శివం – 19   

(శివుడే చెబుతున్న కధలు )

రాజ కార్తీక్

9290523901
(  శివభక్తుడైన ఉద్భవుడి కధను చెబుతుంటాడు శివుడు..)

మరుసటిరోజు సభ... అందరూ సభలో ఉన్నారు. ఉద్భవుడు వచ్చాడు. కొంతమంది పురోహితులు వచ్చారు. వారు ఎన్ని చెప్పినా ధైర్యం చేసి కార్తీకమాస పూజలను ద్రవ్యమడుగుటకు సిద్దమయ్యారు. మంత్రిగారు, రాజపరివారం ఎన్ని చెప్పినా, వారు రాజుగార్ని అడుగుటకు వచ్చారు.
సభలో......
పురోహితులు: ఉద్భవ! మహారాజా కార్తీకమాసపూజలకు ద్రవ్యములకు మీరు మరల రమ్మని సైగ చేశారు, అందులకే వచ్చాము,
ఉద్భవుడు: నేను రమ్మంటినా? ఓహో, గుర్తువచ్చింది, సరే అటులనే , అసలు మనము భగవంతునికీ, అదే మీ మహాశివునికి పూజలు ఎందుకు చేయాలో చెప్పండి, అదే తర్కం చేయండి, తర్కం తప్పు కాదుగా శాస్త్ర సమ్మతమే కదా?
పురోహితులు:సరే చెప్పండి ఏమిటి మీకు తర్కంలో రుజువు చేయవలసింది
ఉద్భవుడు:చెప్పానుగా ఎందుకు ఆ శివుడికి పూజలు చేయాలి
పురోహితులు: ఎండుకంటే, ఆయన పరమేశ్వరుడు కాబట్టి, ఆయన్ని చేరే మార్గాల్లో ఆయన పూజ సులభమైన మార్గం కాబట్టి
ఉద్భవుడు:అసలు ఆయనంటూ ఉన్నాడని రుజువు ఏది, ఒకవేళ ఆయన లేకపోతే ఈ ద్రవ్యములు పూజలు వృథా కదా?
పురోహితులు:ఆయన లేడని సందేహం వలదు? ఖచ్చితంగా ఆయన ఉన్నాడు, మీకు..
ఉద్భవుడు:మీకు గాలి కనబడుతుందా, ప్రేమ కనబడుతుందా , ప్రాణం కనబడుతుందా లాంటి కల్లబొల్లి మాటలతో తర్కం చేయవద్దు
మరొక పురోహితుడు:రాజా! ఆయన్ని నమ్మిన వారి కష్టాలు తప్పక తీరుస్తాడు దుఃఖాలు,బాధలు, కర్మలు దహించి వేస్తాడు
ఉద్భవుడు:అలాగా? ఐతే మరి మన జక్కన్నగారి అమ్మాయిని ఎందుకు ఆ శివయ్య బ్రతికించలేదు, తెలుపగలరా?
పురోహితులు: అది...అది
మరొక పురోహితుడు:ఉద్భవ రాజా! విష్ణుమూర్తి ఎత్తిన అవతారాలలో కూడా, మీకు ఆయన శివారాధన చేసినట్లు అవగతమవుతుంది, మార్కండేయుడ్ని కాపాడలేదా? రావణబ్రహ్మను బ్రతికించలేదా, ఆది దేవుడు ఆయన, సృష్టి ఆరంభం, అంతం ఆయనలోనే విలీనమవుతుంది. ఎందులకు మౌనం వహించే మీరు శివద్వేషి , దైవద్రోహిగా మారారు.
ఉద్భవుడు:నేను అడిగింది అది కాదు, జక్కన్నగారి కూతుర్ని ఎందుకు బ్రతికించలేదు.
మరొక పురోహితుడు:”అవును, వినాయకుడ్ని బ్రతికించలేదా?” – ఉత్సాహంగా
ఉద్భవుడు:తమరు అసలు ఇప్పుడు తర్కానికి వచ్చారు, అవును వినాయకుడు తన కుమారుడు కాబట్టి బ్రతికించాడు, కుమారస్వామి తన మరొక కుమారుడు కాబట్టి, ఆయనకు దేవసేన పదవి ఇచ్చాడు.
పురోహితులు:అందరూ అవాక్కయ్యారు.
ఉద్భవుడు:వినాయకస్వామిని కూడా కర్మ అని వదిలివేయవచ్చు కదా? ఇక క్షీరసాగరమథనం అప్పుడు రాక్షసులకు దగ్గర ఉండి ఎందుకు అమృతం ఎందుకు ఇప్పించలేదు? వారు కూడా కష్టపడ్డారు కదా, రావణాసురుడు ఆత్మలింగం తీసుకొని వెళ్తుండగా వినాయకుడు మారువేషంలో వచ్చి మోసం చేసినప్పుడు ఆయన్ని ఎందుకు వారించలేదు. తనవారు అయితే ఒకనీతి, పరులకు లేదా? శివమానస నాగ పుత్రికైన మానసకు అడిగినను దేవస్థానం ఎందుకు ఇవ్వలేదు, అన్ని తెలిసిన ఆయన. అంతా తెలిసిన ఆయన ఎందుకు ఈ దుఃఖమయ సృష్టిని సృజింపచేసింది, ఆయన శక్తిని అంతా ఉపయోగించి ఈ ప్రపంచం మొత్తం మంచిగా ఉండాలని సంకల్పించవచ్చు కదా? ఎందులకు ఆయన భక్తులను పరిక్షించడం, పరిక్ష పేరుతొ కష్టాలకు గురి చేయడం ఎందుకు, మా తండ్రిగారు, చనిపోయే క్షణం వరకూ “శివాశివా” అని నామస్మరణ చేశారు, ఆయనకి కనబడ్డాడా, తెలియని పూర్వకర్మ గూర్చి, దైవసేవ చేసుకుంటే రాబోయే జన్మ మంచి గూర్చి, ఉందో లేదో తెలియని ముక్తి గూర్చి ఎంత ఆలోచించిన అర్ధం కాని జ్ఞానం గూర్చి, ఆ మహాదేవుడి గూర్చి నాకెందుకు, దయచేసి నాకు.... అన్నాడు, చాలా కోపంగా
పురోహితుల నోటి వెంట మాట రావట్లేదు.... నేను అంతా వింటున్నా, ఉద్భవుడి మాటలకు నాకు ఎంటువంటి ప్రతిస్పందన లేదు.
ఉద్భవుడు:ఉక్రోషంగా అసలు గుడి మూసివేయండి. ఇదే కాదు, రాజ్యంలో అన్ని గుళ్ళు మూసివేయండి అని ఆజ్ఞాపించాడు.
ఎవరికీ ఏమి అర్ధం కాలేదు? శివనామ నిషేధంతో బాటు గుళ్ళు మూసివేయమని చెప్పటం ఏంటి..
ఉద్భవుడు:అవును ఆ మనసులేని దేవుణ్ణి పూజిస్తే ఏంటి? పూజించకపొతే ఏంటి నాకు బాగా గుర్తు వేదసారం “అహం బ్రహ్మస్మి”, అంటే ఏంటి?
పురోహితుడు:”నేనే దేవుడ్ని”, అంటే మనిషే దేవుడు,
ఉద్భవుడు:మరి ఇంత మంది మనుషులను వదిలేసి ఎందుకు ప్రాణంలేని రాయికి మ్రొక్కటం?
పురోహితుడు:”మహారాజా! మీరు హద్దు మీరుతున్నారు, మీరు రాజు కావచ్చు, కానీ మీరు ఏమి మాట్లాడిన చెల్లును అనుకోవటం పొరపాటు, తర్కం అనే పేరుతో మీరు వక్రదృష్టితో వాదన చేయుచున్నారు”
మంత్రిగారు :”పురోహితులారా, మీరుమౌనంగా ఉండండి, నాయనా ఉద్భవా! నీకు ఇష్టం లేకపోయినా మౌనం వహించు, అంటే కానీ, నీవు ఆ పరమేశ్వరుడి గూర్చి మాట్లాడటం సబబు కాదు, రాజువై నీవు ఇలా ప్రవర్తించడం సరి కాదు, ప్రజలు అందరు నిన్ను ప్రజారంజక పాలకుడిగా చూస్తున్నారు, నీపై ఎటువంటి విప్లవం లేదు, దేవుడి పై యుద్ధం ప్రకటించి నీవు ఏమి చేస్తావు, మహా మహా రాక్షసులు విచిత్ర వరాలు పొంది కూడా, మరణించారు జ్ఞప్తి లేదా?
యువ పురోహితుడు:శివ దూషణ వినటం కూడా మహాపాపం మేము  మీవల్ల ఈ రోజు ఆ పాపానికి లోనయ్యాం..
మంత్రిగారు:”ఉద్భవా? మరొక్కమారు ద్రవ్యము ఒసుగుటకు ఆలోచించు”
ఉద్భవుడు:ఆలోచన లేదు ఏమిలేదు, అసలు గుడి తలుపులు తెరిచిన వారికి దండన విధిస్తాను, అటుగా తిరిగి  ఉన్న ఉద్భవుడు, ఈ మాట అదోరకంగా అన్నాడు.
పురోహితుల వైవు చూడకుండా, తన మందిరానికి నడుచుకుంటూ వెళ్ళి తలుపులు బిగ్గరగా వేశాడు.
పురోహితులు మాత్రం రాజుగారు ఏమి చేసినా దొరికిన దాంట్లో, మాహాశివుని పూజ చేయుటకు తీర్మానించారు.... ఇక తరువాత జరగబోయేది ఎవరు ఊహించనిది...ఉద్బవుడు ఏమి చేస్తాడో చూద్దాం.

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top