వాయులీనంతో విలీనం - కున్నకుడి వైద్యనాథన్

మధురిమ 


ఆయన పేరు స్మరించుకోగానే ముందు  నుదిటిపై ఆకాశమంత విభూతి బొట్టు దానిమధ్యలో సూర్యబింబం లాంటి ఎర్రటి కుంకుమబొట్టు స్ఫురణలోకి వచ్చాకే ఆయన ముఖారవిందం మనకి కనిపిస్తుంది.సుమారు 200లకు పైగా సత్కారాలు,పురస్కారాలనే మణిహారాన్ని ధరించి,వేరు వేరు భాషలలో 700 పైగా లలిత గీతాలు,నృత్యాలకు కూడా సమకూర్చిన బాణీలు,భక్తిరస ప్రధాన సినిమా పాటలతో  భక్తిభావాలతో జనాలను ఓలలాడించిన బహుముఖ ప్రజ్ఞాశాలి,జీవించినంతకాలం తన వాయులీనసాధనంతో విలీనం అయిన వ్యక్తి మరెవరో కాదు,వారే శ్రీ కున్నకుడి వైద్యనాథన్.
కున్నకుడి గా  సంగీత ప్రపంచానికి సుపరిచితులైన శ్రీ కున్నకుడి వైద్యనాథన్ 1935వ సం.మార్చి  నెల 2వతేదీన రామస్వామి శాస్త్రి,మీనాక్షి అనే పుణ్యదంపతులకు తమిళ్నాడు రాష్ట్రం కున్నకుడి అనే గ్రామంలో జన్మించారు.
తండ్రి రామస్వామి గారు హరికథా భాగవతరుగారు ఇంకా సంస్కృతం,తమిళ భాషలలో  మహాపండితులు,కర్ణాటక సంగీత వాగ్గేయకారులు,వేణువు,జలతరంగిణి,వీణకూడా వాయించే బహుముఖ ప్రజ్ఞాశాలి.ఎన్నో సంగీత రచనలు కూడా చేసేవారట.వారి నివాసం సంగీత సరస్వతికి రాణివాసం లా ఉండేదట. ఎందుకంటే కన్నుకుడి గారి పెద్ద అన్నగారు మృదంగం వాయించేవారట,వారి సోదరీమణులు శాస్త్రీయ సంగీతం పాడేవారు,ఈయన వయొలిన్ వాయించేవారు.
ఇక తండ్రిగారు అంత విద్వత్ శిరోమణి కాబట్టి సహజంగా ఆయనే వీరికి సంగీత గురువుమరి.వయొలిన్ కన్నుకుడి గారి బాహ్య ప్రాణమే కాదు,వారి అంతర్గతంగా ఉన్న పంచప్రాణాలు కూడా,వయొలిన్ ఆయన బలం,కంచు గంట లాంటి ఆయన గళం,మూర్తీభవించిన ఆహార్యంతో పట్టుపంచతో,మెడలో పులిగోరు పతకం మెరుస్తూ ఉంటే, ఆనుదిటిపై బొట్టుతో, భారతీయ కట్టుతో ఆయన కచేరీ చెయ్యడానికి వచ్చేసరికి జనం అలా ఎన్ని గంటలైనా కదలకుండా వినేవారట.
ఆయన నుదిటిపై పెట్టుకునే ఆ బొట్టుకి ఓకథ ఉంది.కన్నుకుడిగారికి 13ఏళ్ళ వయసున్నప్పుడు వారి ఊరికి(కన్నుకుడికి) ఓ యతి వచ్చాడట. నీపేరు ఏమిటి అని ఈయనను అడిగి నువ్వు వయొలిన్ వాయిస్తావా అని కూడా  అడిగిగాడట.కన్నుకుడి గారి నుదిటిపై మామూలుగా తమిళులు పెట్టుకునే విధంగా అడ్డగీత మాదిరిగా ఉన్న విభూతి చూసి కోపంతో బుగ్గమీద ఓలెంపకాయ కొట్టిమరీ విభూతి ఎలా పెట్టుకోవాలో,దానిపై కుంకుమ ఎలా పెట్టుకోవాలో ఉపదేశం కూడా చేసారట. ఆతరువాత వైద్యనాథన్ పరుగు పరుగున తండ్రి గారి వద్దకు వెళ్ళి జరిగినదమంతా వివరించారట, అప్పుడే వారిరివురూ ఆ యతి జాడ కై ఊరంతా వెతికినా కనబడలేదట.అప్పుడు వాళ్ళు ఆ యతి ఎవరో కాదు కన్నుకుడి దేవాలయం లో ఉండే ఆ మురుగన్ (కార్తికేయుడు) అలా వచ్చాడని భావన చేసుకుని ఇక ఆరోజునుండీ బ్రతికినంత కాలం  ఆ బొట్టు అలానే పెట్టుకుంటూ వచ్చారు.   భగవంతుడు దిశా నిర్దేశం చేసి దశను మార్చేవాడు అని అనడానికి ఇంతకన్నా ఇంకే నిదర్శనం  కావాలి?
ఇక తండ్రి గారి వద్ద సంగీతం అభ్యాసం చేస్తున్న ఓసారి ఏం జరిగిందంటే తండ్రిగారికి అత్యంత  సన్నిహితులైన అరియకుడి రామానుజ అయ్యంగార్ గారు వీరి గ్రామనికి దగ్గర గల ఓ గ్రామంలో ఓ కృష్ణుడి  గుడిలో కచేరీ చెయ్యడానికి వచ్చారట. ఆ రోజు కచేరికి వయొలిన్ సహకార వాయిద్యం గా వాయించ వలసిన విద్వాంసులు  రాలేదు.అప్పుడు అరియకుడి గారు రామస్వామి గారితో అంటే మన వైద్యనాథన్ గారి తండ్రిగారితో అన్నారట "మీ అబ్బాయిని నాకు పక్క వాయిద్యం వాయించమని చెప్పండి". ఇది విన్న రామస్వామి గారు కాస్త కంగారు పడ్డారట.ఎందుకంటే అప్పటికి ఇంకా చిన్న చిన్న కచేరీలకే వాయిస్తూ,తండ్రిగారి వెనకాల ఉండడమే తప్ప పెద్దవారికి వాయించే అనుభవం కూడా లేదు.
అరియకుడి రామానుజ అయ్యంగార్ కన్నుకుడి వైద్యనాహన్ గారిని పిలిచి "నువ్వు ఎన్ని కీర్తనలు నేర్చుకున్నావు?" అని అడిగారట.దానికి మన చిన్న వైద్యనాథన్ భయం భయం గా ఓ 15దాకా నేర్చుకున్నానని సమాధానం చెప్పడంతో ..రా...  నాతో వాయించు...నీకేం భయంలేదు... నీమీద నీకు నమ్మకం పెట్టుకుని ధైర్యంగా నాకు వాయించు అన్నారట.ఆ రోజు అలా వారికి పక్క వాయిద్యం అనుకోకుండా వాయించారు.వారి అభిమానపూర్వక ఆశీర్వాద ఫలితంగా...ఆ కచేరీలో  వైద్యనాథన్ గారికి ఎంతో మంచి పేరు వచ్చింది.ఇక ఆ విజయవంతమైన కచేరీ తరువాత అప్పటినుంచీ సెమ్మంగుడి శ్రీనివాస అయ్యంగార్,చిత్తూరు సుబ్రమణ్య పిళ్ళై,కల్యాణ కృష్ణ భాగవతార్,మధురై  మణి అయ్యర్, మహరాజపురం విశ్వనాథన్ అయ్యర్ లాంటి దిగ్గజాలకు వయొలిన్ సహకార వాయిద్యం వాయించే అపూర్వ అదృష్టాన్ని అనితర సాధ్య అవకాశాన్ని దక్కించుకున్నారు.
అరియకుడి గారు మన వైద్యనాథన్ గారిలో ఆ ప్రతిభని గుర్తించగలిగారు కాబట్టే అంత చక్కని అవకాశాన్ని ఇచ్చారు.దాన్ని అంతే భక్తి శ్రద్ధలతో  వినియోగించుకున్నారు కాబట్టే.. ఇంక వెనక్కి ఎప్పుడు తిరిగి చూసుకునే పనిలేకుండా ఇక అక్కడినుండీ అవకాశాలే ఆయనను వెతుక్కుంటూ వచ్చాయి.
ఒకప్పుడు కర్ణాటక శాస్త్రీయ సంగీత కచేరీలలో వయొలిన్ కేవలం సహకార వాయిద్యంగానే ఉండేదట. కాని వైద్యనాథన్ గారు వయొలిన్ ని ముఖ్య వాయిద్యంగా విద్వాంసుడు కచేరీ చేసేలా(సోలో ఇన్స్ట్రుమెంట్) గా తీర్చి దిద్దడానికి ఎంతో కృషి చేసి సఫలీకృతులుకూడా అయ్యారు. అందుకే 1976 నుండీ ఎంతటి విద్వాంసులకి అయినా పక్క వాయిద్యం వాయించడం మానేసారు.
అయితే మొదట్లో ఈ ప్రయత్నానికి సహవాయిద్యకార్లు నుంచీ, తోటివిద్వాంసులందరి దగ్గరనుండీ ప్రతికూల పరిస్థితులే ఎదురయ్యాయట. వారి నిరాకరణ నాలో ఓ సవాలుకి పునాది వేసింది.ఓ పట్టుదలకి అంకురార్పణ జరిగిందని ఓ ఇంటర్వ్యూలో ఓ సారి చెప్పారు.ఎలాగైనా వయొలిన్ని సోలో ఇనుస్ట్రుమెంట్ గా  తీర్చి దిద్దాలని అహర్నిసలూ శ్రమించి తనకంటూ ఓ ప్రత్యేకమైన బాణీనే సృష్టించిన అపార ప్రతిభావంతులు. వయొలిన్ వాయించడంలో  తన చేతివేళ్ళ నైపుణ్యతతో(ఫింగరింగ్ టెక్నిఖ్) తో ప్రత్యేకమైన ప్రక్రియనే కనుగొన్న మహానుభావులు. తన వాయిద్య నైపుణ్యంతో వయొలిన్ కి ఓ అపూర్వ అపార గౌరవం తెచ్చిపెట్టిన మహా మనీషి.
ఆయన ఇంకో ప్రత్యేకత ఏమిటంటే పండితులకన్నా ముందు సంగీత జ్ఞానంలేని సాధారణ మనుషులునుకూడా తన వాయిద్యంతో మెప్పించాలనుకున్నారట.ఇందుకోసం ఎన్నో ప్రయోగాలు కూడా చేసారు.అందులో భాగంగా వయొలిన్ ని డోలుతో పాటు జతకలిపి కచేరీ చెయ్యాలనే ఆలోచన కూడా వీరిదే.డోలునే ఎందుకు ఎంచుకున్నారంటే అందులో కేవలం లయ మాత్రమే కాదు నాదం కూడా ఉంటుందనేవారు.
ఈప్రస్థానంలో భాగంగా ప్రఖ్యాత డోలు విద్వాంసులు వాలయపాటి సుబ్రమణ్యం గారితో వీరికి ఎంతో చక్కని మైత్రి ఏర్పడింది.ఇద్దరు కలిసి  ఇంచుమించు 1974-1984 వరకు సుమారు 3500 కచేరీలు కలిసి చేసారంటే వీరి విద్వత్ మైత్రికి ఇంతకన్నా పెద్ద తార్కాణం ఇంకేముంది.
సంగీత జగత్తులో ప్రత్యేక లభించిన తరువాత కొంతకాలానికి 1968లో "వా రాజా వా "అనే తమిళ చలన చిత్రం ద్వారా సినీ సంగీతంలోకి కూడా అరంగ్రేటం చేసారు.చిన్నప్పటినుండీ శాస్తీయ సంగీత ప్రధానంగా ఉండే సినిమా పాటలంటే కూడా చాల ఇష్టముట.అందుకే సినిమాలకి సంగీతం చేసే అవకాశం వచ్చినప్పుడు తన ఇష్టానికి ప్రతిభని జోడించి అవకాశాన్ని చక్కగా వినియోగించారు.
ఈ సినిమాలో ప్రఖ్యాత తమిళ దర్శకులు శ్రీ ఎ.పి.నాగరాజన్ గారి ద్వారా తిరుమలై తేన్ కుమారి,మేల్ నట్టు మరుమగల్,నమ్మవీటు దైవం,రాజ రాజ చోళ వంటి చిత్రాలకు సంగీత దర్శకత్వం చెయ్యడమే కాదు సంగీత పరంగా కూడా అవి అపూర్వ విజయం సాధించడానికి కారకులయ్యారు.అప్పటి తమిళ ప్రఖ్యాత నటులు ఎంజీఅర్ గారు తన "నవరాతినం" సినిమాకిగాను శాస్తీయ సంగీత మాధుర్యాన్ని ప్రతిబింబించేలా సంగీతాన్ని చెయ్యమన్నారట. ఆ సినిమాలో పాశ్చాత్య బాణీలలో త్యాగరాజ కృతులు కూడా స్వరపరిచి శ్రోతలను ఉర్రూతలు ఊగించారు వైద్యనాథన్ గారు.
68లో సినిమాలలో అడుగు పెట్టి ఎందరినో అధిగమించి కేవలం రెండేళ్ళలో తమిళనాడు నుండీ "ఉత్తమ సంగీత దర్శకులుగా" పురస్కారాన్ని కూడా పొందారు.
వి.ఆర్ ఫిలింస్స్ పతాకంపై వైద్యనాథన్ గారు ఆయనకి అత్యంత సన్నిహితులైన రామనాథన్ తో కలిసి సినిమా కూడా నిర్మించారు.అయితే ఈ విజయాలన్ని ఎంతో కష్టపడి ఒక్కో మెట్టు ఎక్కి వచ్చినవి కానీ ఓ రాత్రిలో ఈ విజయాలు తనని వరించలేదని చాలా సందర్భాలలో పేర్కొన్నారు. తన సుదీర్ఘ సంగీత ప్రయాణంలో శాస్త్రీయ సంగీతం ఓపడవలో ప్రయాణం అయితే సినిమా సంగీతం ఇంకో పడవ. ఇందులో సుమారు 42 సినిమాలకు సంగీత దర్శకత్వం ,700 ల భక్తి పాటలు,  ఇలా రెండు పడవలపై ఎంతో ఓర్పుతో,నేర్పుతో ప్రయాణించి విజయ తీరాన్ని చేరిన వారు శ్రీ వైద్యనాథన్ గారు.
మేల్ నట్టు మరుమగల్ అనే సినిమాకి గాను ఒక పాశ్చాత్య బాణీలో(పాప్) లో పాటని స్వరపరిచి అది ఉషా ఊతప్ గారితో  పాడించినది వీరే.వీరి ఆహార్యం చూస్తే వీరు పాశ్చాత్య బాణీలు  స్వరపరుస్తరా  అనిపిస్తుంది కానీ ఏ సంగీతమైనా ఒకటే దాని పరమార్ధం శ్రోతని ఆనందింపజేయడమే అనేవారట.ఎవరైనా కచేరీలో ఎప్పుడైనా సినిమా పాటని వాయించమని అడిగితే కాదనకుండా వాయించేవారట.శ్రోతల వల్లే మనం ఉన్నాము అని ఎప్పుడూ చెప్తూ ఉండేవారట.
ఆరు పదులు దాటిన తరువాత కూడా ఎంతో ఉత్సాహంగా ఎప్పుడూ అందరి నవ్విస్తూ హుషారుగా కచేరీలు చేసేవారట. ఆ సమయంలో చెన్నై నగరంలో రాగా రీసెర్చ్ సెంటెర్ అనే రాగ పరిశోధనా సంస్థ ని నెలకొలిపారు.మన భారతీయ సంగీతం  ఎన్నో రాగాల సంపదతో నిండి ఉన్నది.ఒక్కో రాగానికి ఒక్కో శక్తి ఉంది.
కొన్ని రాగాలు వినడం వల్ల అలజడులు,కొన్ని రకాల నొప్పులు,అధిక రక్తపోటు వంటి సమస్యలకు ఉపశమనం కలుగుతుంది.రాగాల వల్ల అనారోగ్యం నయమైన అనుభవం కన్నుకుడి గారి జీవితంలో కూడా జరిగింది.ఆయనకి 14సం. వయస్సు ఉన్నప్పుడు వారి నాన్నగారైన రామస్వామి గారు ఎదో తీవ్ర అనారోగ్యం వల్ల కోమా స్థితి లోకి వెళ్ళిపోయారట,అప్పుడు వారి కుటుంబ వైద్యులు ఆయనతో "నువ్వేమైనా రాగాలు వాయించి వాటి ప్రభావం నీ తండ్రి గారి మీద ఉందేమో చూడు " అన్నారట.అంతకమునుపే వైద్యనాథన్ గారి నాన్నగారు సుమారు ఓ 12 రాగాలపై పరిశోధన చేసి ఆ రాగాలికి అనారోగ్యాలను నయం చేసే శక్తి ఉందని కనుక్కునారట.ఆ పరిశోధన ఆధారంగా రోజు వారి నాన్న గారి వద్ద కూర్చుని భైరవి రాగం వాయించేవారట.ఈ రాగమే  వాయించడానికి గల కారణం ఏమనగా వారి నాన్నగారు పరిశోధనలో  భైరవికి గురించి ఏం రాసారంటే మరణ సయ్య మీదనుంచి కూడా మనిషిని పునః జీవితులిని చేసే శక్తి ఈ రాగానికి ఉందని.  అలా రోజూ గంటల కొద్దీ సమయం ఆయన పక్కన కూర్చుని భైరవి రాగం వాయించగా వాయించగా కొన్నాళ్ళకి వైద్యులు ఏం గమనించారంటే వారి కళ్ళు నెమ్మదిగా చమర్చడం మొదలయ్యయట.ఇది ఒక అద్భుతంగా కూడా వైద్యులు చెప్పారట,ఆ తరువాత వారు నెమ్మది నెమ్మది గా కోలుకుని ఆ తరువాత కొన్ని సంవత్సరాలు జీవించారరట. ఈవిధంగా తనకి జన్మనిచ్చిన తండ్రి,సంగీత గురువు అయిన రామస్వామి గారి ఋణం ఆ విద్య ద్వారానే  తీర్చుకున్న  ఉత్తమ సంతానము మరియు శిష్యులు కూడా.
ఈ సంఘటన తరువాత రాగాలపై పరిశోధన చెయ్యాలని చాల ఆశక్తి గా ఉండేదని అందుకనే తరువాతి కాలంలో ఈ రాగా రీసెర్చ్ సెంటెర్ ప్రారంబించినట్లు ఓ సందర్భంలో పేర్కొన్నారు. రాగాలు కేవలం రసవంతవైనవే కావు వాటి శక్తి కూడా అంతే గొప్పదని వారు ఎప్పుడూ చెప్తూ ఉండేవారట.
చెన్నై నగరం లో ఉన్న ఈ రాగా రీసెర్చ్ సెంటెర్లో ఇప్పటికీ వైద్యులు,మానసిక నిపుణుల,సంగీతజ్ఞుల  సమిష్టి కృషితో వివిధ రాగాల యొక్క వివిధ గుణాలను అధ్యయనం చేస్తున్నారు.
ఇక వారి సత్కరాలు, పురస్కారాల వివరాలకొస్తే..విద్వాన్ సర్వత్ర పూజ్యయేత్ అన్నట్టు ఇటు శాస్త్రీయ సంగీతంలోని,అటు సినీ సంగీతంలో ఎన్నో సన్మానాలు,సత్కారాలు,బిరుదులు అందుకున్నారు. వాటిలో కొన్ని భారత ప్రభుత్వంచే పద్మశ్రీ,తమిళ్ నాడు ప్రభుత్వంచే కలైమామణి
1993లో సంగీత నాటక అకాడెమి అవార్డ్
1996లొ ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ వారిచే సంగీత కళా శిఖామణి.
కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం చే ఇసైజ్ఞాని అవార్డ్ .
ఆకాశవాణితో  కూడా ఎన్నో సంవత్సరాల అనుబంధం ఉన్న వీరు ఎన్నో కచేరీలు కూడా వాయించారు.
అన్ని కార్యక్రమాలలో  ఎంతో ఉత్సాహంగా పాలు పంచుకునె ఆయన  ప్రతీ ఏటా తిరువైయ్యారులో జరిగే త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవాల సంఘం కార్యదర్శి గా ఎన్నో సంవత్సరాలు చాల బాగా నిర్వహించారు. త్యాగరాజ ఆరాధన ఉత్సవ ప్రత్యక్ష ప్రసారాలలో పెద్ద బొట్టుతో మనకి కన్నుకుడి వైద్యనాథన్ గారు ఇతర సంగీతజ్ఞులతో కనిపించేవారు మరియు వినిపించేవారు.
ఇంతటి సుస్సంపన్నమైన సంగీత జీవితం గడిపిన వైద్యనాథన్ గారు సెప్టెంబర్ 8వ తేదీన 2008వ సం.. లో చెన్నై లో తన తుది శ్వాస ను వాయులీనంతో విలీనం చేసారు.వారికి నలుగురు కుమారులు,ఓ కుమార్తె. వారి కుమారుడు బాలసుబ్రమణ్యం కీబోర్డ్ వాయిస్తారు,తండ్రిగారితో కలిసి కొన్ని ఆల్బంస్ కూడా చేశారు.
వాయువు పీల్చుకున్నంత కాలం తన వాయులీనంతో ఆ సంగీతసేవ చేసుకున్న ధన్య జీవి,పుణ్యజీవి వీరు అని అనడంలో ఏ సందేహమూ లేదు.
వీనులవిందైన వీరి సంగీత మాధురిని క్రింది వీడియో లలో చూడండి.

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top