Wednesday, December 23, 2015

thumbnail

జ్ఞానప్రసూనాంబికా శతకము- శిష్టుసర్వశాస్త్రి

జ్ఞానప్రసూనాంబికా శతకము- శిష్టుసర్వశాస్త్రి

దేవరకొండ సుబ్రహ్మణ్యం


కవిపరిచయం:
శిష్టు సర్వశాస్త్రి కాసలనాటి బ్రాహ్మణుడు. అనేక ఆంధ్ర సంస్థానములలో అమితసత్కారములు పొంది తనయంత పండితుడు లేడనిపించుకొన్న శిష్టుకృష్ణమూర్తి కుమారుడు. ఈయన క్రీ.శ. 1830 సం. లో జగగంపేట లో జన్మంచి తన తండ్రిగారివద్దనే కావ్యనాటకాలంకారములు చదువుకొని విద్వత్కవి అయినాడు. ఇతడు జగ్గంపేట, అయినపల్లి, కాళహస్తి మొదలైన సంస్థానములలో తన విద్వత్తు ప్రదర్శించి రాజాదరణకు ప్రాతుడయినాడు. ఈతడవధానములందు, నాశుకవిత్వమునందును అందెవేసిన చెయ్యి. సంస్కృతాంధ్ర భాషలలో ప్రవీణుడు. ఈకవి కొంతకాలము రాయవేలూరునందలి ఆంగ్లపాఠశాలలో సంస్కృతాధ్యాపకునిగా పనిచేసినాడు.
ఈకవి క్ర్తులలో ప్రస్తుతం జ్ఞానప్రసూనాంబికాశతకము, శ్రీలలితాంబాస్తోత్రము, అమరుకము (అనువాదము), అచ్చిగాని తారావళి, కొన్ని చాటువులు లభ్యం అవుతున్నాయి. ఈ కవి తండ్రిగారు మరణించిన రెండేండ్లకే క్రీ.శ. 1880 న పరమపదించినట్లు శాస్త్రకారుల నిర్ణయము.
శతకపరిచయం.
"జ్ఞానప్రసూనాంబికా" మకుటంతో రచించిన ఈశతకంలో 102 శార్ధూలమత్తేభ పద్యాలున్నవి. భక్తిరస ప్రధాన శతకము. శ్రీకాళహస్తిలోని జ్ఞానప్రసూనాంబికను సంభోదిస్తు చెప్పిన ఈ శతకమును తొలిసారిగా "ఆంధ్రపరిషత్కార్యాలయము" వారు సంపాదించి ప్రకటించారు. ఆతరువాత వావిళ్ళవారు తమ భక్తిశతకసంపుటము రెండవభాగంలో ఎనిమిదవ శతకముగా ప్రకటించినారు. ఈశతకము దాదాపు 1858 న కాళహస్తి ప్రభువైన దామర వేంకటపతినాయని ఆస్తానమున కవిగా ఉండిన కాలములో ఆ ప్రభువు ఆజ్ఞచే వాసినట్లు కవియే తెలిపినాడు.
శ్రేయస్సంధామ, దామరకుల శ్రీవేంకటేంద్రాజ్ఞఁ బ్ర
జ్ఞాయత్తౌచితి, సర్వశాస్త్రి, యిటు లొయ్యంజేసె జ్ఞానాంబికా
గ్రీయానుగ్రహలీలఁ బద్యశత మీరీతిం బఠింపన్ జనుల్
ధీయుక్తస్థితి నన్ని విద్యలఁ బ్ర్4అశస్తింజెంది పెంపెక్కరే
శతకములో దాదాపు 80 వంతులు సంస్కృతపదములతో నిండియున్నది. సంస్కృతపదజాటిల్యముగల సమాసములు (కొన్నిచోట్ల పద్యమంతయు ఒకే సమాసముగా వ్రాయబడినది) విశేషముగా ఉన్నవి. ఉభయభాషలలో నీకవి కూలంకషప్రజ్ఞ కవవాడని, నిర్ధుష్టమైన ధారాధోరణి సహజసిద్ధముగానే ఈ కవికి అలవడినదని చెప్పటానికి ఈ శతకము ఒక ఉదాహరణము.
ఈ క్రింది దీర్ఘ జతిల సంస్కృత సమాసాలను చూడండి:
శా. పారావారసుతాదిలేకసుదతీపారంపరీగీతికా
పారానందపురంధ్రివర్గనియతప్రాంచద్వివాహాంగణో
దారామోదయిత్తాత్మబాంధవసతీతత్యాశ్రితస్వాంతిక
స్ఫారాచారకృతిప్రమోదభరితా జ్ఞానప్రసూనాంబికా!
శా. శోణాంభోరుహజైత్రపాదయుగళీశోభాకృదుద్యన్మణి
శ్రేణీహంసకమంజుగుంజితసమాకృష్టావదాచ్ఛద
క్వాణాకర్ణనమోదమానహృదయాగచ్ఛద్ధ్యుష్కత్కిన్నర
స్త్రైణాలోకనహృద్యమందరగతీ జ్ఞానప్రసూనాంబికా!
కొన్ని పద్యములలో సౌందర్యలహరి చ్చాయలు మనకు గోచరిస్తాయి
శా. చింతారత్నగృహాంతరాళమున వాసి న్భ్రహ్మవిష్ణ్వాదిమం
చాంతస్థ్సాయినివై జగంబుల సముద్యల్లీల రక్షింప న
ట్లంతం బొందఁగఁ జేయు నీవొకతెవే యాధారశక్త్యాత్మతన్
సాంతత్యంబున నున్నదానవుగదా జ్ఞానప్రసూనాంబికా!
శా. కైలాసాంచలసీమసంగతలసత్కల్పద్రుమాకల్పనీ
పాళీపాళివిహారకృనంధుకరీవ్యాహారవీణాకళా
లోలిభూతవితంద్రమంద్రరవల్లోలంబకేళీవనీ
జాలాక్రీడితకౌతుకాంచితమతీ జ్ఞానప్రసూనాంబికా!
అలగని శాతకమంతయు సంస్కృతపదభూయిష్టమైన పద్యములుగా భావింపరాదు. ఈ క్రింది అచ్చతెనుగు పద్యాలు చూడండి.
శా. పొంగట్టుంన్విలుదాల్పుమేన నఱయై పొల్పొందు నిన్జూచియా
బంగార్పట్టపువేల్పురాణి యిటులై పల్వన్నె నవ్వెన్నుహ
త్తంగానంగదె యంచు ముచ్చట నెడందం జెంద మేల్ఠీవిసా
గంగా జాణతనంబు నూనితిగదా జ్ఞానప్రసూనాంబికా!
మ. నలుమోముల్గలవేల్పుఁగన్నదొర యెన్న న్నీకుఁదోఁబుట్టు క
ల్వలరాతుంకతలంగలాఁడొడయఁ డేలంజాలు నీవిజ్జగ
మ్ములనానిమ్ముల నిన్నుఁగొల్వఁ దలఁపుంబూనందగున్లోకము
త్కలికామాత్రనుతింతునన్నుఁగనవే జ్ఞానప్రసూనాంబికా!
ఈవిధంగా చెప్పుకుంటుపోతే సంస్కృత ఆంధ్రములలో సమానముగా చెప్పిన ఈశతకం సంపూర్ణ భక్తిరసమయం. ఆనిముత్యాలవంటి పద్యాలను ఈ శతకంలో మనం చూడవచ్చును. మీరు చదవండి. అందరిచే చదివించండి.

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

Comment with Facebook

No Comments


Worlds Best Telugu Online Magazine

మా గురించి

నమస్కారం ! అచ్చతెలుగు లోగిలికి స్వాగతం.

నా పేరు భావరాజు పద్మిని.

5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి. 'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి 'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము.
వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....

aboutus.acchamgatelugu Click here to Read More. Feel free to reach us for more information