ఇలా ఎందరున్నారు ?- 15    

అంగులూరి అంజనీదేవి


(జరిగిన కధ : సంకేత, శివాని, పల్లవి, హిందూ స్నేహితురాళ్ళు, ఇంజనీరింగ్ చదువుతూ ఉంటారు. ఆ కాలేజీ లోనే చదువుతున్న శ్రీహర్ష తండ్రి ,సంకేత తండ్రి  స్నేహితుడుకావడంతో ఆమె వాళ్ళ ఇంట్లోనే ఉంటూ చదువుకుంటుంది. నీలిమ శ్రీహర్ష ఇంట్లో పనిమనిషి, 10 వ తరగతి వరకు చదువుకుంటుంది. కోడలు కాంచనమాల తనను ఎలా చూస్తుందో నీలిమకు చెప్తుంది వరమ్మ. కాలేజీ ఫీజు కట్టేందుకు, తగినంత డబ్బు లేకపోవడంతో తన స్నేహితురాళ్ళను అప్పు అడిగేందుకు వెళ్ళిన సంకేతను, పల్లవి బలవంతంగా బాగా డబ్బున్న అనంత్ పుట్టినరోజు వేడుకకు తీసుకు వెళ్తుంది. బాగా చదివే సంకేత తీరును ఇష్టపడి, ఆమె ఫీజును కడతాడు అనంత్. సంకేతకు అనంత్ పట్ల ఒక గౌరవ భావం కలుగుతుంది. అనంత్ కూడా సంకేతను ఇష్టపడుతూ ఉంటాడు. అనంత్ రూమ్ కు వెళ్తుంది పల్లవి. అతను ఎన్నో గాడ్జెట్ లను చూపిస్తాడు, ఒక మొబైల్ ను గిఫ్ట్ ఇస్తాడు. ఆమె ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతుంది. అతని సమక్షమే ఆమెకు లోకమవుతుంది. అనంత్ తో సంకేత  ప్రేమను గురించి నీలిమకు చెబుతుంది శివాని.  సంకేతను చూసేందుకు ఆమె ఇంటికి వస్తుంది అనంత్ తల్లి శరద్రుతి. అనంత్ తనతో తిరిగింది కేవలం కాలక్షేపానికే అని తెలిసిన సంకేత మనసు ముక్కలవుతుంది. అతన్ని నిలదీసేందుకు వెళ్ళిన సంకేత, ప్రస్తుతం అతను మరో అమ్మాయితో ఇదే ఆట మొదలు పెట్టాడని తెలుసుకుంటుంది. ఇక చదవండి... )
ప్రేమలో విఫలం కావడం అన్నది సంకేతను పీల్చిపిప్పి చేస్తోంది. ఆ జ్ఞాపకాల జ్వాలలో కాలి మసికుప్పై పోతోంది. ఆ మసికుప్ప మళ్లీ ఆకృతిగా మారి సంకేతై పోతుంది.
ఆమెకు తెలుసు అతని మనసులో తను లేనని.. ఎప్పుడో అదృశ్యమైపోయానని... అయినా అతను ఆమెలోంచి మాయమైపోవడం లేదు. అతను ఇచ్చిన సెల్ఫోన్, లాప్ టాప్ తన స్థాయిని లెక్కిస్తున్నాయి... ఎత్తి చూపుతున్నాయి... తన తండ్రి చెప్పేవాడు జీవితంలో వెక్కిరించే పనులు ఎత్తి చూపే పనులు చెయ్యొద్దని... అయినా చేసింది. ఇప్పుడు పరిష్కారం అర్ధం కావటం లేదు...
మనసు ఆపుకోలేక అనంత్ కి ఫోన్ చేసింది ‘కూ’ అంటూ ఎంగేజ్ రావడం తప్ప ఆ ఫోన్ కలవలేదు. చెయ్యగా చెయ్యగా కలిసింది. మాట్లాడింది. అతను ఒప్పుకోలేదు... వాగ్యుద్ధం జరిగింది.
“సరే! మీరు ప్రత్యూషతో ఓ.కె...మరి నా పరిస్థితి ఏంటి? నేనెవరిని ఓ.కె. చేసుకోవాలి? జీవితాంతం ఇంకోవ్యక్తితో నన్ను నేను ఎలా పంచుకోవాలి? మిమ్మల్ని తప్ప వేరే వాళ్లను నేను స్వీకరించగలనా? మనసుతో జీవించగలనా?” అంది.
“జీవించలేకపొతే బ్రతుకు... బ్రతకటం కూడా రాకపోతే ఇంకేమైనా అవ్వు! అంతేగాని నామీద ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు. ఎందుకంటే నేను ఇప్పుడు ఒక సాఫ్ట్ వేర్ అమ్మాయిని చేసుకుంటేనే నా స్థాయి పెరుగుతుంది. నిన్ను చేసుకుంటే ఏముంది?
నీకేమైనా ఇప్పుడు మంచి పర్సెంటేజ్ వుందా? పోనీ బి.టెక్. పూర్తి అయ్యాకనైనా మంచి ఉద్యోగం ఏమైనా వస్తుందా? ఉద్యోగం లేకపోతే సమాజంలో ఏం విలువ వుంటుంది? డబ్బు ఎంత గొప్పదో నీకు తెలుసు. అది తెలిసే నువ్వు నాతో తిరిగావు. ఆఫ్ కోర్స్ నేను కూడా నిన్ను కారులో, బైక్ లో తిప్పగలిగాను అంటే దానికి కారణం డబ్బే!... ఆ డబ్బుతో నీ ఆశల్ని, నీ అభిరుచుల్ని తీర్చాను. జీవితంలో నువ్వెప్పుడూ చూడలేని వినూత్న ప్రపంచాన్ని నీకు పరిచయం చేశాను. నువ్వు హ్యాపీ!
‘నువ్వు హ్యాపీ’ అని ఎందుకంటున్నానంటే నేను పరిచయం కాకముందు నీ దగ్గర ఒక్క చదువు మాత్రమే వుండేది. అది నీకు తగినంత
సంతృప్తి ఇవ్వకనే దాన్ని నిర్లక్ష్యం చేసి నావెంట తిరిగావు. నీ కళ్లలో కన్పించే ఆశల్ని తీర్చాను.ఇందులో నా తప్పేదైనా వుందేమో నువ్వే తేల్చుకో ...
ఇప్పుడు నువ్వేదైనా నష్టపోయానని ఫీలయితే అందుకు నేనెంత వరకు బాధ్యుడిని..? నువ్వేదో,వాదిస్తున్నావని,ఏడుస్తున్నావని , కష్టపడుతున్నావని కరిగిపోయి నిన్ను పెళ్లి చేసుకుంటే నేను నష్టపోతాను కదా!
ఇది జీవితం సంకేతా..? దీన్నొక తెల్లకాగితం అనుకొని ఎంతవరకు రాయాలో అంతవరకే రాయాలి, పిచ్చిపిచ్చిగా రాస్తే చెత్తలో పడేయవలసి వస్తుంది. అప్పుడేదో కాలేజీకి బంకు కొట్టి తిరిగామని, కాలక్షేపం కోసం, హుషారు రావడం కోసం ఫోన్లో మాట్లాడుకున్నామని అదే జీవితం అనుకుంటే ఎలా? జీవితాంతం అలాగే ఉండాలనుకుంటే ఎలా?
నీకింకో విషయం చెప్పనా! నేను అందరిలాంటి వాడిని కాను. సంకేత అమాయకంగా నాతో తిరిగింది అలా తిరుగుతున్న సమయంలో నేను నా కెమెరా సెల్ ఫోన్ తో వీడియో తీశాను అంటూ ఎవరితో చెప్పను ఎవరికీ చూపించను. నువ్వంటే నాకు గౌరవం వుంది. ఈ విషయంలో నువ్వు ధైర్యంగా వుండు.. ఇకముందు నువ్వు ఎప్పుడు ఫోన్ చేసినా నేను ఎంగేజ్ లోనే వుంటాను. చేసి బాధపడేకన్నా చెయ్యకపోవడమే బెటర్ కదా!” అన్నాడు. ఆ తర్వాత అతను సంకేతకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు.
కాల్ కట్ చేశాడు.
సంకేతకు అయోమయంగా ఉంది.
తను చేసిన తప్పు ఓ పాఠమై ‘ఇక చదువు నన్ను’ అన్నట్లు కళ్లముందు ప్రత్యక్షమవుతుంది. పశ్చాత్తాపంతో గుండె నుగ్గు, నుగ్గు అవుతోంది.
కనుకొనుకుల్లో నిండిన నీరు ఏ దృశ్యాన్ని కూడా స్పష్టంగా చూడనియ్యటంలేదు.
ఇప్పటికి అన్నం తినక నాలుగు రోజులవుతోంది. తలనొప్పి మానశిక ఒత్తిడి ఎక్కువై నరాలు గుంజుతున్నాయి...నిద్రరావటం లేదు ఆకలి అన్పించటంలేదు. తల్లిదండ్రులు గుర్తురావటంలేదు. అనంత్ తనని మోసం చేశాడని కూడా అన్పించటం లేదు. అతని వాదన కూడా సరియైనదే కానీ తన మనసు తన నెందుకిలా నలుపుతోంది?
          ఇందుకేనేమో! చాలామంది పరీక్షా పేపర్ ని సెట్ చేసినట్లు జీవితాన్ని అతిజాగ్రత్తగా సెట్ చేసుకుంటారు. బహుశా జీవితం అనే పుస్తకం వెనకాల ఎంత వెతికినా జవాబులు దొరకవని కాబోలు... తనుకూడా సంవత్సరం క్రితం వరకు అన్ని విధాల శ్రీహర్షను మించిపోవాలని టార్గెట్ పెట్టుకుంది. మధ్యలో ఏం దుర్బుద్ధి పుట్టిందో అందమైన ఆటబొమ్మలా మారి అనంత్ చేతిలోకి వెళ్లింది. అడుకున్నంతసేపు ఆడుకొని నేలకేసి కొట్టాడు. ఇక నా వల్ల కాదంటున్నాడు.
ఇప్పుడు ఎవరికోసం బ్రతకాలి? ఎవరిని చూసుకొని బ్రతకాలి? ఎవరున్నారని బ్రతకాలి? ఉన్నదేమో తనది కాదనిపిస్తోంది. లేనిదేమో కావాలనిపిస్తోంది. అది మాత్రమే తనది అన్పిస్తోంది. అందుకే దోసిట్లో ముఖాన్ని దాచుకొని భోరున ఏడ్చింది సంకేత... ఏడుస్తూనే ఉంది.
ఇంట్లో ఎవరూ లేరు. నీలిమ మార్కెట్ కి వెళ్లింది.
వరమ్మకి సంకేత ఏడుపు విన్పించి, చదువుతున్న భగవద్గీతను పక్కనపెట్టి లేచి హాల్లోకి వచ్చింది.
“సంకేతా!” పిలిచింది వరమ్మ
సంకేత ముఖాన్ని దోసిట్లోంచి ఎత్తకుండా అలాగే కదిలి, కదిలి ఏడుస్తోంది. వరమ్మ చూపులు సంకేత మీద జాలిగా నిలిచాయి.
ఎంతకష్టమొచ్చింది సంకేతకు...! ఎవరికైనా కష్టాలు మూడు రకాలుగా వస్తాయంటారు. ఒకటి స్వయంకృతాలు...రెండు పరాకృతాలు... మూడు గత జీవిత అవశేషాలు...వీటిని దాటాలంటే ధైర్యం కావాలి. ఇప్పుడు సంకేతకు కావలసింది అదే!
ప్రేమ అనేది తక్కువైంది కాదు. అది ఆకర్షణ అనే చేదుమాత్ర మీద చక్కరపూత. మనసు మీద పట్టు బింగించి పెత్తనం చేస్తుంది. మనిషిని వివశున్ని చేసి ఆ తర్వాత ఆశక్తున్ని చేస్తుంది. ఇప్పుడు సంకేత పూర్తిగా అశక్తురాలు!
అందుకే అంటారు భావం ఉదాత్తంగా, ఆరోగ్యంగా వుండాలని... అమృతం పుట్టినా, హాలాహలం పుట్టినా భావంలోంచే! అందుకే వరమ్మ సంకేత మంచం పక్కన వున్న కుర్చీలో కూర్చుని “సంకేతా! నువ్వు ఎంత ఏడ్చినా ఆ అబ్బాయి ఏమైనా వచ్చి వింటున్నాడా? ఏడ్చి, ఏడ్చి నీకంటి నరాలే దెబ్బతింటాయి. నిన్ను కాదనుకొని ఇంకొకరిని కావాలనుకునే అతన్ని నువ్వెంత ప్రాధేయపడినా లాభం లేదు... నువ్విలా బ్రతిమాలే కొద్ది ఆ అబ్బాయి దగ్గర చులకన అవుతావు. నీకు నువ్వు తక్కువగా కన్పిస్తావు. నీ మీద నీకు గౌరవం పోతుంది. ఏడుపు ఆపి ముఖం కడుక్కో” అంది.
సంకేత వరమ్మ మాటల్ని కాని, వరమ్మ వచ్చి తన దగ్గర కూర్చోవటాన్ని కాని ఏమాత్రం పట్టించికోవటంలేదు. పైగా పాతపేపర్లు చదువుకుంటూ మెట్లకింద వుండే వరమ్మ మాటలతో తనకేం పని అన్నట్లు ఏడుస్తూనే ఉంది.
“నువ్వు నామాటలు వినటంలేదని నాకు అర్ధమైపోతోంది. ఒక్కసారి నిన్ను నువ్వు అద్దంలో చూసుకో ఎలా ఉన్నావో తెలుస్తుంది. నీమీద నీకే అసహ్యం వేస్తుంది” అంది వరమ్మ.
సంకేత టక్కున ఏడుపు ఆపి, లేచి నిలబడి తన ముఖాన్ని అద్దంలో చూసుకుంది. వరమ్మ చెప్పింది నిజమే! ఇదే ముఖం మంచి వర్చస్సుతో అనంత్ కి కన్పించాలని ఒకప్పుడు చాలా ప్రయత్నాలు చేసేది.ఇప్పుడేంటి ఇలా వదిలేసింది? ముఖాన్నే కాదు అనంత్ కోసం తన ప్రాణ స్నేహితురాలు హిందూని కూడా వదిలేసింది. అయినా ఏముంది అనంత్ లో ఇన్నిన్ని వదులుకోవటానికి...?
అనంత్ చూడనంతమాత్రాన ఈ ముఖం ఇంకెవరికీ పనికిరాదా?
నిన్న తన తండ్రి వచ్చి తన్ను చూడగానే బాధపడి కళ్ళు తుడుచుకున్నాడు. ఇక్కడ కాంచనమాల తనకి సరిగా తిండి పెట్టడం లేదేమోనని అపోహపడ్డాడు. తనకి ఇష్టమైనవన్నీ తెచ్చి తినమన్నాడు... తను తినలేదు.
“ఆకలిగా లేదా సంకేతా! మరి మన ఊరి ఆర్.ఎం.పి. డాక్టర్ కి చూపించుకుంటావా?” అన్నాడు నరసింహం.
సంకేత మాట్లాడలేదు.
“... ఇలా వుండి నువ్వీ చదువేమి చదువుతావ్! ఈ చదువు లేకపోయినా పర్వాలేదు... ఇక్కడే వుంటే నీ ప్రాణమే పోయ్యేలా వుంది. బయలుదేరు ఇంటికి వెళ్దాం!’ అన్నాడు.
సంకేత దెబ్బతిన్నట్లు చూసి “నేను రాను నాన్నా!” అంది.
“రామ్మా వెళ్దాం! నాలుగు రోజులు వుండి కాస్త ఆరోగ్యం కుదుటపడ్డాక వద్దువుగాని...” అన్నాడు ప్రాధేయపడుతున్నట్లు, ఆమెకు ఒంట్లో ఏదో బాగుండలేదనే అనుకుంటున్నాడు నరసింహం.
“ఊహూ...” అంది తలవంచుకుని.
“ఏం! ఎందుకు?” అన్నాడు.
“ఎందుకంటే...!” అంటూ అసలు విషయం చెప్పబోయి ఆగింది. ప్రేమించటం... నిజానికి ఎవరినైనా ప్రేమిస్తే దాన్ని చెప్పటానికి సిగ్గుపడకూడదు. భయపడకూడదు. కాస్త టైం తీసుకొని తను కూడా తండ్రితో చెప్పాలనే అనుకుంది ఈ లోపలే అనంత్ తనని కాదనుకున్నాడు. తనకి ద్రోహం చేశాడు.
“చెప్పమ్మా! అదేంటో...?” చాలా సహనంగా అడిగాడు నరసింహం.
ఏమని చెప్పాలి...? తల్లీ, దండ్రీ తన కోసం ఎండలో కాలి, వానలో తడిసి కష్టపడుతుంటే తనిక్కడ అనంత్ తో స్వర్గసుఖాలు అనుభవించిందనా? ఇంకా వాటికోసమే ఆరాటపడుతూ పరోక్షంగా నిరాహారాదీక్ష చేస్తోందనా? మనసును స్వాధీనంలోకి తెచ్చుకోలేక అతనెంత విదిలించి కొట్టినా అతనికి ఫోన్లు చేస్తూనే వుందనా?
ఒకరోజు మనసు ఆపుకోలేక అనంత్ కి ఫోన్ చేస్తే “అసలేంటే నీగోల. ఎంత చెప్పినా వినకుండా వూరికే వెంటబడుతున్నావ్! నీకేమైనా తిక్కనా! అదసలే ఏదిఅడిగినా పెళ్ళయ్యాకనే అంటోంది నన్ను పిచ్చి తిప్పలు పెడుతోంది... అయితే నువ్వోకపని చెయ్యవే! నువ్వు ఇలాగే అందుబాటులో వుండు. మా పెళ్ళయ్యాక దాంతో నేనెంత ప్రేమగా ఉంటానో ఫోన్ ఆన్ చేసి మరీ విన్పిస్తాను. అప్పటిగ్గాని నీ రోగం తగ్గాడు. అంతవరకు ఫోన్లు చెయ్యకు” అంటూ ఫోన్ పెట్టేశాడు. కొన ఊపిరిని బ్రతుకు కొనన అద్దినట్లు అనంత్ కోసం చేస్తున్న పోరాటం ఆమెను మౌనంగా కోసింది. అది గుర్తొచ్చి గట్టిగా కళ్ళు మూసుకొని బాధపడింది సంకేత.
నరసింహం కూతురునే చూస్తూ “ఏంటమ్మా బాధపడుతున్నట్లున్నావ్! కడుపులో ఏమైనా నొప్పిగా వుందా??” అన్నాడు ఆందోళనగా.
అదేమీ కాదన్నట్లు తల ఊపింది సంకేత.
“నువ్విలా మౌనంగా వుంటే నేకేమైందో నాకెలా అర్ధమవుతుంది? నిన్నిలా చూస్తే మీ అమ్మ కూడా తట్టుకోలేదు. చాలా మారిపోయావు. ఈ చదువొద్దు. ఏం వద్దు. ముందు మనిషివి బాగుంటే చాలు. ఇంటికెల్దాం! ఇంటి దగ్గర మీ అమ్మ నీ ఆకలి చూసి టైం కి పెట్టుకుంటుంది. ఇక్కడ వీళ్ళెవరూ నిన్ను పట్టించుకుంటున్నట్లు లేరు... ఇప్పటికే మీ అమ్మ అదక్కడెలా వుందో ఏమో! చదివింది చాలు పెళ్లి చేద్దాం! అంటోంది. పద ఇంటికి తీసికెళ్లి మీ అమ్మ చెప్పినట్లే నాశక్తికి తగినవాడి కిచ్చి పెళ్లి చేస్తాను...” అన్నాడు.
పెళ్లి అనగానే ఖంగుతిన్నట్లు చూసింది సంకేత.
“నాన్నా! ఇక్కడ నేనో అబ్బాయిని ప్రేమించాను. వేరే వాళ్ళకి నన్నిచ్చి పెళ్ళి చేస్తానని ఇంకెప్పుడూ అనకు...” అంది.
ఆయన ఒక్కక్షణం షాక్ లోకి వెళ్లి తిరిగి తేరుకుని...
“నువ్వు ప్రేమించావా? ఎవరా అబ్బాయి? నిన్ను పెళ్లి చేసుకోబోతున్నాడా?” అడిగాడు నరసింహం. కూతురు చేసిన పని నచ్చకపోయినా ‘తప్పు’ చెయ్యదు అన్న నమ్మకంతో, సంకేత ముఖంలో రంగులు మారాయి.
“చెప్పు సంకేత!” రెట్టించి అడిగాడు.
“పెళ్లి చేసుకోడు...” ఒక్కోపదాన్ని కూడబలుక్కుంటూ అంది.
“మరెందుకు ప్రేమించినట్లు...!” అసహనంతో ఆయన నరాలు చిట్లిపోయేలావున్నాయి!
ఆయన మాటకి సమాధానం చెప్పలేకపోయింది సంకేత. ఆమె మౌనం ఆయన రక్తాన్ని మరిగిస్తూ వెంటనే నరసింహ ఉగ్ర నరసింహుడై సంకేత చెంప చెళ్లుమనిపించాడు. ఆయన కళ్ళు నిప్పుల్ని కురుపిస్తూ అగ్నిశిఖలా అన్పించాయి. తండ్రిలో కొత్త తండ్రి కన్పించాడు సంకేతకి....
“నాన్న...!” అంది చెంపపై చేయి పెట్టుకొని తడుముకుంటూ బాధగా ... ఆయనేం కరగలేదు.
“నాన్ననే అడుగుతున్నా! వాడెందుకు ప్రేమించాడో చెప్పు! పెళ్ళిచేసుకోనన్నాడన్నావుగా!” అన్నాడు.
ఆయన కంఠంలోని కరుకుదనం అతి భీకరంగా వుంది. ప్రేమ తప్ప కోపం తెలియని తండ్రిలో అంతటి ఆగ్రహావేశాలు ఎప్పుడూ చూడలేదు...
ఎంత ప్రయత్నించినా సంకేత నోటివెంట మాటలు రావటం లేదు.
ఆయన పిచ్చిచూపులు చూస్తూ “చదువుకోవటం కష్టం నాన్నాఎవడో ఒకడ్ని ప్రేమించుకుంటూ ఇలా సోంబేరి దానిలా వుంటానని నాకు ముందే చెప్పాల్సింది. చదువుకుంటున్నానని చెప్పి వీళ్లు పెట్టిన తిండి తింటూ ఇంతమందిని మోసం చెయ్యటం దేనికి...? అయినా ఇలాంటి పని చెయ్యటానికి చదువు పేరుతొ ఇంత దూరం రావాలా? మన వూళ్ళో లేరా అబ్బాయిలు? వూరేమైనా గొడ్డుపోయిందా?” అన్నాడు.
వినలేకపోయింది సంకేత. తను చేసిన పనికి ఇన్ని మాటలు వర్తిస్తాయని కలలో కూడా ఊహించలేదు.
“ఇంత నేలబారు ఆలోచనలతో..చిల్లర బుద్ధులతో బ్రతకాలనుకున్నప్పుడు బి.టెక్ చదువుతూ ఆ చదువు పరువు ఎందుకు తియ్యటం...? వాడెవడో ప్రేమించాడంటావ్! పెళ్లి చేసుకోడంటావ్! జీవితమంటే తమాషా అనుకుంటున్నావా? ఎండకు ఎండి, వానకి తడిసి అక్కడ మేమెంత అడ్డమైన చాకిరీ చేస్తున్నామో తెలిసి కూడా నువ్విలా ఉండటానికి సిగ్గుగా లేదా?” అన్నాడు.
సంకేత తేరుకుని “వుంది నాన్నా! ఎవరి ఆదేశాలను, ఆజ్ఞలను పట్టించుకోకుండా జీవితం ‘నాకోసం’ నిర్దేశించిన ట్రాక్ లోంచి బయటపడి నేను చేసిన ప్రయాణం ఎంత హేయమైనదో కూడా తెలిసి కుంగి పోతున్నాను... ఇది నా కర్మ చేతులారా నేను కూర్చోబోతున్న సింహాసనాన్ని నేనే విరగ్గొట్టుకున్నాను” అంది నెమ్మదిగా.
“నోర్ముయ్! నీకిలా మాట్లాడే అర్హత కూడా లేదు... ఇంటికెళ్లి మీ అమ్మ పని చెబుతా! ఇలాంటి కూతుర్ని కని నా పరువు తీసింది. అది ఈరోజు నా చేతిలో చస్తుంది చూడు!” అంటూ గుమ్మం వైపు నడిచాడు కోపోద్రిక్తుడై...
“ఆగు నాన్నా...” అంటూ విసురుగా లేచి వెళ్లి ఆయన చెయ్యిపట్టుకుంది. పట్టుకున ఆమె చేయిని విదిలించి కొట్టాడు. వెంటనే సంకేత కిందకి జారి ఆయన ముందు కూర్చుని కాళ్లు పట్టుకుంది ఆమె కళ్ళు వర్షిస్తుండగా తలపైకెత్తి తండ్రిని చూస్తూ
“నాన్నా! నేను చేసింది తప్పు! నన్ను కొట్టు, నన్ను తిట్టు, నన్ను చంపు, అమ్మనేమి అనకు...” అంది.
ఆమె చేతుల్లోంచి కాళ్లను తప్పించుకొని రెండడుగులు వెయ్యగానే ఆమె స్ప్రింగ్ లా లేచి నిలబడి “నేను కూడా నెతో వస్తాను. లేకుంటే ఈ కోపంలో అమ్మను ఏమైనా చేస్తావు” అంటూ వెంటబడింది.
ఆయన ఆగి “నువ్వు నాతో వస్తే వూళ్ళో తలెత్తుకోలేను. ఆ తర్వాత నా శవాన్నే చూస్తావు. ఇక్కడే నీ చావేదో నువ్వు చావు. నువ్వెక్కడ చచ్చావన్నది కూడా చూడను. మీ అమ్మతో కూడా అదే చెబుతాను. నా స్నేహితుడికి నేనేంటే గౌరవం వుంది. నీకంత ముద్ద పెడతాడు” అంటూ ఇంకో మాటకి అవకాశం ఇవ్వకుండా వెళ్లిపోయాడు.
...మెట్లకింద వున్న వరమ్మకి నరసింహం మాటలు కొద్దికొద్దిగా విన్పించాయి... అంతేకాదు నిన్న ఆయన వచ్చిన టైంలో కాంచనమాల ఇంట్లో లేదు. అది చాలా మంచిదయింది. లేకుంటే ఈపాటికి సంకేతను ఇంట్లోంచి వెళ్లగొట్టివుండేది. నరసింహం రావటం, కూతురుతో గొడవపెట్టుకొని వెళ్లడం ఒక్క వరమ్మకి, నీలిమకి మాత్రమే తెలుసు....దేన్నైనా కడుపులో పెట్టుకోగలిగే మానసిక ఆరోగ్యం వాళ్లది.
“నిన్న మీ నాన్న ముఖం చూస్తుంటే బాధనిపించింది సంకేత! శివయ్యను కలవకుండానే వెళ్ళాడు. అలా ఎప్పుడూ వెళ్ళలేదు ...నాకు తెలిసి ఈ విషయంలో మీ అమ్మా, నాన్న చాలా క్రుంగి పోతారు. ఒకసారి నువ్వు వెళ్లి వాళ్ళకి కన్పించిరా! అదే ఇంకో తండ్రి అయితే నిన్ను జుట్టుపట్టి బయటకి ఈడ్చి నానా రభస చేసేవాడు దీన్ని బట్టి ఆయన ఎంత సంస్కారవంతుడో నిన్నెంతగా గౌరవిస్తున్నాడో! నిన్నెంత పద్దతిగా చూడాలనుకుంటున్నాడో అర్ధం చేసుకో అన్నట్లు.
సంకేత వరమ్మను చూస్తూ “మా నాన్నను నేను అర్ధం చేసుకోగలను. కానీ నా పద్దతికేం తక్కువైంది ఇప్పుడు? నేనేమైనా చీఫ్ క్వాలిటీ వాళ్లతో స్నేహం చేశానా? అనంత్ వాళ్ళు చాలా గొప్పవాళ్లు... వాళ్ల మమ్మీ కూడా చాలా మంచిది. ఈ విషయం మీక్కూడా తెలుసు” అంది.
“వాళ్ళు గొప్పవాళ్ళే సంకేత! కానీ వాళ్లెందుకు వద్దనుకుంటున్నారు నిన్ను? దేనికైనా సమవుజ్జీగా వుండాలనేగా! ఇది నీకు అర్ధం కావటం లేదా? స్నేహంగా ఉండటానికి, ప్రేమగా ఉండటానికి, ఎలాంటి అర్హతలు అవసరం లేదు. కోడలిగా ఉండటానికి మాత్రం కొన్ని అర్హతలు అవసరం అవుతాయి...”
“నాకేం తక్కువ?”
“అదే నేను అంటున్నాను. నీకేం తక్కువ. మీ నాన్న గారు నీకు తగిన అబ్బాయితో పెళ్లి చేస్తాడు. ఇంటికెళ్లి పెళ్ళిచేసుకొని గౌరవంగా జీవించు...
“గౌరవంగా అంటే మనసుతో, శరీరంతో సంబంధం లేకుండానా?”
“అన్ని సంబంధాలు కరక్ట్ గా ఉండటానికి నువ్వేమైనా సంవత్సరం క్రితం అమ్మాయివా? తప్పు చేసినప్పుడు శిక్ష కూడా వుంటుంది”.
“నేను అనంత్ మీద చాలా ఆశలు పెట్టుకున్నాను...”
“నికే కాదు. అనంత్ మీద ఏ అమ్మాయికైనా ఆశలు వుంటాయి. డబ్బుంది కదా! ఆ డబ్బును పక్కనపెట్టి అనంత్ ని చూడు. మీ నాన్న తెచ్చే అబ్బాయే అనంత్ కన్నా ఎక్కువగా అన్పిస్తాడు .... నువ్వు కేవలం డబ్బునే చూస్తున్నావని నాకనిపిస్తుంది...” అంది వరమ్మ.
సంకేత మనసు అందుకు ఒప్పుకోలేదు. అదే నిజమైతే తను ఇంతగా బాధపడేదా? ప్రాప్తం ఉన్నంత వరకే అందింది. అంతవరకే అనుభవించాను అని నిశ్శబ్దంగా వుండేది. ఈ వరమ్మ ఏంటి ఇలా అంటోంది...? తన గురించి అందరు ఇలాగే అనుకుంటున్నారా? తను డబ్బు మనిషా?
“మనకు తెలియకుండానే మనలో కొన్ని వ్యామోహాలుంటాయి సంకేతా! డబ్బు పట్ల, కీర్తి పట్ల, చదువుపట్ల... ఇలా రకరకాలుగా! చదువుపట్ల వుండాల్సిన టైంలో డబ్బుపట్ల, డబ్బుపట్ల వుండాల్సిన టైంలో కీర్తి పట్ల వుంటే ఎలా?” అంది వరమ్మ.
“మీరనుకుంటున్న ఆ వ్యామోహమేదో నాకు డబ్బు పట్లలేదు. మనిషి పట్ల వుంది...” అంది సంకేత.
“మనిషి పట్ల వుంటే మీ నాన్న కూడా మనిషే! చిన్నప్పటినుండి నీ ఎదుగుదలను కోరుకున్న మనిషి! ఎదిగితే చూడాలనుకున్న మనిషి! మీ అమ్మకూడా అంతే! తన కంటిపాపవు నువ్వే అనుకుంటున్న మనిషి! అలాంటి వాళ్ళిద్దరిని వదిలేసి నిన్ను వదిలించుకోవాలని చూస్తున్న మనిషిని ప్రేమిస్తే నిన్నెవరు గుర్తిస్తారు?
దేనికైనా గుర్తింపు, తృప్తి వుండాలి సంకేతా! ఇలా వ్యర్ధంగా నిరాహారదీక్ష చేసి ఒంట్లో వున్న శక్తిని ఎందుకు పాడుచేసుకుంటావ్! “అతనెవరో! నువ్వెవరో! అని నీకిప్పటికీ అన్పించటం లేదా?” అంది వరమ్మ.
“అతనితో నేను చాలా దూరం ప్రయాణం చేశాను. అదే గుర్తొస్తోంది నాకు...” అంది సంకేత.
వరమ్మ మాట్లాడలేదు.
“నన్నర్ధం చేసుకో బామ్మా! నా ప్రేమ డబ్బుకోసం కాదు. అవసరాలకు మించి కాకపోయినా మా దగ్గర కూడా డబ్బుంది. అది మాకు ఇవ్వాల్సినంత తృప్తిని, రక్షణను ఇస్తూనే వుంది... కానీ డబ్బుతో సాధ్యం కానివి కూడా లేవా బామ్మా!” అంది చాలా వినమ్రంగా.
“ఎందుకులేవు. ఖరీదైన పరుపుని కొనాలంటే డబ్బులతో సాధ్యమవుతుంది కాని నిద్రను కొనాలంటే సాధ్యం కాదు. అలాగే ఆహారాన్ని కొనగలం కాని ఆకలిని కొనలేం! విలాసవంతమైన వస్తువుల్ని కొనగలం కాని సంస్కారాన్ని కొనలేం!” అంది వరమ్మ.
“అలాగే మనసును కూడా కొనలేం బామ్మా! అది అనంత్ కి తెలియదు! డబ్బుతోనే అన్నీ వస్తాయనుకుంటున్నాడు” అంది సంకేత దిగులుగా. సంకేత ప్రతి మాటా బాగా ఆలోచించి మాట్లాడుతోందని వరమ్మకి అర్ధమైపోయింది.
          “అందుకే అతన్ని మరచిపోవటం మంచిది సంకేతా! అతను నిన్ను కాదనుకోవటం కూడా ఒకరకంగా నీకు మేలు జరగటం కోసమే అని నాకనిపిస్తోంది” అంది వరమ్మ.
          సంకేత దానికి ఒప్పుకోలేదు. తన ధోరణిలోనే తను ఆలోచిస్తూ మౌనంగా, దిగాలుగా కూర్చుంది.
          ... వరమ్మ కుర్చీలోంచి లేస్తూ “నీ మనసు పుండై నిన్నెంత బాధపెడుతుందో నేను అర్ధం చేసుకోగలను సంకేతా! నువ్వొకసారి మీ వూరు వెళ్లిరా! అమ్మ ఒడి చాలా గొప్పది... నిన్ను ప్రేమతో అక్కున చేర్చుకొని ఉపశమనం ఇస్తుంది” అని మళ్లీ ఒక్కక్షణం ఆగి “నువ్వు ప్రేమించే అనంత్ కన్నా నిన్ను ప్రేమించే దాస్ అయితే నిన్ను బాధ్యతగా చూసుకోగలుగుతాడేమో ఒక్కసారి దాస్ గురించి కూడా ఆలోచించు కావాలంటే నేను దాస్ తో మాట్లాడతాను” అంది.
          “నేను కోరుకోనిది నాకు అవసరం లేదు బామ్మా!” అంది సంకేత
          వరమ్మ ఇంకేం మాట్లాడకుండా సంకేత దగ్గర నుండి వెళ్ళిపోయింది.
*****
          బస్ కదలబోతుండగా పరిగెత్తుకుంటూ వచ్చి బస్ ఎక్కింది పల్లవి... ముందు సీట్లకి నాలుగు సీట్ల వెనకకూర్చుని వున్న శ్రీహర్షను చూడగానే “హాయ్ శ్రీహర్షా!” అంటూ వెళ్ళి అతని పక్కన కూర్చుంది.
          పల్లవి ముఖాన్ని, తలను ఆమె తన చున్నీతో కవర్ చేసుకొని వుండటంతో గొంతు గుర్తుపట్టలేక “ఎవరూ”? అన్నట్లు చూశాడు శ్రీహర్ష.
          అతనెందుకలా చూస్తున్నాడో అర్ధమై, ముఖానికి కట్టులావున్న చున్నీ పక్కకి తొలగించి “ఎండ ఎక్కువగా వునట్టు వుంటే మాడు కాలిపోతుందని చున్నీ తీసి ఇలా చుట్టుకున్నాను. స్టైల్ గా వుంది కదూ!” అంది నవ్వి, ఇప్పుడు పల్లవి ముఖం స్పష్టంగా కన్పించింది.
(సశేషం)

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top