వెన్నెల యానం – 10

భావరాజు పద్మిని


( జరిగిన కధ : వెన్నెల రాత్రి పాపికొండల నడుమ చక్కటి పూలపడవపై ప్రయాణిస్తూ ఉంటారు కొత్త జంట శరత్, చంద్రిక. తమ పరిచయం గురించి ముచ్చటించుకుంటూ ఉంటారు. శరత్ తండ్రి చిన్నప్పుడే పోవడంతో, తల్లి సంరక్షణలో పెరుగుతుంటాడు. తనకు ఎం.సి.ఎ లో సీట్ రాగా, దిల్సుక్ నగర్ బాబా గుడికి, సద్గురుదీవేనలకై వస్తాడు శరత్. గుడి బయట తన మెళ్ళో చైన్ లాగాబోయిన అబ్బాయిని బైక్ పై నుంచి లాగి పడేసి, కొడుతున్న చంద్రికను చూసి, ఆమె ధైర్యానికి ఆశ్చర్యపోతాడు... ఆమెను ఆరాధించడం మొదలుపెడతాడు. చంద్రికను తను రెండవసారి బస్సు లో చూసిన వైనం, ఆమెతో గతంలో తన మధుర జ్ఞాపకాలను నెమరువేసుకుంటాడు శరత్. చంద్రికకు వాళ్ళ బావతో పెళ్లి కుదిరి, మరో నెల రోజుల్లో పెళ్లి ఉందనగా, చంద్రిక తల్లిదండ్రులు, అత్తయ్య కుటుంబం అంతా అనుకోకుండా కేదారనాథ్ వరదల్లో చనిపోతారు. చంద్రిక బావ కంపెనీ బాధ్యత ఆమె మీద పడుతుంది. కోట్లకు వారసురాలిగా ఒంటరిగా మిగిలిన చంద్రికకు ముగ్గురు యువకులు ప్రేమ ఉచ్చు బిగించాలని చూస్తూ ఉంటారు. ఈ లోపల అనుకోకుండా, పరిచయం అయ్యాడు శ్రీరాం. ఆక్సిడెంట్ అయ్యి, ఐ.సి.యు లో ఉన్న అతనికి ఎవరూ లేరు. అతనికి ఆసరాగా  సాయి బాబా అనే అటెండర్ ను పెడుతుంది చంద్రిక. శరత్, చంద్రిక ఇద్దరూ పేరంటాలపల్లి దర్శించుకుని, ప్రయాణం కొనసాగిస్తారు. ఇక చదవండి...)
“అందరూ మా జంటను చూసి... దొండపండు లాంటి నన్ను ఈ కాకిముక్కుకు తగిలించాడే దేవుడు... అంటే, పాపం మా శరత్ ఫీల్ అవకుండా చూడు.”
“నిన్నూ...”
“సర్లే, సర్లే... నీ కాల్ మొక్తా బాంచన్, నవుతానికన్నా, మాఫ్ జేయ్యరాదే...” అంది, చంద్రిక తన చెవులు పట్టుకుని.
“మాఫీ జేసినా, మరి శ్రీ గురించి చెప్పు... “ అన్నాడు శరత్.
కనుమరుగవుతున్న పేరంటాలపల్లి ఆలయం వంక చూసి, మరొక్కమారు నమస్కరిస్తూ, ఇలా చెప్పసాగింది చంద్రిక...
ఆసుపత్రిలో ఉన్న ‘శ్రీ’ నెమ్మదిగా కోలుకోసాగాడు. ప్రతి రోజూ ఉదయం నేను నిద్ర లేచే ముందే అతని నుంచి మంచి సందేశం వచ్చేది. నేనూ బదులిచ్చేదాన్ని. అనేక విధాలుగా ధైర్యం చెప్పేదాన్ని. అతని యోగక్షేమాల గురించి  సాయి బాబా గారిని కనుక్కునేదాన్ని. ప్రతి ఆదివారం శ్రీ ని కలిసి, కాసేపు గడిపి వచ్చేదాన్ని. మేమిద్దరం ఎన్నో విషయాలు చనువుగా మనసువిప్పి మాట్లాడుకునే వాళ్ళం.
“జీవితంలో ఎప్పుడూ ఇలా ఒక్క చోట కుదురుగా కూర్చుంటే ఒట్టు. పది మంది పవన్ కళ్యాణ్ లు కలిసినట్టు ఎగురుతూ, దూకుతూ ఉండేవాడిని...” అన్నాడు శ్రీ.
“అవును పాపం, అందుకే దేవుడు నీ కళ్ళు, చేతులు విరగ్గొట్టి ఇలా కూర్చోపెట్టాడు. తిక్క కుదిరింది.” చంద్రిక మాటలు విని నవ్వసాగింది, అతనికి ఇంజక్షన్ ఇచ్చేందుకు వచ్చిన నర్స్.
“బోలెడు కబుర్లు చెప్పి, మమ్మల్ని కూడా నవ్విస్తూనే ఉంటారండి. శ్రీ గారికి మా డాక్టర్లు, స్టాఫ్ అంతా ఫాన్స్ అయిపోయాము.” అంది నర్స్.
“ఓహో, ఇక్కడా నెట్వర్కింగ్ చేసావన్నమాట. ఎంతైనా అసాధ్యుడివి శ్రీ. సాయి బాబా గారు, పోస్టల్ డిపార్టుమెంటు వారి పార్సెల్ లాగా ఉన్న ‘శ్రీ’ ని ఎయిర్ మెయిల్ లో వచ్చిన కొత్త కవర్ లాగా చేసి, ఇలా వీల్ చైర్ లో కూర్చోబెట్టగలిగారంటే గొప్ప సంగతేనండి.” కవ్విస్తూ అంది చంద్రిక.
“ అయ్యో, ఎందుకు అడుగుతావు తల్లీ నా తిప్పలు. బొత్తిగా మాట వినడు, చిన్న పిల్లలను బుజ్జగించినట్టు బుజ్జగించి, మందులు వెయ్యాల్సిందే. చిటికెలో మనుషుల్ని ఏమార్చే మాయగాడు.”
“అయితే, మీరూ నేనూ ఒక పార్టీ అండి, సాయిబాబా గారు. మీపై వచ్చిన ఈ అభియోగానికి మీ సంజాయిషీ ఏమిటి శ్రీ ?” స్వరం గంభీరంగా మార్చి అడిగింది చంద్రిక.
“అధ్యక్షా ! ఏదో ఆక్సిడెంట్ లో కాళ్ళు, చేతులు విరిగినంత మాత్రాన మనిషి, ఏడుస్తూ కూర్చోవాలన్న రూల్ ఏమీ లేదు. అయినా దెబ్బలు తగిలింది నా ఒంటికే తప్ప, నా సెన్స్ ఆఫ్ హ్యుమర్ కి కాదు. అందరూ ఇలాంటి స్థితిలో డిప్రెషన్ కి గురవుతారు. కాని నాకు దేవుడు ఈ వెన్నెల దేవతను పంపాడు కనుక, నేను ఎక్స్ప్రెషన్స్ తో ఈ డిప్రెషన్ ను చాకిరేవు పెడుతున్నాను. నాతోపాటు నలుగురినీ నవ్విస్తున్నాను. డిప్రెషన్  కి ఎక్స్ప్రెషన్ కి జరిగిన ఈ సమరంలో, బాధలకీ ఎడుపుకీ జరిగిన సంగ్రామంలో... తప్పా, తప్పా, తప్పా... నో..” అంటూ ఎన్. టి.ఆర్. ‘ధర్మానికి న్యాయానికి జరిగిన...’ పాటని అనుకరించాసాగాడు శ్రీ. అందరం పడీపడీ నవ్వసాగాము.
“అమ్మా, మీరు మాట్లాడుతూ ఉండండి, నేనలా వెళ్లి, ఇతని దెబ్బకు మాసిపోయిన ఈ గడ్డం చేయించుకు వస్తాను.” అంటూ నిష్క్రమించారు సాయిబాబా గారు. ఇంజక్షన్ ఇచ్చి, నర్స్ కూడా వెళ్ళిపోయింది.
 ఆ రోజు నా మనసులోని దిగులును కనిపెట్టనే కనిపెట్టాడు శ్రీ. వెంటనే నా చెయ్యి పట్టుకుని...
“ఏమైంది చంద్రా ! ఈ రోజు చాలా డల్ గా ఉన్నావు. నువ్వు నవ్వుతున్నా, నీ మనసు నాకు తెలుస్తూనే ఉంది. నాతో చెప్పకూడదా ?” లాలనగా అడిగాడు వీల్ చైర్ లో ఉన్న శ్రీ.
“నీతో కాకపొతే ఇంక చెప్పుకోడానికి కూడా నాకెవరు ఉన్నారు శ్రీ... మా బావ కుటుంబం చనిపోయిన దగ్గరినుంచి ఈ కంపెనీ భారమంతా నామీద పడింది. మొదట్లో ఆ పనులు చక్కబెట్టేందుకు నాకు సహకరించిన ముగ్గురు, ఈ రోజు గుంటనక్కల్లాగా నా చుట్టూ చేరి, నన్ను, నా ఆస్తిని సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. వాళ్ళ అతి మర్యాదలు, దాహపు చూపులు, కల్లబొల్లి ప్రేమలు నాకు జుగుప్స కలిగిస్తున్నాయి. అసలు ఆఫీస్ కి వెళ్ళాలంటేనే అసహ్యంగా ఉంది.”
“ఎవరా ముగ్గురూ, ఏం చేస్తున్నారు... కాస్త వివరంగా చెప్పరాదూ...”
“బావ ఫ్రెండ్ కిరణ్, నా పర్సనల్ అసిస్టెంట్ మనోహర్, అకౌంట్స్ డిపార్టుమెంటు నివాస్... వీళ్ళు ముగ్గురూ నాకు ఇబ్బంది కలిగిస్తున్నారు. చనువు తీసుకోవాలని, దగ్గరవ్వాలని, చూస్తున్నారు. నేను పట్టీపట్టనట్లు ఉన్నా, ‘మీరంటే నాకెంతో ప్రేమ మేడం. మీకోసం నా ప్రాణాలైనా ఇస్తాను మేడం...’ అంటూ ఏవో కబుర్లు చెప్తున్నారు. ఒక్కోసారి చుట్టుపక్కల ఎవరున్నారో కూడా చూడకుండా అతిచనువు చూపిస్తూ, ఇతరుల ముందు, నేను వారికే స్వంతం అన్న అభిప్రాయం వచ్చేలా ప్రవర్తిస్తున్నారు. వారి చూపుల్లో, మాటల్లో ఎక్కడా నాకు నిజాయితీ తో కూడిన ప్రేమ కనిపించట్లేదు. చాలా బాధగా, ఇబ్బందిగా ఉంది శ్రీ. వీళ్ళ నక్కజిత్తుల్ని ఎలా ఎదుర్కోవాలో తెలియట్లేదు.”
“చంద్రా ! నీ బాధ నాకు అర్ధం అవుతోంది. నువ్వు వాళ్ళతో కాస్త కటువుగా ఉండు. వాళ్ళు ఇతరుల ముందు చనువు తీసుకోవాలని చూస్తే, అందరిముందే, కాస్త స్వరం పెంచి, గదమాయించు. మరీ ఇబ్బంది కలిగిస్తే... ‘ బిహేవ్ యువర్ సెల్ఫ్’ అని సూటిగా కళ్ళలోకి చూస్తూ చెప్పు. సూటిగా కళ్ళలోకి చూసి మాట్లాడితే మనసులో కల్మషం ఉన్న ఏ మగాడైనా తల దించాల్సిందే ! ప్రస్తుతానికి ఇలా చేసి చూడు.” అన్నాడు అనునయంగా.
“నా బాధ ప్రస్తుతం గురించే కాదు, భవిష్యత్తు గురించీ కూడా. మరో రెండు రోజుల్లో నేను ఒక ముఖ్యమైన కాన్ఫరెన్స్ కోసం ఢిల్లీ వెళ్ళాలి. నాతో ఈ సారి మనోహర్ ఒక్కడే వస్తున్నాడు. ఫ్లైట్ లో, హోటల్ లో మేము ప్రక్కప్రక్కనే ఉండాలి. అతనితో వెళ్ళాలి అంటేనే ఏదోలా ఉంది.”
“ఒక్కోసారి ఊహలు వాస్తవం కంటే భయపెడతాయి చంద్రా. ధైర్యంగా ఉండు, నువ్వు బేలవి ఏమీ కాదు. నీ కరాటే లో బ్లాక్ బెల్ట్, మార్షల్ ఆర్ట్స్ ఏమయ్యాయి ? మునుపు యెంత ధైర్యంగా ఉండే నువ్వు, ఇప్పుడు ఇలా ఆలోచిస్తున్నావేంటి ? నువ్వు నేటి తరం యువతివి. భయమే మరణం, ధైర్యమే జీవనం అని నమ్మేదానివి.”
ఒక్కసారి విప్పారిన నయనాలతో శ్రీ నే చూస్తూ ఉండిపోయింది చంద్రిక. “ఇవన్నీ నీకు...”
“సాయి బాబా గారు చెప్పార్లే. కంగారు పడకు. నాకు ఇంత సాయం చేసిన నీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకుంది కదా... నీకు ప్రత్యుపకారం చేసే ఒక్క అవకాశాన్ని ఇమ్మని ఆ దేవుడిని రోజూ ప్రార్ధిస్తున్నాను. అన్నట్టు, రేపు నా ముక్కుకి ప్లాస్టిక్ సర్జరీ చెయ్యబోతున్నారు. ఒక వారంలో నన్ను డిశ్చార్జ్ చేస్తారు. నువ్వు మళ్ళీ ఎప్పుడు వస్తావు ?”
“అయ్యో, అలాగా... నేను తిరిగి వచ్చేందుకు పది రోజులు పడుతుంది. మరో మూడు రోజులు ఊరి చివర హోటల్ లో ఫారెన్ డెలిగేట్స్ తో మీటింగ్.  నిన్ను చూసేందుకు రావడం కుదరదు. నాకు చాలా బాధగా ఉంది.”
“పర్లేదు చంద్రా, బాధపడకు. నీ దయవల్ల, సాయి బాబా గారి దయవల్ల, చాలా మటుకు కోలుకున్నాను. డిశ్చార్జ్ అవగానే నా చిన్ననాటి మిత్రుడి ఇంటికి వెళ్తాను. మా కంపెనీ వారికి కూడా కనిపించి రావాలి. నువ్వొచ్చాకా, నాకు మెసేజ్ ఇవ్వు. ఇప్పటిదాకా ముక్కు లెస్ గా చూసిన నా మొహం ఓ తోలు ముక్కేసి అతికితే ఎలా ఉంటుందో చూద్దువు గాని...”
ఫక్కున నవ్వేసి, ‘మళ్ళీ మొదలెట్టావా ? నువ్వు బాగుపడవ్ ... సరే, నాకు టైం అవుతోంది. నేను మళ్ళీ వచ్చాకా కలుస్తాను. మధ్య మధ్య మెసేజెస్ ఇవ్వు. ఎల్లుండి ఉదయం ఫోన్ చేస్తాను.” అంటూ, అప్పుడే వచ్చిన డాక్టర్ తో... “ డాక్టర్ గారు సర్జరీ చేసేటప్పుడు ఇతనితో జాగ్రత్త ! ఇతని ముక్కుకి రాబోయే పెళ్ళాం ముక్కుతాడు వేసేటట్లు తయారుచెయ్యండి ఇతని ముక్కు,” అంది చంద్రిక.
“అలాగేనమ్మా, కిక్కురుమనకుండా, మత్తిచ్చి పడుకోబెట్టేస్తాము కదా, దిగులుపడకండి.” నవ్వుతూ అన్నారు డాక్టర్.
తిరిగివచ్చిన సాయిబాబా గారికి అన్ని జాగ్రత్తలు చెప్పి, శ్రీ కి వీడ్కోలు పలికుతూ, కళ్ళలో ఒక బెంగ దోబూచులాడుతూ ఉండగా వెనక్కి మరలింది చంద్రిక.
(సశేషం...)

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top