అసలు కథ

  సి.ఉమాదేవి

          
“ ఏంసార్! గంటనుండి వెదకుతూనే ఉన్నారు,మీ అభిమాన రచయితల నవలలన్నీ చదవడం అయిపోయిందా ఏమిటి?”గొంతు బాగా తగ్గించి అడిగాడు లైబ్రేరియన్.
“ అబ్బే చదవాల్సినవెన్నో ఉన్నాయి కాని ఏదో పుస్తకం కావలసి వస్తేను...”అంతే గుసగుసగా బదులు పలికాడు సుందరం-ది బడ్డింగ్ రైటర్!
“ ఏమి పుస్తకం సార్ అది?పేరు చెప్పండి,లిస్ట్ చూసి చెప్తాను.ఏ ర్యాక్ లో ఉంటుందో తెలిసిపోతుంది”.తన వంతు సాయం చెయ్యడం లైబ్రేరియన్ గా తన ధర్మం అనుకుంటూ  నవలల పట్టికనందుకున్నాడు లైబ్రేరియన్.
“ ఇది నవలల్లో ఉండదులే...”సుందరం అడ్డుకున్నాడు.
‘ ఏమయుంటుంది?’లైబ్రేరియన్ లో ఆసక్తి.
“ పుస్తకం పేరు చెప్పండి సార్.ఆ లోపల మీరు మ్యాగజైన్లు,పేపర్లు తిరగెయ్యండి.పుస్తకం వెదకి తీసిచ్చే బాధ్యత నాది.”
“ అది చరిత్రకు సంబంధించినదిలే.” ఇక చెప్పక తప్పదన్నట్లుగా చెప్పాడు.
“చరిత్రా?” ‘చరిత్ర పుస్తకాలున్న బీరువా పుణ్యం చేసుకున్నట్లుంది ’అనుకుంటూ చరిత్రకు సంబంధించిన పుస్తకాలున్న బీరువా వైపు కదిలాడు లైబ్రేరియన్.
ఆ అరలో నుండి ఏ పుస్తకం తాకినా దుమ్ముతోపాటు తుమ్ములు జత కలిసేవి.అప్పుడప్పుడు దుమ్ము దులుపుతున్నా ఏ పుస్తకము చదవడానికి నోచుకోలేదు.నవలలు,కథా సంపుటాలు తీసుకుని వెళ్తున్నవారి వైపు ఆవేదనగా చూస్తూ నిట్టూర్చేవి చరిత్ర పుస్తకాలు. ‘ అవెవరు చదువుతారు,బీరువాలపైనో,స్టోర్ లోనో పెట్టించెయ్యండి,నవలలు చక్కగా సర్దిపెట్టుకోవచ్చు.’ ఇలాంటి సలహాలు అందుకున్నాడు.
“ ఏమిటో సార్ గత రెంఢ్రోజులుగా అందరు చరిత్ర పుస్తకాల గురించే అడుగుతున్నారు . మీకు కావలసినది అదే కాదు కదా?” అనుమానంగా ప్రశ్నించాడు లైబ్రేరియన్ .
‘ నిశ్సబ్ధం !’ అని రాసున్న బోర్డు గాలికి టపా టపా కొట్టుకున్నట్లు లైబ్రేరియన్ మాటలు గట్టిగానే వినబడ్ఢాయి.
ఎవరైనా వింటారేమోనని అటు ఇటు చూస్తూ, “ ష్! నెమ్మదిగా మాట్లాడుకుందాం.నేనడిగేది కృష్ణదేవరాయల గురించి ఏమైనా పుస్తకాలున్నయేమోనని..” గుసగుసగా అన్నాడు సుందరం.
“వూ..వూ..” తల వూపుతూనే, “అనుకున్నాను సార్ మీరు అదే అడుగుతారని కాని సారీ సార్ అశోక్ గారు, వెంకట్ గారు వెదకి,వెదకి నిన్ననే తీసికెళ్లారు.ఎందుకో అనుకున్నాను కాని మన అమ్మాజీ గారు చెప్పారు.గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా మన ప్రెసిడెంటుగారు మంచి కథల పోటీ పెట్టమన్నారట.నోటీసు టైప్ చేస్తున్నారు.బోర్ఢుపై పెట్టాక ఎంతమంది ఎన్ని చరిత్రలడుగుతారో! ” చదవని ఎన్నో పుస్తకాల దుమ్ము రాలిపోయే సమయం వచ్చిందనుకున్నాడు.
చరిత్ర నేపథ్యంగా ఏదైనా కథ రాయవచ్చు,కృష్ణదేవరాయల పరిపాలన నేపథ్యంగా కథ రాస్తే బాగుంటుందని సూచించారు. పాఠకులలో సైతం  రచనాభిలాష కలిగించడమే  సాహితీ సమాలోచన లక్ష్యం.ఈ సంగతి తమకే ముందు తెలిసిందనుకున్నారు పాఠక రచయితలు. కాని,సెక్రటరీ ఆనందంగా అందరితో ఆ వార్తను చరవాణిలో పంచుకున్నపుడు ఎవరికి వారు సంబరపడ్డారు. ‘ మీరు ఎందుకు అడుగుతున్నారో!’ నాకు తెలుసన్నట్టు నవ్వాడు లైబ్రేరియన్.
“ వెళ్లిన పుస్తకాలు ఎప్పుడు వెనక్కి వస్తాయి?” నిస్పృహగా అడిగాడు సుందరం.
“ పదిహేను రోజుల్లో రావచ్చు.ఇంగ్లీషులో ఉన్న పుస్తకం , ‘ ది ఫర్ గాటెన్ ఎంపైర్ ’ కూడా అమ్మాజీగారు తీసుకెళ్లారు .” నొచ్చుకుంటూ తన నిస్సహాయతను ప్రకటించేసాడు.
రాయల ఆస్థానంలో తిమ్మరుసు ప్రత్యేకంగా ఏర్పరచిన వేగులు అన్నీ ఎలా తెలుసుకుంటారో అలా కొంతమంది పాఠకులు పేపర్లు,పుస్తకాలు చదువుతూనే ఓ చెవి వీరి సంభాషణపై వేసి రసస్ఫూర్తి పొందే ప్రయత్నం చేస్తున్నారు.
అది గమనించిన సుందరం, ‘ అందుకేనేమో గోడలకు ఇయర్ ప్లగ్స్ పెట్టాలని జోకులు పుట్టాయి.గోడలకు చెవులుంటాయిగా మరి.అనుకుని,అమ్మాజీగారి ఉబలాటం సరే...నా పరిస్థితి ఏమిటి?ఇక హిందీలో వెతకాలా? ఈ పిల్లిమొగ్గలు వేసేటప్పటికి ముగింపు ముసూర్తం దగ్గరపడి కలం సన్యాసం పుచ్చుకోవాల్సి వస్తుంది.ఎంత హుషారైన వాళ్లు ఆ వెంకట్,అశోక్!’ తనకన్నా ముందే వచ్చి పుస్తకాలు తీసుకుని వెళ్లిపోయిన వారి వాయువేగానికి ఆశ్చర్యపోతున్నాడు సుందరం.
వెంకట్,అశోక్ చిన్నచిన్న కథలు,కవితలు రాస్తూనే ఉంటారు సుందరంలానే!అందులో కొన్ని స్వగతాలు,మరికొన్ని ఇతరుల స్వగతాలు (సంగతులు).ఎప్పటికైనా చక్కనినవల రాయకపోతామా,రాసిన ఆ నవల ఏ సినీ నిర్మాతకో,టి.వి.సీరియల్ నిర్మాతకో కనబడితే సినిమానో,సీరియలో గ్యారంటీ అని కలామ్ గారు కలగన్నమన్నదానికి మించి కలలు కంటుంటారు ఈ ముగ్గురు.
‘ చిన్నప్పుడు క్లాసులో హిస్టరీ మాస్టారు వస్తే అబ్బ! ఇక చరిత్ర తవ్వుతాడురా! అని విసుక్కునే వాళ్లు కూడా పుస్తకాలను తవ్వి తీసుకోవాల్సివస్తోంది.సాహితీ సమరాంగణ సార్వభౌమా ఏది దారి?అష్టదిగ్గజాల రచనా రసాస్వాదన చేస్తూ భువన విజయాన్ని భువనమోహనంగా అలరింపచేసిన కృష్ణదేవరాయా,నీ గురించి చిన్నప్పుడు చదివాను.ఆ తరువాత రష్యన్ విప్లవం,ఫ్రెంచ్ విప్లవం,ఖండాలు,సముద్రాలు,వర్తకం,ఈస్టిండియా కంపెనీ,బ్రిటిష్ పరిపాలన!మార్కుల కోసం చదివిన పాఠాలే కాని ఫార్ములాలు,థీరములు గుర్తుపెట్టుకున్నట్లు చరిత్ర పాఠాలు గుర్తుపెట్టుకోలేక పోయాను.చరిత్ర మరచిన వారికి ఈ పోటీ నిజంగా పెద్ద పరీక్షే! కాలేజీ పిల్లలు రిఫరెన్స్ పుస్తకాల కొరకు లైబ్రరీకి పరుగిడినట్లుంది.ఏమి చేయాలి దేవుడా! ’ అని ఓ క్షణం ఆలోచించాడు సుందరం.
‘ కిం కర్తవ్యం! ’ కర్తవ్యం స్ఫురించింది. అప్పటికప్పుడు మెంబర్ షిప్ తీసుకుని మరో పెద్ద లైబ్రరీలో ప్రయత్నించాడు. పరిచయాలు,ఫోటోలు అందించేసరికి మరో రోజు రాయలవారి అకౌంటు లోకి!
కొత్త లైబ్రరీ-కొత్త లైబ్రరేరియన్ నవ్వుతూ అన్నాడు. “ మీరు పదహారవ వ్యక్తి సార్!”
‘ ఇదేమిటి!ఒకటవ పులకేశి,రెండవ పులకేశిలా! అంటే తనకన్నా ముందు పదిహేనుగురు పాఠకులా?రచయితలా లేక ఏ సభలలోనో ప్రసంగించవలసినవారా? ’ సుందరం కన్నులలోని ఆశ్చర్యాన్ని గమనించి ,
“ ఇప్పటికి పదిహేను మంది క్రిష్ణదేవరాయల గురించే అడిగారు సార్,నేను చిన్నప్పుడు పరీక్షలప్పుడు చదివిందే సార్, మీకు రాయలవారి గురించి బాగా తెలుసా సార్?”లైబ్రేరియన్ ఆసక్తిగా అడిగాడు సుందరాన్ని.
‘ ఏం చెప్పగలను! ఏ ఛానెల్లో ఏ టైంలో ఏ ప్రోగ్రాం వస్తుందో చెప్పగలడుకాని క్రిష్ణదేవరాయల గురించి ఠక్కున అడిగితే , మహామంత్రి తిమ్మరుసు సినిమా ...అదీ సి.డిలో చూసిందో,టి.వి.లో చూపిందో గుర్తుకు వస్తుంది తప్ప మరో విషయమేది గబుక్కున స్ఫురించదు.ఇక పుస్తకాలను మధించి చెప్పాల్సిందే!’
“అబ్బే అంత బాగా తెలియదు.కొంచెం చూస్తే అదే పుస్తకం చదివితే చెప్పగలను.”
‘తనకు తెలిసినా సుందరానికి ఎంత మాత్రం తెలుసో ’ అనే ఆసక్తి లైబ్రేరియన్ను ఆ ప్రశ్న అడిగించింది.
‘ ఇంతేనా మీ శక్తి! ’ అన్నట్లు లైబ్రేరియన్ చూసిన చూపుకు, ‘ మూలాలు మరచి ,నేలవిడిచి సాము చేసే వారి కిలాంటి బలవంతపు సూదిమందు ఎక్కాల్సిందే.’అనుకున్న సుందరం ఖాళీ చేతులతో వెనుదిరిగాడు సుందరం.మెంబరుషిప్ ఫీజు ఖర్చు,ఫలితము దక్కలేదు అనుకున్నా ప్రయత్నము మానలేదు.
ఆదివారం.మా దారి రహదారి.అన్నట్లు రోడ్డంతా పుస్తకాలు దొంతర్లుగా పేర్చబడి ఠీవిగా దర్శనమిస్తున్నాయి..చదివి చదివి ఇక చదవలేము అని వదిలించుకున్న పుస్తకాలు వీధులలో అక్షరరాసులు పోసినట్లు కనిపిస్తున్నాయి. రాయలకాలంలో రాశిపోసి అమ్మిన రత్నాలవలె అష్టదిగ్గజాలతోపాటు రాయలు పండించిన సాహితీరత్నాలు ఒకేచోట కుప్పపోసినట్లున్నాయి.పుస్తకాలన్నీ జల్లెడ పడ్తున్నాడు సుందరం.కాస్త దూరంలో వెంకట్ కూడా ఏదో వెదకుతూ కనబడ్డాడు.తీసికెళ్లినవి చాలలేదేమో,ఇంకెంత వస్తు పరిజ్ఞానము కావాలో,ఏమేమి రాసెయ్యాలనో!తానిలా బొంగరంలా తిరగడానికి కారణం వెంకట్ కూడా అనుకున్న సుందరం వెంకట్ కు కనబడకుండా జాగ్రత్త పడ్డాడు.వెతగ్గా వెతగ్గా దొరికింది క్రిష్ణదేవరాయల గురించి కాదు,ఆ రాయలవారే రాసిన ‘ఆముక్తమాల్యద.’ఎమెస్కోప్రచురణ. ‘ సరే ఆయనేం రాసాడో చదువుదాం.’ అనుకుని ధర చూసాడు. మూడురూపాయలు , లైబ్రరీ ఎడిషన్ అయితే నాలుగు రూపాయలు! మనమివ్వాల్సింది సగం ధరే కదా అనుకుని రెండు రూపాయల బిళ్లందించాడు.డిమాండ్ అండ్ సప్లై కదా! ఇరవైరూపాయలకు తక్కువ లేదన్నాడు.మరి తప్పదు ఎక్కడో ఓ చోట స్పందన మొదలవాలి.భావప్రకటనకు పఠనమే శరణ్యం కదా అనుకుని మరోమాట లేకుండా ఇచ్చేసాడు సుందరం.
రాత్రంతా చదివాడు.ఆముక్తమాల్యద.ప్రక్కనే తెలుగు నిఘంటువు. ‘ రాయలవారికి పరిపాలనకే సమయం సరిపోయేది కదా అది చాలక రచనలు కూడా చేయడమంటే...’ఆలోచనలో పడ్డాడు సుందరం. ఖాళీ కాఫీ కప్పులు, ఉండ చుట్టిన బిస్కట్ కాగితాలు! అన్నీ ఆయనే రాస్తే మనమేమి రాయగలం?గోదాకళ్యాణాన్ని ఆయనలా వర్ణించగలమా!
లాభం లేదు. మరో మార్గాన్ని అన్వేషించాల్సిందే.’ ప్రయత్నం దిశ మార్చుకుంది.
కొత్త అట్టతో శ్రీకృష్ణ దేవరాయలు పేరే పుస్తకం పేరుగా,రాయలవారిదే ముఖచిత్రంగా చూడ ముచ్చటగా ఉంది.పది పన్నెండు పుస్తకాలు కౌంటరు దగ్గరే పేర్చారు,అందరికీ కనబడేటట్లు.
పుసకాన్ని చూసిన సుందరానికి కళ్లు మెరిసాయి.ఆ మెరుపును గుర్తించాడు షాపులోని వ్యక్తి.
“ కావాలాసార్? హాట్ కేక్ లా అమ్ముడవుతున్నాయి,నో స్టాక్ అని పెట్టేయాల్సి వస్తుందేమో! ” పుస్తకాల కొనుగోలుతో ధీమాగా చెప్పాడు అమ్మకందారు.
ఇక ఆలస్యం చేయకుండా పుస్తకానికి స్వంతదారు అయిపోయాడు సుందరం.విజయనగరసామ్రాజ్యమే చేతికి చిక్కినంత ఆనందమనిపించింది సుందరానికి.ఆ రాత్రి శివరాత్రే.క్రిష్ణరాత్రి అనాలేమో!రెండు,మూడు రివిజన్లు జరిగాయి. అప్పటికి లీలగా అర్థమయింది రాయల వంశచరిత్ర.శాలివాహన సంవత్సరం1431,శుక్ల సంవత్సర మాఘ శుద్ధ చతుర్దశికి సరియగు క్రీ.శ1510 జనవరి 23న పట్టాభిషేకం జరిగినట్లు తెలుసుకున్న సుందరానికి, ‘ అండర్ లైన్ చేసి మరీ గుర్తుంచుకోవాల్సిన విషయాన్ని చిన్నప్పుడు కొట్టి మరీ గుర్తుంచుకునేలా చేసే మాస్టారు గుర్తుకు వచ్చారు కాని తేదీలు గుర్తుండవే! ’
విద్యారణ్యయతీంద్రుల ఆశీస్సులతో వేటకుక్కలను  కుందేళ్లు తరిమిన చోటే విజయనగర సామ్రాజ్యానికి పునాది పడటం తలచుకుంటే ఒళ్లు గగుర్పొడిచింది సుందరానికి. తిమ్మరుసు శక్తియుక్తులు పునశ్చరణ పాఠాలే అనిపించింది. తిమ్మరుసు  మంత్రి నీడలో పెరిగి అతడి ఆలంబనతో విజయనగర సామ్రాజ్యానికి పట్టాభిషక్తుడైన  రాయల జనరంజక పరిపాలన శిలా శాసనాలలో,శిథిలాలలో, వివిధ దేశాల యాత్రికుల రచనలలో లభించడం మన అదృష్టం అని పొంగి పోతున్నాడు.క్రిష్ణదేవరాయల రాజనీతి,యుద్ధనీతిగాంచి శత్రువులు సైతం ఆశ్చర్యపోయారని తెలుసుకుని తానూ ఆశ్చర్యపోయాడు.ప్రజా సమస్యలను మారువేషంలో కనిపెట్టగలిగిన ప్రజాభిమాని.పోర్చుగీసు యాత్రికుడు ‘డార్టె బార్బోజా ’ విజయనగర వైభవాన్నిరమ్యంగా వివరించాడు.రత్నాలు,ముత్యాలు,వజ్రాలు రాశులుగా అమ్మిన వైనం సిరి తాండవమే!
సుందరం రాయల కథలో లీనమైపోయాడు.రాయలు దయామయుడేకాని శిక్షలు చదివి గతుక్కుమన్నాడు. చిన్నదొంగతనమైనా కాలో చెయ్యో పణంగా పెట్టాల్సిందే.పెద్ద తప్పులకు శిక్ష మరింత పెరిగేది.న్యాయం కోసం గంట అవసరం లేకుండానే అన్యాయం జరుగకుండా ప్రజలు కాపాడబడేవారు.చదివి చదివి పుస్తకాన్ని తలక్రిందనే జాగ్రత్తగా పెట్టుకుని పడుకున్నాడు సుందరం.
“ అబ్బా తలుపు తీయండి ఎవరో బెల్ కొట్తున్నారు.పాలో,పేపరో!రాత్రంతా సరిగా నిద్రేలేదు. లైటు వేసింది వేసినట్లే ఉంది. ఒకటే చదవడం పబ్లిక్ పరీక్షలకు వెళ్తున్నట్లు. ఏంటి కథ! ఏదైనా కథ రాస్తున్నారా? ” నిద్రమత్తులోనే అడుగుతూ ఆవులిస్తూ అటుతిరిగి పడుకుంది సుందరం శ్రీమతి.
‘ ఎందుకలా చదవాల్సి వచ్చిందో నీకు అసలు కథ తెలిస్తేగా! ’అనుకుని, ‘ అహో ఆంధ్రభోజా,శ్రీ కృష్ణదేవరాయా...’అని పాడుకుంటూ లేచాడు సుందరం.
                                                                                                        ****
   

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top