కా(శీ)ఫీనాధోపాఖ్యానం

 - టేకుమళ్ళ వెంకటప్పయ్య


తిరుపతి, పార్వతి దంపతులకు సంతానం లేకపోవడం తో, ఎక్కని కొండ గానీ, దర్శించని దేవుడు గానీ లేడు. తిరుపతి తల్లి వరలక్షమ్మ కూడా ఎన్నో మొక్కులు మొక్కుకుంది. తిరుపతికి 40 సంవత్సరాల వయసు వచ్చేసింది. రోజూ యధావిధిగా పూజా పునస్కారాలు చేస్తూనే ఉన్నాడు. ఓ రోజు ఉదయాన్నే పూజ చేస్తూ..."పారూ... పారూ...కర్పూరం ఎక్కడ తగలెట్టావే" అని పెద్దగా కేకలేస్తుంటే.. పార్వతి "ఎందుకలా గావు కేకలేస్తారు? ఇక్కడే చచ్చా! పొద్దుటినుండి కడుపులో తిప్పుతోంది..వాంతులు అవుతున్నాయి" అని విసుక్కుంది. "సరేలే కర్పూరం ఎక్కడెట్టావో చెప్పు చాలు" అన్నాడు తిరుపతి.  వరమ్మ ఆ సమయంలో పోతు లోటా (పావు లీటర్ సైజు) తో కాఫీ తాగుతోంది.. కామేశ్వరి మాటలు వినగానే రంగ ప్రవేశం చేసి "మా తల్లే మా తల్లే ఎంత మంచి మాట చెప్పావు" అని నొసట ముద్దు పెట్టుకుని  "ఒరే తిక్క సన్నాసీ! పక్క వీధిలో ఉన్న లేడీ డాక్టర్ ను త్వరగా పిలవరా!" అంది. తిరుపతికేమీ అర్ధం కాక "తగ్గిపోతుందిలే.. వెధవ హడావుడీ నువ్వూనూ, ఇంత చిన్న విషయానికి డాక్టరెందుకు? నిమ్మకాయ బద్ద నోట్లో వేసుకోమను చాలు ఆగిపోతాయి" అన్నాడు. " ఒరేయ్! అందుకే నిన్ను అందరూ తిక్కతిరుపతి అనేది, ఇవి మామూలు వాంతులు కావురా! పిలువు డాక్టర్ను" అంది.
అప్పటికి ట్యూబ్ లైటు వెలిగిన తిరుపతి ఆసమయంలో కేవలం గోచీ తో ఉన్న సంగతి కూడా మరచి "అమ్మా! అదా విషయం! ఆహా ఓహో! ఎంత హాయిలే హలా" అంటూ.. "ఏమేవ్! పారూ.. ఇదే నిజమైతే..బిడ్డను ప్రసవించే వరకూ ఈ కౌపీనము వీడను గాక వీడను" అని శపధం జేసి నాలుక్కరుచుకున్నాడు. అది విన్న వరమ్మ నవ్వుతూ "వెర్రి నాగన్నా! నువ్వు బయటికెళ్ళి మాత్రం వూడబొడిచేముంది గనుక అలాగే తగలడు" అంది. డాక్టరమ్మ వచ్చి ఆవిషయం కన్ ఫాం చేయగానే ఆరోజునుండి కౌపీన వస్త్ర ధారియై, అదే గోచీ తో స్నానపానాదులు గట్రా గట్రా  కానిస్తూ ఉండగా.. , పార్వతి నెలలు నిండి పండంటి మొగ బిడ్డను ప్రసవించగా..కౌపీనానికి విముక్తి లభించింది.
వరమ్మబామ్మగారు  కాశీనాధ్ అనే ఆ వంశాంకురాన్ని అల్లారు ముద్దుగా పెంచుతూ.. వాడికి కాఫీ అలవాటును ఉగ్గు గిన్నె తో ఆరంభం జేసి పోతు లోటా దాకా తెచ్చింది. ఓ పెద్ద ఫ్లాస్కుడు కాఫీతో స్కూల్ కెళ్ళి గంట గంటకూ ఓ గ్లాసుడు కాఫీ తాగేవాడు... కాలేజీ లోనూ అదే తంతు. అన్నం తినకుండా వుండగలడు కానీ కాఫీ లేకుండా వుండలేడు. ఫ్రెండ్సుకు కూడా ఇవ్వకుండా గుట్టు గుట్టుగా తాగే వాడు. ఇదంతా చూసి ఫ్రెండ్స్ హైస్కూల్ లోనే  "కాఫీనాధ్" అని పేరు పెట్టేసారు. ఆవూర్లో ఉన్న పన్నెండు కాఫీ హోటల్స్ కూ "ద్వాదశ కాఫీ క్షేత్రాలు " గా  పేరెట్టి ఏడిపించే వారు.
ఇన్నేసి కప్పులు కాఫీలు తాగినా చదువులో మాత్రం ఫస్ట్ వచ్చేవాడు. "చదువులో అంతా వాళ్ళ తాత పోలికే నా మనుమడు” అని బామ్మ మురిసిపోతూ ఉంటే తిరుపతి "అమ్మా! నాన్న చదివింది ఏడో క్లాసే నట గదా!" అంటే  ఎవరా చెప్పిన కుక్క... ఒరే తిక్క సన్నాసీ.. ఈ రోజుల్లో ఎం.ఏ చదువు  ఆయనగారి రోజుల్లో పదో తరగతికి  సమానం రా!" అనేది. ఎందుకొచ్చిన గొడవ! ఆవిడ ఆనందం ఆవిడది అని వూరుకునే వారు.
కాశీనాధ్ చదువు అయిన తర్వాత బ్యాంక్ పరీక్ష రాసి పెద్ద ఆఫీసరు అయ్యాడు. కామేశ్వరి తొ వివాహం అయ్యక.. బామ్మ కూడా తిరుపతి నస భరించలేక కాశీనాధ్ తో వచ్చి ఉంటొంది. జీతం బాగానే ఉన్నా..కామేశ్వరికి రోజు రోజు కూ వాళ్ళిద్దరి  కాఫీ గోలతో చిరాకు ఎక్కువవుతోంది. కాఫీ ఖర్చు కే పదివేలు అవుతోంది. పాల వాళ్ళూ.. కాఫీ డే షాపులవాళ్ళు అమ్మా మీకు గానీ కాఫీ హోటల్ గానీ ఉందా? ఇన్నేసి కిలోలు ఏమి చేస్తున్నారని అడగడం.. నవ్వడం చాలా అవమాన కరంగా తో స్తోంది.  వాళ్ళ నాన్నా వాళ్ళతో.. చుట్టాలతో..డాక్టర్లతో... చెప్పించి చూసింది. ఫలితం సున్న.వాళ్ళ లెక్క వాళ్ళదే.. మూడు కిలోల కాఫీ పొడి... ఆరు కిలోల పంచదారగా సాగుతోంది ఆ సంసారం "నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు" అన్న రీతిలో.
ఓ శనివారం సాయంత్రం బామ్మ కూరలకని వెళ్ళి..బజార్లో ఎవరో ఇచ్చారని ఓ కరపత్రం తెచ్చింది అది చదివుతూనే.. "అమ్మా..కామూ.. ఓ సారి మా సన్నాసి కి ఫోన్ కలుపు అర్జెంటుగా మాట్లాడాలి" అంది. ఆరోగ్య సమస్యో ఏమో మనకెందుకని రింగ్ చేసి ఇచ్చింది. బామ్మ ఫోన్ అందుకుంటూనే...ఒరే..కాశీ నువ్వు అర్జెంటుగా రావాల్రా" అంది. "ఇక్కడ బ్యాంకు మీటింగు లో ఉన్నానే బామ్మా!" 6 గంటలకు వస్తాను అని చెప్పి...ఆరు కొడుతుండగా రానే వచ్చాడు కాశి.  "ఒరేయ్! కాశీ! నాకా వయసయిపోయింది. ఈ పోటీల్లో నేను పాల్గొనే వయసులేదు. నువ్వే పాల్గొని ఎలాగయినా మన వంశం పరువు నిలబెట్టాల్రా నాయనా!" అంది. "పోటీ ఏమిటి? పాల్గొనడం ఏమిటి? సరిగ్గా అర్ధమయేట్టు చెప్పు బామ్మా! సస్పెన్సు లో పెట్టకు దయచేసి, చిరాగ్గా ఉంది  అసలే’  అనగానే.. ఓ పాంప్లెట్ చేతికిచ్చింది. దాని సారాంశం ఏమిటంటే...కాఫీడే కంపెనీ వాళ్ళు ప్రచార నిమిత్తం ఆదివారం ఉదయం టవున్ హాల్లో ఉచితంగా తాగినవాళ్ళకు తాగినంత కాఫీ.. మరియూ వరుసగా ఆపకుండా ఎవరు ఎక్కువ కాఫీ కప్పులు తాగితే వారికి "కాఫీడే కింగ్" బిరుదు ప్రదానం..మరియూ 10 వేల నగదు బహుమతీ పెద్ద షీల్డూ ఇస్తారట. చదివి బామ్మ వైపు చూడగానే  "ఒరే సన్నాసీ ఇంకా అలోచన ఏంటి రా! రేపు మనం వెళ్తున్నాం అంతే!"  అంది. కామేశ్వరి గుర్రుగా చూచింది. "ఒరే 10 వేల డబ్బూ.. పేరుకు పేరూను..అని గొణిగింది బామ్మ. "సర్లేవే! నీ సరదా ఎందుకు కాదనాలి! వెళ్దాం లే!" అనగానే హమ్మయ్యా అని వూపిరి పీల్చుకుంది బామ్మ.
ఆదివారం ఉదయాన్నే కాఫీ టైముకు ఇవ్వలేదని ఇద్దరూ గోల చేస్తుంటే.. "అక్కడకు వెళ్ళి ఎలాగూ తాగుతారు కదా గ్యాలన్లు..గ్యాలన్లూ.. ఇక్కడకూడా ఎందుకు?" అంది చిరాగ్గా కామేశ్వరి. "దేని రుచి దానిదేనే పిచ్చి పక్షీ! నువ్వేళ్ళి సరదాగా రొండు పోతులోటాల కాఫీ పట్రా! తాగేసి వెళ్తాము" బామ్మ అనగానే.."ఖర్మ రా బాబూ!" అనుకుంటూ వంట గదిలోకి వెళ్ళింది కామేశ్వరి.
కాఫీ సేవనం అయ్యాక.. "వెళ్ళొస్తాం! జాగ్రత్త! వీలుంటే నువ్వూ రా!" అని చెప్పి ఆటో ఎక్కి టవున్ హాలుకు తరలి వెళ్ళారు.  అక్కడ జనం గుంపులు గుంపులు గా ఉన్నారు. "బామ్మా మనం నెగ్గుతామటే ఇంత మందిలో" అంటుంటే.. "ఒరే పిచ్చి తండ్రీ! ఈ వరమ్మ పెంపకం! చదువైనా సరే ఏ పోటీ అయినా సరే.. ఈ వరమ్మ మనుమడు నెగ్గాల్సిందే! తాత గారిని మనసులో తలుచుకుని బరిలోకి దిగరా వెర్రినాగన్నా! అని దీవించింది.
11 గంటలవరకూ ఉన్న రికార్డు ప్రకారం.. 12 కప్పులు వరుసగా తాగిన వాడు మాత్రమే ఉన్నాడు బరిలో. కొంత మంది రొండు మూడు కప్పులకే వాంతులు చేసుకున్నారు. ఇవన్నీ విన్న బామ్మ "ఒరే! చిట్టి తండ్రీ అధైర్య పడకు! నువ్వు వీజీ గా 20 కప్పులు తాగ గలవు" అని పునరాశీర్వచనం చేసి బరిలోకి దింపింది. కాశీనాధ్ అలవోక గా గంటలో 20 కప్పులు తాగేసాడు. అందరూ చప్పట్లు కొట్టారు.  మరికొంత మంది  4-5 కప్పులకే వాంతులు చేసుకుంటూ ఉండడంతో జయం మనదే అన్న ధీమా ఏర్పడింది. ఇంకో రెండు మూడు గంటలు ఉండి ఇంటికి వచ్చేసారు. ఇకనైనా మొహం మొత్తి కాఫీ మానేస్తారేమో అన్న ఆశతో ఎదురు చూస్తూ ఉన్న కామేశ్వరికి  బామ్మ గొప్పగా ఆటొ దిగుతూనే బొటనవేలు పైకెత్తి విజయం మనదే అని చూపిస్తూ ఉంటే.. మూతి తిప్పుకుంది కామేశ్వరి.
సాయంత్రం కాఫీ డే వారిచే ఘన సన్మానం. 10 వేలు నగదు తో విజయ గర్వం తో ఇల్లు చేరారు.  ఆ పక్కరోజు సాయంత్రం ఆఫీసు నుండి ఇంటికి రాగానే కళ్ళు తిరిగినట్లై సోఫా లో కూర్చొండి పోయాడు కాశీనాధ్. వెంటనే కామేశ్వరి ఫ్యామిలీ డాక్టర్ వద్ద అర్జెంట్ అ ప్పా యింటుమెంటు తీసుకుంటాను మీరిద్దరూ ఆటొ ఎక్కి రండి అని హడావిడిగా ఆందోళనగా ముందు వెళ్ళిపోయింది కామేశ్వరి.
డాక్టర్ పరీక్షలు చేస్తూ..అమ్మా ఉండండి చివరిగా ఈ రక్త పరీక్ష అని చెప్పి ఓ ఇంజెక్షన్ నీడిల్ తో రక్తం తీస్తుండగా భయం వేసి కళ్ళు మూసుకున్నాడు కాశి.  "డాక్టర్  ఓ మై గాడ్! అన్నాడు. కాశీనాధ్ "ఏమైంది డాక్టర్! చెప్పండి! అన్నాడు కళ్ళు తెరిచి" అన్నాడు. "ఇది రక్తమా లేక కాఫీనా? ఇదేమిటి రక్తం కాఫీ కలర్లో ఉంది?" అన్నాడు. ఆశ్చర్య కరంగా ఇంజెక్షన్ సిరింజి లో కాఫీ ఉంది. మీరు ఎక్కువ కాఫీ తాగుతారా? అన్న డాక్టర్ ప్రశ్నకు తలూపాడు కాశి. కామేశ్వరి ఏమైంది డాక్టర్ అన్న ప్రశ్నకు.. "అమ్మా ఇలా అంటున్నందుకు మరోలా అనుకోకండి. బ్రాందీ విస్కీ కి దీనికి తేడా లేదు. అవి తాగితే రక్తం ఎలా చెడి పోతుందో ఇదీ అంతే.. ఇంకా కంటిన్యూ చేస్తే ప్రాణానికి ప్రమాదం" అనగానే భయం తో చెమటలు పట్టాయి కాశీకి. "హయ్యో అంత మాట అనకండి డాక్టర్" అని మంగళ సూత్రాలు కళ్ళకద్దుకొంది కామేశ్వరి. "ఈ రోజునుండి కాఫీ పూర్తిగా మానేసి నేను ఇచ్చిన ట్యాబ్లెట్స్ వాడితే తప్ప ఈ వ్యాధికి మరో మార్గం లేదు" అనగానే.. అలాగే డాక్టర్! అన్నాడు కాశీ  గద్గద స్వరంతో..
ఓ రోజు సూపర్ బజార్లో కామేశ్వరికి కనబడ్డ డాక్టర్ "ఎలా ఉన్నారు మీ వారు" అన్నాడు నవ్వుతూ. కామేశ్వరి "చాలా ధన్యవాదాలు డాక్టర్. ఆ కాఫీ పిచ్చి మానిపించినందుకు!" అంది. అదేముందమ్మా ఒకరి చెడు అలవాటు మానిపించడానికి అబద్ధాలు ఆడడం తప్పేమీ కాదు కదా!" అన్నాడు. డాక్టర్తో కలిసి కామేశ్వరి ఆడిన నాటకం ఎప్పటికీ బయటపడే అవకాశం లేదు. వయసుడిగిన  బామ్మ ఇటీవల కాలధర్మం చెందడం కూడా ఆ కాఫీ కారణంగానే అని నమ్మ బలికింది కామేశ్వరి. కాశీనాధ్ ప్రస్తుత శేష జీవితం ఫ్లాస్కులనూ.. కాఫీ కప్పులనూ చూస్తూ.. గత స్మృతులు నెమరేసుకుంటూ బ్రతుకుతున్నాడు.
-0o0-

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top