భార్యాభర్తల అనుబంధం

 శ్రీ పెయ్యేటి రంగారావు 


భార్యాభర్తలూ!  
చివరకు మీరిద్దరే మిగులుతారు!
కొట్టుకున్నా, తిట్టుకున్నా,
అలిగినా, అన్నం మానేసినా
చివరకు మీరిద్దరే మిగులుతారు!
అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేసుకుని
 కాపురాలకు వెళ్ళిపోగా
అబ్బాయిలు ఉద్యోగాలంటూ 
దూరాలకు వలస పోగా
చివరకు మీరిద్దరే మిగులుతారు!
కళ్ళు మసకబారగా,
జ్ఞాపకశక్తి సన్నగిల్లగా
కళ్ళజోళ్ళు వెతికిపెట్టడానికి
చేతికర్రలు అందించుకోడానికి
చివరకు మీరిద్దరే మిగులుతారు!
కీళ్ళనెప్పులు సలుపుతూంటే
నూనె రాసి సేవ చెయ్యడానికి 
నడుము వంగక బెట్టు చేస్తే
కాలిగోళ్ళు కత్తిరించి పెట్టడానికి
చివరకు మీరిద్దరే మిగులుతారు!
స్నానాలగదిలో ఒకరి వీపు
ఒకరు రుద్దుకోడానికి,
పడిపోతే లేవదీసుకోడానికి 
చివరకు మీరిద్దరే మిగులుతారు!
ఆసుపత్రికి వెళ్ళి వచ్చి,
'నా రిపోర్టులన్నీ బ్రహ్మాండం
డాక్టరు నాకేం లేదన్నాడు' అని నవ్వుతూ
ఒకరినొకరు మభ్యపెట్టుకోడానికి
చివరకు మీరిద్దరే మిగులుతారు!
అకస్మాత్తుగా అనారోగ్యం కలిగి
ఆసుపత్రిలో చేర్చవలసి వస్తే
చివరకు మీరిద్దరే మిగులుతారు!
అనకూడదు గాని, 
అటుదిటు, ఇటుదటు అయి
ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకునే 
ఆఖరి క్షణాల్లో కూడా
భార్యాభర్తలూ!  గుర్తుంచుకోండి,
చివరకు మీరిద్దరే మిగులుతారు!
అందుకే జీవితమంతా 
ఒకరినొకరు ప్రేమించుకుంటూ బ్రతికెయ్యండి.
ప్రేమంటే మీదే సుమా అని
అందరూ అసూయ చెందేలా
చెరగని చిరునవ్వులతో
మాయని మమతలతో
తరగని అనురాగంతో
నీకు నేను, నాకు నువ్వు అనుకుంటూ 
ఒకరినొకరు మెచ్చేసుకుంటూ,
ఒకరినొకరు క్షమించేసుకుంటూ,
ఆనందంగా బ్రతికెయ్యండి. ||
*********************

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top