుండా మనసుని ఎప్పుడూ సంతోషంగా వుంచుకుంటే, ఆరోగ్యం మన చేతుల్లోనే వుంటుందమ్మా.  సర్లే, నేనిలా వాగుతూనే వుంటాను.  నువ్వు వింటావా ఏమనన్నానా?  సరేగాని, ఈ అరకు రోజుకి మూడుసార్లు వేసుకో.  ఈ టాబ్లెట్లేమో గుండెలో నెప్పి వచ్చినప్పుడు వేసుకో.  ఈ టాబ్లెట్లేమో రాత్రి పడుకునే ముందర వేసుకో.  ఇదేమో నిద్ర పట్టకపోతే వేసుకోవాలి.  ఏం?  సరేనా?  నే చెప్పినవన్నీ గుర్తున్నాయా?  ఏమిటమ్మా, ఊ, ఆ అనవు?  నేనింత వాగుతుంటే ఏం మాట్లాడవేమిటి?  నా మీద కోపమొచ్చిందా, ఉదయం నించీ ఏం తినకుండా వెళ్ళానని?  నీకు ఆరోగ్యం చిక్కితే నువ్వు చెప్పినట్లే వింటా.  సరేనా?  అర్జంటుగా నీకు మందులు తేవాలనే కదమ్మా నేను వెళ్ళాను?  ఇప్పటికే ఒకరోజు లేటయింది డబ్బు చేతికందక.  అయ్యో!  ఇక్కడ నేను పెట్టిన ఇడ్లీలు అలాగే వున్నాయి.  ఏమిటమ్మా, ఇంతలోనే నిద్రా?  తినేసి పడుకోవచ్చుగా?  ఇదుగో, గ్లాసులో వుంచిన బత్తాయిరసమూ తాగలేదు.  ఏమీ తినకపోతే ఎలా కోలుకుంటావు?  నీ ఆరోగ్యం కూడా చూసుకోకుండా నీరసంగా వున్నా ఇంటిపనంతా నువ్వేచేస్తావు.  అనాథ పిల్లల్ని చేరదీసి వాళ్ళకి చదువు చెబుతావు.  ఇరుగు పొరుగిళ్ళలో సాయం చేస్తూ అందరికీ తల్లో నాలికలా మసులుతావు.  ఇందుకే ఏ చిన్న సాయం కావాలన్నా అందరూ నిన్నే పిలుస్తారు.  నువ్వు మాత్రం ఎవరి సాయమూ తీసుకోవు.  సర్లే.  నేనిలాగే వాగుతుంటా.  నువ్వలాగే వుండుగాని, ఇదుగో, మెల్లగా లేవదీస్తా.  మెల్లగా ఈ ఇడ్లీలు తిని, కొంచెం జ్యూస్ తాగు.  తరవాత మందులేసుకుందువు గాని.'
          ' అయ్యో!  అమ్మా!  అమ్మా!  ఏమిటిది, చెయ్యి కిందకి వాలిపోయింది?  పాదాలు......చ.....చ.........చల్లగా వున్నాయి?'
          ' అమ్మా!.......అమ్మా.................అమ్మా..................!  అమ్మా, నన్ను ఒంటరిదాన్ని చేసి వెళిపోయావా అమ్మా?  అమ్మా..........నువ్వు లేని బతుకు ఎలా బతకాలమ్మా?  గుండెలో మళ్ళీ నెప్పి వచ్చిందామ్మా?  అయ్యో!  ఈ కాసేపట్లో ఎంత బాధ అనుభవించి వుంటావో!  నే పని చేసే ఆఫీస్ బాస్ ఒట్టి మూర్ఖపు దుర్మార్గుడు!  మందులు కొనాలి డబ్బిమ్మని ఎంత ప్రాధేయపడ్డా డబ్బు ఇవ్వలేదు.  అందుకే నిన్ను దక్కించుకోలేకపోయాను.  నిన్ను పోగొట్టుకున్న దౌర్భాగ్యురాలిని. అమ్మా.................'
*******************************
          ' ఎక్సలెంట్!  సూపర్ గా చెప్పావమ్మా ప్రమీలా!  నిజంగా నువ్వు చెప్పే డబ్బింగ్ వింటున్నంత సేపూ నా కళ్ళమ్మట నీళ్ళొచ్చాయి.  అమ్మ పోయిన బాధ నీ గొంతులో బాగా పలికింది. ఇదుగో, నీ రెమ్యునరేషను.  ఇంకో రెండువేలు అదనంగా ఇస్తున్నాను.  ఇకనించి నే తీసే సినిమాల్లో హీరోయిన్లకి నువ్వే డబ్బింగ్ చెప్పాలి.  ఏమిటీ........డైలాగులు చెప్పి అదే మూడ్ లో వుండిపోయి ఏడుస్తున్నావా?  అయ్యో, అంత సెన్సిటివ్ అయితే ఎలా అమ్మా?  ఇంకా ముందర ముందర అనేక రకాల  డైలాగులు చెప్ప్పాల్సివస్తుంది.  అన్నిటికీ సిధ్ధపడాలి.  డబ్బింగ్ చెప్పినందుకే నీకింత బాధనిపిస్తే, నటించే వాళ్ళకెంట బాధుండాలి?  ఎలా అయినా ఈ సినిమా అమ్మ సెంటిమెంటు పిక్చరు కదా?  ఈ సినిమా బ్రహ్మాండంగా ఆడుతుంది.  తరవాత ఇంకో వెరైటీ సినిమా ప్లాన్ చేస్తున్నాను.  దానిక్కూడా డబ్బింగ్ నువ్వే చెప్పాలి.  ఊ..............ఇదుగో, ఈ డబ్బు తీసుకో.  ప్రమీలా!  ఇంకా ఏడుస్తున్నావా?  ఛ, ఊరుకో.  అదంతా నటనే కదా?  మహానటి సావిత్రిగారు కూడా ఏడుపు పాత్రలు వేసినపుడు ఇంటికెళ్ళాక కూడా అదే మూడ్ లో వుండేవారట.  ఆ మహానటిని తలపింప జేసావు నీ డబ్బింగ్ తో.'
          ప్రమీల కళ్ళు తుడుచుకుంటూ, వచ్చే ఏడుపుని బలవంతంగా ఆపుకుని చెప్పింది. 
          ' కాని నాది నటన కాదు సార్!  ఈ చిత్రంలో అమ్మ కోసం బాధతో ఏడుస్తూ నటించిన ఆ హీరోయిన్ ది నటన.  కాని ఆమెకి అమ్మ పోయిన బాధతో డబ్బింగ్ చెప్పిన నాది మాత్రం నటన కాదు సార్.  నిజం!  నిజంగా నిజం!  ఎవరి కోసమైతే గవర్నమెంటు ఇచ్చిన స్కాలర్ షిప్పుతో చదివే చదువు మానేసి డబ్బుకోసం డబ్బింగ్ చెబుతూ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మీ దగ్గర చేరి, ఆ డబ్బుతో అమ్మకి వైద్యం చేయించి, ఎలాగైనా   ఏ అమ్మని బతికించుకోవాలనుకున్నానో, ఆ అమ్మ, ఆ అమ్మ..మా అమ్మ...అందరికీ అమ్మ.....ఎంతోమందిని ఆదరించి, తన చేత్తో అన్నం పెట్టిన అమ్మ, ఎంతో మందిని ప్రేమగా చూసిన అమ్మ..ఎంతో మందికి సహాయం చేసిన అమ్మ.......ఈజగతికే అమ్మ.......ఆ అమ్మ.......మా ....అమ్మ నిజంగా చనిపోయింది సార్!  ఆప్రేమామృతాన్ని పంచిన, ఎంతోమందికి సాయపడుతూ తన జీవితాన్నే త్యాగం చేసిన నిస్వార్థ దేవత, ఆ అమ్మే లేకపోయాక మిరు దయతో ఎక్కువ చేసి ఇచ్చే పారితోషిమం ఇప్పుడెందుకు సార్ నాకు?  ఈ డబ్బు ముందరే ఇచ్చివుంటే అమ్మ బతికేది సార్.  తప్పకుండా బతికేది.  ఎంతో ప్రాధేయపడి అడిగాను. అప్పుడు ససేమిరా ఇవ్వనన్నారు.  అదేహీరోలకి, హీరోయిన్లకి ఐతే అడగకపోయినా కోట్లలో రెమ్యునరేషను ఇస్తారు.  కోట్లు పెట్టి సినిమాలు తీస్తారు.  డబ్బింగ్ చెబుతూ డబ్బు సంపాదించుకునే నాకు అవసరానికి మరి కాస్తైమ్మని అడిగితే ఇవ్వలేదు.  కొంతమంది ఎంత డబ్బున్నా ఇంకా ఇంకా సంపాదించాలనే దురాశతో డబ్బు సంపాదిస్తారు.  వాళ్ళకి డబ్బు సంపాదించాలనే డబ్బుజబ్బు.  అదొక వ్యసనం.  మందులకి కూడా ఆ డబ్బుజబ్బు పోదు. 
          కాని మందులకి తగ్గే జబ్బుకి డబ్బులేక,మందులు కొనలేకపోయి, నా అసమర్థత వల్లనైతేనేమి, మీ కఠిన పాషాణ హృదయం వల్లనైతే నేమి, నన్ను దిక్కులేని దాన్ని చేసి అమ్మ పోయింది.  డబ్బింగు చెప్పాల్సిన కాల్షీట్లు వున్నందున అమ్మ పోయిన బాధలో వున్నా వచ్చాను.' అంది ప్రమీల.
          ' ఏమిటీ, అమ్మ పోయినందుకు అంతబాధ పడిపోతున్నావు? ఎవరికీ అమ్మలుండరా?  అమ్మలందరూ తమ పిల్లల్ని ప్రేమగానే చూస్తారు.  పిల్లలు చెడ్డపిల్లలుంటారేమో గాని, చెడ్డ అమ్మలుండరు.  ఎవరి అమ్మలైనా ఎవరి అమ్మలు వాళ్ళకి ఎక్కువే.  మీ అమ్మ చనిపోతే దానికి నేనే కారణమైనట్లు మాట్లాడతావేమిటి? ఋణం తీరిపోయింది, వెళ్ళిపోయింది.  సరేలే, ఇదుగో, ఈ డబ్బు తీసుకుని వెళ్ళు.'
          ' హు, ఇన్నో నీతివంతమైన సినిమాలు తీస్తారు.  సినిమా ఆకర్న నీతివంతమైన స్లోగన్లూ ఇస్తారు.  కాని అవి రాతల వరకే.  చదువుకోడానికి బాగానే వుంటాయి.  ముందర ఆ చెప్పే పెద్దమనుషులే ఆచరించరు.' అని మనసులో అనుకుంటూ డబ్బింగ్ స్టూడియో నించి బయల్దేరింది ప్రమీల.
                    ' డబ్బు సంపాదించడం తప్పు కాదు.  ఎంత నీతిగా, ఎలా సంపాదించామన్నదే ముఖ్యం.  సంపాదించిన డబ్బు సక్రమమైన మార్గంలో అందరికీ ఉపయోగ పడేలా ఖర్చు చేయడం కూడ ఒక కళ.  కొందరికి రోగాలొస్తే మందులు కొనుక్కోడానికి డబ్బుండదు.  డబ్బున్న వాళ్ళు విదల్చరు.  డబ్బుల్లేక, మందులు కొనలేక ఎంతోమంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.
          కొందరి జీవితాల్లో ఆటుపోట్లు ఎక్కువగా వుంటాయి.  జీవితం కొంతమందికి వడ్డించిన విస్తరి. కొంతమందికి కష్టాలకడలి.  ఆ కష్టాలకి కృంగిపోకుండా, వాటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకి సాగడమే ఇప్పుడు తన తక్షణ కర్తవ్యం.' అని తనకి తను సర్ది చెప్పుకుని ఇంటికి వెళ్ళింది.
          అమ్మ కర్మకాండలు అన్నీ అయాకపన్నెండో రోజు పేదలందరికీ భోజనాలు పెట్టి, బట్టలు పంచిపెట్టింది.
          ' అమ్మా!  అమ్మా! వచ్చానమ్మా.  నేనమ్మా, నీ రాఘవని వచ్చానమ్మా.  నువ్వు పోయిన సమయానికి రాలేకపోయానమ్మా.  కబురు చేరడం ఆలస్యమైంది.  ఆఖరి చూపన్నా దక్కలేదు.  నాకు అమ్మెవరో తెలీదు.  నాన్నెవరో తెలీదు.  అనాథనైన నన్ను చేరదీసి, పెంచిపెద్ద చేసి, సంఘంలో ఉన్నతమైన స్థానాన్ని కల్పించావు.  సినిమాలు తీసే పనిలోబడి నిన్ను నిర్లక్ష్యం చేసాను.  నన్ను క్షమించమ్మా.' రాఘవ ఏడుస్తున్నాడు.
          ' సార్!  మీరేమిటిక్కడ?  మా అమ్మ మీకు తెలుసా?'
          ' అవునమ్మా ప్రమీలా!  ఈ అమ్మ నాకూ అమ్మే.  అమ్మ పోయిందని ఆలస్యంగా తెలుసుకున్నాను.  అందరికీ అమ్మలుంటారు.  ఎవరి అమ్మలు వాళ్ళకెక్కువ.  నీకే అమ్మ వున్నట్లు మాట్లాడతావేమిటి, మీ అమ్మ పోతే దానికి నేనే కారణమైనట్లు మాట్లాడాతావేమిటి, ఋణం తీరిపోయింది, వెళిపోయింది..........' అంటూ నిన్ను తృణీకరం చేసి మాట్లాడాను.  నిజంగా ఈ అమ్మ జగతికే అమ్మ. ఈ అమ్మ గురించే నువ్వు బాధతో డబ్బింగ్ చెప్పావని తెలుసుకోలేకపోయాను..........'
          ఆమెని అందరూ మాతా ఆత్మీయతానందమయి అని పిలుస్తారు.  ఆమె గొప్పతనం గురించి, ఆమె చేసిన సేవల గురించి తి.వి.ఛానెల్లో యాంకర్ చెబుతూ.........ఆమెకి నివాళులర్పించి, ఆ రోజు మదర్స్ డే సందర్భంగా అమ్మ గొప్పతనం గురించి చెబుతోంది.
                    ' అమ్మంటే ఏమిటి?  అమ్మంటే ఎవరు?  అమ్మ తత్వం ఏమిటి?'
          నోరు తెరిచి అంగుట్లోంచి వచ్చేది ' అ '.  పెదాలు రెండూ కలిపితేనే ' మ్మ '.  ' అమ్మ '!  చదువు నేర్చుకునేటప్పుడు పిల్లలు నేర్చుకునే మొదటి మాట ' అ ' అంటే ' అమ్మ '.  మొదటి దైవం అమ్మ.  మొదటి గురువు అమ్మ.  అమ్మని మించిన దైవం లేదు.  ' అ ' అంటే అనురాగం. ' మ ' అంటే మమకారం.  అనురాగాన్ని రంగరించి, మమకారంతో కడుపు నిండా అన్నం తినిపించేది అమ్మ.  బాధల్ని పంచుకునేది అమ్మ.  బాధల్ని తెలుసుకునేది అమ్మ.  బాధలో వుంది ఆర్తిగా పిలిచేది, సరీరానికి దెబ్బ తగిలితే విలవిల్లాడుతూ అరిచేది ' అమ్మా ' అనే!  ఆ బాధతో అరిచే అరుపు సూటిగా అమ్మ  మనసుకు చేరుతుంది.  బాధల్లో ఓదార్చేది, అక్కున చేర్చుకునేది అమ్మ. మాటలు నేర్పేది అమ్మ.  మంచి విద్యాబుధ్ధులు నేర్పేది అమ్మ. లోకజ్ఞానం నేర్పేది అమ్మ.
          మంచిజీవనవిధానానికి మార్గం చూపి, సంఘంలో మంచిమనిషిగా తీర్చి దిద్దేది అమ్మ.  తనకోసం ఏమీ ఆశించకుండా, తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చెయ్యకుండా, అహర్నిశలూ,జీవితాంతం పిల్లక్షేమం కోసమే తపన పడుతూ, త్యాగం చేసే నిస్వార్థజీవి అమ్మ మాత్రమే.  బిడ్డని తన శరీరంలోని భాగంగానే అనుకుని, వాళ్లకే కష్టమొచ్చినా తల్లడిల్లిపోయి, వాళ్ళ బాధని తన బాధగా అనుభవించి, వాళ్ళకోసమే బతుకుతూ, వాళ్ళ చేతుల మీదుగానే తనువు వెళ్ళిపోవాలని కోరుకునేది అమ్మ మాత్రమే. అటువంటి అమ్మ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.  అమ్మ లేనిదే జీవితం లేదు.  ఈ లోకమే లేదు.  దేశానికి రాష్ట్రపతి ఐనా అమ్మకి కొడుకే.  దేవుడు కూడా అమ్మకి కొడుకే.
          అటువంటి అమ్మని తెలుసుకుని ప్రతి ఒక్కరూ పూజించాలి.
NO MOTHER - NO LIFE !
KNOW MOTHER - KNOW LIFE !!
           ఇవాళ మాతృదినోత్సవం సందర్భంగా అమ్మలందరికీ శుభాకాంక్షలు. '
************************
                    ప్రమీల డబ్బింగ్ చెప్పిన ' అమ్మ ' సినిమా సూపర్ హిట్టయింది.  ఆ చిత్రంలో వేసిన హీరోయిన్ నవ్యశ్రీకి ఆస్కార్ అవార్డ్ వచ్చింది.  డబ్బింగ్ చెప్పిన ప్రమీలకి ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా నంది అవార్డ్ వచ్చింది.
అమ్మ పోయిన బాధలో డబ్బింగ్ చెప్పిన ప్రమీల ' అమ్మా!  నువ్వు వెళ్ళిపోయి నన్ను మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా స్థిరపరిచావా అమ్మా?' అని మూగగా రోదించింది.
**************

No comments:

Post a Comment

Pages