అయాచితం

-చెన్నూరి సుదర్శన్

 
         
కాశీబుగ్గ ఒకప్పుడు దేశీయ గోళీకాయ సోడాలకు ప్రసిద్ధి. వేసవి కాలం వచ్చిందంటే వీధి, వీధిన ‘కెవ్వు’, ‘కెవ్వు’ మనే కేకలు. మనుషులు చేసే ఆర్తానాదల్లాగే  సోడాబుడ్డీల (సీసాల) మోతలు మారు మ్రోగి పోతుంటాయి. ఓపనర్‍కు వాడే చిన్న రబ్బరు కవరు ప్రత్యేకతే అలా శబ్దం రావడానికి  కారణం. లేకుంటే కొత్తగా కాపురానికి వచ్చిన పెళ్ళి కూతురులా కిస్సుక్కుమనో! లేదా తుసుక్కున తుమ్మిన శబ్దమో!!.. చేస్తుంది సోడా బుడ్డి. అది తమ వ్యాపారానికి తగిన లాభసాటి కాదని.. సోడా బండి వాళ్ళంతా కెవ్వుమనే మోతలకే ప్రాధాన్యమిస్తారు.
          అలాంటి శబ్దానికి  ప్రతీ రోజు మధ్యాహ్నం సంజీవ్ ఉలిక్కిపడి దిగ్గున లేచి కూర్చోవటం..
          ‘నానమ్మా నాకూ సోడా.. కావాలి’ అంటూ మారాం చేయటం..
          ‘చిన్న పిల్లలు తాగొద్దు నాన్నా..’ అంటూ శాంతమ్మ సర్ది చెప్పటం.. ఆ యింట్లో నిత్యకృత్యం.
          అది వేసవి కాల ఆరంభం.. ఒంటి పూట బళ్ళు.. రెండవ తరగతి చదువుతున్న సంజీవ్ బడి నుండి రాగానే హాయిగా స్నానం చేసి అన్నం తిని పడుకుంటాడు. మంచి నిద్రలో ఉన్నప్పుడు ఇలా సంజీవ్‍ను కాసేపు ఏడ్పించడం సోడా బుడ్డీలకు మహా సరదా. ‘ఏడుస్తూ.. ఏడుస్తూ.. పడుకుంటాడులే..’ అని శాంతమ్మ ధీమా. తిరిగి సంజీవ్ పడుకోగానే వాన పాములా  సోమయ్య సోడా బండి వద్దకు  వెళ్ళి ఒక నిమ్మకాయ సోడా తాగి తన ఖాతాలో నమోదు చేసుకుంటుంది. సోమయ్య బొగ్గుతో తమ తెల్లని గోడ మీద ఒక నల్లని గీత గీయడం జాగ్రత్తగా పరిశీలించి లెక్కించి సరి చూసుకుంటుంది.. ప్రతీ నెల కోడలును డబ్బులు అడిగి బాకీ తీర్చుకుంటుంది.
          శాంతమ్మ కొడుకు ప్రింటింగ్ ప్రెస్సులో.. కోడలు బీడీ కార్ఖానాలో కార్మికులు. వారి ప్రథమ సంతానం సంజీవ్. అతడి బాగోగులు చూసుకోవడమే శాంతమ్మ పని. సంజీవ్ బడి తమ వీధిలోనే ఉన్నప్పటికీ.. మనవణ్ణి బళ్ళో దింపి రావడానికి అప్పుడప్పుడు స్వయంగా వెళ్తుంది.
***
          అది ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల కాశీబుగ్గ.
          ప్రార్థన గంట మ్రోగింది. పిల్లలంతా తరగతుల వారిగా లైన్లు కడ్తున్నారు. శాంతమ్మ చేతిలోని పుస్తకాల సంచిని  తీసుకున్నాడు సంజీవ్.
          “బాబూ.. సంజీవ్.. నాకు మధ్యాహ్నం రావటం కుదురదురా... యీ రోజు మీ తాత గారు పుట్టిన రోజు. గుడికి వెళ్ళి మీ తాత గారి పేరున అర్చన చేయిస్తాను. యీ రోజు  ఏదో ఒక పుణ్య కార్యక్రమం చేయటం మంచిది.  గుడి ముందుండే బీదలకు భోజనాలు పట్టుకెళ్తాను. వంటలూ అవీ  చేసుకోవాలి. నాకు గుడి నుండి రావటం కాస్తా ఆలస్యమైనా నువ్వు వరండాలో కూర్చొని హోంవర్క్ చేసుకో.. ” అంటూ జాగ్రత్తలు చెప్పి వెళ్ళింది శాంతమ్మ.
          ప్రార్థన అనంతరం తరగతులు ఆరంభమయ్యాయి. సంజీవ్ క్లాస్ టీచర్ రాగానే పిల్లలంతా లేచి నిలబడి నుదుటికి చేతులు ఆన్చిముక్త కంఠంగా ‘నమస్తే టీచర్’ అన్నారు. . టీచర్ వారి అభివాదాన్ని స్వీకరించింది.
          “స్కూల్ ఫీజు కట్టని వారు నిలబడండి. మిగతా వాళ్ళంతా కూర్చోండి” అంటూ సంజ్ఞ చేసింది.
          నలుగురు పిల్లలు నిలబడి వున్నారు. అందులో సరళ కూడా వుంది. సరళకు క్లాసులో ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. సంజీవ్ అప్పుడప్పుడు సరళను నోట్స్ అడుక్కుంటాడు. సరళ హ్యాండ్ రైట్ంగ్ చాలా బాగుంటుంది.. అలా రాయాలని తనూ ప్రయత్నిస్తూ వుంటాడు. ఆనేపథ్యంలో వారిద్దరికి గట్టి స్నేహ బంధం ఏర్పడింది.
          “రెండు రోజుల్లో ఫీజు కట్టని వారు యిక బడికి రానక్కర లేదు. వారి పేర్లు తీసెయ్యమంటూ హెడ్మాస్టర్ నోటీస్ పంపించాడు” అంటూ అప్పుడే అటెండర్ తెచ్చిన నోటీసు చదివి వినిపించింది.
          కూర్చున్న పిల్లలంతా నిలబడ్డ వారిని అదో రకంగా చూస్తూ వుండటం సంజీవ్‍కు నచ్చలేదు.. అన్యమనస్కుడయ్యాడు.
          టీచర్ హాజరు తీసుకుని పాఠం చెప్పటం ఆరంభించింది.
          ***
          ఆవాళ సంజీవ్ బడి నుండి మహా హుషారుగా రావడం.. పుస్తకాల సంచి తన గదిలోనికి విసిరేసి బాత్రూం వెళ్ళి స్నానం చేస్తూ ఉండటం శాంతమ్మ ముచ్చట పడింది. గుళ్ళో పని త్వరగా తెమలటం మూలాన  శాంతమ్మ సంజీవ్ కంటే ముందే యింటికి వచ్చేసింది. తాతయ్య పుట్టిన రోజని చెప్పాను కదా .. అందుకే ఆ హుషారుతనం కాబోలు అనుకుంది మనసులో..
          మనుమనికి త్వరగా అన్నం వడ్డించాలని గబ గబ వంట గదిలోనికి వెళ్ళింది.
           బట్టలు మార్చుకుంటుంటున్న సంజీవ్‍కు కెవ్వున కేక వినపడింది..
          “ఈ రోజు పెందరాలే సోడా బండి వచ్చిందే నానమ్మా.. నువ్వు తాగేసి రా.. ” ముద్దు ముద్దుగా అన్నాడు సంజీవ్.
          “సోడా బుడ్డీ కాదురా మనవడా.. ఆ కేక వేసింది నేను.. ” అంటూ తారాజువ్వలా వంట గది నుండి బయటికి వచ్చింది శాంతమ్మ. బిత్తర పోయాడు సంజీవ్.. ఏమైందన్నట్లుగా..
          “నీ మొలతాడు ఏదిరా సంజీవ్?.. మీ తాతయ్య కాలుకు వేసుకునే వెండి బేడీ నీ మొలలో ఉంటుందని ఎంతో ముచ్చట పడి చేయించాను.. బాత్రూంలో పడిందా!.. ” అంటూ కంగారుగా బాత్రూం వైపు పరుగెత్త సాగింది.
          “అదిచ్చేసి సోడా, లెమన్ రెండు తాగాను..”
          ఠక్కున ఆగిపోయి వెను తిరిగింది శాంతమ్మ.. నోరు తెరిచి కనుగుడ్లు తేలేసింది.
          “రేపు కూడా సోడా ఇస్తానన్నాడు..”  మరో సోడా బుడ్డి అదనంగా సాధించాననే ధీమాతో అన్నాడు సంజీవ్..
          శాంతమ్మకు ప్రాణం పోయినంత పనైంది. ఒక రకంగా తనదే తప్పు..‘కాసంత సోడా రుచి చూపించి సర్ది చెబితే పోయేది.. ఇప్పుడు కోపగించుకుని లాభం లేదు.. బుజ్జగించి మొలతాడు ఆరాతీయటం ముఖ్యం..’ అని మనసులో అనుకుంటూ..
          “సంజీవ్..! సోడా బండి అబ్బిని గుర్తు పడ్తావా?” అంటూ గారాబంగా అడిగింది.
          “ఓ...” బండి చక్రాల్లా కళ్ళు తిప్పేడు.
          మనసు కాస్తా కుదుట పడింది. గబ గబా అన్నం తినిపించింది. సంజీవ్‍ను తీసుకుని వీధిలో పడింది.. సోడా బండి వేటలో.
          ఆ సమయానికి సోడా బండ్లన్నీ బడి దారిలో ఉన్న ఊరి బొడ్రాయి వద్ద  వేప చెట్టు నీడన సేద తీర్చుకుంటూ ఉంటాయి. తన పని సుళువు అవుతుందని శాంతమ్మ అటు వైపు వెళ్తూ దారిలో సంజీవ్కు మొలతాడు విశేషాలు.. దాని ఖరీదును సోడా బుడ్లలో చెప్ప సాగింది.
          వేప చెట్టు కింద దాదాపు పది సోడా బండ్లున్నాయి.
          శాంతమ్మ ఎండలో పడి వస్తూ ఉండటం గమనించి సోడా బండ్లన్నీ ఎదురు రాసాగాయి..
          శాంతమ్మ అవేవీ పట్టించుకోకుండా మనుమనికి సైగ చేయ సాగింది ‘ఎవరా బండి అబ్బాయి?’ అన్నట్లుగా..
          సంజీవ్ తన చిట్టి వేలుతో అందరినీ చూపించ సాగాడు.
          బండి వాళ్ళంతా ఆశ్చర్యంగా చూడ సాగారు.
          శాంతమ్మ జరిగింది వివరించింది.. రెండు చేతులూ జోడించింది. అయినా ఫలితం శూన్యం. మాకేమీ తెలిదన్నారంతా ముక్త కంఠంగా..
          చేసేదేమీ లేక కళ్ళ నీళ్ళు గుక్కుకుంటూ వెను తిరిగింది..
          కొడుకు కోడలుతో ఎన్ని తిట్లు తినాల్సి వస్తుందో అనే బాధ కంటే మనుమన్ని కొడతారేమో! అనే భయమే శాంతమ్మను అధికంగా బాధించ సాగింది.
***
          శాంతమ్మ అనుకున్నట్లుగా ఆ పూట ఇంట్లో ఏ గొడవా జరుగ లేదు. విలువైన వస్తువులు చిన్న పిల్లలకు వేయడం.. పిల్లల అభిరుచులు తెలుసుకొని మసులుకోక పోవడం తమదే తప్పని కొడుకు, కోడలు సర్ది చెప్పారు. కాని శాంతమ్మ మనసు కుదుట పడలేదు. భర్త రామయ్య ఎడమ కాలుకు రాజసంలా ఎప్పుడూ నిగ నిగలాడే వెండి బేడీ పదే పదే గుర్తుకు రాసాగింది..
          ఆ మరునాడు సంజీవ్ బడికి వెళ్లి వస్తున్నాడు. వేప చెట్టు కింద ఉన్న సోడా బండి సోమయ్య సంజీవ్‍ను చూడగానే “బాబూ..!” అని పిలిచాడు.
          “నన్ను గుర్తించి కూడా మీ నానమ్మకు నేనే అని గట్టిగా ఎందుకు చెప్పలేదు?.. యీ రోజు కూడా సోడా  తాగుతానంటేనే  కదా.. నేను  మొలతాడు తీసుకున్నాను.. అయినా తాగకుండానే పారిపోతున్నావు” అంటూ ఆరా తీసాడు సోమయ్య.
          “సరళ స్కూల్ ఫీజు కట్టలేదు. డబ్బులు లేక బడి మానెయ్యమంటున్నాడు మా నాన్న అంటూ చెప్పింది.  ఫీజు కట్టకుంటే  సరళ  పేరు తీసేస్తానంది టీచర్. నిన్న మా తాతయ్య పుట్టినరోజు ఏదైనా మంచి పని చేస్తుంది నానమ్మ. నేనూ ఏదైనా మంచిపని చేయాలనుకున్నాను..
           నేను రోజూ సోడా లెమన్ తాగుతానంటేనే నీవు మొలతాడు తీసుకుంటావని అలా అన్నాను. దాన్ని అమ్మేసి  తప్పకుండా సరళ స్కూల్ ఫీజు కట్టండి..” అంటూ జింక పిల్లలా ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు సంజీవ్..
          చెట్టు చాటునుండి విన్న శాంతమ్మకు  నిన్నటి సంజీవ్ సంతోషానికి కారణం అర్థమయ్యింది. దాన ధర్మాలలో తాతను మించిన మనుమడు అనే తృప్తితో సోమయ్యను చూసుకుంటూ కళ్ళతోనే తన సంతోషాన్ని వ్యక్త పర్చింది.
          శాంతమ్మ ఖాతా దారుడైన సోమయ్య తనకు సంజీవ్ మొలతాడును ఎలా ఎరవేశాడో శాంతమ్మకు చెప్పేడు. అసలు విషయం ఈ రోజు బయట పడింది..
          సరళ  సోమయ్య కూతురు..
          అంత చిన్న వయసులో సంజీవ్ చేసిన అయాచిత ధర్మానికి సోమయ్య కళ్ళు చెమర్చాయి.
          తనలో పశ్చాత్తాపం ఆరంభమైంది. అంత లేత వయసులో సంజీవ్ ఉదార బుద్ధి తన కూతురు సరళ చదువు ఆగి పోగూడదని చేసిన అయాచిత ధర్మానికి తాను అర్హుడు కాడని మనసు హెచ్చరిస్తోంది.. అనాలోచితంగా సోమయ్య రెండు అరచేతులు అతడి లెంపలు వాయించాయి. జ్ఞానోదయమైంది.. ఒక స్థిర నిర్ణయానికి వచ్చాడు సోమయ్య.
          ఆ మరునాడు ఆదివారం ఉదయమే సోమయ్య తన కూతురు సరళను తీసుకొని సంజీవ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. సరళను చూడగానే పరుగెత్తుకుంటూ వచ్చాడు సంజీవ్. తాను చదువుకునే గది లోనికి తీసుకు వెళ్తుంటే  వారి స్నేహబంధం చూసి సంజీవ్ నాన్న, నానమ్మ ముచ్చట పడ్డారు. సోమయ్య కళ్ళు చెమర్చాయి. సంజీవ్ను వెనక్కి పిలిచి తన జేబులోనుండి తీసిన  వెండి మొలతాడును స్వయంగా సంజీవ్ నడుంకు అలంకరించాడు.
          సరళ, శాంతమ్మ ఆశ్చర్యంగా చూడసాగారు..
          “అమ్మగారూ నా బుద్ధి గడ్డి తిని చిన్న బాబు దగ్గర మొలతాడు కొట్టేసాను. నా తాగుబోతు తనమే నన్నీ స్థితికి ఉసిగొలిపింది. నాకు బుద్ధొచ్చింది. తాగుడు మానేస్తాను. సరళను సవ్యంగా చదివిస్తాను.. ” అంటూ సరళ తల మీద చెయ్యి వేసి ప్రమాణం చేయ సాగాడు సోమయయ్య. శాంతమ్మ సరళను దగ్గరికి తీసుకుంది లాలనగా.. సంజీవ్ కళ్ళళ్ళో మెరుపుచూస్తూ..
***
     

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top